Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

రైతన్నకు అండగా పవన్‌.. రేపు తూర్పు గోదావరిలో పర్యటన
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు రాజమండ్రి చేరుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.. నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు జనసేనాని.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా జనసేన ప్రకటించింది.. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై జనసేన అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మేల్సీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రేపు తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం 10 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం అవుతుందన్నారు.. కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరామర్శించనున్న పవన్‌ కల్యాణ్‌.. కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.. మధురపూడి విమానాశ్రయం నుండి పవన్‌ కల్యాణ్ పర్యటన ప్రారంభం కాబోతోంది.. కడియం, కొత్తపేట అనంతరం పి.గన్నవరం మండలం రాజులపాలెంలోనూ పవన్‌ పర్యటన కొనసాగనుంది.. సాయంత్రం తిరిగి రాజమండ్రికి చేరుకుని విమానంలో హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. కాగా, రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఇప్పటికే పలు ప్రాంతాల్లో జనసేన నేతలు పరామర్శించారు. ఇప్పుడు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నేరుగా రైతుల పరిస్థితిని తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు. ఈ పర్యటనలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో పాటు జనసేన రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొనబోతున్నారు.

రాజమండ్రిలో వైసీపీ లీడర్‌ దారుణ హత్య.. ఇంట్లోకి వెళ్లి కత్తులతో దాడి..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. రాజమండ్రి మాజీ కార్పొరేటర్‌, వైసీపీ డివిజన్ నేత బూరడ భవానీ శంకర్‌ను దుండగులు దారుణంగా కత్తులతో పొడి చంపారు.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న భవానీ శంకర్‌పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు దుండగులు.. విచక్షణా రహితంగా చాకుతో పొడిచారు.. తీవ్రగాయాలపాలైన శంకర్‌ను హుటాహుటిన రాజమండ్రిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు స్థానికులు, కుటుంబ సభ్యులు.. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు శంకర్‌.. ఒంటిపై పలుచోట్ల గాయాలను గుర్తించారు పోలీసులు.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న త్రీ టౌన్‌ పోలీసులు.. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. అసలు భవానీ శంకర్‌ పై దాడి చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేదా వ్యక్తిగత వ్యవహారాలే హత్యకు దారి తీశాయా? అనే విషయం తేల్చే పనిలో పడిపోయారు త్రీటౌన్‌ పోలీసులు.

హజ్ యాత్రికులపై అదనపు భారం లేకుండా చూస్తాం..
ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లే హజ్ యాత్రికులపై అదనపు ఆర్ధిక భారం లేకుండా చూస్తామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హజ్ యాత్రికులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.. కేంద్రాన్ని మరోసారి పరిశీలించాలని కోరాం. విమాన టిక్కెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసం వల్లే ఖర్చు పెరిగిందన్నారు. విమాన టిక్కెట్ ధరలను తగ్గించమని కోరాం. లేదా, “ఎంబార్కేషన్ పాయుంట్” ను విజయవాడ కాకుండా, హైదరాబాద్ లేదా బెంగుళూరుకు మార్చమని అడిగామని తెలిపారు. అదనపు ఆర్ధిక భారం “హజ్” యాత్రికులు మోయాల్సిన పరిస్థితే వస్తే, విధిలేని పరిస్థితుల్లో, ఆ మొత్తం ఆర్ధిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం తగదన్నారు అంజాద్‌ బాషా.. విజయవాడ నుంచి “హాజ్” యాత్ర కు వెళ్ళే యాత్రికులకు ఒక్కొక్కరికి 3 లక్షల 88 వేల రూపాయలు ఖర్చు అవుతుందని “సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా”, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా సర్క్యులర్‌ జారీ చేశాయని తెలిపారు. అదే, హైదరాబాద్ నుంచి వెళ్ళే హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి 3 లక్షల 5 వేల రూపాయలు, బెంగుళూరు నుంచి 3 లక్షల 4 వేలు నిర్ణయించారు.. కానీ, ఏపీ నుంచి హజ్ యాత్రుకులకు ఇది భారం అవుతుంది. పునఃపరిశీలించమని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసి కోరామని తెలిపారు.

