NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

బాలకృష్ణ కంటిచూపుతోనే చంపేస్తాడు.. అది ఎవరి వలన కాదు
నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్‌ లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకలకు టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు భారీ ఎత్తులో తరలివచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, చంద్రబబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ .. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ గురించి, తెలుగు ప్రేక్షకుల గురించి తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచారు.”తెలుగు మాట్లాడి చాలా రోజులైంది. తెలుగులో ఏమైనా తప్పులుంటే క్షమించాలి.ఈ సభలో జనాన్ని చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోంది. కానీ అనుభవం వద్దురా రజనీ రాజకీయం మాట్లాడొద్దంటోంది. కానీ ఎన్టీఆర్ గురించి రాజకీయం మాట్లాడక తప్పడం లేదు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు అమోఘం. ఎన్టీఆర్ తో టైగర్ సినిమా చేశాను. ఎన్టీఆర్‌ నన్నెంతో ప్రభావితం చేశారు.. నేను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి.. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి.. నేను హీరోగా చేసిన తొలి సినిమా పేరు భైరవి. యాదృచ్చికమైన నాకు అది ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. 13 ఏళ్లప్పుడు లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ను చూశాను.. ఓసారి ఎన్టీఆర్‌ వచ్చినప్పుడు చూడడానికి వెళ్తే ఎవరో నన్ను ఎత్తుకుని ఆయన్ని చూపించారు.. 18 ఏళ్లప్పుడు స్టేజ్‌పై ఎన్టీఆర్‌ను ఇమిటేట్‌ చేశా.. ఆ తర్వాత 1977లో ఆ మహానుభావుడితోనే కలిసి టైగర్‌ సినిమా చేశాను.టైగర్ సినిమా నుంచి ఓ సందర్భంలో నన్ను తప్పించే ప్రయత్నం చేశారు.. కానీ ఎన్టీఆరే ససేమిరా అన్నారు. రజనీకాంత్ అంటే స్పీడ్.. స్పీడ్ అంటే రజనీకాంత్. కానీ నాకంటే ఎన్టీఆర్ నాకంటే స్పీడ్. రాజమండ్రిలో షూటింగుకు వస్తే.. దానవీర శూర కర్ణ సినిమాకు వచ్చిన జనం మధ్యలో ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నాను. అదే అందుకు ఉదాహరణ. ఇక దానవీర శూర కర్ణ సినిమాలో నేను ధుర్యోధన క్యారెక్టర్ చేయాలనుకున్నా.. కానీ నాకు మేకప్ వేస్తే బాగుండలేదన్నారు. అందుకే నేను ఆ క్యారెక్టర్ చేయలేదు.. వదిలేశాను. దానవీర శూరకర్ణ ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు.. ఎన్టీఆర్‌ది ఎంతో గొప్ప వ్యక్తిత్వం.. అప్పట్లో దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ సంచలనం సృష్టించారు.. మహామహులను ధీటుగా ఎదుర్కొన్నారు ఆయన మహా కోపిష్ఠుడు.. కానీ మంచి మనసు. అదే క్వాలిటీ బాలకృష్ణకు వచ్చింది. బాలకృష్ణ నా మిత్రుడు, కంటిచూపుతోనే చంపేస్తాడు.. బాలయ్య ఒక తన్ను తంతే జీపు ఎగిరి పడుతుంది..అది బాలయ్య చేస్తేనే జనాలు చూస్తారు. బాలకృష్ణ చేసే ఫీట్లు అమీర్‌ఖాన్‌, సల్మాన్‌, అమితాబ్‌, నేను చేసినా జనం ఒప్పుకోరు. అది కేవలం బాలకృష్ణ వలన మాత్రమే అవుతుంది. బాలయ్యలో జనాలు ఎన్టీఆర్ ను చూస్తున్నారు. ఆయన ఏం చేసినా జనం చూస్తారు. బాలయ్యకు కోపం ఎక్కువ.. కానీ మనస్సు వెన్న.

దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..
తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ లో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు మహిళా పారిశ్రామిక వేత్తలను ఎంకరేజ్ చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. జపాన్ లో న్యూక్లీయర్ దాడి జరిగినా.. దానిని తట్టుకునే శక్తి ఆ దేశానికి ఉందని ఆయన అన్నారు. కానీ మన దేశంలో సహజ వనరులు ఉపయోగించుకొకపోవడం వల్ల ఇంకా వెనుక బడి ఉన్నామని కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచంలో నే అతి పెద్ద దేశం అయిన ఇండియా.. ప్రపంచానికి ఏమి ఇవ్వలేదు.. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ లు తయారు చేసే దానిలో మహిళా పారిశ్రామిక వేత్తలు ముందుండాలి అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే ప్రొడక్ట్ లు మహిళలు తయారు చేయాలి అని ఆయన వెల్లడించారు. తెలంగాణ లో 15 వేల కోట్ల రూపాయల వరకు మహిళా గ్రూప్ లకు వడ్డీలు లేకుండా రుణాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ లో 20 లక్షల ఎకరాల్లో వంట నూనెలు పండించాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. బాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోన్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆలోచన అంటూ ఫైర్‌ అయ్యారు.. ఎన్టీఆర్ జిల్లా అని చెప్పే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఏం చేయలేదన్నారు.. ఒక్క జిల్లాకు లేదా మండలానికి కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేదు.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, పార్టీ గుర్తు, పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు.. పార్టీ డిపాజిట్లు కూడా లాక్కున్నారు అంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీలో ఎన్టీఆర్‌కి మైక్ ఇవ్వకుండా ఆయన చావుకు చంద్రబాబు కారణం అయ్యారు అని విమర్శించారు మంత్రి రోజా.. ఇన్ని చేసి ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేయటం హాస్యాస్పదమన్న ఆమె.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబుకి గుర్తు వస్తారని ఎద్దేవా చేశారు.. కానీ, అధికారంలో ఉంటే వాళ్లని బాబు పట్టించుకోరన్నారు. ఇపుడు శత జయంతి ఉత్సవం పేరిట హడావిడి చేస్తున్నారు.. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయటమే కాకుండా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.

చంద్రబాబు గజ దొంగ..! రాజకీయాలకి అనర్హుడు..!
మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల గురించి చంద్రబాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు.. చంద్రబాబు లాంటి గజ దొంగ రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. దళిత ద్రోహి చంద్రబాబు.. దళితుల కోసం చంద్రబాబు పెట్టిన ఒక మంచి కార్యక్రమం గురించి చెప్పగలవా..? అంటూ సవాల్‌ చేశారు.. ఈ నాలుగేళ్లలో 53 వేల కోట్లు దళితుల ఖాతాల్లో నేరుగా సీఎం వైఎస్‌ జగన్ వేశారని వెల్లడించారు. దళితుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్దమా? అంటూ చాలెంజ్‌ చేశారు. దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారు? అని చంద్రబాబు హేళనగా మాట్లాడారు అని మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కు భారత రత్న ఇప్పించమని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆయనకు దమ్ముంటే ముందు ఎన్టీఆర్ కు భారత రత్న ఇప్పించాలంటూ సవాల్‌ చేశారు మంత్రి నాగార్జున.. దళితుల ఇంగ్లీష్ మీడియంను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.. 29 దళిత నియోజక వర్గాల ఉంటే 28 నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తుచేశారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఆ 29 నియోజక వర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదంటూ జోస్యం చెప్పారు మంత్రి మేరుగ నాగార్జున.

