Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రాకా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌కు రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆమె హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్టుకు రాష్ట్రపతి చేరుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముర్ము నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పర్యటనకు రాష్ట్రపతి ముర్ము బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు హకీంపేట్ వై జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, హెలిప్యాడ్ వై జంక్షన్, బైసన్ గేట్, లోత్‌కుంట ప్రాంతాల్లో వెహికిల్స్ కు పర్మిషన్ లేదని వెల్లడించారు. అటువైపుగా వెళ్లే వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.

రాంగ్‌ సిగ్నలింగ్‌ వల్లనే ఒడిశా రైలు ప్రమాదం.. సేఫ్టీ కమిషన్‌ నివేదికలో వెల్లడి

ఒడిషాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనకు ప్రధాన కారణం రాంగ్‌ సిగ్నలింగ్‌ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తే దుర్ఘటన జరిగి ఉండేది కాదని కమిటీ నివేదికలో పేర్కొంది. ఒడిషా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్‌ తన నివేదికను సమర్పించింది. బహుళ స్థాయిలో జరిగిన లోపాలను కమిటీ తన నివేదికలో ఎత్తి చూపింది. గతేడాది సైతం ఇదే తరహా దుర్ఘటన జరిగిందని నివేదిక పేర్కొన్న సేఫ్టీ కమిషన్‌.. గతంలో జరిగిన లోపాన్ని సరి చేస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదని రైల్వే సేఫ్టీ కమిషన్ (CRS) రైల్వే బోర్డుకు సమర్పించిన స్వతంత్ర విచారణ నివేదికలో స్పష్టం చేసింది.

నేడు హైదరాబాద్ కు సునీల్ భన్సల్.. పార్టీ నేతలతో కీలక భేటీ\

బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ భన్సల్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆయన సమీక్షించనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమావేశం నిర్వహిస్తుంది. అయితే, ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వం ప్రణాళికలు రూపొందింస్తుంది. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీ నేతల మధ్య గ్యాప్ ను బట్టబయలు చేస్తున్నాయి. బీజేపీలో నేతల మధ్య సయోధ్య లేదనే వాదనలు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తే బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లు అర్ధమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రేమగా పెంచుకున్న ఒంటె.. యజమాని ప్రాణాలనే తీసేసింది!

ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ ఒంటె యజమాని ప్రాణాలనే పొట్టన పెట్టుకుంది. నీరు పెడుతుండగా మహిళ ప్రాణాలను తీసింది. మహిళ గొంతును నోటితో కరచుకొని దవడలతో పీక నొక్కేసింది. దీంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని హాథ్రస్​ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడిలో చనిపోయిన మహిళను తోతా దేవిగా గుర్తించారు.

సస్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్గోయ్ గ్రామానికి చెందిన వ్యక్తి ‘పప్పు బఘేల్’. ఇతని భార్య పేరు ‘తోతా దేవి’. వీరు ఇంటి వద్ద ఓ ఒంటెను పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ఇతర సామానులు మోసేందుకు పప్పు బఘేల్ దంపతులు ఆ ఒంటెను ఉపయోగించుకుంటున్నారు. వీరికి ఒంటెల బండి కూడా ఉంది. ఎప్పటిలాగే ఆదివారం (జులై 2) మధ్యాహ్నం ఒంటెకు నీళ్లు పెట్టేందుకు దేవి దాని వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై ఒంటె దాడి చేసింది.

ఓటీటీ స్ట్రీమింగ్ నిలిపి వేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో..

నరేష్‌ మరియు పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మళ్ళీ పెళ్లి మూవీ స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది.ఈ సినిమా జూన్ 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ పెళ్లి ప్రస్తుతం ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమాను తొలగించింది.లీగల్ ఇష్యూస్ తోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసినట్లు తెలుస్తుంది.. తన పరువుకు భంగం కలిగించేలా మళ్ళీ పెళ్లి సినిమా ఉందని, ఓటీటీ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఈ కేసును దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అమెజాన్ ప్రైమ్ తొలగించనట్లు తెలుస్తుంది.

