NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

కేవీపీ కీలక వ్యాఖ్యలు.. ఆంధ్రుడిగా సిగ్గు పడుతున్నా..!
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలో కేవీపీ కీలక వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడితే.. దేశంలోని ఒక్క ఎంపీ కూడా ఖండించలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచందర్ రావు. రాహుల్ సభ్యత్వ రద్దుపై ఏపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడక పోవటంతో ఆంధ్రుడిగా తాను సిగ్గుతో తల దించుకున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదు అంటూ కేవీపీ నిలదీశారు.. ఇక, జగన్, పవన్, చంద్రబాబు తమ తమ పార్టీలను ఎందుకు బీజేపీలో విలీనం చేయటం లేదో అర్దం కావటం లేదు అంటూ సెటైర్లు వేశారు కేవీపీ.. బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తటానికి మూడు పార్టీలు తొందర పడుతున్నాయని ఆరోపించారు.. అయితే, వైఎస్ చివరి సందేశంలో కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని అన్నారు.. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వైఎస్ కు నిజమైన నివాళి, ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. మరోవైపు.. 2018లో దురదృష్టవశాత్తూ టీడీపీతో కాంగ్రెస్ తెలంగాణలో పొత్తు పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు..

ఖమ్మంలో కడప రాజకీయం
పోలీసులపై దాడికి పాల్పడ్డ షర్మిలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మంలోనూ కడప తరహా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్‌ శ్రీరామ రక్షగా ఉంటారని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. అమిత్ షా ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తివేస్తాం అంటుండు, బండి సంజయ్ సచివాలయం కూల్చివేస్తామంటుండు. మరొకడు ప్రగతి భవన్ కూల్చుతాం అంటున్నారు. మరోవైపు షర్మిళ పోలీసు కానిస్టేబుల్‌ని కొట్టింది. కడప పోగరు చూపిస్తుంది. ఎక్కడఎక్కడ నుండో వచ్చి కేసీఆర్‌ని తూలనాడుతున్నారు అంటూ మంత్రి అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, దేశం ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారంటూ పువ్వాడ అజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 159 మెడికల్ కళాశాలలు దేశ వ్యాప్తంగా మంజూరు చేస్తే తెలంగాణకి ఒక్క కళాశాల మంజూరు చేయలేదని అన్నారు. కానీ, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేశారు. పిహెచ్‌సిలు ఏర్పాటు చేశారని అన్నారు.

అందుకే నేను చొక్కా విప్పా.. సిగ్గు పడటం లేదు..
ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు.. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. అంతేకాదు.. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ చొక్కా విప్పడం చర్చగా మారింది.. అయితే.. తాను చొక్కా విప్పడాన్ని సమర్థించుకున్నారు మంత్రి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నిరసన వ్యక్తం చేస్తే మీ ఇంటిని తగులబెడతారు అనటంతోనే నేను చొక్కా విప్పాను.. దానికి నేను సిగ్గు పడటం లేదన్నారు.. ఎర్రగొండపాలెం ఘటనలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్న ఆయన.. గవర్నర్ కు, డీజీపీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు.. మా ఆఫీసు ముందు నిలబడి చంద్రబాబు మమ్మల్ని అవహేళన చేశాడు.. మేం దాడికి పాల్పడలేదు.. దీనిపై కాణిపాకం గుడి దగ్గర ప్రమాణం చేయటానికి నేను సిద్ధం అని ప్రకటించారు ఆదిమూలపు సురేష్‌. చంద్రబాబు తీరు దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది అంటూ మండిపడ్డారు మంత్రి సురేష్‌.. నిరసన వ్యక్తం చేస్తానని రెండు రోజుల ముందే చెప్పాను.. చంద్రబాబు క్షమాపణ చెబితే నియోజకవర్గంలో నేనే స్వయంగా స్వాగతం చెబుతాను అని కూడా చెప్పాను అని గుర్తుచేశారు.. నేను ముందు దళితుడిని.. ఒక దళితుడిగా చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశాను.. మా దళిత జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడు కోవటానికి ఎంత దూరం అయినా వెళ్తానని ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

