NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై సమీక్ష.. ఎస్‌ఈపై మంత్రి సీరియస్‌..
గోదావరి బేసిన్‌తో పాటు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు అన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.. దీనిపై అటు రైంతాంగంతో పాటు.. ఇటు ప్రభుత్వం పెద్దలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక, ఏపీలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు.. ప్రస్తుతం నీటి లభ్యత ఎక్కువగా ఉన్నందున కాల్వలకి నీటి విడుదలపై ఆరా తీశారు.. అయితే, కృష్ణా జిల్లా ఎస్ఈ ప్రసాద్ బాబుపై మంత్రి నిమ్మల అసహనం వ్యక్తం చేశారు.. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటి విడుదల విషయంలో ఎస్ఈ నిర్లక్ష్యంపై నిమ్మల సీరియస్‌ అయ్యారు.. ఎస్ఈ ప్రసాద్ బాబుని ఈఎన్సీ కార్యాలయానికి సరెండర్‌ చేయాలని మంత్రి నిమ్మల ఆదేశాలు జారీ చేశారు.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్ లలో జలకళ ఉందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. 20 ఏళ్లలో ఎన్నడూ లేనట్లు.. అన్ని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీటి మట్టాలు ఉన్నాయన్న ఆయన.. రాయలసీమకు సాగు, తాగు నీరు అందిస్తున్నాం. కృష్ణా డెల్టాలో కూడా నీటి విడుదల చేస్తున్నాం అన్నారు.. కాల్వలకు నీరు విడుదల చేస్తున్నాం. ముందుగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపుతున్నాం అని వివరించారు.. జగన్ ఐదేళ్ల కాలంలో కనీసం కాల్వలకు పూడికలు కూడా తీయలేదని విమర్శించారు.. ముందు కాల్వలు రిపేర్ల పనులు పూర్తి చేస్తామన్నారు.. ఇక, జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు పని లేకుండా పోయిందంటూ సెటైర్లు వేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.

గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేం.. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పవన్‌
ప్రజా యుద్ధనౌక గద్దర్‌ వర్ధంతి సందర్భంగా.. ఆయనతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. నేడు ప్రజా గాయకులు గద్దర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేం అన్నారు.. పీడిత వర్గాల గొంతుకగా గద్దర్ నిలిచారు. తన పాటనే అస్త్రంగా చేసుకొని గద్దర్ ప్రజా పోరాటాల్లో ఒక అధ్యాయాన్ని లిఖించారు. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు గద్దర్ తన గానంతో చైతన్యాన్ని రగిల్చారు. పాటనే తూటాలుగా మలచి – తను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రజల కష్టాలను తన రచనతో, తన గానంతో ఎలుగెత్తి చాటారు. బడుగు బలహీన వర్గాల కోసం గద్దర్ పోరాడారని గుర్తుచేశారు. తుది శ్వాస విడిచే వరకూ ప్రజా హక్కుల గురించే గద్దర్‌ ఆలోచించారని తెలిపారు పవన్‌.. ఈ సందర్భంగా గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. నెల్లూరు టౌన్ హాల్లో గద్దర్ గారిని తొలిసారి కలిసినప్పటి నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకూ ఆయనతో అనుబంధం కొనసాగిందన్నారు.. గద్దర్ అనే పేరు తలుచుకోగానే కాలికి గజ్జె కట్టి ఆడిపాడిన పాట గుర్తుకొస్తుందన్నారు.. అలాగే – ప్రజల గురించిన పాట బతికినంత కాలం గద్దర్ పేరు చిరంజీవిగానే ఉంటుందని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

వైసీపీకి షాక్‌.. జనసేన గూటికి వైసీపీ కార్పొరేటర్లు.. పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే కొన్ని మున్సిపాల్టీల్లో వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరారు కార్పొరేటర్లు.. దీంతో.. కొన్ని మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది టీడీపీ.. మరోవైపు.. విశాఖపట్నంలో ఈ రోజు వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆ ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌.. పార్టీ కండువా కప్పి.. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.. ఇక, ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్‌ కల్యాణ్‌.. ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలి జాయినింగ్‌గా పేర్కొన్న ఆయన.. గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొటుంటే కొత్తగా ఉందన్నారు.. వ్యక్తిగతంగా వైసీపీ మనకు శత్రువు కాదు.. కానీ, వైసీపీ విధానాలతోనే జనసేన విభేధిస్తోందన్నారు.. నాయకుడు తప్పు చేస్తే.. శిక్ష కార్యకర్తలకు పడుతుంది. రాజకీయంగా, అన్ని రకాలుగా జనసేన నేతలు, కార్యకర్తలు ఎదగాలనే నేను కోరుకుంటున్నాను అన్నారు.. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమి గెలవాలని కోరుకుంటున్నాను అన్నారు పవన్‌.. విశాఖ కాలుష్య నివారణపై కార్పొరేటర్లుగా మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి అని సూచించారు.. విశాఖలో త్వరలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం. త్వరలో విశాఖలో పర్యటిస్తాను. రియల్ ఎస్టేట్ సమస్యలు చాలా ఉన్నాయి. పేదలకు న్యాయం చేసేలా కొర్పొరేటర్లు పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..

