NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. రూ.4,400 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
జులై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గత మూడు నెలల ముందే నుంచే పెంచిన పెన్షన్‌తో పాటు.. జులై నెల పెన్షన్‌ కూడా కలిపి ఒకేసారి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.. దీని కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లతో ఈ రోజు వీడియో కార్ఫరెన్స్‌ నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌.. పెన్షన్ల పంపిణీ నిమిత్తం రూ. 4,400 కోట్ల విడుదల చేసినట్టు వెల్లడించారు.. జులై 1వ తేదీన 65.18 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ఫించన్లు పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు.. ఫించన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.. జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు.. పెన్షన్ల పంపిణీపై గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై 1వ తేదీన 90 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన డబ్బులను ఇవాళ రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని సూచించారు సీఎస్.

పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు.. ఎక్కడంటే..?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జులై 1వ తేదీన (సోమవారం) పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది.. ఇప్పటికే పింఛన్ల పంపిణీకి సర్వం ఏర్పాటు చేసింది.. నిధులను విడుదల చేయడంతో.. రేపు ఆదివారం కావడం.. సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ మొదలుకానుండడంతో.. బ్యాంకుల నుంచి డబ్బులను కూడా డ్రా చేసిపెట్టుకున్నారు.. ఎన్నికల హామీని నిలబెట్టుకుని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పింఛన్లు పంపిణీ చేస్తుండడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జులై 1వ తేదీ పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందులో భాగంగా స్వయంగా సీఎం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ పింఛన్ల పంపినీ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.

హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేవారు.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు సన్మాన సభ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. రెడ్ బుక్ నాకన్నా, అయ్యన్న వద్ద ఉంటేనే బావుండేది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అయితే, అయ్యన్నపాత్రుడు స్పీకర్ అనేసరికి నాకు మొదట గుర్తించింది జగనే అని వ్యాఖ్యానించారు.. అయ్యన్న అంటే భయమో..? ఏమో..? తెలియదు.. కానీ స్పీకర్ గా ప్రకటించినప్పటినుంచి జగన్‌ శాసనసభకు రాలేదు అని ఎద్దేవా చేశారు.. ఇక, స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడును భిక్ష అడిగితే గాని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి వచ్చింది.. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టుగా అభివర్ణించారు.. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు అయ్యన్నకు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూశారు… ఆరడుగుల స్థలం కోసం వందల మంది పోలీసుల్ని గోడలు దూకించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.

మాది ఉద్యోగస్తుల ఫ్లెండ్రీ సర్కార్.. పథకాలు ప్రజలకు అందడంలో వారే కీలకం
మాది ఉద్యోగస్తుల ఫ్లెండ్రీ సర్కార్‌.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో వారిదే కీలక పాత్ర అన్నారు రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం జులై 1వ తేదీన ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి.. సాయంత్రం 5 గంటల కల్లా పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు.. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఉద్యోగస్తులు సహకరించాలని కోరారు.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు, ఇప్పుడు ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీ గానే ఉంటుందని.. దానికి తగినట్టు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అందజేయడంలో ఉద్యోగస్తులు కీలకంగా పని చేయాలని సూచించారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.

వరంగల్‌ పర్యటనలో అధికారులపై సీఎం రేవంత్‌ ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు సీఎం రేవంత్‌. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని రేవంత్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమెంటని ఆయన మండిపడ్డారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి. అయితే.. ఇదిలా ఉంటే.. వరంగల్ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్న సీఎం.. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

కెనాల్ పనులను రైతులు అడ్డుకోవద్దు మీ కాళ్లు పట్టుకుంటా
ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలం ఇమామ్ నగర్ వద్ద సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పరిశీలించారు. కెనాల్ పనులను పరిశీలించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు బైక్ పై ప్రయాణించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. కెనాల్ పనులను రైతులు అడ్డుకోవద్దు మీ కాళ్లు పట్టుకుంటా అని ఆయన అన్నారు. సీతారామ కాలవ త్రవ్వటానికి 100 ఎకరాలు రైతులు ఇవ్వండని ఆయన కోరారు. లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని, రైతులకు మెరుగైన ప్యాకేజీని అందిస్తామన్నారు మంత్రి తుమ్మల. మీరు చేసిన సహాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. అంతేకాకుండా.. కెనాల్ పనులు నెల రోజుల్లో పూర్తి కావాలని, కెనాల్ పనులు పూర్తయ్యే వరకు అధికారులు రాత్రింబవళ్లు కష్టపడాలన్నారు. నేను ఏ రాత్రి అయినా పనులు పరిశీలనకి వస్తా అని ఆయన అన్నారు. ఆగస్టు 15 కల్లా పనులు పూర్తి కావాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే ప్రారంభిస్తామన్నారు.

