NTV Telugu Site icon

Top Headlines @ 9PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు కేంద్ర మంత్రి గ్రీన్‌సిగ్నల్!
విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్‌కు కూడా నితిన్‌ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. యన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు కూడా ఫ్లైఓవర్‌కు అనుమతి లభించినట్లు తెలిపారు. వీటన్నింటిపై తగిన ఆదేశాలు త్వరలోనే ఇస్తామని చెప్పారని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు ఆరుగురు కేంద్ర మంత్రులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అంశంపై మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ అంశాలను త్వరగా పూర్తిచేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, 16 ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియా, మనోహర్ లాల్ కట్టర్, హర్దీప్ సింగ్ పూరీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు.

 

తెలంగాణ నిఘా విభాగాల‌కు నిధులు కేటాయించండి.. అమిత్ షాకు సీఎం విన‌తి
రాష్ట్ర స్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్‌), తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునీక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రిని ఆయ‌న నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం క‌లిశారు. సుమారు గంట‌పాటు కొన‌సాగిన భేటీలో వివిధ అంశాల‌ను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. భేటీలో ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క పాల్గొన్నారు. డ్రగ్స్ మరియు సైబర్ నేరాల‌ నియంత్రణ‌తో పాటు అరికట్టడానికి కావ‌ల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, ప‌రిక‌రాల‌ కొనుగోలు కోసం టీజీ న్యాబ్‌కు రూ.88 కోట్లు, టీజీ సీఎస్‌బీకి రూ.90 కోట్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయడం తప్పనిసర‌ని, తెలంగాణ‌కు సంబంధించి 2016లో మొదటి సారి సమీక్ష నిర్వహించార‌ని, నాటి నుంచి స‌మీక్ష చేయ‌నుందున వెంట‌నే స‌మీక్ష చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించార‌ని, కొత్త రాష్ట్ర అవసరాలకు ఐపీఎస్‌లు సరిపోనందున‌, తెలంగాణ‌కు అద‌నంగా మరో 29 ఐపీఎస్‌ పోస్టులు కేటాయించాల‌ని విజ్ఙప్తి చేశారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌హారాష్ట్రల్లో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేసిన విష‌యాన్ని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే విధమైన క్యాంపులను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంద‌న్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా గ‌తంలో ఉండి తొల‌గించిన మూడు జిల్లాల‌ను ఎస్ఆర్ఈ కింద‌ (భ‌ద్రతాప‌ర‌మైన వ్యయం, చెల్లింపులు) తిరిగి కొన‌సాగించాల‌ని కోరారు. సరిహద్దు రాష్ట్రాలతో విశాల‌మైన సరిహద్దు ఉండటంతో తెలంగాణ భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణిచి వేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో  సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఛత్తీస్ గ‌ఢ్ సరిహద్దుల్లోని కర్రె గుట్టల కొండ‌ల్లో ఉన్న అనుకూల‌త‌ను ఆస‌రాగా చేసుకొని సీపీఐ మావోయిస్టు కమిటీ ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి త‌మ ప్రాబ్యల విస్తర‌ణ‌కు ప్రయ‌త్నిస్తోంద‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టు ప్రత్యేక దళం కద‌లికల నియంత్రణ‌తో పాటు నిర్మూల‌న‌కు జేటీఎఫ్ క్యాంపులు ఉపయోగపడ‌తాయ‌ని తెలిపారు. ఎస్పీవోల‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్ లో ఉంద‌ని, ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాల‌ని కోరారు.  మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఎస్పీవోల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే చేర్చుకోవాలనే నిబంధన స‌మాచారం చేర‌వేత‌కు ఇబ్బందిగా ఉంద‌న్నారు. 1065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి నిబంధనలు స‌డ‌లించాలని కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులు అందుబాటులో లేర‌ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పునర్విభజన సమస్యల పరిష్కారానికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ 9లోని (చ‌ట్టంలోని 53, 68, 71 సెక్షన్ల ప్రకారం) ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ ప‌దిలోని సంస్థల వివాదం (చ‌ట్టంలోని 75 సెక్షన్ ప్రకారం) సామ‌ర‌స్యపూర్వకంగా ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని కోరారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు,సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున‌, అందులో తెలంగాణ‌కు న్యాయం జ‌రిగేలా చొర‌వ చూపాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