ఇలాంటి ఘటనలతో ఏం సాధిస్తారు..? వైఎస్‌ జగన్‌ ఫైర్‌
ఇలాంటి ఘటనలతో ఏం సాధిస్తారు..? అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్‌ అయ్యారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకుడు శ్రీనివాసరావును పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వారు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. దాడులు చేసి ఏమి సాధిస్తున్నారో తెలియడం లేదన్న ఆయన.. ఇలాంటి కిరాతకాలు దారుణాలతో ప్రజలను ఎవరూ భయపడరు.. ఇదంతా ప్రజల్లో కోపంగా మారి టీడీపీని బంగాళాఖాతంలో కలిపేలా చేస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు గ్రాఫ్ చాలా వేగంగా పడిపోతుందన్నారు వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు పాలనపై ఫోకస్ పెట్టకుండా దాడులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుభరోసా ఎగరగొట్టారు.. బడులకు పోయే పిల్లలకు అమ్మఒడి ఇవ్వకుండా తల్లులను మోసం చేశారు.. 18ఏళ్లు నిండిన మహిళలలకు ఆర్థిక సాయం చేస్తామని ఇంకా ఇవ్వలేదు.. ఫీజు రీఎంబర్స్ మెంట్ , వసతి దీవెన బకాయిలు ఇంకా ఇవ్వలేదు.. మహిళలకు ఇవ్వాల్సిన సున్నావడ్డీ, మత్స్యకార భరోసా ఎగొట్టారు.. పథకాలు అమలు చేయకుండా స్కూళ్లు, చదువులు నిర్వీర్యం చేశారు అంటూ విమర్శలు గుప్పించారు.

యూరప్‌ ట్రిప్‌లో మాజీ మంత్రి రోజా..! వైరల్‌గా మారిన ఫొటోలు..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలయ్యింది.. ఇక, నగరి నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి రోజా.. ఫలితాల తర్వాత ఎక్కడా కనిపించడంలేదనే చర్చ సాగుతోంది.. అధికారంలో ఉన్న సమయంలో.. ఎవరినీ లెక్క చేయకపోవడం.. క్రమంగా తన వ్యతిరేకులను పెంచుకోవడమే ఆమె ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే, అధికారంలో ఉన్న సమయంలో గట్టిగా వాయస్‌ వినిపించే ఆమె.. ఆ తర్వాత సైలెంట్‌ మూడ్‌లోకి వెళ్లిపోయారు.. ఇదే సమయంలో రోజా ఎక్కడ? అనే చర్చ సాగుతుండగా.. వైసీపీ శ్రేణులతో టచ్‌లో కూడా లేరట.. అంతేకాదు.. చెన్నైకి మకాం మార్చిన ఆమె.. తమిళనాడులోని ఓ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులతో వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది..అయితే, ఇప్పుడు మాజీ మంత్రి రోజా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. జిల్లాల్లో సీరియస్‌ పాలిటిక్స్‌ నడుస్తోన్న సమయంలో.. కనీసం ఎవరితోనూ టచ్‌లో లేకుండా వెళ్లిపోయిన రోజా.. యూరప్‌ ట్రిప్‌లో ఎంజాయ్ చేశారట.. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ కావడమే కాదు.. ఆమె డ్రెసింగ్‌ స్టైల్‌పై కూడా ట్రోలింగ్స్‌ నడుస్తున్నాయి.. పారిన్‌ ట్రిప్‌కు వెళ్లడాన్ని తప్పుబట్టడంలేదు..! కానీ, కష్టసమయంలో మాకు అండగా ఉండరా? అని నిలదీస్తున్నారు.. కానీ.. రోజా విదేశీ పర్యటనకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ ఆడేసుకుంటున్నారు నెటిజిన్లు.. మరి ఆమె సీరియస్‌ పాలిటిక్స్‌కి దూరం అవుతారా? అనే చర్చ కూడా నడుస్తోంది.

