మత్స్యకారులు అలర్ట్.. 61 రోజుల పాటు చేపల వేట నిషేధం..
సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు.. అంటే మొత్తం 61 రోజుల పాటు చేపల వేటను నిషేధించామని.. ఈ మేరకు 6వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు. అయితే, ఈ 61 రోజుల పాటు చేపల వేటపై ఎందుకు నిషేధం విధించారనే విషయంపై క్లారిటీ ఇస్తూ.. సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వివిధ చేప రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలను రొయ్యలను సంరక్షించడం ద్వారా వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం తద్వారా సముద్ర మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయడమేనని పేర్కొన్నారు.. ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు (మెకనైజ్డ్ మరియు మోటారు బోట్లు) పై మత్స్య కారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని కోరారు.. ఒకవేళ ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా చేపల వేట చేస్తే.. ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994, సెక్షన్ (4)ను అనుసరించి శిక్షార్హులు అని స్పష్టం చేశారు. అట్టివారి బోట్లను, బోటులో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరచుకోవడమే కాకుండా జరిమానా విధిస్తూ ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీలను, సౌకర్యాలను నిలుపుదల చేయబడునని మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు వార్నింగ్ ఇచ్చారు..
కోవిడ్‌పై సీఎం సమీక్ష.. అన్ని సిద్ధం చేయండి..
మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. కేంద్రం సూచనలతో ఆయా రాష్ట్రాలకు కూడా ఎలాంటి పరిస్థితి విచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా ఇవాళ సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన ఆయన.. కోవిడ్ తాజా పరిస్థితిపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా వ్యాపిస్తుందన్న సూచనలు నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.. గ్రామ స్థాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. ఇక, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలుండాలన్నారు ఏపీ సీఎం.. అయితే, పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని సీఎంకు వివరించారు అధికారులు. విలేజ్ క్లినిక్స్ స్ధాయిలోనే ర్యాపిడ్ టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడ ఏమైనా తేలితే వెంటనే ఆర్టీపీసీఆర్‌కు పంపించే ఏర్పాటు చేశామని సీఎంకు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రకారం 25 మంది కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు.. కాగా, ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అన్నిరకాలుగా సిద్ధం కావాలని సీఎం స్పష్టం చేశారు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని చూసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్ వ్యవస్ధ కోవిడ్ విస్తృతిని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.. గ్రామాల్లో సర్వే చేసి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, వారికి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలన్నారు.. ప్రతి విలేజ్ క్లినిక్‌కూ టెస్టింగ్ కిట్స్, మందులు పంపించాలని ఆదేశించారు.. ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కు తగినట్టుగా మందులు తెప్పించుకోవాలన్నారు.. ల్యాబ్‌లు అన్నింటినీ పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
ఈ 69 మండలాల్లో వడగాల్పులు.. ఐఎండీ వార్నింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రెండు రాష్ట్రాలను నిప్పుల కుంపటిలా మార్చేశాడు. తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. ఈ నెల 13 వరకు ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పెరుగతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఇవాళ పెరిగితే.. మరి కొన్ని జిల్లాల్లో రేపట్నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. ఇవాళ 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌లో 41.9 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో 41.8, నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 41.7 డిగ్రీలు నమోదయింది. 11న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఇక, అంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు ఉదయం 10 గంటలకే సెగలు పుట్టిస్తున్నాయ్. మండుతున్న ఎండలకు తోడు వడగాలులూ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఐఎండీ అంచనాల ప్రకారం రేపు 26, ఎల్లుండి 69 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ.. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 26 ఉన్నాయి.. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 1. అడ్డతీగల, 2. నెల్లిపాక , 3. చింతూరు, 4. గంగవరం, 5. రాజవొమ్మంగి, 6. వరరామచంద్రపురం ఉండగా.. అనకాపల్లి జిల్లాలలోని 7. కోటవురట్ల, 8. మాకవరపాలెం, 9. నర్సీపట్నం, 10. నాతవరం ఉన్నాయి.. తూర్పు గోదావరి జిల్లాలోని 11. రాజానగరం, 12. సీతానగరం, 13. గోకవరం, 14. కోరుకొండ.. ఏలూరు జిల్లాలోని 15. కుకునూర్ మండలం ఉన్నాయి.. ఇక, కాకినాడ జిల్లాలోని 16. గండేపల్లి,17. జగ్గంపేట, 18. కిర్లంపూడి, 19. కోటనందూరు, 20. పెద్దాపురం, 21. ప్రత్తిపాడు, 22. ఏలేశ్వరం.. పార్వతిపురంమాన్యం జిల్లాలోని 23. గరుగుబిల్లి, 24. జియమ్మవలస, 25. కొమరాడ, 26. వీరఘట్టం మండలాలు ఉన్నాయి.