పొలిటికల్‌ డ్రామా..! టీడీపీ స్టంట్ బ్యాక్ ఫైర్ అంటున్న వైసీపీ..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు.. ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్‌ చేస్తామని.. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చు అని పేర్కొన్నారు.. సంక్షేమ పథకాలు, వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే రైతన్నలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, మరెవరైనా సరే 1902కు ఫోన్ చేసిన వారి స‌మ‌స్యల‌పై ఫిర్యాదు చేయవచ్చు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితి, పరిష్కారం గురించి తెలుసుకునే వీలుంది. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లతో పాటు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. అయితే, దీనిపై టీడీపీ రాజకీయ డ్రామాకు తెరతీసే ప్రయత్నం చేసిందని వైసీపీ విమర్శిస్తోంది.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని అడ్డుకోవడానికి టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన స్టంట్ బ్యాక్ ఫైర్‌ అయ్యిందంటున్నారు. ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం వినియోగించే గ్రీవెన్స్ సెల్ పై టీడీపీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది.. ప్రజల నిజమైన ఫిర్యాదుల పరిష్కారానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ డ్రామాలకు తెరలేపింది.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని అడ్డుకోవడవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫైర్‌ అవుతున్నారు.. జగన్నకు చెబుదాం ఉద్యోగికి కాల్ చేసి నీ దుంప తెగ అంటూ దూషించారు రామయ్య.. నీ పేరు చెప్పు.. ఫోన్ నెంబర్ చెప్పు అంటూ ఓ ఉద్యోగిని మానసికంగా వేధించే ప్రయత్నం చేశారని విమర్శిస్తున్నారు.. ఫిర్యాదుల పరిష్కారం కోసం కాకుండా 1902కి కాల్ చేసి అధికారుల సమయాన్ని రాజకీయలబ్ధి కోసం వృథా చేస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్‌ అవుతున్నారు.. గ్రీవెన్స్ అధికారి ఓపికగా సమాధానం చెబుతున్నా వర్ల రామయ్య బూతుపురాణం ఆపలేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి..

టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలపై సీఎస్ శాంతి కుమారి మీటింగ్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన జరిగిన స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశంలో టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇంటర్ డిపార్ట్‌ మెంటల్ సమస్యలపై చర్చించారు. అనేక టెలికాం సూచికలలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుందని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. దాదాపు 3.5 కోట్ల జనాభాకు నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లతో టెలి-సాంద్రత (107%) దేశంలోనే అత్యధికం. 97.7 శాతం గ్రామాలు మొబైల్ కనెక్టివిటీతో ఉన్నాయి అని ఆమె తెలిపారు. దేశంలో 5జీని ప్రారంభించిన అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.. పెండింగ్‌లో ఉన్న రైట్ ఆఫ్ వే దరఖాస్తుల పరిస్థితిని సమావేశంలో సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. 5జీ సేవలను వేగవంతం చేసేందుకు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ రకమైన తవ్వకాలనైనా ప్రారంభించేందుకు “కాల్ బిఫోర్ యు డిగ్” (సీబీయుడి) యాప్ ద్వారా ముందస్తు సమాచారం అందించిన తర్వాతే తవ్వకాలు చేయాలని సీఎస్ శాంతికుమారి సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ఇంజినీరింగ్ విభాగాలు ముందుగా యాప్‌ను ఉపయోగించేలా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.

రేపు ఉత్తమ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు
తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు, సేవా పతకాలను రేపు ( బుధవారం, మే 10 ) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌ ఈ పతకాలను అందించనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల తరహాలోనే అత్యుత్తమ సర్వీసులు అందించే పోలీసు అధికారులకు సైతం తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. 2022 సంవత్సరానికి గాను 30 మంది పోలీస్‌ అధికారులకు అతి ఉత్కృష్ట సేవా పతకం, 28 మందికి ఉత్కృష్ట సేవా పతకం, అసాధారణ ఆసూచన కుశలత పతకం ఏడుగురికి, ఇన్వెస్టిగేషన్‌లో ప్రతిభ చూపిన ఎనిమిది మందికి హోంమినిస్టర్‌ మెడల్స్‌, ట్రైనింగ్‌ సమయంలో ప్రతిభ చూపించిన 11 మందికి హోంమంత్రి మెడల్స్‌, శౌర్య పతకం 11 మంది, మహోన్నత సేవ పతకానికి ఏడుగురు పోలీస్‌ అధికారులు ఎన్నికయ్యారు.

