NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్‌..
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో Ms. No 66 ద్వారా ఉద్యోగులకు DA, G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73 శాతం మంజూరు చేశారు. ఈ కొత్త డీఏను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ఇవ్వనున్నారు.. జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు. ఈ కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డీఏ 22.75 శాతం అవుతుంది. ఇక, ఈ సందర్భంగా.. డీఏ మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు నేతలు.. కాగా, గత కొన్ని రోజులుగా.. ప్రభుత్వం ఉద్యోగుల మధ్య వివిడ డిమాండ్లపై చర్చలు సాగుతోన్న విషయం విదితమే..

పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త.. వేతనాలు పెంపు
‘మే డే’ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా 1,000 (వెయ్యి) రూపాయల చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని సీఎం తెలిపారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం తెలిపారు. ‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

పంట నష్టంపై అంచనావేస్తున్నాం.. బురద జల్లొద్దు..
అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటను నష్టపోతున్నారు రైతులు.. అయితే, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు.. అనవసరంగా బురద జల్లొద్దని హితవుపలికారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులకు అందుతున్న పథకాలపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు.. చంద్రబాబు హయాంలో అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం జరిగితే ఆ సీజన్ లో పరిహారం ఇచ్చారా..? అప్పుడు ఈ పత్రికలు ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పంట నష్టాలు.. ఇన్ ఫుట్ సబ్సిడీని ఆ సీజన్ లోనే ఇస్తున్నాం.. కరువు మండలాల ప్రకటించలేదని రాయడం విచిత్రంగా ఉంది.. ప్రభుత్వం మీద బురద జల్లేందుకు అసత్యాలు రాస్తున్నారు అంటూ మండిపడ్డారు.

పవన్‌, రజనీకాంత్‌పై జోగి రమేష్‌ సంచలన వ్యాఖ్యలు..
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్‌.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీతో పెళ్లి, టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ అంటూ ఫైర్‌ అయ్యారు.. మేం ఎవ్వరితో పొత్తులు పెట్టుకోం అని స్పష్టం చేశారు.. పవన్ కి సత్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటూ సవాల్‌ చేశారు.. సన్నాసి అయితే జనసేనను టీడీపీలో కలిపేయాలి అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. అమాయకులు పవన్ ని సీఎం అంటున్నారు‌.. కానీ, చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌.. సీఎం అంటున్నాడన్న ఆయన.. టీడీపీకి పవన్‌ అమ్ముడుపోతాడు అని ఆరోపించారు.. అందరినీ చంద్రబాబుకి హోల్ సేల్‌గా అమ్మేస్తాడు అంటూ జనసేన శ్రేణులను హెచ్చరించిన ఆయన.. జనసేన అభిమానులు కూడా జగనన్న బాటలో నడవాలంటూ పిలుపునిచ్చారు. ఇక, చంద్రబాబు వేదిక మీద ఉండగా హాజరయ్యాడంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు మానవత్వం లేదు అంటూ ఫైర్‌ అయ్యారు జోగి రమేష్‌.. రజనీకాంత్ కి సిగ్గుగా లేదా..? అని ప్రశ్నించిన ఆయన.. ఒక దొంగ చంద్రబాబు, ఇంకొక దొంగ రజనీకాంత్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. 14 ఏళ్లలో ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని చంద్రబాబుకు గుర్తు లేదా? అని నిలదీశారు. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు చంద్రబాబును చెంపమీద కొట్టాలన్న ఆయన.. ఎన్టీఆర్ ని పొట్టనపెట్టుకున్న చంద్రబాబును ఎన్టీఆర్ అభిమానులు తరిమికొట్టాలంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఎన్టీఆర్‌ శతజయంతి వేదికగా చంద్రబాబుపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రశంసలు కురిపించిన విషయం విదితమే.

స్టీల్ ప్లాంట్‌ భూముల్లో వందలాది కంపెనీలు తీసుకొస్తా.. పది లక్షల ఉద్యోగాలిస్తా..!
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వున్న 20 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాల్లో వందలాది కంపెనీలను తీసుకువస్తా.. పది లక్షల ఉద్యోగాలిస్తాం అని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మే డే సందర్భంగా ఉక్కుపరిరక్షణ పోరాటంలో వున్న 27 మంది నాయకులను కలిశాను.. 810 రోజుల పాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు పోరాడుతున్నారని తెలిపారు.. ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రైవేటీకరణ ఆగి తీరుతుందన్న పాల్.. విశాఖ ఉక్కు అదానీది కాదు, గుజరాతీలదు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వున్న 15 కోట్ల మంది తెలుగువారిదన్నారు.. అయితే, స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రధాని మోడీ ప్లాన్డ్ గా నిర్ణయాలు చేస్తున్నారని విమర్శించారు.. స్టీల్ ప్లాంట్ కు చెందిన 20 వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీని పెట్టుబడులకు లీడ్‌ స్టేట్‌గా పరిగణిస్తున్నాం..!
పెట్టుబడులకు లీడ్‌ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ను పరిగణిస్తున్నట్లు వెల్లడించారు భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి.. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.. అయితే, ఎలాంటి సహకారం అందించడానికైనా తాము, తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు సీఎం జగన్‌.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు సీఎం.. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక, ఫుడ్‌ పార్క్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్‌ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి వివరించారు యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి.. ఏపీని పెట్టుబడులకు లీడ్‌ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.. ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