కేసీఆర్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. అయితే.. రేపు కేయు విద్యార్థులతో భట్టి విక్రమార్క భేటి కానున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం భట్టి పాదయాత్ర సాగుతోంది. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో కారణం మీటింగ్‌లో భట్టి విక్రమార్కతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు నాయిని రాజేందర్ రెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, స్వర్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక మాయ మాటలు చెప్పి అధికారం లోకి వచ్చారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని బీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, పెదలకు పెన్షన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. మరో సారి ఇందిరమ్మ పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దినకర్మ రోజు ఆమె కూతురు కీలక నిర్ణయం..
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నకల్ లో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దినకర్మ నిర్వహించారు.. అయితే, నీరజారెడ్డి దినకర్మ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆమె కూతురు హిమ వర్షా రెడ్డి… అవకాశం కల్పిస్తే పత్తికొండ లేదా ఆలూరు నియోజకవర్గంలోగాని పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.. అమెరికాలో ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హిమవర్ష రెడ్డి.. ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు.. గతంలో హిమవర్ష తండ్రి దివంగత పాటిల్ శేషిరెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు.. ఎమ్మెల్యేగా సేవలు అందించారు.. 1996లో హత్యకు గురయ్యారు మాజీ ఎమ్మెల్యే పాటిల్ శేషిరెడ్డి.. ఇక, ఆ తర్వాత ఆయన భార్య నీరజారెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టారు.. 2009-2014లో ఆలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే, గత వారం జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు నీరజారెడ్డి.. హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు వెళ్తుండగా బీచుపల్లి వద్ద టైర్‌ పేలడంతో ఆమె ప్రయాణించే కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక, డ్రైవర్‌ బాబ్జీకి గాయాలయ్యాయి. నీరజారెడ్డి 2009-2014లో ఆలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. బీజేపీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగుతోన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోయాయి.

నాపై దాడి రాజకీయ కుట్రలో భాగమే.. ఎస్టీ మహిళకు తీవ్ర అవమానం..!
నెల్లూరు నగరపాలక సంస్థ సమావేశంలో అజెండాలోని అంశాలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ కారణాలతోనే తనపై దాడి చేశారని నెల్లూరు నగర మేయర్ స్రవంతి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఫొటో పెట్టడాన్ని తాను వ్యతిరేకించలేదని.. కేవలం ఫొటో గురించి మాట్లాడుతుండగానే ఒక్కసారిగా తన పోడియం వైపు దూసుకు వచ్చారన్నారు. అంతే కాకుండా సమావేశాన్ని వాయిదా వేసి వెళ్తుండగా తనపై ముగ్గురు కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తించారన్నారు. దీనిని తాను సహించబోనని హెచ్చరించారు మేయర్ స్రవంతి.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫొటో విషయంపై కమిషనర్‌తో మాట్లాడే అవకాశం కూడా నాకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు మేయర్ స్రవంతి.. సమావేశాన్ని వాయిదా వేసి వెళ్తున్న నాపై దాడి చేశారు.. నా చీర చిరిగే విధంగా అడ్డుకున్నారు.. రాజకీయ కుట్రలో భాగంగా ఇలా చేశారని మండిపడ్డారు. ఎలాగైనా నన్ను అవమానం, అస్వస్థతకు గురి చేయాలనేదే వారి లక్ష్యం.. నన్ను అడ్డుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.. నా పై జరిగిన దాడికి సంబంధించి ఎస్టీ కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు..

