NTV Telugu Site icon

Top Headlines @ 9PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు
సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతామని చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని సీఎం చెప్పారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమానికి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్దతి అనుసరించాలి… ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను నమోదు చేసేందుకు ఏయే వైద్య పరీక్షలు చేయాలి.. గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా… రాష్ట్రంలో ఉన్న లాబోరేటరీల సాయం తీసుకోవాలా…? వెంటనే పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని, అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం అన్నారు.

 

రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..
డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ చేయనున్నారు. రేపు ఉదయం 11:00 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్లో సీఎం చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరుగనుంది. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు. కాగా.. ఈ సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో.. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరుగనుంది.

 

దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవదాయ శాఖపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కమిటీ వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలని.. దేవాలయాల్లో అపచారాలకు చోటు ఉండకూడదన్నారు. బలవంతపు మత మార్పిడులు, అన్య మతస్థులు రాకూడదన్నారు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తామన్నారు. రూ. 10 వేలు వేతనం వచ్చే అర్చకులకు ఇకపై రూ. 15 వేలు వేతనంగా చెల్లిస్తామని సీఎం తెలిపారు. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ వేద విద్యార్ధులకు నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీజీఎఫ్ కింద, శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా జరిగే పనుల్లో ప్రారంభం కాని పనులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపడతామన్నారు. సింహాచలం పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

 

రేపు ఏపీ ఈ-కేబినెట్ భేటీ.. అంతా ఆన్‌లైన్‌లోనే!
రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఏపీ సర్కారు ఈ-కేబినెట్ భేటీని నిర్వహించనుంది. 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. తిరిగి మళ్లీ రేపటి నుంచి ఈ-కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకు ఆన్ లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేయనుంది. ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ఈ-కేబినెట్ వల్ల ఉపయోగాలను జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ వివరించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

 

జన్వాడ ఫాం హౌస్లో కొలతలు వేస్తున్న అధికారులు..
హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫాం హౌస్కు ఇరిగేషన్ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో.. ఫాం హౌస్లో అధికారులు కొలతలు వేస్తూ పరిశీలించారు. కాగా.. గత కొద్దీ రోజులుగా జన్వాడ ఫాం హౌస్కు సంబంధించి చర్చ జరుగుతుంది. జన్వాడ ఫాం హౌస్ను కూలుస్తారు అనే అంశంకు సంబంధించి గతంలో ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలకు సంబంధించి స్టే ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. కొద్దీ రోజులుగా నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువుల కబ్జాకు సంబంధించి, FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్మాణాలకు సంబంధించి కూల్చే ప్రక్రియను హైడ్రా చేపట్టింది. కాగా.. ఇటీవలే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే.. హైడ్రా కూల్చివేత కంటే ముందు జన్వాడ ఫాంహౌస్ కు సంబంధించి ఇరిగేషన్ అధికారులు అక్కడికి వెళ్లారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాళాలకు సంబంధించిన అంశాలపై కొలతలు వేశారు అధికారులు. ఇటీవలే కోర్టుకు వెళ్లిన సందర్భంగా హైడ్రాకు ఒక ఆదేశం జారీ చేసింది. హైడ్రా ఏర్పాటుకు సంబంధించి నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని సూచించింది. కాగా.. ఈ ఫాం హౌస్ కేటీఆర్ది అని గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫాం హౌస్కు చేరుకోవడంపై చర్చనీయాంశంగా మారింది.

 

రాష్ట్రంలో డెంగ్యూ విజృంభణ.. అధికారులకు దిశానిర్దేశం
సీజనల్ వ్యాధుల కట్టడి పై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశం ఇచ్చారు. డెంగ్యూ కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (DH) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న సీజనల్ వ్యాధుల బాధితుల వివరాలను కంట్రోల్ రూమ్ కు తెలియచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందేలా కంట్రోల్ నుండి సూచనలు అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై స్పెషల్ డ్రైవ్ ను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు.. డెంగ్యూ, చికున్‌గున్యా , మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా జ్వరాలతో సహా దాదాపు అన్ని ప్రధాన సీజనల్ వ్యాధులు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగాయి. వాతావరణ మార్పుల కారణంగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. డెంగీ, చికున్​గున్యా వంటి జబ్బులతో బాధపడుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు. ఓవైపు ఉదయమంతా ఎండలు, సాయంత్రం కాగానే వర్షాలతో భిన్న వాతావరణం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.

 

ఏపీలో నూతన విమానాశ్రయాలు.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి
రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 7ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలలో వీటి ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. సీ ప్లేన్ కార్యకలాపాలు రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మొట్టమొదటి సీ ప్లేన్ డెమోను అక్టోబర్‌లో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామన్నారు. గతంలోనూ సీ ప్లేన్ కార్యకలాపాలపై ప్రయత్నాలు జరిగినా నిబంధనలు, ఇబ్బంది కారణంగా కార్యరూపం దాల్చలేదన్నారు. సీ ప్లేన్ కేవలం పర్యాటకం కోసమే కాకుండా వైద్య, పౌర రవాణాకు ఉపయోగపడేలా నిబంధనలు సడలిస్తున్నామని తెలిపారు. విమానాశ్రయానికి వేల ఎకరాల్లో భూమి అవసర సమస్యకు పరిష్కారంగా సీ ప్లేన్ విధానం ప్రోత్సహించాలన్నది మోదీ ప్రభుత్వ ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. ఉన్న విమానాశ్రయాల సామర్ధ్యం పెంచుతున్నామన్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందన్నారు. నివేదిక అందిన తర్వాతే దానిపై మాట్లాడతామన్నారు. ఎయిర్ క్రాష్ ప్రమాదాలకు సంబంధించి విమానయాన శాఖలో విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల్లో ప్రజా తీర్పును వైసీపీ వక్రీకరిస్తోందని.. 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని దీనిబట్టే అర్ధమవుతోందని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది, న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈ అంశంపై తాను మాట్లాడనన్నారు. సామాన్యుడికి ప్రభుత్వం అండగా ఉంటుందనే ధైర్యం కల్పించేందుకే సెప్టెంబర్1 నుంచి రెవెన్యూ సదస్సులు పెడుతున్నామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని తెలిసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అవ్వటంతో ఢిల్లీతో పాటు జాతీయ స్థాయిలో ఏపీ ఇమేజ్ పెరుగుతోందన్నారు. నాయకులకు-ప్రజలకు అనుసంధానం కొనసాగేలా ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్ సత్ఫలితాలనిస్తోందన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండేందుకే ప్రజా సమస్యలు స్వయంగా స్వీకరించి, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి పరిష్కరిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే అనేక హామీలు నెరవేర్చడం తో పాటు సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.

