NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మాజీ సీఎస్‌ జవహర్‌రెడ్డి సహా నలుగురు ఐఏఎస్‌లను రిలీవ్ చేసిన సర్కార్‌.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మాజీ సీఎస్‌ జవహర్‌రెడ్డి సహా.. నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను రిలీవ్‌ చేసింది.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.. అయితే, ఈ నెల 30వ తేదీన నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు రిటైర్ కానున్నారు.. వారిలో జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య, వెంకట రమణా రెడ్డి, అరుణ్ కుమార్‌ ఉన్నారు.. దీంతో.. ఈ నెల 30వ తేదీన రిటైర్ కానున్న నలుగురు ఐఏఎస్‌ అధికారులను రిలీవ్ చేస్తున్నట్టు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, గత ప్రభుత్వంలో సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించి.. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డితో పాటు.. మరో సీనియర్‌ ఐఏఎస్‌ పూనమ్ మాలకొండయ్యకు ఈ రోజే పోస్టింగ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డికి.. సాధారణ పరిపాలన శాఖలో జీపీఏం, ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనమ్ మాలకొండయ్యకి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం విదితమే.. ఈ నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న ఇద్దరు సీనియర్‌ అధికారులకు మూడు రోజుల ముందే పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం.. మరోవైపు ఈ రోజే వారిని రిలీవ్‌ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం చంద్రబాబుకు ఇంకా సమయం ఇవ్వాలి…
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇంకా సమయం ఇవ్వాలి అన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. నిరంతరం 20 గంటలు కష్టపడే నాయకత్వం కేంద్రం, రాష్ట్రంలో ఉందన్న ఆయన.. ఏపీ మరల అభివృద్ధికి చిరునామాగా మారిపోతుంది త్వరలో అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఎమర్జెన్సీ నాటి యదార్ధ సంఘటనలపై బీజేపీ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 39, ఆర్టికల్ 42లు అత్యంత దారుణం అన్నారు.. సావరిన్ సెక్యులర్ రిపబ్లిక్ అని ప్రియాంబుల్ ను మార్చారు కాంగ్రెస్ వారు… ఇవాళ రాజ్యాంగం మారుస్తారంటూ దారుణంగా మాట్లాడుతున్నారు. సుద్దపూసల్లాగా వాళ్ళంతా మోడీపై వ్యాఖ్యలు చేస్తున్నారు.. గత ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగింది. ప్రజలకు రావాల్సిన సౌలభ్యాలు అడ్డుకోవచ్చని, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకోవచ్చని ఒక వ్యక్తి నిరూపించాడు.. ఆనాడు ఇందిరాగాంధీని గద్దె దించినట్టుగా ఓటు ద్వారా మే 13న ఈ రాష్ట్రంలో ఒక ఓ(వే)టు వేశారని వ్యాఖ్యానించారు.

మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు.. డిప్యూటీ సీఎం పవన్‌కు ఎక్కడంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.. అప్పటికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం, శాఖల కేటాయింపు.. బాధ్యతల స్వీకరణ అంతా జరిగిపోయింది.. అయితే, కొందరు మంత్రులు అప్పటికే తమకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.. మరికొందరు సంబంధిత శాఖల కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇప్పుడు మరికొందరు మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఛాంబర్లు కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు కొనసాగుతోన్న విషయం విదితమే కాగా.. గతంలో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్, పేషీని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కేటాయించారు. మంత్రి పయ్యావులకు గతంలో కేఈ వినియోగించిన పేషీ, ఛాంబర్ కేటాయించగా.. మంత్రులకు కేటాయించిన ఛాంబర్లు, పేషీల నంబర్లతో జీవో జారీ చేసింది జీఏడీ. ఇక, మంత్రులు నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర , నాదెండ్ల మనోహర్‌, పి. నారాయణ, వి. అనిత, సత్యకుమార్‌ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఫరూక్, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్య ప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్‌, సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌, టీజీ భరత్, సవిత, సుబాష్‌, శ్రీనివాస్, రాంప్రసాద్‌రెడ్డి.. ఇలా మంత్రులు అందరికీ ఛాంబర్లు కేటాయిస్తూ జీవో వచ్చింది.

