NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సతీమణి కోసం స్వయంగా చీరలు కొన్న సీఎం చంద్రబాబు

చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం, క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా ఇదేరోజు జరిగిందన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నేతన్నలు తమ ఉత్పత్తులతో స్టాల్స్‌ ఏర్పాటు చేయగా.. స్టాళ్లల్లో ఉత్పత్తులను పరిశీలించి వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ స్టాళ్లలో సతీమణి భువనేశ్వరి కోసం చీరలను కొనుగోలు చేశారు. చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ రెండు చీరలను కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం కొనుగోలు చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు. చేనేత కార్మికులు ఉన్న ప్రతీచోటా టీడీపీ గెలుస్తుందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత కార్మికులకు పూర్తిగా అన్యాయం జరిగిందని.. నేతన్న నేస్తం అంటూ చేనేతలకు అన్యాయం చేశారని విమర్శించారు. రుణాల పేరిట చేనేతల పొట్టకొట్టారని మండిపడ్డారు. చేనేతల కోసం పని చేసిన పార్టీ టీడీపీ అని.. చేనేతల కోసం 110 కోట్ల ఋణమాఫీ చేశామన్నారు. 90, 500 కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చిన ఘనత మాది‌ అని సీఎం స్పష్టం చేశారు. బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం తెస్తామని.. బీసీ సబ్ ప్లాన్‌కు 5 ఏళ్ళలో 1.5లక్షల కోట్లు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. బీసీలకు చట్టసభల్లో 35% అవకాశం కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. ఏపీలో ఖజానా దివాళా తీసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 80 నుంచీ 90 వేల కోట్ల అప్పు ప్రతీనెలా ఉందన్నారు. ఏపీ అవినీతి, దోపిడి, విధ్వంసంతో నిండిపోయిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామని.. లేకపోతే మీ ఆస్తులు మీవి కాకుండా పోయేవని సీఎం చెప్పారు. పేదవాళ్ళ ఆస్తులు కొట్టేయడమే గత ప్రభుత్వంలో ఆనవాయితీగా మారిపోయిందని విమర్శించారు. అన్నదానం చేయాలనుకునే వారు అన్న క్యాంటీన్ ను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. దేశంలోనే మొదటిసారి స్కిల్ సెన్సస్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గతంలో దేవుడు ఇచ్చిన ఇసుకను కూడా అమ్ముకున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక ఇవ్వాలని నిర్ణయించామని.. ఈ మేరకు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కృష్ణాజలాలు కూడా పరవళ్ళు తొక్కుతున్నాయని.. కనకదుర్గమ్మ దయవల్ల కృష్ణమ్మ వస్తోందన్నారు. పేదరికం లేని సమాజం కోసం పని చేస్తున్నామని.. పేదరికాన్ని ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో నిర్మూలించాలన్నారు. పేదోడికి అండగా ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మరల జన్మభూమి లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామన్నారు.