పాకిస్థాన్ లో పరువు హత్యలు.. ఇద్దరి కూతుళ్లను చంపేసిన తండ్రి

పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. ఓ తండ్రి పరువు కోసం తన ఇద్దరు కూతుళ్లను కాల్చి చంపి పారిపోయిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. పాక్ దేశం పంజాబ్ రాష్ట్రంలోని కసూర్ జిల్లా హవేలీ నథోవాలి గ్రామానికి చెందిన సయీద్ అనే తండ్రి తన ఇద్దరు కుమార్తెలపై గన్ తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. అనంతరం తండ్రి నేర స్థలం నుంచి పారిపోయాడు. బాలికల మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు. పారిపోయిన తండ్రి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పన్నెండేళ్ల బాలుడు పరువు కోసం గుజ్రాన్ వాలా శాటిలైట్ టౌన్ లో తల్లిని చంపిన ఘటన ఈ వారంలోనే జరిగింది. తల్లి వీధిలో నడిచి వెళుతుండగా 12 ఏళ్ల కొడుకు ఆమెను కాల్చిచంపాడు. పాకిస్థాన్ లో తరచూ పరువు హత్యలు జరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంతలో, బాలుడు హత్యను అంగీకరించడంతో పోలీసులు అరెస్టు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. వెలవెలబోతున్న మార్కెట్లు!

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయను కొందామనుకున్నా.. ధర కొండెక్కి కూర్చుంది. పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో అదే పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూరగాయల ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. ఇదివరకు 100-200 రూపాయలు తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ. 500 తీసుకెళ్లినా.. సంచి మాత్రం నిండడం లేదు. దాంతో కూరగాయల మార్కెట్ వెళ్లాలంటేనే సామాన్య జనాలు భయపడిపోతున్నారు.

సాధారణంగా ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు తక్కువ. ఈ కాలంలో అన్ని కూరగాయల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి బిన్నంగా ఉంది. ఇప్పుడు కూరగాయలు పేద, సామాన్య ప్రజలకు పెను భారంగా మారాయి. ఏ కూరగాయ, ఆకుకూరలు చూసినా.. ధర కరెంట్ షాక్‌ మాదిరి కొడుతున్నది. దాంతో ‘ఏం కొంటాం.. ఏం తింటాం లే’ అన్నట్లుగా పరిస్థితి ఉంది. కూరగాయలు ధరలు పెదగడంతో పట్టణాల్లోని మార్కెట్‌, గ్రామీణ ప్రాంతాల్లోని వారపు సంతలు కూడా ఖాళీగా కనబడుతున్నాయి.

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రేపు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు సీఎం జగన్‌. అంతేకాకుండా.. అమిత్‌షా సహా కేంద్రమంత్రులను కలిసే అవకాశం. ఈ నెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం జగన్‌ హస్తినలోనే ఉంటారు. 5వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో.. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు. ఒకవేళ అపాయింట్‌మెంట్ దొరికితే అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు.

ఈ పర్యటనలో ప్రధానంగా ఏపీకి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. ఈ నెల 6న ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి వస్తారు. ప్రధానితో భేటీలో మరికొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులకు వైఎఎస్సార్‌సీపీ మద్దతు కోరే ఛాన్స్ ఉందంటున్నారు. ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రానికి మద్దతు కావాల్సి అనివార్యం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది.

బొమ్మ లో డ్రగ్స్ సరఫరా..రూ.14 కోట్ల డ్రగ్స్ పట్టివేత.

ముంబై ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు..కొరియర్ టెర్మినల్‌లో కోస్టారికాకు చెందిన చెక్క వస్తువుల నుండి 5 కోట్ల రూపాయల విలువైన 500 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది..ఈ కేసులో ఓ మహిళ సహా ఇద్దరిని అరెస్టు చేశారు. జూన్ 28న డీఆర్‌ఐ ముంబై జోనల్ యూనిట్ ఈ సరుకును స్వాధీనం చేసుకుంది. కొకైన్‌ను చెక్క వస్తువుల్లో ఉంచారు.. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు డ్రగ్స్ ను చెక్క వస్తువులలో ఉంచినట్లు అధికారులు గుర్తించారు..

కరీంనగర్ లో రోడ్డు యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

కరీంనగర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఇద్దరు యువకులను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకి చికిత్స కోసం తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.

బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు శుభవార్తలు..!

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..ఇండియన్ బ్యాంక్ తాజాగా స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండ్ సూపర్ 400 డేస్ డిపాజిట్ స్కీమ్ మరి కొంత కాలం కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా బ్యాంక్ మరో కొత్త ఎఫ్‌డీ స్కీమ్ కూడా తీసుకువచ్చింది. 300 రోజుల టెన్యూర్‌తో ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. అంటే ఒకేసారి బ్యాంక్ కస్టమర్లకు రెండు శుభవార్తలు తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయాల వల్ల ప్రధానంగా బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పవచ్చు..