మేక పిల్లలకు తల్లిగా మారిన ఆవు.. పాలిస్తూ.. ప్రేమను పంచుతూ..
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం చాపరాతిపాలెంలో ఓ రైతుకు చెందిన ఆవును తన లేగదూడతో పాటు.. రెండు మేక పిల్లలకు కూడా పాలు ఇస్తుంది.. ఆ ఆవు పాలను దూడతో కలిసి రెండు మేకపిల్లలు పోటీపడి తాగుతున్నాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఓ కెమెరాకు చిక్కడంతో.. వెలుగులోకి వచ్చింది.. అయితే, వారం రోజుల నుంచి ఆవు.. మేక పిల్లలకు పాలు ఇస్తోందని స్థానికులు తెలిపారు. తల్లి లేని ఆ మేకలకు పాలిస్తూ.. తల్లి ప్రేమను అందిస్తోందని, దూడ కూడా వాటిని నెట్టకుండా కలిసి మెలిసి పాలు తాగుతున్నాయని చెబుతున్నారు.. అయితే, ఇది చూసేందుకు చుట్టుపక్కల వారు వస్తున్నారని ఆ గో యజమాని పేర్కొన్నారు.. ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే.. సోషల్‌ మీడియాలో వైరల్ చేయడం నెట్టింట ఎప్పుడూ జరిగే పనే.. ఇప్పుడు గోమాత దగ్గర లేగదూడతో పాటు.. ఆ రెండు మేక పిల్లలు పాలు తాగుతున్న వీడియో వైరల్‌గా మారిపోయింది.

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 8,790 క్యూసెక్కుల ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజ్‌లో గేట్లను ఎత్తి ఉంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దెబ్బతిని కుంగిన ఏడో బ్లాక్‌లో 20 వ గేటును కూడా కట్ చేసి అధికారులు తొలగించారు. వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఇరిగేషన్ అధికారులు దిగువకు తరలిస్తున్నారు. బ్యారేజ్‌లో తాత్కాలిక‌‌ మరమ్మతులు చివరి దశకు‌ చేరుకున్నాయి. బ్యారేజ్ రక్షణ చర్యలో భాగంగా ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాల మేరకు గ్రౌటింగ్‌, షీట్‌ ఫైల్స్‌ పనులు పూర్తికాగా, అప్‌ అండ్‌ డౌన్‌ స్టీమ్‌లో చేపట్టిన సీసీ బ్లాక్‌ రీ అరేంజ్‌మెంట్‌ పనులు తుది దశలో ఉన్నాయి. మట్టి నమూనాల కోసం డ్రిల్లింగ్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. కాగా.. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం గేట్లు 85 ఉన్నాయి. వాటిలో 84 గేట్లను ఎత్తి ఉంచారు.

రానున్న పదేళ్లలో పీసీపీ అవుతా.. సీఎం కూడా అవుతా..
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గాంధీ భవన్ అటెండర్ పదవి ఇచ్చిన చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న పదేళ్లలో పీసీసీ అవుతానని.. సీఎం కూడా అవుతానన్నారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ఢిల్లీలో కాదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏది చెప్తే జగ్గారెడ్డి అది ఫాలో అవుతారన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. నేనేం పైరవీలు చేయట్లేదని.. ఎవ్వరు పీసీసీ అయినా పాలన బాగానే ఉంటుందన్నారు. అధికారంలోనే ఉంటేనే బీజేపీకి పవర్ అని.. పర్మినెంట్ పవర్ కాంగ్రెస్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు చరిత్ర ఉందని, బీజేపీకి చరిత్ర లేదన్నారు. మోడీది తాత్కాలిలిక పవర్ అని.. మోడీ ఉన్నంత వరకే బీజేపీ అని.. పవర్ దిగిపోతే మోడీని ఎవ్వరు పట్టించుకోరన్నారు. మళ్ళీ మోడీ పవర్‌లోకి రారని జగ్గారెడ్డి అన్నారు. యాభై ఏళ్ల కింద ఎమర్జెన్సీ గురించి ప్రస్తావన పార్లమెంట్‌లో మోడీ, స్పీకర్ తీసుకురావాల్సిన అవసరముందా అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ ఒక్క ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే మేము వంద ఎమర్జెన్సీల గురించి మాట్లాడుతామన్నారు. పదేళ్ల మోడీ పాలన రోజూ ఎమర్జెన్సీనే కదా అంటూ విమర్శించారు.