లోకేష్‌కి ఇదే నా సవాల్‌.. నాపై పోటీచేసి గెలిస్తే రాజకీయాలకు గుడ్‌బై..
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు బహిరంగ సవాల్‌ విసిరారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. దమ్ముంటే లోకేష్ నాపై పోటీచేసి గెలవాలి.. లోకేష్ గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని చాలెంజ్‌ చేశారు.. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా దాటేలోపు నా సవాల్‌కు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.. యువగళం పాదయాత్ర భూ మాఫియా నిధులతో సాగుతోందని నిరూపిస్తా అంటూ మరో చాలెంజ్‌ విసిరారు.. నా పై, నా కుటుంబం పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయాల నుండి తప్పుకుంటా.. లోకేష్ సిద్ధామా అని చాలెంజ్ చేశారు.. దేవుడి భూములు కబ్జా చేయలేదు.. లీజుకు తీసుకున్నానంటూ క్లారిటీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరికి పట్టినగతే టీడీపీలో చంద్రబాబు, లోకేష్ కు పడుతుందని జోస్యం చెప్పారు.. మరోవైపు ఎప్పటికైనా టీడీపీ నాయకుడు జూనియర్ ఎన్టీఆరే నంటూ మరోసారి చెప్పుకొచ్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.

నాలుగేళ్ల జైలు శిక్షతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన మరో ఎంపీ
గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీ ఏప్రిల్ 29 నుంచి ఎంపీగా అనర్హుడని లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ తెలిపింది. గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద 2007లో ఒక కేసులో దోషిగా తేలి నాలుగేళ్ల జైలు శిక్ష పడిన కొద్ది రోజులకే అతనిపై అనర్హత వేటు పడింది. 2007లో అన్సారీ సోదరులపై గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద కేసు నమోదు చేయగా, 2022లో వారిపై ప్రాథమిక అభియోగాలు మోపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సోదరులకు శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బీఎస్పీ ఎంపీ అయిన అఫ్జల్, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయాడు. ఏ సభ్యుడైనా దోషిగా తేలితే, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడితే అనర్హుడవుతాడు. ఇటీవల, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్, బీజేపీకి చెందిన విక్రమ్ సైనీలు ఇదే చట్టంలోని నిబంధనల ప్రకారం తమ ఎంపీ హోదాను కోల్పోయారు. ప్రస్తుతం యూపీలోని బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ ఉత్తరప్రదేశ్‌లోని మౌ సదర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు 2022 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు. అతని స్థానాన్ని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) నుంచి అతని కుమారుడు అబ్బాస్ అన్సారీ గెలుచుకున్నారు.

రోహిత్ శర్మ ఔటా? నాటౌటా? ఇదిగో సాక్ష్యం!
ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. రోహిత్ శర్మ వికెట్‌పై ఎంత వివాదం చెలరేగిందో అందరికీ తెలుసు. రోహిత్ శర్మది న్యాయబద్దమైన ఔట్ కాదని, కీపర్ సంజూ శాంసన్ గ్లోవ్స్ తాకడం వల్ల బెయిల్స్ కిందకు పడిపోయాయని, ఇది చాలా అన్యాయమంటూ సోషల్ మీడియాలో డిబేట్లు నడుస్తున్నాయి. అది ఔటేనని ఒక వర్గం వారు చెప్తుంటే.. కాదంటూ మరో వర్గం వారు వాదిస్తున్నారు. కనీసం రివ్యూ కూడా తీసుకోకుండా.. అలా ఎలా ఔట్‌గా నిర్ధారిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైడ్స్, నో బాల్స్‌కి కూడా రివ్యూ చూస్తున్న ఈ రోజుల్లో.. రోహిత్ శర్మ ఔట్ అవ్వడానికి ఎందుకు మరోసారి పరిశీలించలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చివరికి ముంబై ఇండియన్స్ క్యాంప్‌కి చెందిన వాళ్లు సైతం.. రోహిత్ వికెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సైడ్ యాంగిల్స్‌లో పరిశీలించి ఉంటే.. అది ఔటో, కాదో క్లారిటీగా తెలిసి ఉండేదని అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కానీ.. ఏమాత్రం చెక్ చేయకుండా దీన్ని ఔట్‌గా ఖరారు చేయడం, నిజంగా అన్యాయమేనన్నారు.

