NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రైతు రుణమాఫీపై క్లారిటీ.. అప్పటి లోపు పూర్తిగా మాఫీ
యాదాద్రి జిల్లా రామన్నపేటలో నూతనంగా నిర్మించిన సహకార సంఘం భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేశాం.. రాష్టంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అన్నారు. దేశంలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి పేర్కొన్నారు. అలాగే.. పెండింగులో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. రామన్నపేటను కొత్త మార్కెట్‌గా పునరుద్ధరణ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఏ పథకాన్ని అమలు చేయలేదు.. దీంతో సహకార సంఘాలు కోట్ల రూపాయలు నష్టపోయాయని అన్నారు. మరోవైపు.. చేనేతకు పెండింగులో ఉన్న నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు. చేనేత ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి మహిళలకు చీరలు ఇస్తాం.. చేనేత వృత్తి మీద బ్రతికే కుటుంబాల కోసం వాళ్ళ అప్పులను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుందని అన్నారు. మరోవైపు.. వడ్ల కొనుగోలులో మిల్లర్స్‌తో మాట్లాడి వాళ్లకు మిల్లింగ్ ఛార్జీలు పెంచామని తెలిపారు. రైతులు తేమ లేకుండా ధాన్యం, పత్తిని తీసుకురావాలి.. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.

 

వచ్చే ఎన్నికల్లో వంద శాతం విజయం మనదే.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ రవితేజ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాల్లో జనం చెబుతున్నారు.. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తామని కేసీఆర్ తెలిపారు. అందులో అనుమానమే లేదు.. ప్రజలు ఏమి కోల్పోయారో వారికి అర్ధం అయ్యింది.. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయని పేర్కొన్నారు. పార్టీ కోసం అందరూ కష్టపడి పనిచేయాలి.. అధికారంలోకి రాగానే వాడిని లోపల వేయాలి.. వీడిని లోపల వేయాలని తాము చూడమని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి.. నిర్మాణం చేయాలి.. పదిమందికి లాభం చేయాలని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో తాము మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే.. కానీ 90 శాతం ఎవరు అడగకున్న పనులు చేసి చూపించామని కేసీఆర్ పేర్కొన్నారు.

 

తిరుపతి ప్రత్యేక రాష్ట్రం కోసం పిటిషన్.. సుప్రీంకోర్టు తిరస్కరణ
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం 700 మందికిపైగా ఉన్న ప్రజల కోసం వాటికన్ సిటీ దేశంగా ఉందంటూ ఉదాహరణ చూపుతూ.. అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న తిరుపతిని కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని పిటిషన్‌లో కేఏ.పాల్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టతను కాపాడేందుకే ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. పిటిషన్‌ను వ్యక్తిగతంగా కేఏ.పాల్ వాదించారు. అయినా కూడా సుప్రీం ధర్మాసనం పిటిషన్ కొట్టేసింది. తిరుపతిని ప్రత్యేక రాష్ట్రం చేస్తే.. దేశంలో ఉన్న ఇతర దేవాలయాల కోసం కూడా ఒక్కో రాష్ట్రాన్ని కేటాయించాల్సి ఉంటుందని.. జగన్నాథ్ పూరి కోసం, కేదార్‌నాథ్ కోసం, బద్రీనాథ్ కోసం, మదురై దేవాలయం కోసం, రామేశ్వరం దేవాలయం కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి.’’ అని డిమాండ్ వస్తుందని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ. విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఒక్కో దేవాలయం కోసం రాష్ట్రంగా పరిగణించడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో పిటిషన్‌ను కొట్టేసింది. అలాగే తిరుపతి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను కూడా శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), సీబీఐ వ్యతిరేకంగా ఆయన పిటిషన్ వేశారు. సిట్ నివేదిక టైమ్‌లైన్‌కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది.

