NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..
హౌసింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ.. గ్రామాల పరిధిలో పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలాన్ని ఇస్తాం.. కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేయనున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇళ్ల నిర్మాణమనేది ప్రభుత్వానికి హై ప్రయార్టీగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని మంత్రి పార్థసారధి చెప్పారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్దిదారులను పక్కన పెట్టేసిందని.. ఇళ్లు పూర్తి అయినా పేమెంట్లు చెల్లించ లేదని మంత్రి పార్థసారధి తెలిపారు. ఇలాంటి బాధిత లబ్దిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లని ఏర్పాటు చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి.. తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగిందని.. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి.. మౌలిక సదుపాయాలను కల్పించ లేదని.. మౌళిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే రూ. 10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది.. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఆరోపించారు. 2014-2019 మధ్య కాలంలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి చెప్పారు.

 

రెవెన్యూ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు..!
సీఎం చంద్రబాబు చేపట్టిన రెవెన్యూ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం రూ.15 కోట్లు తగలేశారంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. మరోవైపు.. రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతేకాకుండా.. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చేందుకు రూ.650 కోట్లు ఖర్చయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. కేంద్రం చెప్పిన రీ సర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకున్నా.. తన బొమ్మల కోసం గ్రానైట్ రాళ్లు సిద్దం చేశారని అధికారులు వెల్లడించారు. మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలిక అంచనా వేసింది. జగన్ మోహన్ రెడ్డి బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృధా అయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు.. వాటితో ఏం చెయ్యవచ్చో చూడమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ఇచ్చారు.

 

ఆగష్టు 2న ఏపీ కేబినెట్‌ సమావేశం..
వచ్చే నెల (ఆగష్టు)2వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆగస్ట్‌ 2న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

 

తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు..
శ్రీశైలం జలాశయం గేట్లను అధికారులు కాసేపటి క్రితం ఎత్తేశారు. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేశారు అధికారులు. ఒక్కో గేటు నుంచి 27వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తు్న్నారు. 6, 7, 8 గేట్ల ద్వారా సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.67,210 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.. మరోవైపు.. కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో.. విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఇప్పటికే 62,725 క్యూసెక్కుల నీటిని వాడుతూ.. దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 879.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 182.6050 టీఎంసీలు ఉంది.

 

ఆగస్టులో విదేశీ పర్యటనకు వెళ్లనున్న రాష్ట్రపతి.. ఏఏ దేశాలంటే..!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు రాష్ట్రపతి ఆయా దేశాలను సందర్శించనున్నారు. ఆగస్టు 5-10 మధ్య ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్-లెస్టేలో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఫిజీ ప్రెసిడెంట్ రతు విలియమ్ మైవలిలీ కటోనివెరే ఆహ్వానం మేరకు ఫిజీని ముర్ము సందర్శిస్తారు. 05-06 తేదీల్లో ఈ పర్యటన కొనసాగనుంది. భారతదేశం నుంచి ఒక దేశాధినేత ఫిజీకి వెళ్లడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ప్రెసిడెంట్ ముర్ము ఆగస్టు 2024, 07-09న న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ డామ్ సిండి కిరో ఆహ్వానం మేరకు న్యూజిలాండ్‌ను సందర్శిస్తారు. అలాగే అధ్యక్షుడు జోస్ రామోస్-హోర్టా ఆహ్వానం మేరకు ప్రెసిడెంట్ ముర్ము 10 ఆగస్టు, 2024న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్-లెస్టేను సందర్శించనున్నారు. అనంతరం ఇండియాకు తిరిగి రానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.

 