దుమ్మురేపిన జీఎస్టీ వసూళ్లు.. ఆ రికార్డులు బ్రేక్‌
జీఎస్‌టీ వసూళ్లు దుమ్మురేపాయి. ఏప్రిల్‌ నెలలో రికార్డుస్థాయి వసూళ్లు సాధించాయి. ఏప్రిల్‌లో లక్షా 87వేల కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే 12వశాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్టీ వచ్చాక ఈ స్థాయిలో వసూళ్లవడం ఇదే మొదటిసారి. ఇక గతేడాది జీఎస్‌టీ కింద 18లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా జీఎస్‌టీ వసూళ్లు స్వల్పంగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఏపీలో 6శాతం, తెలంగాణలో 13శాతం వృద్ధి నమోదైంది. జీఎస్‌టీ వసూళ్లు ఈ స్థాయిలో నమోదు కావడంపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద శుభవార్త అంటూ ట్వీట్ చేశారు. తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో పన్ను వసూళ్లు పెరగడం విజయానికి సంకేతంగా అభివర్ణించారు.

యవసామ్రాట్ రిపోర్టింగ్ టైమ్ వచ్చేసింది…
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే మాస్టర్ గా పేరున్న ఈ దర్శకుడితో సినిమా అనగానే నాగ చైతన్య కోలీవుడ్ లో కూడా హిట్ అందుకోవడం గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ కలిగింది. అ నమ్మకాన్ని నిజం చేస్తూ, కస్టడీ సినిమాపై అంచనాలని పెంచుతూ ప్రమోషన్స్ లో మంచి జోష్ చూపిస్తున్నారు. టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో కస్టడీ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అరవింద స్వామీ విలన్ గా నటిస్తున్నాడు. నాగ చైతన్య ‘శివ’ అనే పాత్రలో కానిస్టేబుల్ గా నటిస్తున్న కస్టడీ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్కీన్ ప్రొడుక్ చేస్తుంది. మే 12న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది. ది హంటింగ్ సీజన్ బిగిన్స్ అంటూ కస్టడీ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇచ్చేసిన మేకర్స్, మే 5న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పేసారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో నాగ చైతన్య గన్ పట్టుకోని మస్త్ ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇటివలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ… తనకి పెద్దగా బాధలు లేవని, ఎంతో ఇష్టంతో పక్కా హిట్ అవుతుంది అనుకోని చేసిన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడే కాస్త అప్సెట్ అవుతానని చెప్పాడు. ప్రస్తుతం నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ ఇచ్చాడు. నాగార్జున, అఖిల్ లు కూడా ఫ్లాప్స్ ఇచ్చేసరికి అక్కినేని ఫాన్స్ కంప్లీట్ గా డిజప్పాయింట్ స్టేజ్ లో ఉన్నారు. అక్కినేని ఫాన్స్ లో మళ్లీ జోష్ తీసుకోని రావాలి అంటే చైతన్య కస్టడీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాల్సిందే. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నాగ చైతన్య హిట్ కొడితే అక్కినేని ఫాన్స్ ఫుల్ హ్యాపీ అవుతారు మరి మే 12న కస్టడీ సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన మెగా డాటర్.. ఈసారైనా
జీవితంలో బాధలు, కష్టాలు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకూడదు..బుక్ లో కొత్త పేజీని ఓపెన్ చేసినట్లు.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక అదే పని చేస్తోంది. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయామైన నిహారిక.. హీరోయిన్ గా నిరూపించుకోలేకపోయింది. ఆ తరువాత చైతన్య జొన్నలగడ్డను వివాహామాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నిహారిక.. నిర్మాతగా మారింది. ఇక గత కొన్నిరోజులుగా ఆమె చుట్టూ పుకార్లు మాత్రమే తిరుగుతున్నాయి. భర్తతో విబేధాలు అని, విడాకులు అని ఏవేవో చెప్పుకొస్తున్నారు. అందులో నిజం ఎంత అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇక ఈ రూమర్స్ నుంచి బయటపడడానికి నిహారిక మళ్లీ కొత్త అవతారంలో కనిపించింది. నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి వెండితెరపై కాదు ఓటిటీ ఎంట్రీ ఇచ్చింది. ఓటిటీ ఆమెకు కొత్తకాదు.. ఇప్పటికే ఆమె ముద్దపప్పు ఆవకాయ, నాన్న కూచి లాంటి వెబ్ సిరీస్ లను సమర్థవంతంగా తెరకెక్కించి,నటించింది. ఇక తాజాగా డెడ్ పిక్సల్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.