కోవిడ్ ఎదుర్కొనేందుకు సిద్ధం.. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్
ఇక, కరోనా మాయం అయ్యింది.. సాధారణ పరిస్థితులు వచ్చాయని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. మళ్లీ మహమ్మారి కేసులు పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి.. దేశవ్యాప్తంగా కోవిడ్.. మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 24 గంటల్లోనే 5వేల 880 పాజిటివ్‌లు నిర్దారణ అయ్యాయి. పాజిటివిటీ రేటు దాదాపు 7శాతానికి చేరుకుంది. వారం రోజులుగా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మళ్లీ నిబంధనలను అమలు చేస్తున్నాయ్. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ.. అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించే ఆసుపత్రుల్లో సౌకర్యాలపై.. మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, ఐసోలేషన్, ఆక్సిజన్ వసతి ఉన్న బెడ్‌లు, వెంటిలేటర్, ఐసీయూ బెడ్‌ల వివరాలను సేకరిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ల వివరాలను తెలుసుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు, కిట్ల లభ్యత, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్‌లు, మాస్కులు, వెంటిలేటర్ల సంఖ్య వంటి కీలక అంశాలు గుర్తించి వైద్యారోగ్య శాఖకు అందజేయనున్నారు. హరియాణాలోని ఝజ్జర్ ఎయిమ్స్‌లో జరిగిన మాక్ డ్రిల్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పరిశీలించారు.
హీట్ పెంచుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. టార్గెట్ కేసీఆర్..!
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి ఆహ్వానించిన బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ తరఫున పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలికవసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల కోసం వెంటనే విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని కేసీఆర్ ఆదేశించారని చెబుతున్నారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరనసల్లో బీఆర్ఎస్ ఏపీ నేతలు పాల్గొనడం కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది.. ఈ వార్తలపై ఏపీ ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నది తమ స్టాండ్ అన్నారు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ పై మీడియాలో వస్తున్న వార్తలే తప్ప, ఇంతవరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నుండి కానీ, తెలంగాణ ప్రభుత్వం నుండి గాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదన్నారాయన. అయితే, స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్ పాల్గొంటుందన్న వార్తలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. ముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీ, కాగజ్‌నగర్ పేపర్‌మిల్ తెరవాలన్నారు బండి. తెలంగాణ ప్రభుత్వం నిజంగా దీనిపై నిర్ణయం తీసుకుందా లేదా ఇదంతా ప్రచారమేనా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్ పాల్గొంటుందన్న ప్రచారం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ఆచితూచి స్పందించిన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే ప్రయత్నం తొలి దశ నుంచి వైసీపీ చేస్తోందన్నారు వైవీ సుబ్బారెడ్డి.. ప్రధాని వద్ద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించారన్న ఆయన.. చట్టపరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు పార్టీలు ఇంత కాలం ఏం చేశాయి ? అని నిలదీశారు..