 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలి..
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచినవారు, పోటీచేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారని జగన్‌ చెప్పుకొచ్చారు. బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలని నేతలను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యా బలం లేదని.. నైతికలు విలువలు పాటిస్తే గనుక టీడీపీ పోటీ పెట్టకూడదని ఆయన అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే.. విలువలు పాటిస్తూ పోటీకి పెట్టే వాళ్ళం కాదన్నారు. సంఖ్యాబలం లేదని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతోందన్నారు. 380 పైచిలుకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీకి పోటీకి దిగుతోందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడని.. రాజకీయాల్లో విలువలను మరింత దిగజారుస్తున్నాడని ఆరోపించారు. విలువులు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఇవి వదులుకున్నప్పుడు ప్రజలకే కాదు, మన ఇంట్లోకూడా మనకు విలువ తగ్గుతుందన్నారు. “నేను జీవితంలో విలువలకు, విశ్వసనీయ తకు కట్టుబడి ఉన్నాను. కాంగ్రెస్‌ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు నేను, అమ్మ మాత్రమే బయటకు వచ్చాం. నాతో వచ్చేవాళ్లు రాజీనామాలు చేసి వచ్చారు. ఇద్దరితో మొదలైన పార్టీ.. పెద్ద స్థాయికి చేరుకుంది. విలువలు విశ్వసనీయతతోనే మనం రాజకీయాలు చేశాం. 2014లో ఎన్నికలప్పుడు రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలను చంద్రబాబు ఇచ్చినప్పుడు నన్నుకూడా అలాంటి హామీలు ఇవ్వమని ఒత్తిడి తెచ్చారు. కాని చేయలేనిది, జరగనిది చెప్పడానికి నేను ఇష్టపడను. ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయాం. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. తర్వాత చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే అని ప్రజలు గుర్తించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. మనం అధికారంలోకి వచ్చాం. మేనిఫెస్టోలో చెప్పింది తప్పకుండా అమలు చేశాం. రాజకీయాల్లో విలువలకు, విశ్వసనీయతకు అర్థంచెప్పాం. మేనిఫెస్టో అంటే.. భగవద్గీత, ఖరాన్‌, బైబిలు అని అమలు చేశాం. మన ఎమ్మెల్యేలు గడపగడకూ వెళ్లారు. మేనిఫెస్టోలో అమలు చేసిన అంశాలను ప్రజలకు చూపించారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో మనం గొప్పపాలన అందించాం.” అని జగన్ పేర్కొన్నారు. కాని, 2024 ఎన్నికల్లో 10శాతంమంది ప్రజలు చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మారని జగన్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాడని.. కాని, ఏం జరిగింది? రెండు నెలలు అయినా ప్రజలకు ఏమీ జరగడంలేదన్నారు. “జగనే ఉండి ఉంటే అమ్మ ఒడి వచ్చేది.. రైతు భరోసా వచ్చేది…ఫీజు రియింబర్స్‌మెంట్‌… విద్యాదీవెన…సున్నావడ్డీలు వచ్చేవి.. మోసం, అబద్ధాలతో చేసే పాలన ఎక్కువ కాలం ఉండదు. ఇవ్వాళ్టికీ మనం తలెత్తుకుని ప్రజల వద్దకు గర్వంగా వెళ్లగలం. చంద్రబాబుకు చెందిన లీడర్లు, ప్రజాప్రతినిధులు.. మనలా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయా? సూపర్‌ సిక్స్‌ గురించి ప్రజలు అడిగితే వాళ్లు ఏం సమాధానం చెప్తారు?” అని జగన్‌ ప్రశ్నించారు.

 

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా
విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(GVMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీని కూటమి కైవసం చేసుకుంది. పదికి 10 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల ప్రక్రియపై ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. జీవీఎంసీకి చెందిన కార్పొరేటర్లు , అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అధికారులు మధ్యాహ్నం 2 గంటల తరువాత కౌంటింగ్ ప్రారంభించారు. ఈ ఫలితాల్లో 10 స్థానాలను టీడీపీ దక్కించుకోగా.. జీవీఎంసీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. 10స్థానాలు కూటమి కైవసంతో వైసీపీ కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు హంగామా చేశారు. అంతకు ముందు కౌంటింగ్‌పై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్‌పై పెన్సిల్‌తో గుర్తు పెట్టి ఇచ్చారని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపించారు. దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

 

తనపై రేప్ జరిగిందన్న ఇంగ్లీష్ టీచర్.. 19 ఏళ్ల యువకుడి ఆత్మహత్య..
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తనపై అత్యాచారం జరిగిందని మహిళా ఇంగ్లీష్ టీచర్ ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే 19 ఏళ్ల యువ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, తమ కుమారుడిని సదరు మహిళా టీచర్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇండోర్ మహిళా పోలీస్ స్టేషన్ కౌశల్య చౌహాన్ ప్రకారం.. ఇండోర్‌కి చెందిన 19 ఏళ్ల బీఫార్మసీ చదువుతున్న యువకుడు మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి సోదరి ఉరివేసుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు వెల్లడించింది. ఒక కోచింగ్ సెంటర్‌లో 25 ఏళ్ల మహిళా ఇంగ్లీష్ టీచర్, మరణించిన యువకుడిపై మూడు రోజుల క్రితం అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. యువకుడిపై వచ్చిన ఆరోపణల్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని పోలీస్ స్టేషన్ పిలిపించి అతడి వాంగ్మూలం నమోదు చేసి విడిచిపెట్టామని పోలీసులు చెప్పారు. అయితే, ఈ ఆత్మహత్య వెనక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. బాధితుడి తండ్రి తన కొడుకుని ఇంగ్లీష్ టీచర్ బ్లాక్‌మెయిల్ చేయడంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు. ‘‘ఆమె నా కొడుకు కన్నా కొన్నేళ్లు పెద్దది. ఆమెపై అత్యాచారం ఆరోపణలకు సంబంధించి నాకు ఎలాంటి ఐడియా లేదు. కానీ అత్యాచారం ఫిర్యాదు గురించి ఆమె బెదిరిస్తున్న మెసేజ్‌లకు సంబంధించి స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను’’ అని యువకుడి తండ్రి చెప్పారు.

