హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం మేఘావృతమైన వాతావరణం తర్వాత.. నగరంలోని అనేక ప్రాంతాలలో ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వర్షం కురిసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. లక్డీకాపూల్, బేగంపేట్, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరికొన్ని గంటల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తుపాను కారణంగా పలు కాలనీల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. జీడిమెట్ల, సూరారం, బాలానగర్, కూకట్‌పల్లి సహా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే.. ప్రజలు అవసరముంటేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది.
సింహాచలంలో అపచారం.. సర్కార్ సీరియస్..
సింహాచలం చందనోత్సవంలో అపచారం ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు గుర్తు తెలియని భక్తులు.. ఓ వైపు వేడుక జరుగుతుండగానే బయటకు వచ్చాయి ఫొటోలు, వీడియోలు.. స్వామివారి అంతరాలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం ఉన్నా.. ఇలా బయటకు రావడంతో కలకలం రేగుతోంది.. గత ఏడాది తొలిసారి బయటకు వచ్చాయి అప్పన్న అంతరాలయ వీడియోలు.. ఇప్పుడు మరోసారి ఫొటోలు, వీడియోలు బయటకురావడంపై భక్తులు మండిపడుతున్నారు. అయితే, సింహాచలం దేవస్ధానంలో అపచారాలు, చందనోత్సవ వైఫల్యాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సింహాచలంలో విచారణ చేపట్టారు జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్.. దేవస్ధానంలో సీసీఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించారు.. చందనోత్సవం టిక్కెట్లు భారీగా రీసైక్లింగ్ జరిగినట్టు యంత్రాంగం భావిస్తోంది.. ఆ దిశగా బాధ్యులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.. అంతరాలయం వీడియోలు రికార్డింగ్, బయటకు రావడంపై దృష్టిసారించిన అధికారులు.. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.
విద్యార్థులకు అలర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు..
ఇంటర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న విద్యార్థులకు అలర్ట్.. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.. రేపు అనగా.. ఈ నెల 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు విజయవాడలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ ఫలితాలను విడుదల చేయబోతున్నారు.. విజయవాడలోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లెమన్ ట్రీ ప్రీమియర్ వద్ద ఈ ఫలితాలను మంత్రి బొత్స విడుదల చేస్తారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు..
శుభవార్త చెప్పిన సీఎం జగన్.. రేపే వారి ఖాతాల్లో నిధుల జమ
విద్యార్థులకు, వారి తల్లులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు జగనన్న వసతి దీవెన విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేయనున్నారు సీఎం జగన్.. అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.. అయితే, బుధవారం రోజు జమ చేస్తున్న రూ. 912.71 కోట్లతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం.. కాగా, ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తూ వస్తుంది సర్కార్.. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్న విషయం విదితమే.
సీఎస్‌కు చంద్రబాబు లేఖ.. వారిని ఆదుకోవాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి లేఖ రాశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మార్చిలో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్న ఆయన.. మరోవైపు.. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చేతికొచ్చే పంట నేలపాలైంది.. కృష్ణా, గుంటూరు, గోదావరి డెల్టా ప్రాంతాల్లో భారీగా వరిపంట దెబ్బతిన్నదని.. కళ్లాల్లో ఆరబెట్టిన వేలాది టన్నుల ధాన్యం తడిచిపోయిందని తన లేఖలో పేర్కొన్నారు.. . మొక్కజొన్న రైతులు కూడా తీవ్రస్థాయిలో నష్టపోయారు.. ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీగా మిరప పంట దెబ్బతిన్నది.. కోతలు పూర్తి కాక.. ఈదురు గాలుల ధాటికి మిరప రాలిపోయింది.. అరటి, మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు అని సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.. పిడుగులు పడి ఏడుగురు రైతులు దుర్మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.. దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. వరి, మొక్కజొన్నకు ఎకరాకు రూ.20వేలు, మిర్చి, అరటి, మామిడికి రూ.50 వేలు పరిహారం అందించాలంటూ తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారు
దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. నాంపల్లి నియోజకవర్గం, అసిఫ్‌నగర్ లోని నియోజకవర్గ ఇంఛార్జి సి.హెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశ వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, బీఆర్‌ఎస్ స్టేట్ ఇంఛార్జి బండి రమేష్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అన్ని డివిజన్ల నుండి బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, తెలంగాణ వచ్చిన తర్వాత అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గత కొన్నాళ్లుగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనలు పార్టీ మరింత బలోపేతానికి, కార్యకర్తల ఐక్యతకు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారు.. రప్పించేందుకు చర్యలపై సీఎం ఆదేశం..
సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారు స్వస్థలాలకు చేరేంతవరకూ అండగా నిలవాలని స్పష్టం చేశారు.. దీని కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి.. విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని వారి స్వస్థలాలకు చేరుకునే వరకు అండగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, సుడాన్‌లో ఇప్పటి వరకు సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు..
కర్ణాటక ఇంటర్ సెకండియర్ లో హిజాబ్ అమ్మాయే టాప్
కర్ణాటకలో గతేడాది హిజాబ్ పోరాటం ఉధృతంగా సాగింది. ముస్లిం బాలికలు స్కూళ్లు, కాలేజీలకు హిజాబ్ ధరించి రావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు చేశారు. కాలేజీలకు హిజాబ్ తో వచ్చే విద్యార్థినులపై దాడులకు దిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఓ బాలిక మాత్రం వారిని ప్రతిఘటించింది. హిజాబ్ తోనే వచ్చి చదువుకుంటానని తేల్చిచెప్పేసింది. విద్యార్థుల రూపంలో ఉన్న అల్లరిమూకలు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత కర్ణాటకలో హిజాబ్ పోరాటం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఏమీ తెలలేదు. ఆ లోపే కర్ణాటక ఎన్నికలు కూడా వచ్చేశాయి. అయితే అప్పట్లో హిజాబ్ ధరించడం కోసం అల్లరి మూకలతో ధైర్యంగా పోరాడి సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్లా వైరల్ అయిన ఓ విద్యార్థిని ఇప్పుడు ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో సత్తా చాటింది. ఏకంగా టాపర్ గా నిలవడంతో పాటు చదువు కోసం తాను చేసిన పోరాటం వృథా కాలేదని నిరూపించింది. కర్ణాటకలో క్లాస్ 12 ఫలితాల్ని తాజాగా బోర్డు ప్రకటించింది. ఇందులో 600 మార్కులకు గానూ ఏకంగా 593 మార్కులు సాధించి సదరు హిజాబ్ బాలిక తబస్సుమ్ టాపర్ గా నిలిచింది.
రికార్డ్ ధరకి ఇసుక ప్లాట్.. ఓనర్‌కి 242% లాభం
బాగా డబ్బున్న బడా బాబుల కంటికి ఏదైనా అందమైన భవనం, విలాసవంతమైన పెంట్‌హౌస్, పురాతన భవనాలు లేదా వస్తువులు కనిపిస్తే.. కోటాను కోట్లు పెట్టి, వాటిని కొనుగోలు చేస్తుంటారు. పెయింటింగ్‌లపై కూడా ఎన్నో కోట్లు వెచ్చించడాన్ని మనం చూశాం. కానీ.. ఒక వ్యక్తి మాత్రం కేవలం ఇసుక ప్లాట్ కోసం ఏకంగా 34 మిలియన్ డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో రూ.279 కోట్లు) ఖర్చు చేశాడు. భూతల స్వర్గంగా పేరొందిన దుబాయ్‌లో ఒక ఇసుక ప్లాట్‌ని అమ్మకానికి పెట్టగా.. ఓ కొనుగోలుదారు దాన్ని 125 మిలియన్ దిర్హామ్‌లకు సొంతం చేసుకున్నాడు. దీంతో.. ఇది యూఏఈలో విక్రయించబడిన అత్యంత ఖరీదైన ఫ్లాట్‌గా చరిత్రపుటలకెక్కింది. ఇంతకుముందు.. యూఏఈలోని ఒక ల్యాండ్ 91 మిలియన్ దిర్హామ్ (24 మిలియన్ డాలర్స్) అమ్ముడుపోయి.. అత్యంత ఖరీదైన ఫ్లాట్‌గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైంది. జుమైరా సముద్ర తీరంలో ఉన్న ఆ ఇసుక ప్లాట్ విస్తీర్ణం 24,500 చదరపు అడుగులు. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు వెల్లడి కాలేదు కానీ.. ఫ్యామిలీ వెకేషన్ కోసం అక్కడ ఒక మ్యాన్షన్ నిర్మించాలన్న ఉద్దేశంతో ఆ ఇసుక ప్లాట్‌ని అతడు కొన్నట్లు వెల్లడైంది.
