NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ప్లాస్టిక్ వినియోగం తగ్గాలి.. పిఠాపురం నుంచే ప్రయోగం..
ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి.. కానీ, ఆచరణలో అనుకున్నస్థాయిలో మాత్రం ముందడుగు పడడం లేదు.. అయితే, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలుచేశారు.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణకు దిగనున్నారు.. దానిని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే ఆచరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలని సూచించారు పవన్‌ కల్యాణ్.. మన వేడుకలు.. ఉత్సవాల్లో పర్యావరణ హిత వస్తువులను వాడడం మేలన్నారు.. వినాయక చవితి వేడుకల్లోనూ మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపరుతో చేసిన కవర్లతో ఇవ్వొద్దన్నారు.. ప్రసాదాలను ప్లాస్టిర్ కవర్లల్లో కాకుండా తాటాకు బుట్టలు.. ఆకుల దొన్నెలతో వాడాలి. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల్లో ప్రయోగత్మాకంగా చేపడతాం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అయితే, ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయరామ్.. ఈ సందర్భంగా పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకోవాలని పవన్‌ పిలుపునిచ్చారు.. వినాయక చవితిని మట్టి వినాయకులే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్‌ లేనట్టే..!?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది.. ఈ నెల 22వ తేదీ లేదా ఆ తర్వాత తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు.. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం కష్టమని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. దీంతో, ప్రస్తుతమున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్టును కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.. మరో నాలుగు నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తేవాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టుగా చర్చ సాగుతోంది.. ఆర్థిక వెసులుబాటు.. వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇప్పుడే ప్రవేశపెట్టడం కష్టమని.. అందుకే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కొనసాగింపుపై సమాలోచనలు చేస్తున్నారట.. అయితే, ఏపీ ఆర్ధిక పరిస్థితిపై క్లారిటీ వస్తే సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టుగా సమాచారం.. ఇప్పుడు మాత్రం.. ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనకు ప్రభుత్వ పెద్దల ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురుచూస్తోందని తెలుస్తోంది.

ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్.. ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా కృషి..
ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నాం.. ఫిర్యాదులు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయచోటి నియోజకవర్గంలో 2000 కోట్లు విలువ చేసే భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు.. భూ ఆక్రమణలపై మండిపడ్డ మంత్రి.. టీడీపీ ఇచ్చిన హామీల మేరకు పేదల, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు. సంబేపల్లి మండలంలో వంకపొరం పోడు భూముల ను ఆక్రమించి వైసీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు.. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు రెవెన్యూ రికార్డులను సైతం ట్యాంపరింగ్ చేశారన్నారు. అయితే, టీడీపీ కక్ష కట్టి ఎటువంటి చర్యలు తీసుకోదు అని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో వైఎస్ విలక్షణమైన వ్యక్తి..
రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలక్షణమైన వ్యక్తి అని కొనియాడారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. అమరావతిలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు బిళ్ల పెట్టుకుని తిరుగుతున్నారు.. రాజకీయ నాయకులు పూటకో పార్టీలో ఉంటున్నారు.. కానీ, వైఎస్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారని.. రాజకీయాల్లో వైఎస్ విలక్షణమైన వ్యక్తిగా అభివర్ణించారు నారాయణ.ఇక, డబుల్‌ ఇంజిన్ సర్కార్ పై మరింత పోరాటం చేయాలని సూచించారు నారాయణ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే నష్టం అని ఆరోపించారు.. ప్రమాదకరమైన బీజేపీతో చంద్రబాబు ఉన్నారు.. మరోవైపు.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇక, కమ్యూనిస్టులపై వైఎస్‌కు మంచి అభిప్రాయం ఉందన్నారు.. అంతేకాదు.. అది నిరూపించారని కూడా గుర్తుచేశారు. కొందరు నేతలు మనం మంచిగా ఉన్నప్పుడే పలకరిస్తారు.. లేకపోతే పక్కకు పోతారు.. కానీ, వైఎస్‌ అలాంటి వ్యక్తి కాదు.. ఎవరైనా కలిస్తే.. పరిస్థితి ఏంటి? అని ఆరా తీసి.. సహాయం చేసేవారని కొనియాడారు. అయితే, వైఎస్‌ ఉండిఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదన్నారు.. ఒకవేళ తెలంగాణ ఏర్పడినా.. టీఆర్ఎస్‌ మాత్రం ఉండేది కాదన్నారు నారాయణ.. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