అమెరికాలో రేవంత్‌ పర్యటన.. హైదరాబాద్‌లో మరిన్ని ఉద్యోగాలు
టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్‌లో పేరొందిన ఆర్సీసియం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికాలో పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీసియం సీఈవో గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆర్సీసియం మొదటిసారిగా హైదరాబాద్‌లో తమ ఆఫీసును విస్తరించనుంది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటి సారి. ప్రపంచ వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సీసియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది. ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్య స్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది.

ఆక్రమణలపై హైడ్రా కొరడా.. చెరువులో అక్రమ నిర్మాణాలు తొలగింపు
హైదరాబాద్‌లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది. ఆక్రమణల కూల్చివేత పనులను హైడ్రా మొదలు పెట్టింది. గాజులరామారం చెరువును ఆక్రమించి నిర్మించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజులరామారానికి సంబంధించిన చెరువుల్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం విజయవంతంగా తొలగించారు.చెరువుల పునరుద్దరణ చేయడంతో పాటు, నీటి వనరుల పరిరక్షణ, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజులరామారానికి సంబంధించిన బఫర్ జోన్‌తో సహా 44.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. చెరువు పుల్ ట్యాంక్ లెవెల్ (ఎల్. టి. ఎఫ్ ) పరిధిలో అక్రమంగా 52 నిర్మాణాలను చేపట్టడంతో ఈ నిర్మాణాలపై స్థానిక ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఎ. వి. రంగనాథ్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టడంతో వెలుగు చూసిన ఈ అక్రమ నిర్మాణాలపై హైడ్రా విభాగం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అధికారుల ఆదేశాల మేరకు ఆర్‌ఎఫ్‌వో పాపయ్య నేతృత్వంలో, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ బాల్ రెడ్డి, హైడ్రా విభాగం మార్షల్స్, డీఆర్‌ఎఫ్ బృందాలతో చెరువులోని అక్రమ నిర్మాణాలను పూర్తి తొలగించారు.

రాష్ట్రపతికి అరుదైన గౌరవం.. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్నారు. మూడు విదేశాల పర్యటనకు ఆమె వెళ్లారు. ప్రస్తుతంలో ఫిజీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీ’ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్‌ మైవలిలీ కటోనివేర్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ఎక్స్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి ముర్ము మాట్లాడారు.. ఫిజీని బలమైన. సంపన్నమైన దేశంగా మార్చేందుకు భారత్‌ అండగా నిలుస్తుందన్నారు. రెండు దేశాల ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. 10 ఏళ్ల క్రితం ఫిజీ పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలను గుర్తుచేశారు.

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ బురిడీ.. కేటుగాడు అరెస్ట్
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ ఓ కేటుగాడు అధికారులనే బురిడీ కొట్టించాడు. ఉద్యోగాల్లో పదోన్నతలు కల్పిస్తానంటూ మోసాలకు తెగబడ్డాడు. అతగాడి బండారం బయటపడడంతో నిందితుడు పుష్పేంద్ర దీక్షిత్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పుష్పేంద్ర దీక్షిత్ శర్మ పలువురు కేంద్రమంత్రులతో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి తాను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ కలరింగ్ ఇచ్చాడు. అతగాడి మాయలో పడ్డ ఉద్యోగులు పదోన్నతలు కల్పించాలంటూ కాసులు సమర్పించారు. అనంతరం మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని గ్రామమైన ఉదల్‌పటా టేకాన్‌పూర్‌లో పోలీసులు అతనిని పట్టుకున్నారు. పోలీసులు నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 8 వరకు రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే బదిలీల కోసం మోసగాడిని సంప్రదించినందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇద్దరు టీఐలను సస్పెండ్ చేశారు.