 

పీఎం మోడీ అరబ్ దేశాలకు వెళ్తే ఇలాగే మాట్లాడుతారా..? ఓవైసీ విమర్శలు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అక్కడ రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రధాని మోడీ అరబ్ దేశాలకు వెళ్లిన సమయంలో ఇదే భాషను ఉపయోగిస్తారా..? అని ప్రశ్నించారు. మహరాష్ట్రలో రైతు ఆత్మహత్యల వంటి ప్రధాన సమస్యలపై అధికార పార్టీ దృ‌ష్టి మళ్లించిందని ఆరోపించారు. ఔరంగాబాద్ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. నవంబర్ 20న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రదీప్ జైశ్వాల్, శివసేన(యూబీటీ)కి చెందిన బాలా సాహెబ్ థోరట్‌తో ఎంఐఎం అభ్యర్థి నాజర్ సిద్ధిఖీ తలపడుతున్నారు. “ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రంలో ‘ఓటు జిహాద్’ గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రధాని (నరేంద్ర మోదీ) అరబ్ దేశాలను సందర్శించినప్పుడు వారు అదే భాషను ఉపయోగిస్తున్నారా” అని ఓవైసీ అడిగారు. ఔరంగాబాద్ డివిజన్‌లో 324 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయితే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు. బదులుగా ఫడ్నవీస్ ఓటు జిహాద్ గురించి మాట్లాడుతున్నారని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఓవైసీ విమర్శించారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరాఠాలు, ముస్లింలు, దళితులు ఐక్యంగా ఉండాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాంగ్రెస్, శివసేన ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు చేశారు. మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో 14 స్థానాల్లో ‘ఓట్ జిహాద్’ కనిపించిందని ఫడ్నవీస్ అన్నారు. ధూలే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి 5 సెగ్మెంట్లలో 1.9 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని, అయితే మాలేగావ్ సెంట్రల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓఒ వర్గం వారు ఒకే వైపు ఓట్లు వేయడంతో, బీజేపీ అభ్యర్థి 4000 ఓట్ల తేడాతో ఓడిపోయారని అన్నారు. దీనికి ఓట్ జిహాద్ కారణమని చెప్పారు.

 

హిమాచల్‌ప్రదేశ్‌ను వదలని సమోసా వివాదం.. సీఎంకు బీజేపీ సమోసాలు ఆర్డర్
హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయాలను సమోసాల వివాదం ఇంకా కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకి బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలను ఆన్‌లైన్ ఆర్డర్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గత నెల (అక్టోబర్) 21న ముఖ్యమంత్రి సుఖు.. సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమానికి ఓ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారు. అయితే హోటల్ నుంచి సమోసాలు రాగానే.. వాటిని పోలీసులకు అందజేశారు. అయితే పొరపాటున తమ కొరకే సమోసాలు తెచ్చారేమోనని పోలీస్ సిబ్బంది ఆరగించారు. అయితే వేదికపైకి సమోసాలు రాకపోవడంతో ప్రముఖులు ఆకలితో ఇబ్బందిపడ్డారు. ముఖ్యమంత్రితో సహా ప్రముఖులకు ఈ ఇబ్బంది తలెత్తింది. అయితే సమోసాలు.. లోపలికి వెళ్లకుండా బయటనే సిబ్బంది తినేశారు. అయితే సమోసాలు ఎలా మిస్ అయ్యాయంటూ సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. సమోసాల కోసం సీఐడీ విచారణకు ఆదేశించడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆశిశ్‌ శర్మ.. ముఖ్యమంత్రి సుఖుకు 11 సమోసాలను ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ.. ‘‘నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే.. సమోసాల విషయంలో సీఐడీ విచారణకు ఆదేశించించడం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రికి 11 సమోసాలు పంపాను. ఆయనకు ప్రజా సమస్యలను గుర్తుచేసేందుకే అలా చేశాను’’ అని శర్మ వెల్లడించారు. మరోవైపు శుక్రవారం రాత్రి బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్.. బీజేపీ శ్రేణులకు సమోసా పార్టీ ఇచ్చి ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.

 

