NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రేపు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో పాల్గొననున్న సీఎం..
మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సాక్షాత్తు సీఎం తమ ప్రాంతానికి వస్తుండటంతో మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతాయని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మూసీ నదిని శుద్ధి చేసి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ క్రమంలో మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొననున్నారు. రేపు ఉదయం 9 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం 11.30కు యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టనున్నారు. 1.30కి రోడ్డు మార్గంలో సంగెం వెళ్లి.. అక్కడి నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం – నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. అక్కడే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. అనంతరం హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం కానున్నారు.

 

మూసీ ప్రక్షాళన చేయాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిందే… నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుండి తీసుకువచ్చిన అభ్యంతరం లేదని తెలిపారు. ఒక్క ఇల్లు కూలగొట్టిన ఊరుకునేది లేదు.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రిటైనింగ్ వాల్ కట్టాలి.. సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి తెలిపారు. తాము కులగణనకు వ్యతిరేకం కాదని.. 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలని కోరారు. తన డీఎన్ఏ ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు.. ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ గెలువాలనే దృష్టిలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మరోవైపు.. మూసీ పరివాహక ప్రాంతంలో బస చేస్తాం.. ఒకరోజు అక్కడే నిద్ర చేస్తాం.. అక్కడ ఉంటున్న వాళ్ళ ఇళ్లలో ఉంటాం, అక్కడే తింటామని పేర్కొ్న్నారు. అలాగే.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బీజేపీ బృందాలు పర్యటిస్తాయని వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటినీ ఖతం చేస్తాం.. బీఆర్ఎస్ అవినీతి పై మోడీ స్వయంగా మాట్లాడారన్నారు. బీజేపీ లేకుండా తెలంగాణ రాజకీయాలు లేవని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి అశ్విని వైష్ణవ్ వస్తారన్నారు. ఫ్లై ఓవర్లు, ఇతర ఇష్యూల పై సీఎంకి లేఖ రాస్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

 

అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం.. మీడియా ద్వారా ప్రశ్నిస్తామని జగన్ ప్రకటన
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్‌ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు. 40 శాతం ఓట్లు వచ్చిన వారిని గుర్తించరా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే సభలో మైక్ ఇవ్వాలి.. సభా పక్ష నాయకుడికి, ప్రతి పక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. సమస్యలు చెప్పనీయకుండా ఉండటానికే ప్రతిపక్ష పార్టీని గుర్తించటం లేదన్నారు. మైక్ ఇస్తే ప్రభుత్వాన్ని ఎండగడతామని భయమని ఆయన అన్నారు. మైక్ ఇవ్వనపుడు అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం ఏమి ఉందని అన్నారు. మీడియా సమక్షంలో ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ సహా కొన్ని చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

 

డిప్యూటీ సీఎం పవన్‌పై జగన్‌ సంచలన వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి లా అండ్ ఆర్డర్ లేదని అనటం ఆశ్చర్యంగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ అన్నారు. దళిత మంత్రి మీద విమర్శలు చేసి ఊరుకున్నారని.. లా అండ్ ఆర్డర్ గురించి ప్రశ్నించాల్సింది చంద్రబాబుని అంటూ ఆయన పేర్కొన్నారు.చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదన్నారు. దళిత మహిళ కాబట్టి పడుతుంది అని పవన్ ఆమెపై విమర్శలు చేశారన్నారు. సొంత నియోజకవర్గంలో అత్యాచారం చేస్తే పవన్ ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. సినిమా డైలాగ్‌లు కొట్టమంటే మాత్రం పవన్ తోలు తీస్తా అని డైలాగ్‌లు కొడతారంటూ ఎద్దేవా చేశారు. డీజీపీ చట్టం వైపు, న్యాయం వైపు నిలబడాలన్నారు. డీజీపీకి మా ప్రభుత్వ హయంలో మంచి పదవి ఇచ్చామన్నారు. పదవి వ్యామోహంతో డీజీపీ ఇలా తయారయ్యాడని విమర్శించారు. డీజీపీ అధికార పార్టీ కార్యకర్తల మాదిరి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పోలీసులు సరిగా పనిచేస్తే అత్యాచారాలు, హత్యలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు.సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే రీతిలో వ్యవహరిస్తున్న పోలీసులు ప్రభుత్వం ఎప్పుడు ఇదే ఉండదు అని తెలుసుకోవాలన్నారు. పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామన హెచ్చరించారు. జమిలి గిమిలి అంటున్నారని.. అధికారం కూడా త్వరగా కోల్పోవచ్చని జగన్ జోస్యం చెప్పారు. లేకపోయినా నాలుగేళ్ల సమయం మాత్రమే ఉంటుందన్నారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రిటైర్ అయ్యాక కూడా పోలీసుల సంగతి కూడా చూస్తామన్నారు.సప్త సముద్రాల అవతల ఉన్నా పోలీసులను ఇక్కడకు పిలిపిస్తామన్నారు. చేసిన తప్పులను బయటకు తీసి చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. రెడ్ బుక్ పెట్టడం వాళ్లకు మాత్రమే తెలుసా.. రెడ్ బుక్ పెట్టడం పెద్ద విషయం కాదన్నారు. బాధితులు అందరూ రెడ్ బుక్ పెట్టుకుంటారన్నారు. వాళ్లు అందరూ వచ్చి నాకు వినతులు ఇస్తే చూస్తూ ఊరుకోనన్నారు.