అఖిలపక్ష భేటీకి కేంద్రం ఆహ్వానించకపోవడంపై ఆప్ ఆగ్రహం
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ మినహా ఇండియా కూటమిలోని పార్టీలను కేంద్రం ఆహ్వానించింది. ఈ పరిణామాన్ని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ తప్పుపట్టారు. 13 మంది ఎంపీలు ఉండి… జాతీయ హోదా కలిగిన పార్టీని దేశ భద్రతకు సంబంధించిన సమావేశానికి ఆహ్వానించకపోడం నిరాశకు గురిచేసిందని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను గురించి విదేశాంగ మంత్రి జైశంకర్‌ రాజ్యసభలో తెలియజేశారన్నారు. ఈ విషయంలో మేం ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలనుకున్నామని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని… అలాంటి కార్యక్రమానికి ఆప్‌ను ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ప్రధానికి ఇష్టమైన పార్టీలకు సంబంధించిన అంశం కాదన్నారు. తమను ఎందుకు ఆహ్వానించలేదో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రధానికి తమ పార్టీ నచ్చకపోయినంత మాత్రన సమావేశానికి పిలవకపోవడం సరికాదని ఆప్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే సమావేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాలస్వామి, తదితరులు హాజరయ్యారు.

మను భాకర్‌ను సత్కరించిన నీతా అంబానీ..
పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించగా, మూడింటికి కాంస్యం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌తో కలిసి మను, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాలను సాధించారు. కాగా.. రెండు పతకాలు సాధించిన మను భాకర్ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ సత్కరించారు. మంగళవారం పారిస్‌లోని ఇండియన్‌ హౌస్‌లో ఆమె మనును సన్మానించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. గతవారం పారిస్‌లో హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువతి చరిత్ర సృష్టించి తన కలలు, అభిరుచి, శ్రమ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిందని తెలిపారు. మను విజయాల ద్వారా ప్రతి భారతీయుడు స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రతి అమ్మాయి ఈ విజయాల ద్వారా శక్తిని పొందినట్లు అనిపిస్తుందని చెప్పారు. మూడేళ్ల తర్వాత క్రీడల్లో తన భవితవ్యాన్నే కాకుండా దేశ భవితవ్యాన్నే మార్చేసిందని మను భాకర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. మరోవైపు.. పారిస్‌ ఒలింపిక్స్లో స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయిన ప్రతి క్రీడాకారులను నీతా సత్కరించింది. వారిలో లోవ్లినా బోర్గోహైన్, నిశాంత్ దేవ్ కూడా ఉన్నారు. లోవ్లినా, నిశాంత్ బాక్సింగ్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే..

పారిస్ ఒలింపిక్స్‌లో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు..
2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. చాప కింద నీరులా క్రీడాకారులకు, ఇతరులకు ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయని, అన్ని దేశాలు తమ ప్రతిస్పందన చర్యలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని WHO నొక్కి చెప్పింది. పారిస్ గేమ్స్‌లో ఇప్పటికే ప్రముఖ క్రీడాకారులు కోవిడ్ బారిన పడ్డారు. బ్రిటీష్ స్మిమ్మర్ ఆడమ్ పీటి 100 మీటర్ల విభాగంలో రజతం సాధించిన తర్వాతి రోజు అనారోగ్యం బారిన పడ్డాడు. పరీక్షలు నిర్వమించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆస్ట్రేలియా ప్లేయర్ లానీ పల్లీస్టర్ అనారోగ్యంతో గేమ్స్‌ నుంచి నిష్ర్కమించింది. అయితే, ఒలింపిక్స్ సహా ఇటీవలి కాలంలో సీజన్‌తో సంబంధం లేకుండా చాలా దేశాలు కోవిడ్ -19 యొక్క ఉప్పెనలను ఎదుర్కొన్నాయి.