వైఫల్యాలపై ఛార్జీషీట్లు.. దోపిడీని ప్రజలకు వివరిస్తాం..!
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమానికి సిద్ధం అవుతోంది భారతీయ జనతా పార్టీ.. గుంటూరులో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం వివరాలను వెల్లడించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.. రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని చార్జిషీట్ల రూపంలో ప్రజలకు వివరిస్తాం అన్నారు. మే 5వ తేదీ నుంచి ప్రజా చార్జ్ షీట్ల కార్యక్రమం నిర్వహిస్తాం అని ప్రకటించారు. ఇక, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.. ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేశారు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.. కేంద్రం ఇచ్చే పథకాలు అందిపుచ్చుకునే పరిస్థితి లేదన్న ఆయన.. ప్రభుత్వ వైఫల్యాలపై ఐదు స్థాయిల్లో ఛార్జీషీట్లు వేయాలని నిర్ణయించామని వెల్లడించారు.. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు.. సర్పంచుల స్థానంలో వార్డు వాలంటీర్లు పెత్తనం చేస్తున్నారు.. ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహం ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీలకు అవార్డులు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు? అని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లు వైసీపీ మాఫియా చెప్పిందే నడుస్తోందని మండిపడ్డారు.. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు.. అన్నమయ్య డ్యాం కొట్టుకు పోతే బాధితులకు ఇప్పటి వరకూ ఆదుకోలేదు.. కాంట్రాక్టర్లు డబ్బులు రావని పనులు చేయటం లేదు.. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించకపోవడంతో వారు వైద్యం ఆపేసే పరిస్థితి అంటూ ఆరోపణలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీల పనులు మాత్రమే జరుగుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కాలేజీల పనులు కనీసం ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది, ఎవరూ అప్పు ఇచ్చేపరిస్థితి లేదని.. అందుకే వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి. ఇదొక్కటే మార్గం అని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.

జీసస్‌ని కలిసేందుకు.. ఆకలితో 47 మంది మృతి
ఓవైపు ప్రపంచం మొత్తం టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకెళ్తుంటే.. కొన్ని చోట్ల మాత్రం మూఢనమ్మకాలు ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. దేవుడిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కొందరు వ్యాపారంగా మలచుకుంటున్నారు. ప్రజల్ని ఇంకా అంధకారంలో నెట్టేస్తున్నారు. తాము చెప్పిందే ఆటగా ఆడుతున్న వారిని టార్గెట్ చేసుకొని.. అఘాయిత్యాలకూ పాల్పడుతున్నారు. తాజాగా ఓ చర్చ్ లీడర్ అయితే.. అంతకుమించిన నేరానికే పాల్పడ్డాడు. ఆకలితో చస్తే జీసస్‌ని కలిసే సౌభాగ్యం లభిస్తుందని చెప్పి.. అమాయకపు ప్రజల ప్రాణాల్ని బలి తీసుకున్నాడు. ఈ ఘటన కెన్యాలోని మలిండి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మెకెన్జీ ఎన్‌తెంగే అనే ఒక చర్చ్ లీడర్.. ‘మీట్ జీసస్’ అనే ప్రోగ్రామ్‌ని ప్రారంభించాడు. ఆమరణ నిరాహార దీక్ష చేసి మృతి చెందితే.. జీసస్‌ని కలిసే అదృష్టం దక్కుతుందని అతడు తన ఫాలోవర్లకు చెప్పాడు. ఇక అప్పటి నుంచి క్రిస్టియన్ కల్ట్ సభ్యులు.. అతను చెప్పినట్టు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మలిండి టౌన్‌కి సమీపంలో ఉన్న 800 ఎకరాల ప్రాంతంలో.. 47 మృతదేహాలు లభ్యమయ్యాయి. వాళ్లంతా ఆకలితో మరణించినట్టు విచారణలో తేలింది. ఆ ఏరియాని వాళ్లు సీజ్ చేశారు. ఈ నెల ప్రారంభంలోనూ.. గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చిలో నిరాహార దీక్షతో మరణిస్తే స్వర్గానికి వెళ్తామని, జీసన్‌ని కలిసే అదృష్టం లభిస్తుందని, తద్వారా తాము ఆకలితో చనిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పిన సభ్యుల్లో 15 మందిని పోలీసులు కాపాడారు.