కేసీఆర్ మోడల్ దేశానికి ప్రమాదం
కేసీఆర్ మోడల్ దేశానికి ప్రమాదమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ రాజకీయాలుగా మార్చేశారు మోడీ అని రేవంత్ అన్నారు. కేసీఆర్.. తన మోడల్ మొదలుపెట్టారని, వేల కోట్లు సమకూర్చుతా అని బేరసారాలు మొదలుపెట్టారన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కుమార స్వామికి వందల కోట్లు ఇస్తున్నారని, కాంగ్రెస్ ని అస్థిర పరచే కుట్ర మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీ ఎన్నికలకు కూడా వందల కోట్లు ఖర్చు పెట్టారు కేసీఆర్ అని ఆరోపించాఉ. ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ వందలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని, కేసీఆర్ భూములు వనరుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. తనతో ఉన్న వాళ్లకు… భూములు పంచుతున్నారని, పార్థసారథి రెడ్డి … కేసీఆర్ సహచరుడు.. రేమిడేసివర్ బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఐటీ దాడుల్లో 140 కోట్లు దొరికాయి. కేసులు… ఉద్యోగాలు పెట్టించి తప్పుకున్నాడు. సీబీఐ..ed కేసులు ఎదుర్కొంటున్నారు పార్థసారధి. 2015 లో కేసీఆర్ కి పార్థసారధి ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. క్యాన్సర్ పేషేంటల కోసం 15 ఎకరాలు కావాలని అడిగారు.
సముద్రం మధ్యలో చిక్కుకున్న షిప్.. ప్రమాదంలో 400 మంది
ఉత్తర ఆఫ్రికాలోని మధ్యధరా సముద్ర మార్గంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 400 మంది వలసదారులతో కూడిన ఒక ఓడ.. సముద్రం మధ్యలో చిక్కుకుపోయింది. వీరు లిబియా నుంచి మధ్యదరా సముద్ర మార్గం ద్వారా అక్రమంగా దేశం దాటుతుండగా.. గ్రీస్, మాల్టా మధ్యలో ఈ ఓడ ఆగిపోయింది. ఇందుకు కారణం.. ఇంధనం అయిపోవడం! ఈ విషయాన్ని పసిగట్టిన ఆ ఓడ కెప్టెన్.. ఎవ్వరికీ తెలియకుండా అక్కడి నుంచి చెక్కేశాడు. దీంతో.. ఆ ఓడలో ఉన్న 400 మంది వలసదారుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఆ వలసదారులు.. తమ దుర్భర స్థితి గురించి ‘అలారం ఫోన్’ అనే సపోర్ట్ సర్వీస్‌కు సంప్రదించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే.. ఈ ఓడ గురించిన వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించింది. తాము ఆల్రెడీ అధికారులకు సమాచారం అందించామని కూడా ఆ సంస్థ పేర్కొంది. ఓడ కింది భాగమంతా నీటితో నిండిపోవడం వల్ల.. అందులోని వలసదారులంతా బోటు పై భాగానికి చేరుకున్నారని తెలిపింది. అంతేకాదు.. ప్రస్తుతం ఓ ఓడ గాలికి కొట్టుకుపోతోందని తెలియజేసింది.
రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్.. టీ20లోనే అగ్రస్థానం
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేయడంతో.. అతడు ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో రషీద్‌కి ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. ఓవరాల్ టీ20లో మాత్రం నాల్గవది. ఈ జాబితాలో రషీద్ తర్వాత అండ్రూ టై, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రా, రస్సెల్, తహీర్ ఉన్నారు. వీరిందరూ ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో మూడు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ తీసిన హ్యాట్రిక్ గురించి మాట్లాడితే.. తొలుత ఇతడు ఆండ్రూ రసెల్ వికెట్ పడగొట్టాడు. మొదట ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు కానీ, రివ్యూ తీసుకున్నాక అల్ట్రా ఎడ్జ్‌లో బ్యాట్‌కు బంతి తాకినట్టు తేలింది. దీంతో.. దాన్ని ఔట్‌గా ఖరారు చేశారు. అనంతరం సునీల్ నరైన్ భారీ షాట్ కొట్టబోగా.. అది నేరుగా ఫీల్డర్ చేతిలో క్యాచ్‌గా చేరింది. ఇక శార్దూల్ ఠాకూర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రషీద్ వేసిన బంతి అంచనాలకు అందని విధంగా స్వింగ్ అవ్వడంతో.. అది బ్యాట్‌కు బదులు ప్యాడ్స్‌ను తాకింది. తద్వారా అతడు ఔట్ అయ్యాడు. రివ్యూ తీసుకున్నా.. అది ఔట్‌గా తేలడంతో, కేకేఆర్ ఒక రివ్యూ కోల్పోవాల్సి వచ్చింది. ఇలా రషీద్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి, ఈ ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
మీకు జీపే ఉందా..? రూ.81 వేల క్యాష్ బ్యాక్..? చెక్ చేసుకొండి..!
