NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఇంచార్జీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
2017లో రాహుల్ గాంధీ సభ సంగారెడ్డి లో నిర్వహించానని ఆ సభ ఖర్చు అంత నాదే అంటూ వ్యాఖ్యానించారు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. ఆ గుర్తింపు ఎక్కడ పాయే అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో ముగించుకొని తెలంగాణ రాష్ట్రంలో మొదటి రోజు మహబూబ్ నగర్ జిల్లలో అడుగు పెట్టడం జరిగిందని, కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీ గారి యాత్ర సంగారెడ్డి లో 25 కిలోమీటర్లు ముగించుకొని మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళడం జరిగిందన్నారు. సంగారెడ్డి లో ఉదయం 5 గంటలకే భారీ ఎత్తున రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకడం జరిగిందని ఆయన అన్నారు. ఈ ఖర్చు నాదేనని, స్వయంగా రాహుల్ గాంధీ గారే నన్ను పిలిచి చాలా బాగా చేశావాని అభినందించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇలాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ కోసం ఎలా వాడుకోవాలని ఇప్పుడున్న ఇన్ ఛార్జ్ లు తెలుసుకోకపోవడం చాలా దురదృష్టకారమన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. “మేము అనేక సార్లు సీనియర్ నాయకులతో ముఖ్యమైన విషయాలను చర్చించాము,” అని చెప్పుకొచ్చారు. ఇఫ్తార్ పార్టీకి హాజరైన పార్టీ అగ్ర నాయకుడితో తన ఆలోచనలను పంచుకున్నాడు. పాత రోజుల్లో లాగా గాంధీభవన్‌లో కూర్చోలేకపోతున్నట్లు, ఉండలేకపోతున్నట్లు కూడా ఆయన చెప్పారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జగ్గారెడ్డి లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మునుపటిలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ప్రశాంతత కరువైందన్నారు. తన మనసులో ఎన్నో బాధలు ఉన్నాయని, వాటిని చెబితే ఏమౌతుందో.. చెప్పకపోతే ఏమవుతుందోనని ఆందోళన ఉందని జగ్గారెడ్డి తెలిపారు.

ఉద్యోగుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం భేటీ.. మే 1 నుంచి వరుసగా జీవోలు..!
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఉద్యోగ సంఘాల నాయకులతో ఇన్ ఫార్మల్ మీటింగ్ జరిగింది.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు, పెండింగ్ నిధులు వంటి అంశాలపై చర్చించాం.. అన్ని అంశాలకు టైం బాండ్ పెట్టాం.. ఇక, మే ఒకటివ తేదీ నుంచి వరుసగా జీవోలు జారీ అవుతాయని వెల్లడించారు.. పీఆర్సీ కమిటీని ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.. ఓపీఎస్ పై అడిగారు.. తర్వాతి సమావేశంలో చర్చిద్దాం అని చెప్పామన్న ఆయన.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చర్చకు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా ఈ అంశం పై సానుకూలంగా ఉన్నారని తెలిపారు.. త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

జీవో ఇచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదు..!
మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చలు ముగిసిన తర్వాత.. ఒక్కో ఉద్యోగ సంఘం స్పందన ఒకోలా ఉంది.. సమావేశంపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తే.. మరికొందరు ఉత్తర్వులు వచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. సచివాలయంలో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. చట్ట బద్దంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు.. రూ. 1800 కోట్ల బకాయిలు ఇంకా ఇవ్వాలన్న ఆయన.. అవి ఎప్పుడు చెల్లిస్తారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.. పీఆర్సీ అరియర్ లు కూడా ఎంత ఇవ్వాలో లెక్కలు చూస్తామని అధికారులు చెప్పారు.. పోలీసులు, వైద్యశాఖలో పని చేస్తున్న వారికి ఇచ్చే స్పెషల్ పేలకు కాల పరిమితి వద్దని చెప్పామన్నారు.. ఇక, కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లులో 16 శాతం హెచ్ఆర్ఏ ఉత్తర్వులు ఇవ్వాలని కోరామన్నారు.. అయితే, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకూ మా ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదు.. రేపు జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశం యథావిథిగా కొనసాగుతుందని.. మా ఉద్యమ ఫలితంగానే 5860 కోట్ల బకాయిల డబ్బులు ఇచ్చారని తెలిపారు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు.