 

గర్ల్‌ఫ్రెండ్‌కి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు అమ్మ నగలు చోరీ.. 9వ తరగతి విద్యార్థి నిర్వాకం..
తన గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఓ బాలుడు అమ్మ నగలనే దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తనతో గర్ల్ ఫ్రెండ్‌కి పుట్టిన రోజున ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఆరోపణలపై బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో దొంగతనం చేసినట్లు బాలుడి తల్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేసిన తర్వాత బాలుడే ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడు తన తల్లి బంగారు చెవిపోగులు, బంగారు ఉంగరం, బంగారు గొలుసుని చోరీ చేసి కక్రోలా ప్రాంతంలోని ఇద్దరు స్వర్ణకారులకు విక్రయించాడు. బాలిక కోసం హై-ఎండ్ ఫోన్‌ని కొనుగోలు చేశాడు. బాలుడు, బాలిక ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కమల్ వర్మ అనే 40 ఏళ్ల స్వర్ణకారుడిని పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఉంగరం, చెవిపోగులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘ఆగస్టు 3న మహిళ ఇంట్లో చోరీ జరిగింది. అందులో ఆమె తన ఇంట్లోని రెండు బంగారు గొలుసులు, ఒక జత బంగారు చెవిపోగులు మరియు ఒక బంగారు ఉంగరాన్ని ఆగస్టు 2న ఉదయం 8 నుండి 3 గంటల మధ్య గుర్తుతెలియని వ్యక్తి అపహరించినట్లు ఫిర్యాదు చేసింది.’’ అని డీసీపీ(ద్వారక) అంకిత్ సింగ్ చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారి తెలిపారు. క్రైమ్ సీన్ సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేశారు. అయితే, చోరీ జరిగిన ఇంటి సమీపంలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులు కనుగొనలేదు. సమీప ప్రాంతాల్లో ప్రజల్ని ఎంక్వైరీ చేసినప్పటికీ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఇంటి దొంగల పనే అని అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. చోరీ జరిగినప్పటి నుంచి మహిళ కుమారుడు కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. అతడి స్కూల్‌లో స్నేహితులను ప్రశ్నించారు. రూ. 50,000 విలువైన ఐఫోన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధర్మపుర, కక్రోలా, నజఫ్‌గఢ్‌లో సోదాలు నిర్వహించారు. ప్రతీసారి బాలుడు తప్పించుకోగలిగాడు. చివరకు అతని ఇంటికే వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. సెర్చ్ చేస్తే అతని వద్ద నుంచి ఆపిల్ మొబైల్‌ని గుర్తించారు. దర్యాప్తు చేయగా దొంగిలిచించిన బంగారాన్ని ఇద్దరు స్వర్ణకారులకు అమ్మినట్లు బాలుడు చెప్పాడు. తాను 9వ తరగతి చదువుతున్నాని, తన తండ్రి అనారోగ్యంతో మరణించినట్లు పోలీసులకు బాలుడు వెళ్లడించాడు. తనకు చదువుపై ఆసక్తి లేదని బాలనేరస్తుడు చెప్పినట్లు డీసీపీ తెలిపారు. అదే తరగతిలో చదువుతున్న బాలికతో అతడికి సంబంధం ఉన్నట్లు అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు. తన ప్రియురాలి పుట్టిన రోజుకు గిఫ్ట్ ఇవ్వాలని చెబితే అతడి తల్లి తిరస్కరిచండంతో డబ్బు కోసం నగులు దొంగిలించినట్లు చెప్పాడని డీసీపీ చెప్పారు.