ముందుగానే ప్రజలకు ఎన్నికల తాయిలాలు.. బడ్జెట్ అంతా వరాలే
శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా నష్టపోయింది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలా పడింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ ప్రకటనలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ‘‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్’’ పథకం కింద 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు నెలకు రూ.1,500 అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇక 10 లక్షల మంది ఇంటర్న్‌లకు నెలకు రూ.10,000 స్టైఫండ్ అందించే పథకాన్ని కూడా ప్రకటించారు. పంట నష్టానికి పరిహారంగా చెల్లించాల్సిన గరిష్ట మొత్తం రూ. 50,000కి పెంచారు. ఆవు పాల రైతులకు లీటర్‌కు రూ.5 సబ్సిడీ ఇస్తామని వెల్లడించారు. అంతేకాకుండా 44 లక్షల మంది రైతులకు విద్యుత్ బిల్లు బకాయిలు మాఫీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ ప్రకటించారు. దీంతో పాటు ముంబై ప్రాంతంలో పెట్రోల్‌పై పన్నును 26 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంటే పెట్రోల్ ధరలు లీటరుకు 65 పైసలు తగ్గుతాయి. ఇక డీజిల్‌పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి పన్ను తగ్గించారు. దీంతో ముంబై ప్రాంతంలో డీజిల్ ధర లీటర్‌కు రూ.2 తగ్గుతాయని ఆయన తెలిపారు.  అలాగే పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏ రాష్ట్రంలో అంటే..!
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, గోవా లాంటి రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. కానీ మహారాష్ట్రలో మాత్రం విచిత్రమైన పరిస్థితి చోటుచేసుకుంది. ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ముంబై ప్రాంతంలో పెట్రోల్ లీటరుకు 65 పైసలు, డీజిల్ లీటరుకు రూ.2 తగ్గించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జూన్ 28న (శుక్రవారం) రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ కీలక ప్రకటన చేశారు. ముంబై ప్రాంతంలో పెట్రోల్‌పై పన్నును 26 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంటే పెట్రోల్ ధర లీటరుకు 65 పైసలు తగ్గుతుంది. ఇక డీజిల్‌పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి పన్ను తగ్గించారు. దీంతో ముంబై ప్రాంతంలో డీజిల్ ధర లీటర్‌కు రూ.2 తగ్గుతాయని ఆయన తెలిపారు. ఇక బడ్జెట్‌లో 44 లక్షల మంది రైతులకు విద్యుత్ బిల్లులు మాఫీ చేయడంతో పాటు పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలో మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటించినట్లు తెలుస్తోంది.

నిబంధనలు విస్మరించిన బ్యాంకు.. రూ.29.6 లక్షల జరినామా విధించిన ఆర్బీఐ
హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (HSBC) కొన్ని కార్డు సంబంధిత సూచనలను పాటించనందుకు 29.6 లక్షల రూపాయల పెనాల్టీని విధించినట్లు ఆర్బీఐ(RBI) శుక్రవారం తెలిపింది. బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, రూపే డినోమినేటెడ్ కో-బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్ కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన కొన్ని సూచనలను పాటించనందుకు ఈ భారీ పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. RBI సూచనలను పాటించడం.. దానికి సంబంధించిన సంబంధిత కరస్పాండెన్స్‌ల పర్యవేక్షక నిర్ధారణల ఆధారంగా బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. ఎందుకు నిబంధనలు పాటించలేదో తెలపాలని హెచ్ఎస్ బీసీకి ఆర్బీఐ వివరణ అడిగింది. దీంతో స్పందించిన బ్యాంకు వ్యక్తిగత విచారణ సమయంలో తమ వాదనలు వినిపించింది. అదనపు సమర్పణలను పరిశీలించిన RBI హెచ్ఎస్ బీసీపై ఆరోపణలు నిజమని గుర్తించి.. ద్రవ్య పెనాల్టీ విధించింది. నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ ఖాతాలలో కనీస చెల్లింపు బకాయిలను గణించేటప్పుడు ప్రతికూల రుణ విమోచన లేదని నిర్ధారించుకోవడంలో బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఆర్‌బీఐ, పెనాల్టీ చట్టబద్ధమైన మరియు రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ఎస్ బీసీ తమ కస్టమర్‌లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీలు లేదా ఒప్పందం చెల్లుబాటుపై వివరణ ఇవ్వాలేదని తెలిపింది.

