NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అమరావతికి రైల్వే లైన్‌.. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు
అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతికి రైల్వే లైన్‌ ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే లైన్‌తో దేశంలోని అన్ని నగరాలకు అమరావతి కనెక్ట్‌ అవుతుందని ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఈ రైల్వే లైన్ పూర్తవుతుందన్న ఆయన.. మూడేళ్లలోనే పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భూసేకరణకు అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. వచ్చే నెలలో ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానిని సీఎం ఆహ్వానించారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని.. దీనికి అవసరమయ్యే భూమికి సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీకి ఇది చారిత్రాత్మక రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అభివర్ణించారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రాజధాని నుంచి ఏ ప్రాంతానికైనా అనుసంధానం కీలకమని తెలిపారు. 10 రోజుల సమయంలో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలు కేంద్ర కేబినెట్‌ ముందుకు తెచ్చారని చెప్పారు. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ ఏపీకి పెద్ద బూస్ట్ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ ప్రజల కలను కేంద్రం నెరవేర్చింది.. పవన్ చొరవతో రైల్వేలైన్‌కు మోడీ ఆమోదం తెలిపారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ వస్తుందని తెలిపారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

 

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు సాయంత్రం లోపు డీఏ పై నిర్ణయం
తెలంగాణలోని ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది. రేపు సాయంత్రంలోపు డీఏ (DA)పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటి వేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సభ్యులుగా.. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేకే నియమించారు. అంతకుముందు.. ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారని సీఎం తెలిపారు. దీపావళి తరువాత డిపార్ట్‌మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం తొలి మెట్టు అని అన్నారు. డీఏల విషయంలో రేపు సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 317 జీవోపై కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

 

పవన్ చొరవతోనే రైల్వేలైన్‌కు మోడీ ఆమోదం.. రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీ ప్రజల కలను కేంద్రం నెరవేర్చింది.. పవన్ చొరవతో రైల్వేలైన్‌కు మోడీ ఆమోదం తెలిపారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ వస్తుందని తెలిపారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. . రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం లభించింది. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతికి హైదరాబాద్‌-చెన్నై-కోల్‌కతాతో రైల్‌ కనెక్టివిటీ రానుంది. ఇప్పటికే ఈ రైల్వే లైన్‌కు సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర రాజధానికి అమరావతికి రవాణా కనెక్టివిటీని పెంచి అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. అమరావతి రైల్వే లైన్‌లో పలు గ్రామాలకు కూడా రైల్వే కనెక్టివిటీ రానుంది. ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు!
నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలకు 45,300 కోట్లు అవసరమని.. ఈ పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయన్నారు. 18వేల కోట్లతో పనులు ముందుగా పూర్తి చేస్తారని.. హైదరాబాదు నుంచీ మచిలీపట్నం కనెక్ట్ చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. జాతీయ రహదారుల అధికారులు, ఏజెన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని.. 70 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 21 ప్రాజెక్టులకు అటవీ భూముల సమస్యలు, 3 ప్రాజెక్టులకు టోల్‌ప్లాజా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ మూడు నెలల్లో సరిచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రణస్ధలం నుంచీ శ్రీకాకుళం హైవే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎన్‌హెచ్‌-42లో పాడేరు బైపాస్, బైరెడ్డిపల్లి నుంచీ వి.కోట, బెంగళూరు హైవే విషయంలోనూ చర్చించామన్నారు. ఏపీకి మరో మూడు పోర్టులు వస్తాయని.. లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆక్వా కల్చర్, హార్టికల్చర్ వల్ల ఎక్స్‌పోర్టులు పెరిగే అవకాశం ఉందన్నారు. రైల్వే లో 70వేల కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. గత ఐదేళ్ళలో చాలా పనులు ఆగిపోయాయని విమర్శించారు. లాజిస్టిక్స్ కనెక్టివిటీ పూర్తిగా ఆగిపోయిందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిటాల దగ్గర మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు వస్తాయని చెప్పారు. 14 శాతం లాజిస్టిక్స్ కాస్ట్ ఇంటర్నేషనల్‌లో మనకు ఉంది… తగ్గిస్తామన్నారు. ఇసుక ప్రతీ సామాన్యుడికి అందించాలని ఉచిత ఇసుక విధాన తీసుకొచ్చామన్నారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వంలో మోనోపోలీ తీసుకొచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం సహజ వనరులను లూటీ చేశారని విమర్శించారు. ఇప్పుడు ఇసుక కావాల్సిన వాళ్ళే తవ్వుకుని తీసుకెళ్ళే అవకాశం ఉందన్నారు. అన్ని అంశాలను ట్రాక్‌లో పెడుతున్నామన్నారు.