 

సమాజ క్షేమం కోసం పవన్ కళ్యాణ్ సూర్యారాధన
విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికి ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధాన ఆచరిస్తున్నారని ఆయన టీం వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు, ఇందులో భాగంగా సూర్యారాధన చేశారు. దీక్షా బద్ధుడైన పవన్ కళ్యాణ్ ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు. వేద మంత్రోక్త సూర్య నమస్కార ప్రకరణం గావించారు. పవన్ కళ్యాణ్ నిత్యం సూర్య నమస్కారాలు చేసేవారు కానీ వెన్ను సంబంధిత ఇబ్బందితో కొద్ది కాలంగా సూర్య నమస్కారాలు చేయడం సాధ్యం కావడం లేదు. అందుకు ప్రతిగా సూర్య నమస్కారాలకు సంబంధించిన మంత్ర సహిత ఆరాధనను నిర్వర్తించారని తెలుస్తోంది. బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయింది కానీ మన సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉంది. రవి వారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారు, అందుకే ఆదివారాన్ని కృషి వారం అని కూడా అనవచ్చని వేద పండితులు తెలిపారు. వారాహి దీక్ష, సూర్యారాధనలు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

 

అందుకే ఓడిపోయాం.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్ట్‌ అయ్యి.. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్‌లో కలిసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 307 సెక్షన్ కింద కేసు పెట్టారు.. అన్యాయంగా జైల్లో నిర్బంధించారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దొంగ కేసులు పెడుతున్నారు.. వాళ్లే దాడి చేసి వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు.. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏం చేశాడు.. కులం మతం ప్రాంతం చూడలేదు.. ఏ పార్టీకి ఓటు వేశారు అనే విషయాన్ని కూడా చూడకుండా అందరికీ ప్రభుత్వ పథకాలను ఇంటికి అందించామని గుర్తుచేసుకున్నారు. అయితే, ఈరోజు టీడీపీకి ఓటు వేయలేదని మనుషులను కొట్టి కేసులు పెడుతున్నారు.. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు.. వైయస్సార్ విగ్రహాలను పగలగొడుతున్నారు.. ఈ విధంగా దౌర్జన్యాలు చేసి తప్పుడు కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు వైఎస్ జగన్.. ఇలానే పరిస్థితి కొనసాగితే చంద్రబాబుకు బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు.. ప్రజలు ఎందుకు ఓటు వేశారు చంద్రబాబు ఆలోచించాలన్న ఆయన.. ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదు.. ప్రజలకు మంచి చేసిన ఓడిపోయాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మోసపూరిత హామీలను ఇచ్చారు.. అందువల్లే 10 శాతం ఓట్లు ఆయనకు అధనంగా వచ్చాయి అన్నారు జగన్.. ఇక, రైతులకు భరోసా ఇస్తామని చెప్పారు.. ఇంతవరకు అతీగతి తెలియదు.. ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తానని చెప్పారు.. తల్లికి వందనం అని పేరు మార్చారు.. కానీ, ఆ డబ్బులు ఏమయ్యాయి? అని నిలదీశారు. 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు 15 వందల ఆర్థిక సాయం చేస్తామన్నారు.. వీటి మీద దృష్టి పెట్టే పని చంద్రబాబు చేయాలి.. ఇవేవి పట్టించుకోకుండా భయాందోళనలకు గురిచేస్తున్నారు అని ఆరోపించారు జగన్.. కారంపూడిలో ఘటన ఎన్నికలు జరిగిన మరుసటి రోజు జరిగింది.. డీఎస్పీ అనుమతి తీసుకుని దళిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెళ్లారు.. మే 14న ఘటన జరిగితే తొమ్మిది రోజుల తర్వాత రామకృష్ణారెడ్డి పై హత్యాయత్నం కేసు పెట్టారు.. ఒక పథకం ప్రకారమే కేసులు పెట్టారు.. ఎన్నికల రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వద్ద జరిగిన ఘటన కేసు పెట్టారని.. దళితులను ఓటు వేయకుండా అడ్డుకున్నారు.. దాన్ని ప్రశ్నించేందుకు పిన్నెల్లి వెళ్లారు.. దానిపై కేసు పెట్టారని విమర్శించారు. సిట్ నివేదికలో ఏం జరిగిందో చెప్పలేదని ఫైర్‌ అయ్యారు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గెలిచారు.. మంచివాడు కాబట్టే కాదా? ఆయన విజయం సాధించింది..? అలాంటి వ్యక్తిని తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంతవరకూ ధర్మం? అని ప్రశ్నించారు. ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరు.. చంద్రబాబు పాపంపండుతుంది.. ప్రజల బుద్ధి చెప్పే రోజులు వస్తాయి.. ఇదే మాదిరిగా కొనసాగితే ఇప్పుడు కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుంది.. ఈ రోజు ఏమైతా విత్తనం వేస్తావో అదే పండుతుంది.. చంద్రబాబు ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