 

శ్రీలంక అధ్యక్ష బరిలోకి రాజపక్సా వారసుడు.. అనూహ్యంగా బరిలోకి!
శ్రీలంక అధ్యక్ష బరిలోకి మహీందా రాజపక్సా కుటుంబం నుంచి వారసుడు బరిలోకి వచ్చాడు. సెప్టెంబర్ 21న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కుమారుడు నమల్‌ రాజపక్సా పోటీ చేయబోతున్నట్లు కుటుంబం ప్రకటించింది. ఎస్‌ఎల్‌పీపీ పార్టీ తరఫున దేశ అధ్యక్ష అభ్యర్థిగా నమల్‌ రాజపక్సా (38) పేరును ప్రతిపాదించారు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సాగర కరియవసామ్‌ వెల్లడించారు. నమల్‌ రాజపక్సా ఎంట్రీతో అధ్యక్ష ఎన్నికల పోరు నలుగురి మధ్య జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే, ప్రతిపక్ష నేత సజిత ప్రేమదాస, జీవీపీ నాయకుడు అరుణ కుమార దిశనాయకే బరిలో నిలిచారు. తాజాగా నమల్ బరిలోకి వచ్చాడు. ఇదిలా ఉంటే 2022 జులైలో రాజపక్సాకు చెందిన కుటుంబమే.. విక్రమసింఘేకు అధికారం దక్కేలా సహకరించింది. ఆయన గొటబాయ నుంచి అధికారం స్వీకరించారు. 2022 ఏప్రిల్‌లో శ్రీలంక ప్రభుత్వం అప్పులు చెల్లించలేక చేతులు ఎత్తేసింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా చోటు చేసుకొన్న ఆందోళనలు, అధ్యక్ష భవనం ఆక్రమణతో గొటబాయ పదవిని వదులుకొన్నారు. దీంతో విక్రమసింఘే అధికారం చేపట్టారు. తాజాగా ఎస్‌ఎల్‌పీపీకి చెందిన దాదాపు 100 మంది ఎంపీలు రాజపక్సాకు మద్దతుగా నిలిచారు. దీంతో నమల్ పేరు తెరపైకి వచ్చింది.నమల్ 2010 నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 2020 పార్లమెంట్ ఎన్నికల్లో కుటుంబ కోట అయిన హంబన్‌తోట జిల్లాలో డీప్ సౌత్ నుంచి భారీ మెజార్టీతో నమల్ గెలుపొందారు. నమల్ ఇంగ్లండ్, శ్రీలంకలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆసక్తిగల క్రీడాకారుడు కూడా. శ్రీలంక జాతీయ రగ్బీ జట్టు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. లిమిని వీరసింహను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నమల్‌కు కనీసం 40 ఏళ్లు నిండకముందే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదని అతని స్నేహితుల్లో చాలా మందికి తెలుసు. కానీ పరిస్థితులను బట్టి 38 ఏళ్లలోనే అధ్యక్ష బరిలోకి రావాల్సి వచ్చింది.

 

నోబెల్ విజేత యూనస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం.. రేపే ప్రమాణస్వీకారం
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ బుధవారం తెలిపారు. నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం ప్రమాణస్వీకారం చేయనుందని ఆర్మీ చీఫ్ జమాన్ పేర్కొన్నారు. ఆర్మీ చీఫ్ జమాన్ మీడియా మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రభుత్వం గురువాకం రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలిపారు. సలహా మండలిలో 15 మంది సభ్యులు ఉండవచ్చని చెప్పారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ మంగళవారం.. మాజీ ప్రధాని షేక్ హసీనాను తొలగించిన తర్వాత మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించాలని యూనస్ (84)ను ఎంపిక చేశారు. యూనస్‌ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్‌ విశ్వవిద్యాలయానికి వైస్‌ఛాన్సలర్‌గా ఉన్నారు. అలాగే చిట్టగాంగ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం కృషిచేశారు. చిట్టగాంగ్‌లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థిక వేత్త. మైక్రోఫైనాన్స్‌ బ్యాంక్‌ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు 2006లో నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. ఇదిలా ఉంటే కోటా ఉద్యమం కారణంగా జరిగిన అల్లర్లలో 440 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేదాటడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. అనంతరం ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