 

చెరువుల అనుసంధానంతోనే వ‌ర‌ద‌కు క‌ట్టడి..
చెరువులు, నాలాల ప‌రిర‌క్షణ‌తో పాటు వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్‌, జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధికి సంబంధించిన ప‌లువురు ప‌రిశోధ‌కులు, నిపుణ‌ల‌తో హైడ్రా స‌మావేశాలు నిర్వహించింది. గురువారం హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ఆధ్వర్యంలో వాటర్‌-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మ‌న్సీబాల్ భార్గవ‌తో హైడ్రా బృందం స‌మావేశ‌మైంది. న‌గ‌రంలో చెరువుల ప‌రిస్థితిపై స‌మీక్షించారు. వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు తీసుకుంటున్న చ‌ర్యల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌ వివ‌రించారు. హైడ్రా చ‌ర్యల‌ ప‌ట్ల డా. మ‌న్సీబాల్ భార్గవ హ‌ర్షం వ్యక్తం చేశారు. చెరువుల పున‌రుద్ధర‌ణ‌తోనే న‌గ‌రానికి వ‌ర‌ద‌ ముప్పు త‌ప్పుతుందంటూ ఆయన సూచించారు. అలాగే.. శ‌రీరానికి నాడీ వ్యవ‌స్థ ఎంత ముఖ్యమో.. చెరువుల‌కు నాలా వ్యవ‌స్థ అంతే అవ‌స‌రమ‌ని డా. మ‌న్సీబాల్ భార్గవ‌ తెలిపారు. నాలాలు స‌రిగా ఉంటే.. వ‌ర‌ద నీరు సాఫీగా చెరువుకు చేరుతుందని అన్నారు. అనుసంధానం ఉన్నప్పుడే ఒక దాని త‌ర్వాత మ‌రో చెరువు నిండుతుందని పేర్కొన్నారు. ఆ గొలుసు తెగ‌కుండా చూడాలి.. ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే వాటిని పున‌రుద్ధరించాలని తెలిపారు. భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో బెంగ‌ళూరులోని చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.. ఇలాంటి ప‌రిస్థితులు న‌గ‌రంలో త‌లెత్త కూడ‌దంటే చెరువుల అనుసంధానం, గొలుసుక‌ట్టు చెరువులు, నాలా వ్యవ‌స్థ స‌రిగా ఉండాల‌ని డా. మ‌న్సీబాల్ భార్గవ‌ సూచించారు. స‌హ‌జ‌ సిద్ధంగా చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం క‌ల్పించే ప‌ద్ధతుల‌ను వివ‌రించారు. చెరువుల‌కు కాలువులు జీవ‌నాడులు.. వాటిని ముందుగా ప‌రిర‌క్షించుకుంటూ.. ఆ కాలువ‌ల నుంచి మంచి నీరు వ‌చ్చేలా చూస్తే.. చెరువుల కాలుష్యం త‌గ్గుతుందంటూ సూచ‌న‌లు చేశారు. కాంక్రీట్ క‌ట్టడాలు కాకుండా.. స‌హ‌జ‌సిద్ధంగా చెరువుల‌ను పున‌రుద్ధరించిన‌ప్పడే వాటిలో జీవ‌క‌ళ ఉంటుంద‌ని.. ఆ నీరు జీవ‌రాసుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భార్గవ‌ తెలిపారు. ఇలా త‌క్కువ ఖ‌ర్చుతో చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం సాధ్యమౌతుందని అన్నారు. ఈ క్రమంలో.. ఆ విధానాలపై ఆయన ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌ ఇచ్చారు. నెల‌లో కుర‌వాల్సిన వ‌ర్షం ఒక్క రోజులోనే.. ఒక్క రోజులో కురిసే వ‌ర్షం.. ఒక గంట‌లో ప‌డి న‌గ‌ర జీవ‌నాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న వేళ.. వ‌ర‌ద నీటి కాలువ‌లు ఎలా ఉండాలనే అంశంపై లోతైన చ‌ర్చ జరిపారు. వ‌ర‌ద నీరు చెరువుకు చేరాలి.. చెరువులు నిండితే ఆ నీరు న‌దుల్లో క‌ల‌వాలన్నారు. అలా కాకుండా ఆటంకాలు ఏర్పడితే నివాసాలు నీట మునుగుతాయని తెలిపారు. చెరువుల‌లో ఆక్రమ‌ణ‌లు తొల‌గింపు.. న‌గ‌రం ముంపున‌కు గురి కాకుండా చేసిన శ‌స్త్ర చికిత్స లాంటిద‌ని డా. మ‌న్సీబాల్ భార్గవ‌ అన్నారు.