 

ఆకస్మిక తనిఖీ.. అధికారులను ఏకిపారేసిన మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీన్ని ఆఫీస్ అంటారా..? ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు..? అంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ దుస్థితి ఇలా ఉందని అధికారులను నిలదీశారు మంత్రి శ్రీధర్ బాబు. మూడు నెలల్లో ఆఫీస్ మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ పాత ఫైళ్లను డిజిటలైజేషన్ చేసి, ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్‌పై న్యాయమైన రిపోర్ట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రిపోర్ట్‌పై ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం జరిగిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రిగా తాను, అధికారులుగా మీరు ఎలాంటి ఆఫీసు వాతావరణంలో కూర్చొని పని చేస్తున్నామో.. ప్రతి ఉద్యోగి కూడా అదే వాతావరణంలో కూర్చొని పని చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. కాగా.. ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ లో పర్యటించారు. హనుమకొండలో ఐటీ కంపెనీని ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. నిర్ధేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నిన్న ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

 

ఆస్పత్రి నుంచి ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్
బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి అద్వానీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 96 ఏళ్ల అద్వానీ వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరినప్పుడు టెస్టులు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు. ఇక బుధవారం మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం కుదటపడడంతో గురువారం సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్లు అపోలో ఆస్పత్రి పేర్కొంది.

 

ఉక్రెయిన్‌లోని మరో కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా..
నెలల తరబడి ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా దళాలు చివరకు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని చాసివ్ యార్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ నగరం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. బుధవారం రాత్రి నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా తెలిపింది. ఈ విధంగా దాదాపు 29 నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ మరో నగరాన్ని కోల్పోయింది. ఈ యుద్ధంలో, రష్యా ఇప్పటివరకు ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతానికి పైగా ఆక్రమించింది. రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్న చాసివ్ యార్ నగరం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో, ఉక్రెయిన్‌లోని రెండు ముఖ్యమైన నగరాలను – క్రామాటోర్స్క్, స్లోవియన్స్క్‌లను స్వాధీనం చేసుకోవడం రష్యాకు సులభం అవుతుంది. తమ భద్రత కోసం సైన్యాన్ని ఉపసంహరించుకోవడం మంచిదని, అందుకే చాసివ్ యార్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. రష్యా అనుకూల ఉక్రేనియన్ తిరుగుబాటుదారులు 2014 నుంచి దొనేత్సక్‌లోని భాగాలను నియంత్రించారు. ఫిబ్రవరి 2022 లో ప్రారంభమైన యుద్ధం తరువాత, రష్యా సైన్యం ఈ ప్రావిన్స్‌లో తన ఆక్రమణను పెంచుకుంది. కాగా.. తమ సైన్యంలోని 14 బ్రిగేడ్‌ల వద్ద పోరాడేందుకు సరిపడా ఆయుధాలు లేవని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. దీని వల్ల రష్యా లాభపడుతోంది. తమ ఎస్-350 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాశ్చాత్య దేశాల క్షిపణులను గుర్తించి వాటిని ఆకాశంలో ధ్వంసం చేయగలదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యవస్థ పాశ్చాత్య దేశాల బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులను ఓడించగలదని తెలిపింది. దీనితో పాటు, ఈ వ్యవస్థ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, 16 అంగుళాల వెడల్పు గల ఆయుధాల దాడులను కూడా అడ్డుకుంటుంది.