ఇకపోతే ఈ బ్యాంక్ 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీసులు అందిస్తోంది. వీటిపై 2.8 శాతం నుంచి 6.7 శాతం వరకు వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇండ్ సూపర్ ఎఫ్‌డీ స్కీమ్ విషయానికి వస్తే.. ఇది స్పెషల్ రిటైల్ టర్మ్ డిపాజిట్ ప్రొడక్ట్. దీని టెన్యూర్ 400 రోజులు. ఈ స్కీమ్ 2023 మార్చి 6 నుంచి అందుబాటులోకి వచ్చింది. కనీసం రూ. 10 వేల నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రూ. 2 కోట్ల వరకు డబ్బులు దాచుకోవచ్చు. ఈ స్కీమ్ గడువను బ్యాంక్ ఆగస్ట్ 30 వరకుపొడిగించినట్లు పేర్కొంది..

ట్విటర్ కు పోటీగా రాబోతున్న మెటా థ్రెడ్.. ఫస్ట్ లుక్ ఇదే

జనవరి నుండి Twitterకు పోటీగా యాప్ తీసుకురావాలని కృష్టి చేస్తోంది. ఇప్పుడు దీని వర్క్ పూర్తయిందని, త్వరలోనే లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. కంపెనీ ఈ యాప్‌ను జూలై 6న ప్రారంభించవచ్చని తెలిపారు. థ్రెడ్‌ల యాప్ యాప్ స్టోర్‌లో మెటాచే అప్ లోడ్ చేయబడింది. ఇక్కడ దాని ప్రారంభ తేదీ జూలై 6గా పేర్కొనబడింది. ఈ యాప్ Twitter లాగా ఉంటుంది, దీనిలో మీరు ట్వీట్ చేయవచ్చు, రీట్వీట్ చేయవచ్చు. లైక్, షేర్, కామెంట్స్ చేయవచ్చు. ఈ యాప్ వెరిఫికేషన్ నిమిత్తం డబ్బు వసూలు చేస్తుందా లేదా అన్నది ఇంకా పూర్తి సమాచారం వెల్లడించలేదు.

నిజానికి, Twitter తర్వాత Meta Instagram, Facebook కోసం చెల్లింపు ధృవీకరణ సేవను తీసుకువచ్చింది. ఈ సేవలు భారతదేశంలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. కంపెనీ కొత్త యాప్‌లో కూడా ఇలాంటి ఫీచర్‌ను అందించే అవకాశం ఉంది. Threads యాప్‌లో వినియోగదారులు Instagram ID సహాయంతో లాగిన్ చేయగలుగుతారు. కొత్త ఖాతా అవసరం లేదు. ఈ యాప్ ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌లలో ఉన్న వ్యక్తులను అనుసరించడానికి ఫాలో ఆప్షన్ ఇస్తుంది. అంటే మీరు ఇక్కడ మీ ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులతో సులభంగా కనెక్ట్ అవ్వగలరు.

సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న మోడీ

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సాయి హీరా గ్లోబ‌ల్ క‌న్వెన్షన్ సెంట‌ర్‌ను నేడు ఉద‌యం 10:30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించ‌నున్నారు. ప్రారంభోత్సవ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రముఖులు, భక్తులు హాజరుకానున్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ అనే కొత్త సౌకర్యాన్ని నిర్మించింది.

ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా యొక్క ప్రధాన ఆశ్రమం. పరోపకారి శ్రీ ర్యూకో హిరా విరాళంగా ఇచ్చిన కన్వెన్షన్ సెంటర్, సాంస్కృతిక మార్పిడి, ఆధ్యాత్మికత, ప్రపంచ సామరస్యాన్ని ప్రోత్సహించే దృక్పథానికి నిదర్శనం. విభిన్న నేపథ్యాల ప్రజలు ఒకచోట చేరడానికి, కనెక్ట్ అవ్వడానికి మరియు శ్రీ సత్యసాయి బాబా బోధనలను అన్వేషించడానికి ఇది పెంపొందించే వాతావరణాన్ని అందిస్తుంది. దాని ప్రపంచ స్థాయి సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాలు సమావేశాలు, సెమినార్లు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను సులభతరం చేస్తాయి, అన్ని వర్గాల వ్యక్తుల మధ్య సంభాషణ మరియు అవగాహనను పెంపొందించాయి. విశాలమైన కాంప్లెక్స్‌లో ధ్యాన మందిరాలు, నిర్మలమైన తోటలు మరియు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

Exit mobile version