ముస్లిం విద్యార్థుల ఫలితాలు నిలిపివేత.. కారణమేంటంటే..!
శ్రీలంకలో 70 మంది ముస్లిం విద్యార్థుల ఫలితాలను పరీక్షల విభాగం వారు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హిజాబ్ కారణంగా ఫలితాలు నిలిపివేసినట్లు వెల్లడించింది. పరీక్ష సమయంలో చెవులకు హిజాబ్‌లు ధరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ట్రింకోమలీలో ఉన్న కళాశాల నిబంధనల ప్రకారం.. పరీక్షల సమయంలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు విద్యార్థులు చెవులు మూసుకుపోకుండా చూసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చారు. దీంతో ఫలితాలు ఆపేసింది. విచారణ తర్వాత విద్యార్థుల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ చర్యను ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు ఖండించాయి.

జులైలో అమల్లోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే..
ప్రతీ నెల కొత్త కొత్త రూల్‌ వస్తూనే ఉన్నాయి.. వాటిలో బ్యాంకులకు లింక్‌ ఉన్నవి కచ్చితంగా ఉంటున్నాయి.. ఇక, రేపటితో జూన్‌ నెల ముగియనుండగా.. సోమవారం నుంచి జులై నెల ప్రారంభం కాబోతోంది.. ఇదే సమయంలో.. కూడా కొన్ని కొత్త రూల్స్‌ రాబోతున్నాయి.. ముఖ్యంగా.. పెద్ద బ్యాంకుల ప్రధాన క్రెడిట్ కార్డ్ నియమ, నిబంధనలు మారబోతున్నాయి.. వాటిలో, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంక్‌లకు సంబంధించిన కార్డులు ఉన్నరాయి.. ఇలా అనేక పెద్ద బ్యాంకులు కస్టమర్లకు అందించే తమ క్రెడిట్ కార్డ్ సేవలలో పెద్ద మార్పులు చేశాయి. మార్పులలో క్రెడిట్ రివార్డ్ పాయింట్లు, నిలిపివేయబడే ఛార్జీలు, రివార్డ్ పాయింట్ ప్రయోజనాలు, కార్డ్‌ల విలువ తగ్గింపు లాంటివి.. ఇక, జులైలో అమల్లోకి వచ్చే పెద్ద బ్యాంకుల ముఖ్యమైన క్రెడిట్ కార్డ్ సంబంధిత మార్పులను పరిశీలిస్తే.. ఎబ్బీఐ క్రెడిట్ కార్డ్ 2024 జులై 1 నుండి నిర్దిష్ట క్రెడిట్ కార్డ్‌లకు ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. జులై 15 నుండి అమలులోకి వచ్చే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు వర్తించవని ఎబ్బీఐ క్రెడిట్ వెబ్‌సైట్ లో పేర్కొంది.. అంటే.. వచ్చే నెల 15 నుండి ప్రభుత్వ లావాదేవీలకు 22 రకాల క్రెడిట్ కార్డ్‌లపై రివార్డ్ పాయింట్లు వర్తించవు అన్నమాట..

జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
ఈ రోజుల్లో చాలా వరకు బ్యాంకింగ్ పనులు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. బ్యాంక్ మొబైల్ యాప్‌లో అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పటికీ రుణం తీసుకోవడం వంటి అనేక పనులు ఉన్నాయి, దీని కోసం బ్యాంకు శాఖకు వెళ్లాలి. అయితే బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లి మూసి ఉంటే? మీ పని ఆగిపోతుంది. మీ సమయం కూడా వృధా అవుతుంది. దీన్ని నివారించడానికి, మీ బ్యాంక్ ఎప్పుడు మూసివేయబడుతుందో మీరు ముందుగానే తెలుసుకోవాలి. నెలలో ప్రతి ఆదివారం, రెండవ, నాల్గవ శనివారం బ్యాంకులకు సెలవు. జులై నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. జూలైలో బ్యాంకులు ఏ తేదీలలో మూసివేయబడతాయో తెలుసుకోండి.

ఎస్‌బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. ఈ మేరకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో శనివారం ఎంపిక చేసింది. శెట్టి ప్రస్తుతం ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్లు, టెక్నాలజీ వర్టికల్స్‌ను ఆయన చూస్తుంటారు. ప్రస్తుతం ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా పదవీకాలం ఆగస్టు 28తో 63 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన స్థానంలో శెట్టి బాధ్యతలు చేపట్టనున్నారు. అనుభవం, పనితీరును బట్టి శెట్టి నియమితులయ్యారు. శ్రీనివాసులు శెట్టి 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో చేరారు. 2020లో ఎస్‌బీఐ బోర్డులో ఎండీగా నియమితులయ్యారు. కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌లో విశేష అనుభవం ఉంది. అయితే ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫార్సు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.