అమెజాన్‌లో బెస్ట్ డీల్.. రూ.6,999 కే స్మార్ట్ ఫోన్..ఫీచర్స్ ఇవే..
ఈ రోజుల్లో ఫోన్ చాలా ముఖ్యమైన వస్తువుగా మారింది. చాలామంది ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు..అంతలా ఫోన్ మన జీవితంలో భాగమైంది. దాదాపు అన్ని పనులు ఫోన్ లోనే ఇప్పుడు పూర్తవుతున్నాయి. కాని కొందరికీ స్మార్ట్ ఫోన్ కొనడం భారంగా ఉండొచ్చు. అందరూ వేల రూపాయలు ఖర్చు చేసి ఫోన్లు కొనలేరు. అయితే అలాంటి వారికి ఫేమస్ మొబైల్ బ్రాండ్ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7 వేల కంటే తక్కువ ధరకే అందిస్తోంది. దాని గురించి తెలుసుకుందాం. Redmi A3 స్మార్ట్ ఫోన్ ని వినియోగదారులు రూ.9,999 MRP ధరకు బదులుగా రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ అమెజాన్‌లో అందించబడుతోంది. అంటే Redmi A3 స్మార్ట్ ఫోన్ పై 30 శాతం తగ్గింపు తర్వాత వినియోగదారులకు రూ.3000 తగ్గింపు ఇస్తున్నారు. ఈ ధరతో వినియోగదారులు ఫోన్ 3GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌లను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు తమ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.6,600 తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే గరిష్ట తగ్గింపు కోసం ఫోన్ మంచి స్థితిలో ఉండటం అవసరం. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుండి నలుపు, ఆకుపచ్చ రంగు ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. Redmi A3 ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ Android 13లో రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.71 అంగుళాల HD+ (1,600×700 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ octa-core MediaTek Helio G36 ప్రాసెసర్‌తో వస్తుంది. అంతేకాకుండా, ఇది 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. దీని వెనుక భాగంలో 8MP ప్రైమరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది.

కల్కికి కోమటిరెడ్డి రివ్యూ.. విజువల్ వండర్ అంటూ!
కల్కి సినిమాకి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ రోజు ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూడటం జరిగింది. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. కల్కి సినిమాలో లెజెండ్రీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకొనే వంటి తారాగణం అద్భుతంగా నటించారు.టాలీవుడ్ లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వైజయంతీ ఫిలింస్ బ్యానర్ లో అశ్వినిదత్ చలసాని, స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న కల్కి 2898AD సినిమా ఓ విజువల్ వండర్. ఈ సినిమా మరింత అద్భుతంగా విజయవంతం కావాలని.. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సిమాలు విజయవంతం అయితే.. పరిశ్రమ పచ్చగా ఉంటుంది.. లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రతీ ఒక్కరు పౌరాణిక, ఆధునిక అంశాల కలయికలో వచ్చిన ఈ కల్కి 2808 AD వంటి అద్భుతమైన సినిమాను ఈ తరం చూడాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోరుకుంటున్నాను అని ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

రాజకీయాలకు అలీ గుడ్ బై.. ఏ పార్టీ వాడిని కానంటూ వీడియో విడుదల
2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసిన అలీ 1999లో రాజకీయాల్లో అడుగు పెట్టానని అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే తాను అప్పుడు రాజకీయాల్లో అడుగు పెట్టానని ఆయన అన్నారు. ఆయన బాపట్లలో ఎంపీగా నిలబడుతున్నాను నువ్వు వచ్చి ప్రచారం చేయాలంటే వెళ్లి టీడీపీలో చేరానని ఆయన అన్నారు. 20 ఏళ్లు అందులో ఉన్న తర్వాత వైసీపీలో చేరానని అన్నారు. ఇక తనకు అన్నం పెట్టింది తెలుగు సినీ పరిశ్రమ అని, 45 ఏళ్లు ఆరు భాషలు 1200 పైచిలుకు సినిమాల్లో నటించానని అన్నారు. నాకు ఎంతో కొంత భగవంతుడు దయా గుణం ఇచ్చాడు, దానికి రాజకీయ బలంతోడైతే ఇంకా సేవ చేయొచ్చు అని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయం చేయాలని రాలేదు. మా నాన్న పేరుతో ట్రస్ట్ పెట్టి కరోనాలో కూడా ఆపకుండా 16 ఏళ్లుగా సేవ చేస్తున్నాను, ఆ ట్రస్టు ద్వారా నేను ఎంతో మందిని చదివించానని అన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలను పొగుడుతాను కానీ ఇతర పార్టీల నేతలను ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించలేదు. ఈ మేరకు మీరు వెతకినా నేను ఎవర్ని అయినా దూషించిన వీడియో దొరకదని అలీ అన్నారు. ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను, ఏ పార్టీ సపోర్టర్ ను కాదని అలీ క్లారిటీ ఇచ్చారు. ఇక మీదట నా సినిమాలు, నా షూటింగ్స్ నేను చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ మాట చెప్పడానికే మీ ముందుకు వచ్చానని ఆయన వీడియోలో పేర్కొన్నారు. నేను కూడా మీలాగే ఒక కామన్ మ్యాన్ లాగా ఐదేళ్లకు ఒకసారి వెళ్లి ఓటు వేసి వస్తాను అని ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని ఆయన అన్నారు. గత వైఎస్ జగన్‌ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా అలీ వ్యవహరించారు.