 

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక..
తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ విత్ డ్రా గడువు ఈరోజుతో ముగిసింది. కాగా.. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఎమ్మెల్యేలు ఎవరూ బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ క్రమంలో.. సింఘ్వీ ఏకగ్రీవమయ్యారు. కాగా.. ఆయన ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఎన్నికల అధికారి నుంచి అందుకోనున్నారు. అభిషేక్ సింఘ్వీ గతంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2006, 2018లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయగా.. ఓడిపోయారు. సింఘ్వీ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా.. తెలంగాణలో కేకే రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సింఘ్వీ ఏకగ్రీవమయ్యారు.

 

హీరో విజయ్‌కి బీఎస్పీ షాక్
టివికే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ కి బిఎస్పి షాక్ ఇచ్చింది. పార్టీ జెండాపై మా పార్టీ గుర్తు అయిన ఏనుగు గుర్తును ముద్రించారంటూ ఎన్నికల కమిషన్‌కు బహుజన సమాజ్ వాదీ పార్టీ ఫిర్యాదు చేసింది. విజయ్ పార్టీ జెండాలో ఏనుగు గుర్తును ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బహుజన సమాజ్ వాదీ పార్టీ. ఏనుగు బిఎస్పీ పార్టీ జాతీయ చిహ్నంగా ఉపయోగిస్తున్నందున విజయ్ పార్టీ జెండా పై ఉన్న ఏనుగు గుర్తు తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో విజయ్ ఎలాంటి చర్యలు తీసుకోనందున, ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని, జెండాపై ఉన్న మా ఏనుగు బొమ్మను తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు పిటిషన్ వేసింది. తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడు విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళనాడు వెట్రి కజగం పేరుతో పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్ ఇటీవల పార్టీ జెండాను, పార్టీ పాటను పరిచయం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌ అని ప్రకటిస్తూ.. అంచెలంచెలుగా పార్టీ కార్యాచరణను సాగిస్తున్నారు. తమిళనాడు విక్టరీ కజగం సభ్యత్వంతో ప్రారంభించి, ఇప్పుడు పార్టీ జెండాను ప్రవేశపెట్టారు. త్వరలో పార్టీ రాష్ట్ర సదస్సును కూడా నిర్వహించాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ పార్టీ జెండాలో ఉపయోగించిన ఏనుగు మా పార్టీ జెండాకు చిహ్నమని, అందుకే విజయ్ జెండాపై నుంచి దానిని తొలగించాలని బహుజన సమాజ్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. అయితే దీనిపై తమిళనాడు విక్టరీ అసోసియేషన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనన్న అంచనాలు తమిళగ వెట్రి కళగం నిర్వాహకుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ పెను ఉత్కంఠ రేపుతున్నాయి.

 

ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యం.. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి జైషా గురించి పెద్ద అప్డెట్ వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పుడు గ్రెగ్ బార్క్లే స్థానంలో జే షా రానున్నాడు. ఐసీసీ చైర్మన్ పదవికి దరఖాస్తు చేసుకున్న ఏకైక అభ్యర్థి జై షాగా నిలిచాడు. దీంతో ఎటువంటి ఎన్నికలు జరగకుంగా.. ఏకగ్రీవంగా జై షా ఎన్నికయ్యాడు. దరఖాస్తుకు చివరి తేదీ మంగళవారం (ఆగస్టు 27) అని తెలిసిందే. ఎంపిక చేసిన సమయానికి జైషా మాత్రమే పోటీలో ఉన్నాడు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఆయన వరుసగా రెండోసారి ఈ పదవిని చేపట్టారు. అయితే తాజాగా ఆయన మూడోసారి పోటీకి దూరమయ్యారు. అటువంటి పరిస్థితిలో, ఆట యొక్క గ్లోబల్ గవర్నింగ్ బాడీ అయిన ఐసీసీలో జే షా యొక్క భవిష్యత్తు దావా చాలా బలంగా పరిగణించబడింది . ఛైర్మన్‌కు ఒక్కొక్కరు రెండు సంవత్సరాల చొప్పున మూడు పదవీకాలానికి అర్హులు. కాగా.. న్యూజిలాండ్ న్యాయవాది గ్రెగ్ బార్క్లే ఇప్పటివరకు 4 సంవత్సరాలు పూర్తి చేశారు. నవంబర్ 2020లో ఆయన స్థానంలో బార్క్లే స్వతంత్ర ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన 2022లో ఈ పదవికి తిరిగి ఎన్నికయ్యారు.