చీర కోసం జుట్లుపట్టుకుని కొట్టుకున్న లేడీస్‌.. డిస్కౌంట్‌ సేల్‌లో ఘటన
మహిళలకు షాపింగ్‌ అంటే పిచ్చి.. నచ్చిన నగలు మెడలో ఉండి.. మెచ్చిన చీరను ధరిస్తే.. వారి ఆనందమే వేరుగా ఉంటుంది.. ఇక, చీరల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధం అవుతారు.. ఇదే సమయంలో.. ఎక్కడైనా డిస్కౌంట్‌ సేల్‌ నడుస్తుందంటే అస్సలు వదలరు.. తక్కువా? ఎక్కువా? కాదు.. డిస్కౌంట్‌ వచ్చిందంటే చాలా సంతోషంగా ఫీలవుతారు.. అయితే, బెంగళూరులోని ఓ శారీ సెంటర్‌ డిస్కౌంట్‌ సేల్‌ ప్రకటించింది.. అక్కడ జరిగిన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. చీర కోసం జుట్లుపట్టుకుని కొట్టుకున్న మహిళల వీడియో ఇప్పుడు నెట్లింట్లో వైరల్‌గా మారిపోయింది.. డిస్కౌంట్‌ ధరలతో ఇయర్లీ శారీ సేల్‌ నిర్వహించారు.. అయితే, అసలే డిస్కౌంట్‌పై చీరలు కొనే అవకాశం రావడంతో.. కొనుగోలు చేసేందుకు మహిళలు ఆ దుకాణానికి క్యూ కట్టారు. తమకు నచ్చిన చీరలను బుట్టలో వేసుకోవడం మొదలు పెట్టారు. కానీ, ఆ షాపులో ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. అంతే, ఇంకేముంది.. ఆ చీర నాకు కావాలంటే.. నాకు కావాలంటూ ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. మాటలతో మొదలై.. తోపులాటకు దారి తీసింది.. ఆ తర్వాత ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకునేవరకు వెళ్లింది.. ఏదేమైనా లేడీస్‌ గొడవలోకి వెళ్లొద్దని చెబుతుంటారుగా.. ఆ ఇద్దరు మహిళలను అదుపు చేసేందుకు సిబ్బంది ఎంతో కష్టపడాల్సి వచ్చింది.. అయితే, ప్రతీ చేతిలో ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌.. అందులో కావాల్సినన్ని సోషల్‌ మీడియా యాప్‌లు ఉండడంతో.. ఆ దృశ్యాలను బంధించి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.. ఇంకేముందు.. ఫన్నీ కామెంట్లు పెడుతూ.. నెటిజన్లు షేర్‌ చేస్తుండడంతో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

సీఎం కీలక నిర్ణయం.. ఇక నుంచి అక్కడ కూడా మద్యంకు అనుమతి
రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని అరికట్టేందుకు గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలకు భిన్నంగా స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2016 మే 24న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జయలలిత 500 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు మరియు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల వ్యాపార వేళలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. తర్వాత అప్పటి తమిళనాడు సీఎం కె. పళనిస్వామి 2017 ఫిబ్రవరి 20న ప్రభుత్వ రంగ టాస్మాక్ యాజమాన్యంలోని 500 మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. అయితే.. ఇప్పుడు తాజాగా సీఎం స్టాలిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు మద్యం (లైసెన్స్ మరియు పర్మిట్) రూల్స్, 1981ని సవరించి ప్రత్యేక లైసెన్స్‌ను ప్రవేశపెట్టింది. దీంతో.. ఇక నుంచి ఇది కళ్యాణ మండపాలు, బాంకెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాలు వంటి వాణిజ్య ప్రాంగణాల్లో కూడా మద్యాన్ని అమ్ముకోవడానికి వీలు కల్పించింది. దీని ద్వారా.. లైసెన్సుదారు మరియు లైసెన్సర్ పేర్కొన్న ప్రదేశంలో బహిరంగ కార్యక్రమాలలో అతిథులు, సందర్శకులు మరియు పాల్గొనేవారికి మద్యం అందించడానికి ప్రత్యేక లైసెన్స్ ఇవ్వబడుతుంది. ఇప్పటివరకు క్లబ్బులు, స్టార్ హోటళ్లకు మాత్రమే లైసెన్సులు ఇచ్చేవారు. ప్రత్యేక లైసెన్స్‌పై హోం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

Show comments