శ్వేత మృతికి కారణం అదే..! షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన సీపీ
విశాఖపట్నంలో గర్భిణి శ్వేత మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేశారా? అనే విషయంలో పెద్ద సస్పెన్స్‌ కొనసాగింది.. ఈ కేసులో శ్వేత పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ కీలంగా మారింది.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాత.. ఈ కేసులో కొన్ని షాకింగ్‌ విషయాలను మీడియాకు వెల్లడించారు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మ.. శ్వేత అనే అమ్మాయి మృత దేహం YMCA బీచ్ లో లభ్యం అయింది.. శ్వేతది ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. శ్వేత ఆత్మహత్యకు గల కారణాలను పేర్కొంటూ.. శ్వేత భర్త కొద్ది రోజుల క్రితం ఉద్యోగం రీత్యా హైదరాబాద్ కి వెళ్లాడు.. సాయంత్రం 6.20 నుంచి 6.30 గంటల మధ్యలో భర్త తో మాట్లాడింది.. 8 గంటలకి తిరిగి భర్త ఫోన్ చేశాడు.. 8:15 కి శ్వేత తల్లి రమాదేవికి అత్తింటివారు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఇక, ‘శ్వేతపై అత్తింటి వేధింపులు నిజమే.. శ్వేత తల్లి ఎదుటే దంపతులు గొడవపడ్డారు.. ఆమె కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారు. 90 సెంట్ల భూమి శ్వేత పేరు మీద ఉంది.. ఆ భూమి తన పేరు మీదకి మార్చాలి అని మణికంఠ ఇబ్బంది పెట్టాడు.. అత్త, మామ చిన్నచూపు చూడడంతో శ్వేత మనస్తాపానికి గురైంది’’ అని సీపీ వివరించారు. ఫిబ్రవరిలో ఒక సారి శ్వేత ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందన్న ఆయన.. అత్తింటివారి వేధింపులు కారణంగా గతంలో ఆత్మహత్యకి పాల్పడిందన్నారు.. బీచ్‌ దగ్గర మృతదేహం ఉందని సమాచారం వచ్చింది. శ్వేత భర్త, ఆడపడుచు భర్తపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. శ్వేత చెప్పులు 100 మీటర్లు దూరంలో లభ్యం అయ్యాయి.. కానీ, శ్వేత ఒంటి పై ఎటువంటి గాయాలు లేవు.. పోస్ట్‌మార్టం వీడియో గ్రఫి చేయించామని తెలిపారు. శ్వేత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలు, ఆడపడుచు భర్త మీద గృహ హింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపుల కేసులు పెట్టాం.. ఐపీసీ సెక్షన్ 354, 498(a) కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.

ఆదివారం తుది ఉద్యమ కార్యాచరణ ప్రకటన.. చర్చలకు విలువ లేదు..?
తమ డిమాండ్ల పరిష్కారంకోసం ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఇక సమస్య పరిష్కారం అయినట్టేనని చెబుతున్నా.. అవి కార్యరూపం దాల్చేవరకు వెనక్కి తగ్గేది లేదంటున్నాయి ఉద్యోగ సంఘాలు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు.. 50 రోజులుగా ఉద్యమం చేస్తున్నాం.. న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమం కొనసాగిస్తామన్నారు.. ప్రభుత్వం నిన్నటి వరకు చర్చలు జరపకుండా లాస్ట్ మినిట్‌లో పిలిచి అనధికారిక చర్చలన్నారు.. చర్చలకు విలువ లేదని వారే చెప్పారని వ్యాఖ్యానించారు. ఇక, డీఏలు కూడా 1-7-2018 నుండి నేటి వరకు సెటిల్‌ చేయలేదని.. ప్రభుత్వం వచ్చాక పీఆర్సీ ఇస్తామని నేటికి ఆ సమస్యలు అలానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ అరియార్, సరెండర్ లీవ్‌లు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సంఘాలతో రౌండ్ టేబుల్ నిర్వహించామని తెలిపారు బొప్పరాజు.. కార్మిక సంఘాల మద్దతు అవసరం వుందని కోరామన్నారు.. ఏపీ జేఏసీతో కూడా గతంలో కలిసి పనిచేశాం.. త్వరలో మా ఉద్యమంలో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.. రౌండ్ టేబుల్‌కు వచ్చిన అన్ని సంఘాలు ఉద్యమానికి పూర్తిగా మద్దతు తెలిపాయి.. రేపు గ్రామ, వార్డు సచివాలయం సమస్యలపై ధర్నాలు చేయాలని నిర్ణయించాం.. మహిళ కార్యదర్శులని చెప్పి.. ఇప్పుడు పోలీసులు అంటున్నారని తెలిపారు. ఇక, రేపు, ఎల్లుండి రాష్ట్ర సమావేశం నిర్వహించి ఆదివారం మా తుది ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు.