 

ముంబై ఎయిర్ పోర్టులో టీమిండియాకు అరుదైన గౌరవం..
టీ20 క్రికెట్ ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియాకు దేశం ఘనంగా స్వాగతం పలుకుతోంది. ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే భారత క్రికెట్ జట్టు విమానానికి వాటర్ క్యానన్ సెల్యూట్‌తో స్వాగతం పలికారు. భారత్‌లో ఒక బృందానికి వాటర్‌ ఫిరంగులతో స్వాగతం పలకడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఈ సంప్రదాయం కొత్త విమానాలను స్వాగతించడానికి లేదా కొత్త విమానాశ్రయంలో మొదటి విమాన సర్వీసులో మాత్రమే ఉపయోగించబడింది. కొన్ని చోట్ల.. ఎయిర్‌లైన్‌తో అనుబంధించబడిన వ్యక్తుల ప్రత్యేక విజయాలకు ఈ రకమైన స్వాగతం లభించింది. కానీ ఏవియేషన్ సర్వీస్‌తో పాటు, రోహిత్ శర్మ బృందానికి స్వాగతం పలికిన విధానం, భారతదేశంలోని ఏ ప్రధాన మంత్రికి లేదా ముఖ్యమంత్రికి ఇంతటి స్వాగతం లభించలేదు. కాగా.. బార్బడోస్ నుంచి ఢిల్లీకి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్న ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు గ్రాండ్ రోడ్‌షో నిర్వహించారు. విక్టరీ పరేడ్ కోసం లక్షలాది మంది ప్రజలు ముంబై వీధుల్లోకి వచ్చారు. టీమ్ ఇండియాతో కూడిన విస్తారా ప్రత్యేక విమానం ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే, ఆటగాళ్లకు ఇరువైపుల నుంచి విమానంపై నీటి జల్లులు కురిపించి స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ముంబైలో విక్రోరీ ర్యాలీ కొనసాగుతోంది. ఈ ర్యాలీకి లక్షల సంఖ్యలో జనాలు హాజరయ్యారు. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు తండోపతండాలుగా తరలి వచ్చారు. దీంతో మహానగరంలోని రోడ్లు రద్దీగా మారాయి.

 

సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డి కండిషన్స్.. ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు తాజాగా కీలక సూచనలు చేశారు. పోలీస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు ప్రకటించారు. సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలన్న ఆయన వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాకు ముందు డిస్క్లెయిమర్స్ ప్రదర్శించాలని పేర్కొన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై అవగాహన కల్పించడం లేదు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ట ఎవరైతే టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ ప్రభుత్వం వద్దకు వస్తారో వారి నుంచి ఆ సినిమాలో నటించిన స్టార్ల చేత డ్రగ్స్ అవగాహన వీడియో చేయించి రిలీజ్ చేయించాలని అప్పుడే రేటు పెంచుకునే అవకాశం కల్పించేలా ఒక ప్రీ కండిషన్ పెడుతున్నట్టు ఆయన ప్రకటించారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పై సినిమా కు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియోతో అవగాహాన కల్పించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదన్న రేవంత్ రెడ్డి అలాంటి నిర్మాతలకు , డైరెక్టర్ లకు , తారాగణంకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవన్నారు. ఇక తాజాగా ఈ అంశం మీద ఫిలిం ఛాంబర్ స్పందించింది. రేవంత్ రెడ్డిని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు ఇటీవల కలిసినప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలపై సానుకూలంగా స్పందించారని అన్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ పై సినీ రంగ ప్రముఖులు, సినిమా థియేటర్ యాజమాన్యాలు తమవంతుగా భాగం పంచుకోవాలని అన్నారని, లోగడ ఇటువంటి విషయాలలో చలన చిత్ర పరిశ్రమ ముందుండి ప్రభుత్వానికి అండగా ఉందని తెలియజేయుచున్నామని అన్నారు. ఈ విషయం పై చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు మరియు థియేటర్స్ యాజమాన్యాలు డ్రగ్స్ మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి తమవంతు భాధ్యత నిర్వర్తించడానికి ఇకపైన కూడా ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటారని ప్రకటించారు. దీనిపై అతి త్వరలో ముఖ్యమంత్రిని కలవగలమని అంటూ అధ్యక్షుడు దిల్ రాజు సహా కార్యదర్శులు కె. ఎల్. దామోదర్ ప్రసాద్, కె. శివప్రసాద రావుల పేరుతో ఒక లేఖను రిలీజ్ చేశారు.