భూమి వైపు దూసుకొస్తున్న ప్రమాదం.. వలస పక్షులు, శాటిలైట్లపై ప్రభావం
సూర్యుడు ప్రస్తుతం తన 14 సోలార్ సైకిల్ లో ఉన్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలంపై అనేక రకాల చర్యలు జరుగున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సూర్యుడు ‘సోలార్ మాగ్జిమమ్’ స్థితికి చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని వల్ల సూర్యుడి వాతావరణంలో గందళగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి సౌరజ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ)లు వెలువడుతుంటాయి. కొన్నిసార్లు సూర్యుడి అయస్కాంత క్షేత్రాల నుంచి సౌరజ్వాలలు వెలువడుతుంటాయి. సూర్యుని నుండి ఒక కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) గంటకు మిలియన్ల కిలోమీటర్ల వేగంతో విశ్వంలోకి వెలువడుతుంది. ఇది భూమిపై ప్రభావం చూపిస్తుంది. సీఎంఈల్లో ఉండే అవేశిత కణాలు భూవాతావరణంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. సూర్యుడి నుంచి వచ్చే ప్లాస్మా కణాలు భూ అయస్కాంత తుఫానులను (జియో మాగ్నిటిక్ తుఫాన్) ప్రేరేపించే అవకాశం ఉంది. మే 7నరివర్స్డ్ పొలారిటీ సన్ స్పాట్ AR3296 నుండి కరోనల్ మాస్ ఎజెక్షన్ వెలువడింది. కరోనల్ మాస్ ఎజెక్షన్ విడుదలైనప్పుడు చాలా వేగంతో బిలియన్ల టన్నుల అవేశిత కణాలు విశ్వంలోకి వెదజల్లబడుతాయి. ఈ కణాలు గంటలకు 30 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ కణాలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు భూమిపై G1 క్లాస్ మైనర్ జియోమాగ్నిటిక్ తుఫాన్ వస్తుందని యూఎస్ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ అంచనా వేసింది. గత వారం సూర్యుడు 14 ముఖ్యమైన సౌర మంటలు, 31 కరోనల్ మాస్ ఎజెక్షన్‌ల జరిగాయి.

రణరంగంగా పాకిస్తాన్.. పలుచోట్ల ఆర్మీ కంటోన్మెంట్ల ముట్టడి..
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ కోర్టు వెలుపల అరెస్ట్ చేశారు. అవినీతి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే అరెస్టుకు ముందు ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. తనను అరెస్ట్ చేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. మరోవైపు ఇమ్రాన్ అరెస్టుకు వ్యతిరేకంగా పీటీఐ పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ అంతటా ఆందోళనలు మిన్నింటుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రోడ్లపైకి వస్తున్నారు. పాక్ లోని ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండి, క్వెట్టా ఇలా అన్ని నగరాల్లో ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. కరాచీలో నిరసన చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కరాచీ ప్రధాన రహదారి షరియా ఫైసల్ ను పీటీఐ కార్యకర్తలు బ్లాక్ చేశారు. నగరంలోని మెయిన్ యూనివర్శిటీ రోడ్, ఓల్డ్ సబ్జీ మండి, బనారస్ చౌక్ నిరసనలు తెలిపారు.

లేడీ పవర్ స్టార్ ను పట్టించుకోరేంటి..?
ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన డ్యాన్స్ తో, నటనతో ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. అందాలను ఆరబోస్తేనే స్టార్ హీరోయిన్ అనిపించుకునే ఈ రంగంలో .. ఎటువంటి అందాలను ఆరబోయకుండా.. ఎటువంటి గ్లామర్ రోల్స్ చేయకుండా, లిప్ కిస్ లు లాంటివి ప్రయత్నించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను చేస్తూ మెప్పిస్తుంది సాయి పల్లవి. ఒక్క నటనలోనే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఔరా అనిపిస్తూ హృదయాలను కొల్లగొట్టి లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటుంది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనిపించకపోయినా అమ్మడికి ఉన్న క్రేజ్ మాత్రం మామూలుది కాదు. అయితే ఆ క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గుతుందా..? అంటే.. నిజమే అంటున్నారు నెటిజన్లు. అందుకు కారణం కూడా చెప్పుకొస్తున్నారు. అదేంటంటే.. నేడు సాయి పల్లవి పుట్టినరోజు.. అయినా సోషల్ మీడియాలో హంగామా లేదు. సోషల్ మీడియాలో కొంత మంది అభిమానులు…స్నేహితులు…పరిశ్రమలో తెలిసిన వారంతా అమ్మడికి విషెస్ తెలియజేసారు. చేతిలో సినిమాలు లేకపోవడంతో ప్రొడక్షన్ హౌసెస్ విషెస్ చెప్పలేదు. సాధారణంగా ఒక బ్యానర్ లో చేసిన హీరోయిన్ కు అయితే.. ఆ బ్యానర్ నుంచి వచ్చేసిన తరువాత కూడా ఆమెకు పోస్టర్లు వేసి, వీడియోస్ పెట్టి బర్త్ డే విషెస్ చెప్తారు. కానీ సాయి పల్లవి విషయంలో అది జరగలేదు. అవకాశాలు లేకపోవడంతో మేకర్స్ కూడా లైట్ తీసుకున్నారా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇంకోపక్క ఇదేరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో.. రౌడీ హీరో బర్త్ డే విషెస్ లో అమ్మడు కొట్టుకుపోయింది అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా లేడీ సూపర్ స్టార్ బర్త్ డే నుపట్టించుకోకపోవడమేంటని ఆమె అభిమానులు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి.. శివ కార్తికేయన్ సరసన SK21 లో నటిస్తోంది.

Exit mobile version