పఠనాసక్తి పెంచేందుకు విద్యాశాఖ శ్రీకారం.. వేసవి సెలవుల్లో అమలు..
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.. We Love Reading పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.. ఈ వేసవి సెలవుల్లో కార్యక్రమం అమలు చేయనున్నారు.. కార్యక్రమం అమలుపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్.. ప్రతి టీచర్ కొందరు విద్యార్థులకు మెంటర్లుగా We Love Reading కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు.. స్కూళ్లల్లోని లైబ్రరీ నుంచి విద్యార్థులకు పుస్తకాల పంపకం జరగాలన్నారు.. ఏప్రిల్ 29వ తేదీన పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల వార్షిక పరీక్ష ఫలితాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయనున్నారు టీచర్లు.. విద్యార్థుల అకాడమిక్‌ స్థితిగతులపై తల్లిదండ్రులతో సమీక్ష నిర్వహించనున్నారు.

శ్వేత కేసులో మరో ట్విస్ట్‌.. వెలుగులోకి సంచలన విషయం..!
విశాఖపట్నం బీచ్‌లో మృతదేహమై తేలిన వివాహిత శ్వేత కేసులో మరో సంచలన అంశం వెలుగు చూసింది.. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారాయి.. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్‌మెంట్‌ను త్రీటౌన్‌ పోలీసులు నమోదు చేశారు. ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు విచారణలో తేలింది. మరోవైపు.. శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.. ఇదే సమయంలో శ్వేత అనుమానాస్పద మృతి కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.. భర్త మణికంఠ చెల్లెలి భర్తపై లైంగిక వేధింపులు కేసు నమోదైంది.. శ్వేత తల్లి రమ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు త్రీ టౌన్ పోలీసులు.. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ తో పాటు, శ్వేత సెల్‌ఫోన్‌ కీలకంగా మారగా.. మొబైల్ లాక్ ఓపెన్ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.. ఇక, విశాఖలోని జ్ఞానాపురం స్మశాన వాటికలో శ్వేత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక, ఈ కేసుపై మీడియాతో మాట్లాడిన ఏసీపీ వివేకనందా.. శ్వేత తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం అన్నారు. శ్వేత అడపడచు భర్త లైంగిక వేధింపులు భరించలేక శ్వేత ఆత్మహత్యకి పాల్పడినట్టు రమాదేవి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.. ఈ కేసులో నలుగురుని అదుపులోకి తీసుకున్నాం.. గృహహింస, లైంగిక వేధింపులు కింద 304 (B) ,354 (A) సెక్షన్లు కింద కేసు నమోదు చేశామన్నారు.. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు ఏసీపీ వివేకనందా.

చంద్రబాబు తర్వాత టీడీపీ మాయం..! ఎప్పటికైనా జూ.ఎన్టీఆరే టీడీపీ నాయకుడు..
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మరో సారి కీలక కామెంట్లు చేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదని జోస్యం చెప్పారు.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్సీపీ)కి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)యే ప్రత్యామ్నాయంగా మారుతుందన్నారు. ఇక, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేసిన ఆయన.. పప్పు లోకేష్‌ ఇంకా పది పాద యాత్రలు చేసినా నాయకుడు కాలేడని వ్యాఖ్యానించారు.. లోకేష్ పాదయాత్రలో ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నాడు.. కానీ, మా మంత్రి ఆర్కే రోజా.. లోకేష్ కు పప్పు అని పేరు పెట్టిందని చెప్పుకొచ్చారు.. మరోవైపు.. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆరే టీడీపీ నాయకుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చెన్నకేశవరెడ్డి. చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారని గుర్తుచేశారు.. టీడీపీ హయాంలో పేపర్ పై పనులు మంజూరు చేయడం, కమీషన్లు కొట్టడమే పని అంటూ ఆరోపించారు.. కానీ, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలన పారదర్శకంగా సాగుతోందని ప్రశంసలు కురిపించారు.. అయితే, ఎప్పటికైనా టీడీపీకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆరే నాయకుడు అవుతాడంటూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. కాగా, విపక్షాలకు కూడగట్టుకుని.. మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇక, రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముందుకుసాగుతున్న విషయం విదితమే.