 

సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా.. హోంమంత్రి సీరియస్
పులివెందుల ఎమ్మెల్యే నోటి నుంచీ వినకూడని మాటలు వస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. రాజకీయాలలో ఎవరున్నా.. మా కుటుంబ సభ్యులను సైతం నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారన్నారు. మేం ఏరోజూ మిమ్మల్ని అడ్డుకోలేదన్నారు. ఇప్పుడు మీ ఆఫీసుల మీద దాడులు జరగలేదే అంటూ జగన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. మాది ప్రజారంజక పరిపాలన.. 28 శాతం క్రైం రేట్ తగ్గిందన్నారు. రాజకీయ లబ్ధికోసం అభంశుభం తెలీని ఆడపిల్లల విషయంలో మాట్లాడొద్దన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులను పని చేయనివ్వలేదని విమర్శించారు. మేం చేస్తున్న అరెస్టులు తప్పు కాదని.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ప్రచారంపై ఉగ్రవాదుల కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడానికి వార్ రూం ఏర్పాటు చేస్తారట..భావ స్వేచ్ఛా ప్రకటనకి కూడా ఒక లిమిట్ ఉంటుందన్నారు. సోషల్ మీడియాను ఉగ్రవాదుల కంటే ఎక్కువగా తీసుకోవాలన్నారు. పేట్రేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడితే ఎవరినీ వదలమని హెచ్చరించారు. దీనికోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావడానికి సిద్ధమయ్యామని చెప్పారు. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసు తలెత్తుకు తిరిగేలా‌ చేస్తామన్నారు. ఎన్డీఏ కూటమిలో బరి తెగించే వాళ్ళు లేరన్నారు. నా మీద జాలి ఎందుకు కానీ… చాలామంది ఉన్నారు జాలి పడాల్సిన వారు ఉన్నారన్నారు. టీడీపీ వాళ్ళు పోస్టులు పెట్టినా కూడా వదలమన్న హోంమంత్రి.. మహిళ ఎవరైనా మహిళేనని స్పష్టం చేశారు.

 

అగ్రి గోల్డ్ కేసులో కీలక మలుపు.. పరిగణలోకి ఈడీ ఛార్జ్ షీట్‌
అగ్రి గోల్డ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ని నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తం 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. అలాగే.. 4,141 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, అండమాన్ నికోబార్‌లో ఆస్తులు అటాచ్ చేశారు. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్ పేర్లతో పాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపైనా ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. అగ్రి గోల్డ్ కేసులో 14 మందిని ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. 130 సెల్ కంపెనీల ద్వారా నిధులు బదలాయించినట్లు గుర్తించారు. అగ్రి గోల్డ్ డబ్బులను వెంకట రామారావు ఇతర ఖాతాలకు మళ్లించారు. మళ్లించిన నిధులతో పవర్, రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టారు. పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తున్నట్లుగా చూపెట్టి మోసం చేసింది అగ్రి గోల్డ్. కోట్ల రూపాయల డబ్బులను సొంత ఆస్తుల కోసం మళ్లించారు.

 

అసెంబ్లీకి పంపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేస్తా.. ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి హామీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓటర్లను దర్శనం చేసుకుంటున్నారు. ఇంకోవైపు అన్ని పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓట్లు కోసం అన్ని వర్గాలకు హామీలు ఇచ్చేస్తున్నారు. అయితే ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి మాత్రం మరో అడుగు ముందుకేసి.. తనను అసెంబ్లీకి పంపిస్తే.. పెళ్లికాని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు చేస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఈ వార్త వైరల్‌గా మారింది. శరద్ పవార్ పార్టీకి చెందిన అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గంలోని బ్రహ్మచారులందరికీ వివాహం జరిపిస్తానని హామీ ఇచ్చారు. యువకులందరికీ పెళ్లిళ్లు చేయడమే కాదు.. జీవనోపాధిని కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు కూడా కాలేదన్నారు. అందుకే తనను అసెంబ్లీకి పంపిస్తే.. బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసే బాధ్యత తనదేనన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తానని ప్రకటించారు. తన ప్రధాన ప్రత్యర్థి, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) పార్టీ నేత, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ధనుంజయ్‌ ముండేను విమర్శిస్తూ రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. 288 స్థానాలు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌ 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి, విపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమిలు నువ్వానేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈసారి అధికారం ఏ కూటమికి కట్టబెడతారో వేచి చూడాలి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి.