పాకిస్తాన్ ఆర్మీకి అంత సీన్ లేదు.. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావెద్ బజ్వా తన సొంత సైన్యంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ సైన్యంతో పోరాడే శక్తి, సామర్థ్యాలు పాక్ ఆర్మీకి లేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. ఆ స్థాయి ఆయుధ సంపత్తి సైతం పాక్ ఆర్మీ వద్ద లేదని బాంబ్ పేల్చారు. బ్రిటన్‌లోని పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు హమీద్ మీర్, నజీం జెహ్రాలకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. జావెద్ మాట్లాడుతూ.. ‘‘ఇండియన్ ఆర్మీకి పాక్ ఆర్మీ ఏమాత్రం సరితూగలేదు. భారత్‌తో యుద్ధానికి దిగే పరిస్థితి పాక్‌కి లేదు. ట్యాంకులు ఏమాత్రం పని చేయడం లేదు. ఫిరంగులను తరలించేందుకు డీజిల్ సైతం లేదు’’ అని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు.. పాక్ దేశ సైనిక సామర్థ్యాలపై ప్రశ్నలు లేవెనత్తేలా, సైన్యం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి. పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులో జావెద్ బజ్వా ఈ వ్యాఖ్యలు చేసినట్లు.. జర్నలిస్ట్ హమీద్ మీర్ వెల్లడించాడు. అంతేకాదు.. పాకిస్తాన్ వద్ద పెద్దగా ఆప్షన్స్ లేవు కాబట్టి భారత్‌తో శతృత్వం పెంచుకోవడం కన్నా స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరచుకుంటేనే ఉత్తమమని జావెద్ అభిప్రాయపడినట్టు మీర్ తెలిపాడు. భారత్‌తో ఉన్న సుదీర్ఘ విరోధం పాక్ దేశాన్ని హరించేస్తోందని.. భారత్‌తో పోరాడేందుకు కావాల్సిన ఆయుధ సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్‌కు వద్ద లేవు కాబట్టి, కశ్మీర్ సమస్యపై ఇరుదేశాలు శాశ్వత పరిష్కారానికి వచ్చే విషయంపై సమాలోచనలు జరుగుతున్నాయని బజ్వా పేర్కొన్నట్టు చెప్పాడు.
సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే
అలనాటి అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే.. సిల్క్ జీవితం ఒక పువ్వు లాంటిది. అందు ఆ పువ్వుని చూసారు కానీ, దానికింద ఉన్న ముళ్ళును మాత్రం ఎవరు చూడలేకపోయారు. ఆ ముళ్ళమీద నడుస్తూనే ఆమె చిరునవ్వులు చిందించింది. ఎంతమంది హృదయాల్లో శృంగార తారగా కొలువుండిపోయింది. ఇక ఈ మధ్య వచ్చిన దసరా సినిమా ద్వారా ఆమెను మరోసారి అభిమానులు తలుచుకున్నారు. సిల్క్ జీవితం మొత్తం అందరికి తెల్సిందే. ఎన్నో ఆవమానాలు పడి, స్టార్ డమ్ ను తెచ్చుకుంది. చివరికి ఆ స్టార్ డమ్ వలనే ఆమె చనిపోయింది. ఎందుకంటే .. తెరమీద ఆమె అందాలను ఆస్వాదించినవారే.. బయట ఆమెను చాలా చులకనగా చూసేవారట. ఆమె సినిమాలో ఉందని తెలిస్తేనే వెళ్లే అభిమానులు కానీ, హీరోలు కానీ.. బయట ఆమెను అవమానించేవారట. వాటితో పాటు నమ్మినవాడు ఆస్తికోసం ఆమెను మోసం చేసాడని తెలియడంతో ఆమె ఇంకా కుంగిపోయింది. ఇదేనా బతుకు అనుకోని 1996లో బలవన్మరణానికి పాల్పడింది. సిల్క్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. ఇండస్ట్రీలో ఎంతోమందిని ఆమె మరణం కలిచివేసింది. కానీ, ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు ఆమె చనిపోయినప్పుడు శవాన్ని చూడడానికి కూడా రాలేదు. వారే కాదు కనీసం కుటుంబ సభ్యులు కూడా రాలేదు. ఒక అనాథ శవంలా ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. అయితే సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి ఒకే ఒక్క హీరో వచ్చాడట. అతనే.. యాక్షన్ కింగ్ అర్జున్. ఎవరు ఎన్ని అన్నా, ఎలా అయినా వార్తలు రాసుకున్నా తనకు నష్టం లేదని, తెగించి ఆమెను కడచూపు చూడడానికి వచ్చాడట అర్జున్. అందుకు కారణం, సిల్క్, అర్జున్ మంచి స్నేహితులు కావడమే.. అంతేకాకుండా సిల్క్ ఎప్పుడు అర్జున్ తో నేను చనిపోయాక నన్ను చూడడానికి వస్తావా ..? అని అడిగేదట. తప్పకుండ వస్తాను అని అర్జున్ చెప్పేవాడని, ఆ మాట నిలబెట్టుకోవడానికే అర్జున్, సిల్క్ శవాన్ని చూడడానికి వెళ్ళాడట. ఇది కోలీవుడ్ లో ఒక నిర్మాత రివీల్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.