NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

132 ఏళ్ల నాటి రికార్డ్‌ను బద్ధలుకొట్టిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లలో మెజారిటీ మార్కు 270. ప్రస్తుతం ట్రంప్ 280 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. ఈ మేరకు ట్రంప్‌ మెజారిటీ సీట్లను సాధించినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇక రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న ట్రంప్ సరికొత్త రికార్డు సృష్టించారు. 132 ఏళ్ల నాటి రికార్డుతో సహా అనేక చారిత్రాత్మక అంశాలు నమోదు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఒక నేత అధ్యక్ష పదవి చేపట్టి.. మళ్లీ రెండోసారి ఎన్నికల బరిలో దిగి పరాజయం పాలై మూడోసారి పోటీ చేసి గెలుపొందిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. గత 132 ఏళ్ల అమెరికా చరిత్రలో అలాంటి పరిణామం ఇప్పటి వరకూ చోటు చేసుకోలేదు. తాజా ఎన్నికల్లో ఆ రికార్డును ట్రంప్‌ సాధించారు. దాదాపు 132 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్రను నమోదు చేశారు. గ్రోవెర్‌ క్లీవ్‌ల్యాండ్‌.. 1884 ఎన్నికల్లో గెలుపొంది అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 1888 మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం 1992లో మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో గెలుపొంది రెండోసారి అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. తాజా ఎన్నికల్లో ట్రంప్‌ ఆ ఘనత సాధించారు. గ్రోవెర్‌ క్లీవ్‌ల్యాండ్‌ తర్వాత యూఎస్‌ ఎన్నికల్లో ఈ విధంగా గెలుస్తున్న రెండో వ్యక్తిగా ట్రంప్‌ నిలిచారు. గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్.. యూఎస్ 22, 24వ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 1885 నుంచి 1889 వరకు, 1893 నుంచి 1897 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మొదటి పదవీకాలం 2016- 2020 మధ్య జరిగింది. 2020లో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. తిరిగి రెండవ పర్యాయం గెలవలేకపోయారు. మళ్లీ 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. భారీ విక్టరీని నమోదు చేశారు. అమెరికా ఓటర్లంతా ఏకపక్షంగా ఓట్లు వేశారు. గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ తర్వాత ట్రంప్ మాత్రమే ఆ విజయం నమోదు చేశారు. అంటే 132 ఏళ్ల రికార్డును తిరిగి ట్రంప్ బద్ధలుకొట్టారు. ఇదిలా ఉంటే న్యూయార్క్ టైమ్స్ ప్రకారం… 20 ఏళ్లలో ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుచుకున్న మొదటి రిపబ్లికన్‌గా ట్రంప్ అవతరించారు.

 

ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులకు సూచించారు. సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోందని.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే అకడమిక్ ఇయర్ లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని.. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. “చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి.. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం.వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇవాళ్టి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్ లో మీరు సచివాలయంలో అడుగు పెట్టాలని… పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా. గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా 100కు డయల్ చేసి సమాచారం అందించండి. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయి. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలి. 14 నవంబర్ న 15వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నాం. అదే రోజు ఫేజ్-2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయబోతున్నాం..” అని సీఎం తెలిపారు. ప్రభుత్వ వ‌స‌తిగృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

 

స్వయం సహాయక సంఘాలకు గుడ్‌న్యూస్.. ఏకంగా 3000 కోట్ల వడ్డీ లేని రుణాలు
బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం ప్రజా భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని వివరించారు. హైడ్రా సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, అక్రమార్కులు పార్కులు, సరస్సులు ఆక్రమించుకోకుండా చూస్తుందని తెలిపారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు బ్యాంకింగ్ రంగం ద్వారా చేయూతను అందించాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలనేదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశమన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు భట్టి విక్రమార్క.. “కార్పొరేట్ కమర్షియల్ బ్యాంకులు తొమ్మిది నుంచి.. 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలి. రుణాలు ఇచ్చే ముందు ఉన్న నిబంధనలు సరళ తరం చేయాలి. ప్రైవేటు విభాగాల్లో బ్యాంకర్లు ఇచ్చిన రుణాల రికవరీ శాతం తక్కువగా ఉంటుంది. అదే స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చిన రుణాల రికవరీ శాతం చూస్తే 98 శాతానికి పైగా ఉంది. హైదరాబాదులో 3000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించాం. వాటిని ఐదు వేల కోట్లకు తీసుకువెళ్లాలి. అని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హస్తిన పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు అమిత్‌ షాతో పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు పవన్‌ మీడియాతో మాట్లాడుతూ అమిత్ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతగా ఉంటామన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా బాధ్యతతోనే పర్యటనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.

 

కుల గణన, మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్‌కి గవర్నర్ కీలక సూచనలు..
కుల గణన, మూసి ప్రక్షాళనపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్‌ భేటీలో చర్చ జరిగింది. మూసి ప్రక్షాళనపై సీఎంని గవర్నర్ ఆరా తీశారు. పేదలు నష్టపోకుండా చూడాలని.. పరిహారం అందించడంలో ఉదారంగా ఉండాలని సీఎంకి గవర్నర్ సూచించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించినట్లు సీఎం ఆయనకు తెలిపారు. మరికొంత మందికి కూడా పరిహారం అందించడంలో ఇబ్బంది లేదని.. పేదలను సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజ్ భవన్ లో గవర్నర్.. సీఎం ఇద్దరు 10 నిమిషాల ఏకాంత భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును గవర్నర్ కు వివరించిన సీఎం వివరించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 2025 చేపట్టే దేశవ్యాప్త జన గణలో తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్ ను ఆహ్వానించారు.