 

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. వైద్యురాలి కేసు బదిలీకి నిరాకరణ
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు పశ్చిమ బెంగాల్ కాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కేసు బదిలీకి న్యాయస్థానం నిరాకరించింది. ఈ సందర్భంగా పోలీసు, న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతోందని వ్యాఖ్యానించిన ఓ న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మందలించారు. కోర్టులో ‘క్యాంటీన్‌ కబుర్లు’ చెప్పొద్దని, అటువంటి జనరల్‌ స్టేట్‌మెంట్‌లు చేయొద్దని హెచ్చరించారు. ‘‘మణిపూర్ వంటి కేసుల్లో బదిలీ చేశాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమీ లేదు. కావున అటువంటి కేసు బదిలీ చేయలేం. ఇక ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఆరో స్టేటస్‌ రిపోర్టును మేం పరిశీలించాం. అయితే సీబీఐ విచారణ సమయంలో మేం కేసు స్టేటస్‌ పరిశీలనకు దూరంగా ఉన్నాం. నాలుగు వారాల తర్వాత అప్‌డేట్‌ అయిన కొత్త రిపోర్టును దాఖలు చేయనివ్వండి’ అని సీజేఐ పేర్కొన్నారు. ఇక.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది. ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా అత్యాచారానికి గురైంది. అనంతరం సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. విధులు బహిష్కరించిన నిరసనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత డాక్టర్లు విధుల్లో చేరారు.

 

షూటింగ్ లో నటుడికి తీవ్ర గాయాలు
నటుడు సునీల్ శెట్టి గాయపడ్డాడు. తన రాబోయే సిరీస్ హంటర్ సెట్స్‌లో షూటింగ్ సమయంలో విన్యాసాలు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. అయితే ఆయన పరిస్థితి గురించి సునీల్ శెట్టి స్వయంగా వెల్లడించారు. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని, నేను పూర్తిగా క్షేమంగా ఉన్నానని చెప్పాడు. డూప్ లేకుండా స్వంతంగా స్టంట్‌లు చేస్తాడని పేరున్న శెట్టి హంటర్ కోసం నలుగురైదుగురు స్టంట్ ఆర్టిస్టులతో హై-ఇంటెన్సిటీ ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ సన్నివేశంలో ఒక చెక్క లాగ్‌ను సపోర్టుగా ఉపయోగించారు, కానీ తప్పుగా కదలడంతో ఆ లాగ్ అనుకోకుండా నటుడి పక్కటెముకలను తాకింది. ఈ ఘటనలో సునీల్ శెట్టి గాయపడ్డాడు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తీవ్ర గాయాలయ్యాయి . ఇండియా టుడే కథనం ప్రకారం, “సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు, గాయాన్ని అంచనా వేయడానికి వైద్యులు, ఎక్స్-రే యంత్రాన్ని సెట్‌కు పిలిపించారు. శెట్టి ప్రస్తుతం చాలా నొప్పితో బాధ పడుతున్నారు. ముంబైలో షూటింగ్ ఇప్పుడు ఆగిపోయింది అని పేర్కొన్నారు. అయితే సునీల్ శెట్టి మాత్రం “చిన్న గాయమే అంతకు మించి ఏమీ లేదు, నేను పూర్తిగా బాగున్నా, తదుపరి షాట్‌కి సిద్ధంగా ఉన్నాను. అందరి ప్రేమ, సంరక్షణకు కృతజ్ఞతలు, వెబ్ సిరీస్ సెట్స్‌లో “చిన్న గాయం”తో బాధపడ్డాడు. తీవ్రమైన గాయంతో బాధపడుతున్నట్లు వచ్చిన నివేదికలను తోసిపుచ్చాడు. సునీల్ శెట్టి తదుపరి ‘వెల్‌కమ్ టు ది జంగిల్’లో కనిపించనున్నారు, ఇందులో అక్షయ్ కుమార్, దిశా పటానీ, పరేష్ రావల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లారా దత్తా, రవీనా టాండన్, అర్షద్ వార్సీ అలాగే శ్రేయాస్ తల్పాడే కూడా కనిపించనున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.