మీ ఫోన్‌లో గూగుల్ పే ఉందా? గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేస్తున్నారా? అయితే, మీకు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందే..! ఎందుకంటే.. జీపే భారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుందట.. ఏకంగా కొంత మందికి రూ.81 వేల వరకు క్యాష్ బ్యాక్ వచ్చేసింది.. కానీ, అది అనుకోకుండా జరిగిందట.. ఇదే విస్మయానికి గురిచేస్తోంది.. విషయం ఏంటంటే..? గూగుల్ పే అనుకోకుండా కొంతమంది వినియోగదారులకు రూ. 81 వేల వరకు క్యాష్ బ్యాక్ ఇచ్చింది.. లోపం కారణంగా, కొంతమంది వినియోగదారుల గూగుల్ పే ఖాతాల్లో 1,000 అమెరికా డాలర్లు అంటే సుమారు రూ. 81,000 వరకు క్రెడిట్ చేసింది.. ఇదే విషయాన్ని కంపెనీ కూడా ధృవీకరించింది. వినియోగదారులకు అదనపు డబ్బును క్రెడిట్ చేసే లోపం అనేకసార్లు జరుగుతూనే ఉంటుంది.. అటువంటి అరుదైన సంఘటనలో, అనేక మంది ఇంటర్నెట్ వినియోగదారులు తమ గూగుల్ పే ఖాతాలకు రెండు అదనపు డాలర్లు జమ చేసినట్లు నివేదించారు. ఈ లావాదేవీల మొత్తం 10 అమెరికా డాలర్ల నుండి 1,000 డాలర్ల వరకు వచ్చిందట.. ఇది లక్షరాల భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 81,000. అయితే, ఈ వినియోగదారుల ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.. ఎందుకంటే కంపెనీ తన తప్పును వెంటనే గ్రహించి, అలా చేయడానికి అవకాశం ఉన్న సందర్భాలలో జమ చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. అయితే, వినియోగదారులు ఇప్పటికే డబ్బును బదిలీ చేసిన లేదా ఖర్చు చేసిన సందర్భాల్లో, ఆ డబ్బును వినియోగదారులు ఉంచుకోవచ్చని, తదుపరి చర్య అవసరం లేదని గూగుల్ పే తెలిపింది.
పోలీస్ పవర్ చెప్పి హైప్ పెంచేశారే..
అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం.. తమదైన స్టైల్లో హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో తాజాగా చై.. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో సందడి చేసి పోలీసుల జీవితాల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేశాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను కూడా పోలీసులకు డేడికేట్ చేశాడు. ‘హెడ్ అప్ హై’ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. పోలీస్ గురించి, వాడు పడే కష్టం గురించి రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతమని చెప్పాలి. తాము చేసే పనికి రోజాపూలు ఇచ్చి గుర్తించాల్సిన అవసరం లేదని, వారి నుంచి వచ్చే అభినందనలే చాలని ఎంతో అద్భుతంగా చెప్పుకొచ్చారు. ఇక యువన్ శంకర్ రాజా సంగీతం, యువన్, అర్జున్ కౌడిన్య, అసల్ కోలార్ మెస్మరైజింగ్ వాయిస్ అయితే వినసొంపుగా ఉంది. ఇక జానీ మాస్టర్ హుక్ స్టెప్స్ తో చై అదరగొట్టేశాడు. శివ అనే కానిస్టేబుల్ గా ఈ చిత్రంలో చై కనిపించనున్నాడు. మొదటి సాంగ్ తోనే సినిమాపై హైప్ పెంచేశాడు వెంకట్ ప్రభు. ముందు ముందు మరిన్ని సాంగ్స్ తో అభిమానులను అలరించడమే కాకుండా సినిమాపై హైప్ కూడా పెరుగుతుందని అర్ధమవుతోంది. మరి ఈ సినిమా చై కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.