 

పోలీసుల చేతికి కీలక రిపోర్టు.. నటుడు దర్శన్‌కు బిగుస్తున్న ఉచ్చు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ కేసులో పోలీసులకు కీలక రిపోర్టు చిక్కింది. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది. ఫోరెన్సిక్ పరీక్షల్లో దర్శన్ దుస్తులపై ఉన్న రక్తపు మరకలు బాధితుడి దుస్తులపై ఉన్నవాటితో సరిపోలినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ కేసు ఓ కీలక దశకు రాబోతుంది. ప్రస్తుతం దర్శన్, పవిత్ర గౌడతో సహా మరో 16 మంది జైల్లో ఉన్నారు. ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసుకు మరింత బలం చేకూరింది. రేణుకాస్వామి హత్య కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు కొత్త సాక్ష్యంగా మారనుంది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో దర్శన్ దుస్తులపై ఉన్న మరకలు రేణుకాస్వామి రక్తమేనని తేలింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరగబోతుంది. బెంగళూరులో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని దర్శన్, పవిత్రగౌడ్ హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో దర్శన్ నివాసం నుంచి బ్లూ జీన్స్, నలుపు రౌండ్-నెక్ షర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపారు. వస్ర్తాలపై ఉన్న రక్తపు మరకలు రేణుకాస్వామిదేనని తాజా నివేదిక ద్వారా నిర్ధారణ అయింది. అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రమేయం ప్రత్యక్షంగా ఉందని పోలీసులు తాజాగా నిర్ధారించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టును ఇందుకు సాక్ష్యంగా న్యాయస్థానంలో సమర్పించనున్నారు. పోలీసులకు ఇది బలమైన సాక్ష్యంగా ఉండబోతుంది. ఇప్పటికే చాలా రోజులుగా నిందితులంతా జైల్లో మగ్గుతున్నారు. బెయిల్ కూడా దొరకడం లేదు. ఇక తాజా రిపోర్టుతో మరిన్ని రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

స్పిన్ దెబ్బకు చేతులెత్తిసిన టీమిండియా.. సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక ..
కొలంబోలో నేడు శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య జరిగిన మూడవ వన్డేలో శ్రీలంక టీమిండియా పై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీమిండియా సీరియస్ ని కోల్పోవాల్సి వచ్చింది. 3 వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ టై కాగా.. చివరి రెండు వన్డేలలో శ్రీలంక విజయం సాధించడంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక నేటి మ్యాచ్లో మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో శ్రీలంక కెప్టెన్ మెన్ డేస్ ఆఫ్ సెంచరీ తో తన బాధ్యతను నిర్వహించగా.. ఆవిష్క ఫెర్నాండో 96 పరుగులతో రాణించి తృతిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఇక తక్కువ స్కోరుని ఛేదించేందుకు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా మొదట్లో కాస్త నిదానంగానే మొదలుపెట్టిన.. వరుస విరామములలో వికెట్లు కోల్పోవడంతో కేవలం 26.1 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 110 పరుగులతో భారీ అపజయాన్ని ఎదుర్కొంది. దీంతో సిరీస్ 2 – 0 శ్రీలంక కైవసం చేసుకుంది. ఇక టీమిండియా బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులతో రాణించగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్ 30 పరుగులతో రాణించారు. ఇక మిగతావారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో మరోసారి దునిత్ వెళ్లలాగే ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి మరోసారి తన సత్తా చాటాడు. రెండో వన్డే మ్యాచ్లో కూడా అతడు ఆరు వికెట్లతో టీమిండియాకు ఓటమిని రుచి చూపాడు. దింతో శ్రీలంక 27 ఏళ్ళ తర్వాత టీమిండియా పై వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.