క్వెట్టా బ్లాస్ట్.. 14 మంది సైనికులతో సహా 26 మంది మృతి.. “బీఎల్ఏ” బాధ్యత..
పాకిస్తాన్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని రైల్వే స్టేషన్‌లో బాంబు పేలి 26 మంది మరణించారు. పాకిస్తాన్ ఆర్మీ సైనికులే లక్ష్యంగా బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన 26 మందిలో 14 మంది సైనికులు ఉన్నారు. క్వెట్టా స్టేషన్ నుంచి పెషావర్‌కి ఈ రోజు ఉదయం రైలు బయలుదేరే ముందు ఈ పేలుడు సంభవించింది. పేలుకు సంబంధించిన వీడియోలో, ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే, ఈ పేలుడు తమ పనే అని ‘‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ)’’ ప్రకటించింది. పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు చెప్పింది. క్వెట్టా రైల్వే స్టేషన్‌లోని పాకిస్తాన్ ఆర్మీ యూనిట్‌పై దాడి చేసినట్లు ఒక ప్రకటనలో బీఎల్‌ఏ ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌ స్వాతంత్ర్యం కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఇటీవల కాలంలో ఈ సంస్థ పాక్ ఆర్మీతో పాటు, చైనీయులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సుని కలుపుతూ సిపెక్ ప్రాజెక్ట్ చేపడుతోంది చైనా. ఈ ప్రాజెక్టులో పనిచేస్తే చైనీయులతో పాటు దానికి రక్షణగా నిలుస్తున్న పాక్ ఆర్మీ, పోలీసులపై బీఎల్ఏ విరుచుకుపడుతోంది. తమ బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు చైనా సహజ వనరుల్ని కొల్లగొడుతోందని బీఎల్ఏ ప్రధాన ఆరోపణ.

 

‘‘మీతో సె*క్స్ చేయం’’.. ట్రంప్ గెలుపుకి మగాళ్లని నిందిస్తున్న మహిళలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఆ దేశంలోని లక్షలాది మంది మహిళలకు నచ్చడం లేదు. కమలా హారిస్ నేతృత్వంలోని డెమొక్రాట్ పార్టీ గెలుస్తుందని అంతా భావించినప్పటికీ, వాళ్ల కలలు డొనాల్డ్ ట్రంప్ విజయంతో చెరిగిపోయాయి. అయితే, ట్రంప్ విజయానికి మగవాళ్లే కారణం అంటూ అక్కడి మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. చాలా మంది మహిళలు పురుషులతో సె*క్స్, డేటింగ్, పిల్లలు కనడం వంటి వాటికి దూరంగా ఉండాలని 4B ఉద్యమంలో చేరారు. నిజానికి ఎన్నికల సమయంలోనే కమలా హారిస్ క్యాంపెయిన్ ట్రంప్‌ని స్త్రీవాద వ్యతిరేక వ్యక్తిగా చిత్రీకరించింది. అయితే, అఖండ మెజారిటీతో ట్రంప్ గెలవడంతో చాలా మంది మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది మహిళావాదులు ఈ ‘‘4B మూమెంట్’’లో చేరారు. ఇప్పుడు ఇది అమెరికాలో ట్రెండ్ అవుతోంది. పురుషులతో సంబంధాలు పెట్టుకోవద్దని ఒక సెక్షన్ మహిళలు పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. 4B అనేది ‘‘ 4 నోస్’’ అని అర్థం. కొరియన్‌లో ‘‘Bi’’ అంటే ‘‘వద్దు’’ అనే అర్థం వస్తుంది. 2018లో సౌత్ కొరియాలో మొదలైంది. అక్కడి రాడికల్ ఫెమినిస్టులు ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేశారు. ఇది పురుషులతో ‘‘వివాహం,సెక్స్, బిడ్డల్ని కనడం, డేటింగ్’’ వంటివి వద్దు అనే నాలుగు విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే, యూఎస్ ఎన్నికల్లో చాలా మంది మహిళలు తమ పునరుత్పత్తి హక్కుల్ని కాపాడే వ్యక్తి కమలా హారిస్ గెలవాలని కోరుకున్నారు. ట్రంప్ గెలవడంతో పురుషుల పాత్ర ఉందని భావిస్తున్న కొందరు మహిళలు ఈ ‘‘4B ఉద్యమం’’లో భాగస్వామ్యమయ్యారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరు మహిళలు సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నారు. ‘‘మహిళలు మరవకండి మనకు శక్తి ఉంది. మన శరీరాలను మగవారికి అప్పగించడం మన ఛాయిస్. దీన్ని ఇక మనం చేయాల్సిన అవసరం లేదు’’అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు 4బీ ఉద్యంలో పాల్గొన్న మహిళలపై మరో వర్గం మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘మీరు ఒక వ్యక్తితో పడుకోవాలని అనుకోంటే, ఒక్క వ్యక్తి నిద్ర కూడా చెడిపోదు’’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

 