అగ్నిపథ్‌పై లోక్‌సభలో రగడ.. రాహుల్‌-రాజ్‌నాథ్‌ మధ్య మాటల యుద్ధం
అగ్నిపథ్‌పై లోక్‌సభలో రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య వాడీవేడీ చర్చకు దారి తీసింది. అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్ష నేత తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్‌నాథ్ ఆరోపించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్‌పై రాహుల్ ప్రసంగిస్తూ.. అగ్నిపథ్ పథకం దేశంలోని సైనికులు, వారి కుటుంబాల ఆర్థిక భద్రత మరియు గౌరవాన్ని దోచుకున్నారని ఆరోపించారు. పెన్షన్ లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. ఈ పథకం.. యువత, రైతు వ్యతిరేక ధోరణిని బట్టబయలు చేసిందని రాహుల్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై విపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రులు దీటుగా స్పందించారు. ఈ క్రమంలో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమైన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని రాహుల్‌ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇదే అంశంపై పార్లమెంటులో ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు బడ్జెట్‌పైనా విపక్ష నేత అపోహలు వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వివరణ ఇస్తారని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అంశాన్ని రాహుల్‌ గాంధీ మరోసారి లేవనెత్తారు. అమరులైన అగ్నివీరుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని రక్షణశాఖ మంత్రి చెప్పారని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదని, అది కేవలం ఇన్సూరెన్స్‌ మాత్రమేనని స్పష్టం చేశారు.

 

టర్కీ అధ్యక్షుడు నిర్వాకం.. ముద్దు పెట్టనందుకు చెంపదెబ్బ
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రవర్తన వివాదాస్పదమైంది. వేదికపై ఓ చిన్నారిని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. జూలై 27న రైజ్ ప్రావిన్స్‌లో టర్కీ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనిషియేటివ్ కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన సందర్భంగా ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేదికపైకి ఇద్దరు చిన్నారులను ఆహ్వానించారు. సంప్రదాయం ప్రకారం ముద్దుల కోసం అధ్యక్షుడు తన చేతిని ఇచ్చారు. కానీ బాలుడు మాత్రం ముద్దు ఇవ్వడానికి సంకోచించాడు. అంతే చిన్నారి చెంపపై ఎర్డోగాన్ ఒక్కటిచ్చారు. అక్కడే ఉన్న సిబ్బంది.. ఆ బాలుడికి ముద్దు పెట్టుకోమని చెప్పగా.. ఆ తర్వాత వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఇంకో బాలుడు మాత్రం ముద్దు ఇచ్చి.. హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది సరైన ప్రవర్తన కాదని తప్పుబడుతున్నారు. ఇంకొందరు ఆయన తీరును సమర్థిస్తున్నారు. ఎర్డోగాన్‌కు ఈ ఘటన ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా ఇదే తరహాలో మనవడిని చెప్పుతో కొట్టడం వివాదానికి దారి తీసింది.

 

‘రాజాసాబ్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసిందోచ్‌.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్!
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రాజాసాబ్‌ ‘ నుంచి తాజా అప్‌డేట్‌ వచ్చేసింది. రాజాసాబ్‌ నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ వీడియో రిలీజైంది. ఇందులో ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్, బీజీఎం ఆకట్టుకుంటోంది. వరుస సినిమాలతో జోరుగా దూసుకుపోతున్న రెబల్‌ స్టార్ ప్రభాస్‌.. చాలా రోజుల తర్వాత ఓ క్లాస్‌లుక్‌లో కనిపించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి సోమవారం సాయంత్రం “ఫ్యాన్ ఇండియా గ్లింప్స్” పేరుతో స్పెషల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ చూసిన తర్వాత.. సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అని అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అసలు మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే.. ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? అని ఎదురు చూసేలా ఉంది ఈ గ్లింప్స్. ఇందులో ప్రభాస్ లుక్ ఆ రేంజ్‌లో ఉంది మరి. ముందు నుంచి మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపిస్తానని చెబుతూ వస్తున్నాడు. అందుకు తగ్గట్టే.. రాజాసాబ్ గ్లింప్స్ అదిరిపోయింది. చెప్పినట్టుగానే.. కరెక్ట్ టైంకి ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్‌ను చూస్తే.. అబ్బా ఎన్నాళ్లైంది ఇలా చూసి.. అనేలా ఉన్నాడు. చాలా కలర్ ఫుల్‌గా వింటేజ్ వైబ్‌లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. పూల బొకేతో బైక్ పై రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. తనకు తానే దిష్టి తీసుకోవడం ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక ఈ 45 సెకండ్ల గ్లింప్స్‌లో రాజాసాబ్ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశారు మేకర్స్. చెప్పినట్టుగానే.. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే.. ఇదో హారర్ రొమాంటిక్ కామేడీ సినిమా అని క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి రాజాసాబ్ ఎలా ఉంటుందో చూడాలి.