 

2008 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. ప్రక్రియ వేగవంతం
2008 డీఎస్సీ అభ్యర్థులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాలకు పరిశీలకులను నియమించింది. నవంబర్ 8వ తేదీ లోపు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. నిర్ణీత ప్రొఫార్మాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని సూచించింది. కాగా.. డీఎస్సీ-2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసుల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. హైదరాబాద్‌ మినహా ఇతర జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. డీఈడీ ఉన్న వారికి 30 శాతం ఎస్‌జీటీ పోస్టులు కేటాయించింది. 30 శాతం రిజర్వేషన్‌ వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1200 మంది అభ్యర్థులకు లాభం చేకూరుతుంది. అంతేకాకుండా.. 16 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

 

ట్రంప్‌కు అభినందనలు.. కమలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రాహుల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రపంచ నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోడీ కూడా ఎక్స్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మిత్రుడు ట్రంప్‌కు అభినందనలు అంటూ మోడీ పేర్కొన్నారు. తాజాగా కాంగ్రెస్ కూడా శుభాకాంక్షలు చెప్పింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ.. ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. అలాగే ఓటమి పాలైన కమలా హారిస్‌కు ‘‘ఆల్ ది బెస్ట్’’ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి విజయం సాధించినందుకు ట్రంప్‌నకు రాహుల్ అభినందనలు తెలిపారు. అలాగే కమలా హారిస్‌కు భవిష్యత్ ప్రయత్నాలకు ‘‘ఆల్ ది బెస్ట్’’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశం-యునైటెడ్ స్టేట్స్ బలమైన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ఆకాంక్షించారు. ‘‘ప్రపంచ శాంతి మరియు శ్రేయస్సు కోసం యునైటెడ్ స్టేట్స్‌తో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము’’ అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. ట్రంప్ 270 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపు మార్కును క్రాస్ చేసి 280 ఓట్లు సాధించారు. అమెరికా చరిత్రలో అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు.

 

కమలాహారిస్ ఓ యోధురాలు.. కొనియాడిన తమిళనాడు వాసులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ విజయం సాధించాలంటూ తమిళనాడు వాసులు పూజలు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ బ్యానర్లు కట్టారు. తీరా.. ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ నిరాశలోకి వెళ్లిపోయారు. ఆమె తల్లి పూర్వీకుల గ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురం ప్రజలు ఆవేదన చెందారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ ఓడిపోయినా.. ఆమె ఒక పోరాట యోధురాలని కొనియాడారు. ఆమె మళ్లీ నాలుగేళ్ల తర్వాత వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా గెలిచితీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తులసేంద్రపురం గ్రామ ప్రజలు.. బుధవారం ఉదయం నుంచి.. అమెరికా ఎన్నికల ఫలితాల కోసం టీవీలకు అతుక్కుపోయారు. కమలా హారిస్ విజయం కోసం శ్రీ ధర్మ శాస్తా పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించి.. పూజలు చేశారు. అయితే డెమోక్రాటిక్ ప్రత్యర్థి కమలా హారిస్‌ ఓడిపోవడంతో తులసేంద్రపురం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. గ్రామానికి వచ్చిన ఇద్దరు అమెరికన్లు, ఓ యూకే పౌరుడు ఊరు నుంచి వెళ్లిపోయారని గ్రామవాసులు తెలిపారు. తులసేంద్రపురం గ్రామ నాయకుడు జే.సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ… కమలా హారిస్‌ విజయం సాధిస్తారని అనుకున్నామన్నారు. దీపావళి కంటే పెద్దగా వేడుకలను ప్లాన్ చేసినట్లు చెప్పారు. బాణాసంచా పేల్చడం, మిఠాయిలు పంపిణీ చేయడం, ఆలయ పూజలు చేయటం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని.. తీరా ఫలితాలు కమలకు వ్యతిరేకంగా వచ్చాయన్నారు. అయినా ఆమె పోరాట స్ఫూర్తిని తప్పక మెచ్చుకోవాలన్నారు. ఆమె పోరాట యోధురాలు, దేవుడి దయతో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తారని ఆకాంక్షించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 270 మ్యాజిక్ ఫిగర్ ఉండగా.. ప్రస్తుతం ఇప్పటి వరకూ ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఇక విస్కాన్సిన్‌‌లో ట్రంప్ గెలుపొందారు. తాజా ఫలితాలను చూస్తుంటే అమెరికన్లు ఏకపక్షంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ను గెలిపించాలన్న ఉద్దేశంతోనే అమెరికన్లు ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ట్రంప్ భారీ విజయం దిశగా దూసుకెళ్లారు. ఇక రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంపై ప్రపంచ నాయకులంతా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో అధ్యక్షుడిగా గెలవాలంటే 270 ఓట్లు సాధించాలి. కానీ ఆ సంఖ్య దాటేసింది. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ పనిచేశారు. 2021 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడంతో జో బైడెన్ అధ్యక్షుడయ్యారు. అధ్యక్ష పదవి పోయిన తర్వాత ట్రంప్ ఎన్నో ఆరోపణలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ రానున్న ఎన్నికల్లో గెలిచి చూపిస్తానంటూ సవాల్ చేసి మరీ గెలిచారు.

Show comments