 

చైనా- భారత్‌ మధ్య ఒప్పందంపై అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
భారత్‌-చైనా మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. తూర్పు లడఖ్‌లోని పెట్రోలింగ్ పాయింట్లకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మరోవైపు ఈ అంశంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటన వెలువడింది. మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చైనా మన దేశంలోకి ప్రవేశించిందని ఒవైసీ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని తెలిపారు.
ఓ వార్తా ఛానెల్‌తో ఒవైసీ మాట్లాడుతూ.. “గాల్వాన్‌లో ఘర్షణ జరిగినప్పుడు, చైనా తన దేశ భూమిలోకి ప్రవేశించిందని మేము చెప్పాం. మోడీ ప్రభుత్వం ఈరోజు చైనాతో ఒప్పందం కుదుర్చుకుందంటే.. నాలుగేళ్ల క్రితం ప్రధాని దేశానికి అబద్ధాలు చెప్పారని అర్థం. ప్రభుత్వం చేస్తున్న రాజీ మార్గాన్ని నేనూ, మీరూ చూడలేదు. అందుకే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం.” అని పేర్కొన్నారు. ఒవైసీ ఇంకా ప్రశ్నలు లేవనెత్తారు. అక్టోబర్‌లో ఎస్‌ఏసీ చుట్టూ హిమపాతం ప్రారంభమైతే.. పెట్రోలింగ్ గురించి మాట్లాడుతున్న 25 పాయింట్లు ఎలా తెలుస్తాయని అన్నారు. దీనిపై మనకు ఏప్రిల్‌లో మాత్రమే క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. 4 సంవత్సరాలుగా మన సైన్యం అక్కడ కూర్చుంటే.. సైన్యం తిరిగి వస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు డీ-ఎస్కలేషన్, డీ-ఇండక్షన్ ఉంటుందా అన్నదే మన ప్రశ్న అని అన్నారు. మన సైన్యం మళ్లీ 25 పెట్రోలింగ్ పాయింట్ల వద్ద గస్తీ తిరుగుతుందా? అని ప్రశ్నించారు.

 

కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌‌పోర్టులు మూసివేత.. ప్రయాణికులకు ఇక్కట్లు
దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ పెను బీభత్సమే సృష్టించనుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో దానా తుఫాన్ హడలెత్తించనుంది. ఐఎండీ హెచ్చరికలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇదిలా ఉంటే కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరికొన్ని గంటల్లో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే 200లకు పైగా ట్రైన్ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేసుకున్న వారంతా ఇక్కట్లు పడుతున్నారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాలు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేశారు. దానా తుఫాన్‌తో బెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాత్రిపూట నాబన్నాలో బస చేయనున్నారు. అక్టోబర్ 24 అర్ధరాత్రి దానా తీరం దాటనుంది. ఇక అక్టోబర్ 25 ఉదయం తీవ్ర తుఫానుగా మారనుంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం దగ్గర అతి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 100-110 కి.మీ నుంచి 120 కి.మీ వరకు ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 

ప్రధాని మోడీతో ఒమర్ అబ్దుల్లా భేటీ.. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాపై చర్చ
ప్రధాని మోడీతో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌పై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి ఒమర్ అందజేశారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఒమర్ అబ్దుల్లా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర హోదా తీర్మానాన్ని అందజేశారు. ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బుధవారం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్ తీర్మానించిన తీర్మాన పత్రాన్ని అమిత్ షాకు అందించారు. ఇటీవలే జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదించారు. ఒమర్ అబ్దుల్లా అందించిన తీర్మాన పత్రంపై అమిత్ షా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇరువురి భేటీలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సహకరిస్తామని.. అలాగే రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు భేటీ అనంతరం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణలు అక్కర్లేదని, సుపరిపాలన, జమ్మూ కాశ్మీర్‌ అభివృద్ధికి కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాల కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం అమిత్ షాతో అరగంటపాటు జరిగిన సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఒమర్ అబ్దుల్లా వర్గాలు తెలిపాయి. జమ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌సీ- కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించగా.. ఒమర్‌ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సైతం ఆమోదించారు. తాజాగా కేంద్రం కూడా పచ్చజెండా ఊపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

జమ్మూకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి..
జమ్మూకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో భారత ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 5 మంది సైనికులు గాయపడ్డారు. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఆ ప్రాంతం సీల్ చేయబడింది. ఆ ప్రాంతంలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. జమ్మూకశ్మీర్‌లో గత నాలుగు రోజుల్లో ఇది మూడో అతిపెద్ద దాడి. అంతకుముందు అక్టోబర్ 20న గందర్‌బాల్‌లో జరిగిన ఉగ్రదాడిలో డాక్టర్‌తో సహా 7 మంది చనిపోయారు. గురువారం ఉదయం కూడా వలసేతర కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. గుల్‌మార్గ్‌లో జరిగిన ఉగ్రదాడిపై, బారాముల్లా జిల్లాలోని బోటపత్రి వద్ద ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు పిటిఐకి తెలిపారు. దాడిలో గాయపడిన జవాన్లను ఆస్పత్రిలో చేర్చారు. గుల్‌మార్గ్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడికి గంటల ముందు పుల్వామాలో అనుమానాస్పద ఉగ్రవాద దాడిలో స్థానికేతర కార్మికుడు గాయపడ్డాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుభం కుమార్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం బటాగుండ్ గ్రామంలో ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. బుల్లెట్ అతని చేతికి తగిలింది. అతన్ని ఆసుపత్రిలో చేర్చారు.