రోడ్ల నాణ్యతపై మరింత దృష్టి.. ఏడాదికే రిపేరు చేయాల్సిన పరిస్థితి రావొద్దు..!
రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌.. వేసిన మరుసటి సంవత్సరమే మళ్లీ రిపేరు చేయాల్సిన పరిస్థితి రాకూడదన్నారు.. ఇంజినీర్లు వీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష సందర్భంగా ఉపాధి హామీపై కూడా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.. ఇప్పటి వరకూ 215.17 లక్షల పని దినాల కల్పన జరిగింది.. పని దినాల రూపంలో రూ. 5280 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద ఖర్చు చేయాలని లక్ష్యంగా ఉండాలన్నారు.. మెటీరియల్‌ రూపంలో రూ.3520 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి అనేది టార్గెట్‌.. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8800 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించారు.

బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో రేపు సీబీఐ కోర్టు తీర్పు..
బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో రేపు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రేమ వ్యవహారంతో ముడిపడి ఉన్న ఈ ఆత్మహత్య కేసు 2013లో సంచలనం రేపింది. జూన్ 3, 2013లో ముంబైలోని తన ఇంట్లో నటి జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలి, జరీనా వహాబ్ ల కుమారుడు, బాలీవుడ్ నటుడు అయిన సూరజ్ పంచోలీ ఈ ఆత్యహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జుహూలో తన ఇంట్లో ఉరేసుకుని మరణించిన జియాఖాన్, సూరజ్ పంచోలిపై 6 పేజీల లేఖలో ఆరోపించింది. ఈ లేఖలో ప్రేమ పేరుతో సూరజ్ పంచోలి తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసిన విషయాలను ప్రస్తావించింది. పలుమార్లు గర్భం దాల్చినట్లు, అబార్షన్లు చేసుకున్నట్లు కూడా ప్రస్తావించింది.

గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రితో చర్చలు..
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫుతో గురువారం చర్చలు జరిపారు. 2020లో గాల్వాన్ లో భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణ అనంతరం చైనా రక్షణ మంత్రితో చర్చల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఇరుదేశాల రక్షణ మంత్రులు సమావేశం నిర్వహించారు. కజకిస్థాన్, ఇరాన్, తజికిస్థాన్ రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు. గత ఆదివారం భారత్, చైనా మధ్య 18వ రౌండ్ కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు జరిగాయి, రెండు దేశాలు సన్నిహితంగా ఉండటానికి మరియు తూర్పు లడఖ్‌లోని మిగిలిన సమస్యలను పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని త్వరగా రూపొందించడానికి అంగీకరించాయి. అయితే మూడేళ్లుగా ఉణ్న సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలకడంపై స్పష్టంగా ముందుకు వెళ్లే సూచనలు కనిపించడం లేదు.

ఇన్ని వేరియేషన్స్ సినిమాలో కూడా చూపించి ఉండదు…
లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సమంతా, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ శాకుంతలం సినిమా చేసింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎంటైర్ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చే రేంజులో డిజాస్టర్ అయ్యింది. ఊహించని ఈ రిజల్ట్ నుంచి ఇమ్మిడియేట్ గా బయటకి వచ్చిన సామ్, తన నెక్స్ట్ షూటింగ్స్ కి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే సమంతా పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది. ఈ కోలాబోరేషణ్ కి సంబంధించిన లేటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ బయటకి వచ్చేసింది. ఈ యాడ్ లో సామ్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించింది. రెండున్నర గంటల సినిమాలో కూడా సామ్ ఇన్ని వేరియేషన్స్ చూపించలేదేమో అనే రేంజులో ట్రెడిషనల్ నుంచి ట్రెండీ అవుట్ ఫిట్స్ వరకూ అన్ని రకాల కాస్ట్యూమ్స్ ట్రై చేసి సమంతా ఫాన్స్ కి కిక్ ఇచ్చింది. రైజ్ అప్ బేబీ అంటూ సామ్ ఇచ్చిన స్లోగన్ పెప్సీకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. సౌత్ నుంచి KGF యష్, నార్త్ నుంచి రన్వీర్ సింగ్ లు మాత్రమే ప్రస్తుతం పెప్సీతో బ్రాండ్ కొలబోరేషణ్ లో ఉన్నారు.