నాకు అవార్డు ఇప్పించండి ప్లీజ్!!!
ఈ మధ్యకాలంలో కొన్ని సినిమా అవార్డులను ప్రకటించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అవార్డులు అందుకున్న వారందరూ ఆనందోత్సాహాలతో మునిగిపోతున్నారు. ఇవేమీ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాదు కానీ మంచి ప్రతిష్టాత్మక అవార్డులుగా పేరు ఉండడంతో వాళ్లంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక తెలుగు సినిమా హీరో మాత్రం ఈ అవార్డుల కారణంగా వార్తల్లోకి ఎక్కాడు. ఈ అవార్డులు ఎలా ఇస్తారు అసలు నామినేషన్స్ లోకి ఎలా వెళ్లాలి అనే విషయం తెలుసుకునేందుకు ఆయన అనేక మందికి ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది .ముఖ్యంగా చాలామంది ప్రొడక్షన్ మేనేజర్లకు కూడా కాల్ చేసి ఈ ప్రాసెస్ ఏమిటో తనకు తెలియచెప్పాలని కోరినట్లుగా తెలుస్తోంది. అంతేకాక తన పేరు నామినేషన్స్ లోకి వెళ్లడమే కాదు కచ్చితంగా అవార్డు వచ్చేలాగా ఏదో ఒకటి చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్లలో ఏ ఫోన్ ఫలించిందో తెలియదు గానీ మొత్తానికి ఒక అవార్డుల లిస్ట్ లో నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన హైదరాబాదులో లేడు త్వరలో హైదరాబాద్ వచ్చే అవకాశం కూడా లేదు. కానీ ఒకవేళ హైదరాబాద్లో అవార్డులు ఇచ్చే అవకాశం ఉంటే కూడా వెంటనే వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. సదరు హీరో ఇప్పుడిప్పుడే మీడియాలో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు. అయన సినిమాల్లో కొన్ని హిట్లు ఉన్నాయి, అదే విధంగా ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఎలాగైనా టాలీవుడ్ లో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే అతను సాధారణ హీరో ఏమీ కాదు. మంచి టాలెంట్ ఉన్న నటుడే. ఏదో ఒకరోజు అవార్డు కొడతాడు కానీ ఇప్పుడే అవార్డు కోసం పాకులాడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సంకేతాలు బయటికి వెళితే అది లాంగ్ రన్ లో ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పొచ్చు.

కమల్ హాసన్ బిగ్ బాస్ నుండి బయటకు రావడానికి అసలు కారణం అదా?
విశ్వనటుడు కమల్ హాసన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, మాటల రచయితగా, నృత్య దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ 2017లో అదే పేరుతో తమిళంలో ప్రారంభమైంది. ఇందులో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా రంగంలోకి దిగారు. ఈ షోను కొత్త కోణంలో చూడాలని కమల్ హాసన్ తన మాటలతోనే ఈ సమస్యకు ముగింపు పలికారు. అదేవిధంగా వారంలో ఐదు రోజులు షో కాస్త మందకొడిగా సాగినా, కమల్ హాసన్ ఎంట్రీతో టీవీలో శని, ఆదివారాల్లో బిగ్ బాస్ టీఆర్పీలు దూసుకుపోయేవి. గత ఏడేళ్లుగా విజయవంతంగా హోస్ట్ చేసిన షో నుంచి ఇప్పుడు తప్పుకుంటున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. గత సీజన్‌లో కమల్‌హాసన్‌పై వచ్చిన విమర్శల వలనే ఆయన తప్పుకుంటున్నారు అనే చర్చ జరుగుతోంది. గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7లో ప్రదీప్ ఆంటోనీ కంటెస్టెంట్‌లలో ఒకరు. కొంత నత్తిగా ఆట ఆడినా, గేమ్‌లో నిజాయితీగా ఉన్నాడు. అయితే అతడిని ఎలాగైనా ఎలిమినేట్ చేయించాలని చూసిన కొందరు కంటెస్టెంట్ల ప్లాన్ ఫలించింది. ప్రదీప్ పై వచ్చిన ఆరోపణలను సరిగ్గా విచారించకుండా.. మహిళలకు రక్షణ లేదంటూ కొందరు చెప్పిన నీచమైన మాటలు నమ్మి కమల్ హాసన్ ప్రదీప్ ఆంటోనీకి రెడ్ కార్డ్ ఇచ్చారు. ఈ విషయాన్ని తర్వాత దాచడానికి కమల్ చాలా కారణాలు చెబుతున్నప్పటికీ బిగ్ బాస్ షోలో కమల్ హాసన్ జడ్జ్మెంట్ గురించి తమిళంలో పెద్ద చర్చే జరిగింది. ప్రదీప్‌ ఆంటోనీకి అన్యాయం చేసినట్టు అక్కడ చాలా మంది నమ్మారు. నిజానికి గత ఆరు సీజన్లలో లేదు కానీ ఏడో సీజన్‌లో కమల్ హాసన్ రకరకాల విమర్శలను ఎదుర్కొన్నాడు. కమల్ హాసన్ బిగ్ బాస్ నుంచి తప్పుకోవడానికి ఇదే కారణమా? అని కొందరు సందేహాస్పద ప్రశ్నలు వేస్తున్నారు. కానీ కమల్ హాసన్ తన సినిమాల కారణంగా షో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.