తెలంగాణకు నష్టం లేకుండా ఏపీకి మంచి చేయండి..
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జ్ఞాపకాలు నిలిచిపోయేవి.. మరిచిపోయేవి కావు అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.. వైఎస్‌ 75వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌.. పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి.. ఆయన మరణించిన నాటి వరకు ఆయనతో నా ప్రయాణం కొనసాగింది.. ఆ ప్రయాణం కొనసాగేలా చేసిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు అని గుర్తుచేసుకున్నారు.. వైఎస్‌ మరణం తర్వాత నాకు తెలిసింది.. ఆయన మామూలు మనిషి కాదు.. మహా నేత అన్నారు.. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది చనిపోతే నాకు ఆశ్చర్యం వేసిందన్నారు.. ఇక, హైదరాబాద్‌లో జరిగినట్టుగా గణేష్ నిమజ్జనం ఎక్కడా జరగదు.. కానీ, వైఎస్‌ మరణం తర్వాత జరిగి గణేష్‌ నిమజ్జనం మాత్రం సైలెంట్‌గా జరిగింది.. అన్ని విగ్రహాల దగ్గర వైఎస్‌ ఫొటోను పెట్టుకుని గణేష్‌ విగ్రహాలను తీసుకొచ్చారు.. వినాయకుడి విగ్రహంతో పాటు వైఎస్‌ ఫొటోలను కూడా నిమజ్జనం చేశారు.. అది చూసిన తర్వాత నాకు అనిపించింది వైఎస్‌ దేవుడిలో కలిసిపోయాడని అన్నారు.. ఇక, బతికితే ఇలా బతకాలిరా.. అనే ముద్రవేసి వెళ్లిన వ్యక్తి వైఎస్‌ అన్నారు ఉండవల్లి.. ఆయన జీవితం మొత్తం పోరాటమే.. అంతా అసమ్మతే.. కానీ, ఆయన సీఎం అయిన తర్వాత ఏ మాత్రం వ్యతిరేకత లేని వ్యక్తి అని అభివర్ణించారు. దానికి ఒకటే కారణం.. ఆయన చిరునవ్వు మాత్రమే అన్నారు.. ఎవరు వచ్చినా.. ఆప్యాయంగా పలకరింపు.. ఆయన దృష్టికి సమస్య వెళ్లిందంటే.. అది పరిష్కారం అయిపోవాల్సిందే.. కానీది ఏదైనా ఉంటే.. వెంటనే సమాచారం ఇచ్చేవారిని గుర్తుచేసుకున్నారు.. మరోవైపు.. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గురించి ఉండల్లి మాట్లాడుతూ.. తెలంగాణ కు నష్టం లేకుండా ఏపీకి మంచి చేయండి.. ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య శాశ్వతంగా అనుబంధం కలిగించే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంది.. అది కాంగ్రెస్ వారికి మార్క్‌గా పేర్కొన్న ఆయన.. ఆంధ్రా వారికి తెలంగాణ మీద ఎటువంటి ద్వేషం లేదు.. కానీ, తెలంగాణ వారి కోపానికి కారణం ఉందన్నారు. ఏపీ తెలంగాణ టెక్నికల్ గా రెండు రాష్ట్రాలు మాత్రమే తప్ప ప్రజలు ఒకటే అన్నారు..

ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారం ఉందని.. ప్రతిపక్షం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అంటూ పేర్కొన్నారు. ఏపీలో ఉంది కేవలం అధికార పక్షమేనని.. ఏపీలో అందరూ బీజేపీ పక్షమేనన్నారు. ఏపీలో ప్రజల కోసం ఉన్నది వైఎస్ షర్మిల మాత్రమే అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. 2029లో షర్మిల ఏపీకి ముఖ్యమంత్రి అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ చెప్పారు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదన్నారు. ఆశయాలు మోసే వారికి మాత్రమే వారసత్వం వస్తుందన్నారు. వైఎస్సార్ 75వ జయంతి వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీలో కాంగ్రెస్ గెలుపుకు కార్యకర్తలు కోసం తెలంగాణ కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు. ఏపీలో కాంగ్రెస్ కి అండగా నిలుస్తామని చెప్పటానికి మంత్రి వర్గంతో సహా ఇక్కడకి వచ్చామన్నారు. కడప ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందని.. అదే జరిగితే కడపలో ప్రతి ఊరు తిరగటానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఎక్కడైతే కాంగ్రెస్‌కి దెబ్బ తగిలిందో అదే కడప నుంచే మళ్ళీ ఏపీ కాంగ్రెస్ జెండా ఎగరవేయటానికి అండగా ఉంటామన్నారు.