110 ఏళ్ల తరువాత ఆ రాష్ట్రంలో కనిపించిన పులి..
దాదాపుగా 110 ఏళ్ల తర్వాత హర్యానాలో పులి కనిపించింది. చివరి సారిగా 1913లో పులి కనిపించినట్లు రాష్ట్ర అటవీ, వన్యప్రాణి మంత్రి కన్వర్ పాల్ చెప్పారు. హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని కలేసర్ నేషనల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులికి సంబంధించిన ఫోటోలు చిక్కాయని అధికారులు వెల్లడించారు. 110 సంవత్సరాల తర్వాత కలేసర్ ప్రాంతంలో పులి కనిపించడం రాష్ట్రానికి గర్వకారణం మంత్రి అన్నారు. అడవులు మరియు వన్యప్రాణులు మన సహజ వారసత్వం మరియు వాటిని రక్షించడానికి మనం ఐక్యంగా కృషి చేయాలని చెప్పారు. ఏప్రిల్18, 19 తేదీల్లో పులి కనిపించింది. పులి వయస్సు, ఆడా..? మగా..? అని నిర్థారించేందుకు ప్లగ్ మార్క్ లను పరిశీలించేందుకు ఓ టీం ను ఏర్పాటు చేసినట్లు పంచకుల చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంఎల్ రాజ్ వంశీ చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని రాజాజీ నేషనల్ పార్క్ నుండి పులి కాలేసర్‌కు చేరుకుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. హర్యానాలోని కలేసర్ పార్క్, హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలోని సింబల్బరా నేషనల్ పార్క్ను అనుకుని ఉంది. ఈ రెండు నేషనల్ పార్కులు దట్టమైన అటవీ ప్రాంతంతో రాజాజీ నేషనల్ పార్క్‌కి కలపబడి ఉన్నాయి. పులులు తిరిగేందుకు ఈ కారిడార్ అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు.

ఓరల్ సెక్స్‌తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్ ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ఓరల్ సెక్స్ పద్ధతులు గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అమెరికా, యూకే దేశాల్లో ఈ రకం క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నట్లు తేలింది. ఈ రెండు దేశాల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్(సర్వికల్ క్యాన్సర్) ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో గొంతు క్యాన్సర్ల సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్(హెచ్పీవీ) గర్భాశయ క్యాన్సర్లకు ప్రధాన కారణంగా ఉంటుందని బర్మింగ్ హామ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ హిషామ్ మెహన్నా జర్నల్ లో రాశారు. హెచ్ పీ వీ అనేది సాధారణ వైరస్. ఈ వైరస్ ఉన్నవారి నుంచి యోని, అంగం, నోటి ద్వారా సెక్స్ చేస్తే ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఓరల్ సెక్స్ అనేది ఓరోఫారింజియల్ క్యాన్సర్ అని పిలువబడే ఓ రకమైన గొంతు క్యాన్సర్ పెరుగుదలకు కారణం అవుతోందని, ఇది టాన్సిల్స్, గొంతు వెనకభాగాన్ని ప్రభావితం చేస్తోందని అధ్యయనంలో తేలింది. గత రెండు దశాబ్దాలుగా, పాశ్చాత్య దేశాలలో గొంతు క్యాన్సర్ వేగంగా పెరుగుతోంది, దీనిని కొందరు అంటువ్యాధిగా కూడా పిలుస్తున్నారని డాక్టర్ మెహన్నా పేర్కొన్నారు.

విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఎటువంటి ఫిర్యాదు లేకున్నా సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడుతామని హెచ్చరించింది. ప్రసంగం చేసిన వ్యక్తుల మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోబడతాయని, దీని ద్వారా భారత రాజ్యాంగంలోని మౌళిక లక్షణం అయిన లౌకికవాదాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో 2022లో సుప్రీకోర్టు ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులకు ఇచ్చిన ఉత్తర్వుల పరిధిని అన్ని రాష్ట్రాలు, యూటీలకు విస్తరించింది. ద్వేషపూరిత ప్రసంగాలు దేశంలోని లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేయగలవని సుప్రీం పేర్కొంది. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన నేరాలను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. ఇలాంటి కేసులో చర్యలు తీసుకోవడంతో విఫలం అయిన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కోరింది.

ఏందీ బ్రో.. ప్రభుదేవాకు రెండో పెళ్లి అయ్యిందా.. ఇదెక్కడి ట్విస్ట్
ఇండియన్ మైఖైల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. శరీరంలో స్ప్రింగ్స్ ఉన్నాయా అన్నట్టు ప్రభుదేవా చేసే డ్యాన్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా హీరో, డైరెక్టర్ అని తేడా ఉండకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రభుదేవా. ఇక ఆయన పర్సనల్ లైఫ్ మొత్తం వివాదాలే అన్న విషయం కూడా అందరికి తెల్సిందే. ప్రభుదేవా మొదటి భార్య రామ లతా. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాబిడ్డలతో సంతోషంగా ఉన్న వారి జీవితంలోకి నయనతార ఎంట్రీ ఇచ్చింది. నయన్ తో ప్రేమలో పడ్డ ప్రభుదేవా.. ఆమెను పెళ్లాడడానికి సిద్దమయ్యాడు. దీంతో ప్రభుదేవా కోసం నయన్.. హిందూ మతాన్ని కూడా స్వీకరించింది. ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసినా పట్టించుకోకుండా ప్రభుదేవాతోనే జీవితం అనుకుంది. ఇక చివరికి ప్రభుదేవా చేతిలో అడ్డంగా మోసపోయింది. అందుకు కారణం ప్రభుదేవా మొదటి భార్య రామలత. ఆమె విడాకులకు ఒప్పుకోకుండా నయన్ పై మీడియాముందు కు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. తన కుటుంబాన్ని ముక్కలు చేసిన నయన్ జీవితం కూడా ముక్కలు అవుతుందని, తన ఉసురు ఆమెకు తగులుతుందని శాపనార్దాలు పెట్టింది.

గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఉగ్రం’ టైటిల్ సాంగ్!
‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ‘ఉగ్రం’పై అంచనాలను పెంచింది. ‘అల్లరి’ నరేష్, విజయ్ కనకమేడల మరో పెద్ద హిట్ అందించనున్నారని ప్రమోషనల్ కంటెంట్ భరోసా ఇచ్చింది. ఈ రోజు ‘ఉగ్రం’ టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల ఈ టైటిల్ ట్రాక్ ని హైలీ పవర్ ఫుల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. గూస్ బంప్స్ తెప్పించే ఎమోషన్ తో ఈ పాటని స్కోర్ చేసి స్వయంగా అలపించారు. చైతన్య ప్రసాద్ ఈ పాటకు పవర్ ఫుల్ లిరిక్స్ అందించారు. టైటిల్ ట్రాక్ నరేష్ ఉగ్రరూపాన్ని ప్రజంట్ చేసింది. పాటలో కనిపించిన విజువల్స్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, స్టన్నింగా వున్నాయి. ‘ఉగ్రం’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. వేసవి కానుకగా మే 5న ఉగ్రం థియేటర్లలో విడుదల కానుంది.