భారీగా తగ్గిన కార్ల ధరలు..రూ.82,000 వరకు డిస్కౌంట్!
ఈ ఏడాది జనవరి నుంచి దేశంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచాయి. కానీ, ఇప్పుడు కార్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వబోతున్నారు. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు గొప్ప అవకాశం. ఎందుకంటే, 4 సంవత్సరాల తర్వాత కార్లపై బంపర్ డిస్కౌంట్ అందుబాటులోకి వస్తోంది. ఈ తగ్గింపు పరిధి రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు ఉండగా, కొన్ని కార్లపై ఈ తగ్గింపు రూ. 40,000 నుంచి రూ. 65,000 వరకు ఉంటుంది. ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపు, కార్పొరేట్ తగ్గింపు, మార్పిడి తగ్గింపు ఉన్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఇన్ (టీఓఐ) TOI నివేదికలోని మూలాల ప్రకారం.. పాత హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లపై ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. మారుతి నుంచి మహీంద్రా, టాటా మరియు హ్యుందాయ్ వరకు ఉన్నాయి..

ట్రోల్స్ గీల్స్ జాన్తానై.. కొండన్న భలే ఇచ్చాడుగా స్ట్రోకు!
టాలీవుడ్‌లో పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఎప్పుడో నువ్విలా సినిమా నుంచి ప్రయత్నాలు చేస్తూ ఎట్టకేలకు పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి హిట్ అందుకున్నాడు. అయితే ఆ తరువాత అర్జున్ రెడ్డి, టాక్సీవాలా లాంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో దూసుకొచ్చిన విజయ్ దేవరకొండ ఎందుకో ట్రోలింగ్, విపరీతమైన హేట్ ఫేస్ చేస్తున్నాడు. ‘కల్కి 2898AD’ మూవీలో విజయ్ దేవరకొండ, అర్జునుడి పాత్రలో నటించాడు. Kalki 2898AD మూవీలో అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ గెటప్, డైలాగ్ డెలివరీ విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌ జరుగుతోంది. అర్జునుడి పాత్రలో అల్లు అర్జున్ మొదలు రామ్ చరణ్ వరకు ఫలానా హీరో నటించి ఉంటే బాగుండేదని, దేవరకొండకు ఏమాత్రం సెట్ కాలేదని ఒక వర్గం కావాలని చేసి వదులుతున్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్, అర్జునుడిలా డైలాగ్స్ చెప్పమంటే అర్జున్ రెడ్డిలా చెప్పాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.. నిజానికి అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ చక్కగా నటించాడు కానీ విజయ్ దేవరకొండ మీసాల విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. ఏదేమైనా ఉన్నంతలో విజయ్ దేవరకొండ తనకిచ్చిన పాత్రలో అదరకొట్టాడు. కానీ విజయ్ ను టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే సౌత్‌లో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి కానీ నార్త్‌లో మాత్రం విజయ్ దేవరకొండ ఎంట్రీ విజిల్స్ పడుతున్నాయి.

ఆసక్తి రేపుతున్న విజయ్ ఆంటోనీ “తుఫాన్” ట్రైలర్
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్” రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోని హీరోగా రాఘవన్, హత్య సినిమాలు నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్లో ఈ “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమాను జూలైలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్న క్రమంలో “తుఫాన్” ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ “తుఫాన్” ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎవరి గతంలో లేని, మరొకరి భవితగా మారిన ఓ వ్యక్తి కథ ఇదని ట్రైలర్ లో క్లారిటీ ఇచ్చ్చారు మేకర్స్. తనకు ఎవరూ తెలియని ఓ ప్రాంతంలోకి వెళ్లి ఎవరూ తనను గుర్తుపట్టకుండా జాగ్రత్తపడుతుంటాడు హీరో విజయ్ ఆంటోనీ. అతన్ని తన చీఫ్ శరత్ కుమార్ గైడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతన్ని ఓ కుటుంబం ఆదరిస్తుంది. మరోవైపు పోలీస్ అధికారి మురళీ శర్మ…హీరో కోసం వేట సాగిస్తుంటాడు. ఇంతకీ ఎవరి గతంలో లేని హీరో గతమేంటి, అతని కోసం పోలీసుల వేట ఎందుకు సాగుతుంది. కొత్త ప్రాంతంలో తనను ఆదరించిన కుటుంబం కోసం హీరో ఏం చేశాడు అనేది ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ లొకేషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు, విజయ్ ఆంటోనీ ఇంటెన్స్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా ఉంది. విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.