గాంధీ, ఉస్మానియా బలోపేతానికై ఫార్మా కంపెనీలు ఆ నిధులను అందించాలి..
ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలకు ఫార్మా కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశం నిర్వహించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల పూర్వ వైభవానికి సామాజిక బాధ్యతగా ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్ నిధులను విరివిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ప్రాధాన్యత రంగాలైన పేషెంట్ కేర్, శానిటేషన్, డైట్, బయో – మెడికల్ వేస్టేజ్, డ్రింకింగ్ వాటర్ సప్లైలతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించటానికి అవసరమైన సిబ్బంది, విద్య, వైద్య రంగాలతో పాటు గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ లాంటి అంశాలలో ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ను అందించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బలోపేతానికి ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్ విధులను విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

శరద పవార్ పార్టీకి ఊరట.. విరాళాలు సేకరణకు గ్రీన్‌సిగ్నల్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్)కి కేంద్ర ఎన్నికల సంఘం ఊరటనిచ్చే కబురు చెప్పింది. ప్రజల నుంచి విరాళాలను స్వీకరించడానికి శరద పవార్ పార్టీకి అనుమతించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలను స్వీకరించేందుకు ఈసీ అనుమతి కోరింది. దీనికి భారత ఎన్నికల సంఘం ఆమోదించింది. సుప్రియా సూలే నేతృత్వంలోని 8 మంది సభ్యులు సోమవారం కమిషన్ కలిసింది. వ్యక్తి లేదా కంపెనీ నుంచి స్వచ్చంధంగా విరాళాలు సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శరద పవార్ పార్టీ సత్తా చాటింది. ఇండియా కూటమి 30 స్థానాలు గెలుకుచుకుంటే.. శరద పవార్ పార్టీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. ఇండియా కూటమి కూటమి 17 స్థానాలు మాత్రం సొంతం చేసుకుంది. త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందుకోసం భారీగా కసరత్తు చేస్తోంది. అలాగే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారధ్వంలోని ఎన్డీఏ కూటమి కూడా మరోసారి అధికారం ఛేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

హత్రాస్‌ తొక్కిసలాటపై సుప్రీంలో పిటిషన్..రేపు విచారించినున్న సీజేఐ
యూపీలోని హత్రాస్‌లో తొక్కిసలాట, వంద మందికి పైగా మరణించిన కేసు మంగళవారం సుప్రీంకోర్టు ముందు ప్రస్తావనకు రానుంది. ఈ పిటిషన్ ను సీజేఐ డీవై చంద్రచూడ్ ముందు ప్రస్తావించనున్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించాలని కోరారు. ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షణ విచారణ జరపాలని ఈ పిటిషన్‌లో డిమాండ్ చేశారు. హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. కార్య నిర్వహకుడు మధుకర్. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏకైక నిందితుడు ఇతడే. హత్రాస్‌లో తొక్కిసలాటలో 121 మంది మరణించిన కేసులో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.

గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులు.. నేలమట్టమైన భారీ భవంతులు
ఇజ్రాయెల్ మరోసారి విజృంభించింది. గాజాపై బాంబులతో విరుచుకుపడింది. గాజా నగరంపై టెల్‌ అవీవ్‌ దళాలు ముప్పేట దాడి చేశాయి. హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. దీంతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. నగరానికి మూడువైపుల నుంచి బాంబు దాడులు.. మరోవైపు సముద్రం.. ఈ భయానక పరిస్థితుల్లో ఎటువైపు వెళ్లాలో తెలియక స్థానికులంతా రోడ్లపై పరుగులు తీశారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేసి.. రోడ్ల పక్కనే నిద్రించారు. అక్టోబర్‌ 7 తర్వాత ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో ఇదే అతి పెద్ద దాడిగా తెలుస్తోంది. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు ఖతార్‌, అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న వేళ.. ఇంత భారీ స్థాయిలో టెల్‌ అవీవ్‌ సేనలు విరుచుకుపడటం భయాందోళన కలిగిస్తోంది. తాజా దాడులపై గాజా సివిల్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ స్పందించింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. గాజా తూర్పు ప్రాంతంలోని దరాజ్‌, టఫాతో పాటు పశ్చిమ దిక్కున ఉన్న టెల్‌-అల్‌-హవా, సర్బా, రిమాల్‌ ప్రాంతాల్లో కాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి. మూడువైపుల నుంచి ఒకేసారి దాడులు జరగడంతో ప్రాణభయంతో వేలాది మంది ప్రజలు మధ్యధరా సముద్రతీరం వైపు పరుగులు తీశారు. తెల్లవారు జాము వరకు కాల్పులు కొనసాగాయి. హమాస్‌ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆపరేషన్‌ చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ మిలటరీ ప్రకటించింది. తమ బలగాలకు ముప్పు తలపెట్టే అవకాశమున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

ఓటీటీకి వచ్చేస్తున్న హరోం హర.. ఎప్పుడు? ఎక్కడ? చూడాలంటే!
వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు సుధీర్ బాబు ‘హరోం హర’ సిద్ధం అయింది. సుధీర్ బాబు నటించిన తాజా యాక్షన్ డ్రామా ‘హరోం హర’. సాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. మిశ్రమ సమీక్షలతో జూన్ 14న థియేటర్‌లలో విడుదలైన ఈ చిత్రం, జూలై 11, 2024 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా OTT ప్రేక్షకులను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. హరోం హర” సుధీర్ బాబు కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి సినిమాగా నిలుస్తుంది. ఇందులో తన మునుపటి సినిమాలతో పోలిస్తే ఒకడుగు ముందుకేసి యాక్షన్ సన్నివేశాలతో అలరించారు. సుబ్రమణ్యం అనే ప్రధాన పాత్రలో సుధీర్ బాబుతో పాటు, ఈ సినిమాలో మాళవిక శర్మ మహిళా కథానాయికగా నటించారు, సునీల్, జయప్రకాష్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ మరియు ఒక ప్రముఖ యూట్యూబర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్న ప్రణీత్ హనుమంతు ఈ సినిమాలో నటించారు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించగా, సుమంత్ జి నాయుడు నిర్మించిన ‘హరోం హర’ కుప్పం నేపథ్యంలో తెరకెక్కింది. జూలై 11, 2024 నుండి ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో ‘హరోం హర’ని చూడచ్చు.

సినీ మీడియాకి నభా స్పెషల్ పార్టీ
కన్నడ భామ నభా నటేష్ కన్నడలో మూడు సినిమాలు చేసింది. తర్వాత సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచమైంది. ఇక ఆ తర్వాత తెలుగులో రవిబాబు అదుగో సినిమా కూడా చేసింది. ఇక ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో ఆమె సూపర్ హిట్ కొట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తరువాత ఆమె కెరీర్ ఇక పరుగులు పెడుతుందని అనుకున్నారు అందరూ. కానీ అనూహ్యంగా ఆమెకు సరైన హిట్లు ఏమీ పడలేదు. డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటరూ, అల్లుడు అదుర్స్, మాస్ట్రో అనే సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకు యాక్సిడెంట్ కావడంతో చాలా కాలం పాటు బెడ్ మీద ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆమె హీరోయిన్గా డార్లింగ్ అనే సినిమా చేసింది. ప్రియదర్శి హీరోగా తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాని కూడా నిర్మించారు. జూలై 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దీంతో తన రీ ఎంట్రీ సినిమా రిలీజ్ కు ముందు ఆమె తెలుగు సినీ మీడియాకి పార్టీ ఇచ్చేందుకు సిద్ధమైంది. రేపు హైదరాబాద్ లో ఒక హీరోకి చెందిన రెస్టారెంట్లో ఆమె తెలుగు సినీ మీడియాకి లంచ్ ఏర్పాటు చేసింది. తనను ఇన్నాళ్లుగా సపోర్ట్ చేస్తూ వచ్చిన తెలుగు సినీ మీడియాకి థాంక్స్ చెప్పేందుకే ఈ స్పెషల్ పార్టీ అని నభా సన్నిహితులు చెబుతున్నారు.