గాజాలో కరవు విలయతాండవం.. తక్షణమే సాయం పెంచాలంటూ డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్
గాజాలో కరవు విలయతాండవం చేస్తోంది. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. భవంతులు కుప్పకూలాయి. ఆహార ఉత్పత్తులు అడుగంటాయి. స్వచ్ఛంద సంస్థల సహాయాలు నిలిచిపోయాయి. దీంతో కరవు మరింత దుర్భిక్షంగా మారింది. కనీస అవసరాలు తీర్చుకోలేక ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. దీంతో అక్కడి పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే సాయం పెంచాలంటూ ఆదేశించింది. అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్‌‌పై హమాస్ దాడికి తెగబడింది. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. అప్పటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. చాలా మంది నిరాశ్రయులుగా మారారు. మరికొందరు తరలిపోయారు. అయితే కొంత కాలం స్వచ్ఛంద సంస్థలు సాయం అందించడంతో కడుపు నింపుకున్నారు. అయితే కొంత కాలం నుంచి గాజాకు వెళ్లే దారులు మూసివేయబడ్డాయి. దీంతో సాయం నిలిచిపోయింది. దీంతో గాజాలో మరింత క్షామం పెరిగింది. ఆకలితో అల్లాడిపోతున్నారు. దీంతో అక్కడి పరిస్థితులను చూసి డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్ ఇచ్చింది. తక్షణమే సాయం పెంచాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే శుక్రవారమే గాజాకు వెళ్లే దారిని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. తక్షణమే మానవతా సాయం అందించకపోతే గాజా పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రజలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని.. తక్షణమే ఆహారంతో పాటు ఔషధాలు అందించాలని సూచించింది. మరోవైపు బ్లాక్ మార్కెట్‌లో విపరీతమైన ధరలతో వస్తువులు అమ్ముతున్నారు. దీంతో కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి.

 

విడాకులైన డైరెక్టర్ తో అనుష్క పెళ్లి.. అసలు నిజం ఇదే!!
నటి అనుష్క శెట్టి సౌత్ లీడింగ్ హీరోయిన్స్ లో ఒకరు. ఆమె తెలుగు సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో నటించింది. ఆ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని తెలుగులో ఘాటి అనే సినిమాలోనూ, మలయాళంలో ఖదనార్ అనే సినిమాలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు 2025లో విడుదల కానున్నాయి. ఈ దశలోనే అనుష్క శెట్టి పెళ్లిపై సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. అవును, ఆమె సైజ్ జీరో దర్శకుడు ప్రకాష్ కోవెలమూడిని రహస్యంగా వివాహం చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. దీనిపై అనుష్క శెట్టి ఘాటుగా స్పందించింది. కొన్ని రోజుల క్రితం అనుష్క శెట్టి తన 43వ పుట్టినరోజు జరుపుకోగా ఆమె పెళ్లి గురించిన చర్చలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇది మొదటిసారి కాదు. బాహుబలి ప్రారంభం నుండి అనుష్క శెట్టి మరియు ప్రభాస్ ప్రేమలో ఉన్నారని మరియు వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఇద్దరూ ఖండించారు. ఇప్పుడు మళ్లీ అనుష్క శెట్టి పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. ఆ దర్శకుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. అనుష్క శెట్టి దర్శకుడు ప్రకాష్ కోవెలమూడితో 2015లో వచ్చిన సైజ్ జీరో చిత్రంలో పని చేసింది. అప్పట్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం నేపథ్యంలో ఓ ప్రైవేట్ ప్రెస్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క పెళ్లిపై వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు ప్రకాష్ కోవెలమూడితో పెళ్లయిందా? .అది నిజం కాదు. ఈ పుకార్ల వల్ల నేను ఎప్పుడూ ప్రభావితం కాను. నా పెళ్లి ఎందుకు అంత పెద్ద విషయం అని నాకు తెలియదు. వైవాహిక సంబంధాన్ని ఎవరూ దాచలేరు. అలాంటప్పుడు నా పెళ్లిని ఎలా దాచగలను? ఇది చాలా ఎమోషనల్ విషయం. నాకు వ్యక్తిగత స్పేస్ ఉంది. ఎవరైనా అందులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే నాకు నచ్చదు. ఏదో ఒక రోజు ప్రజలకు నా పెళ్లి తేదీ తెలుస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే అనుష్క శెట్టి దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందని సమాచారం. అలాగే ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిశాయని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.