NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రాజధాని పునర్నిర్మాణంపై సీఎం ఫోకస్‌.. నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో భేటీ
రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గతంలో అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.. గతంలో ఉన్న టెండర్ల కాలపరిమితి ముగియడంతో ఆయా కంపెనీలతో మళ్లీ చర్చలు జరుపుతోంది కూటమి ప్రభుత్వం.. మధ్యలో నిలిచిపోయిన పనులు కొనసాగించే అంశంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగింది.

వచ్చే నెలలో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది.. ఎన్నికల కంటే ముందు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అప్పటి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. అయితే, వచ్చే నెలాఖరుతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గడువు ముగియనుంది.. ఈ నేపథ్యంలో.. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌.. దీని కోసం వచ్చే నెల (జులై) మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది.. ఈ సమావేశాల్లో ఆగస్టు 2024 నుంచి మార్చి 2025 వరకు అవసరమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. ఆమోదం తెలపడానికి ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.. అయితే, త్వరలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూపొందించి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టడం.. చర్చ అనంతరం ఆమోదింపజేయడం అజెండాగా ఈ సమావేశాలు సాగనున్నాయి.

రద్దు చేసిన రైళ్లలో కొన్ని పునరుద్ధరణ.. రేపటి నుంచి యథావిధిగా..
రాజమండ్రి మీదుగా అకస్మాత్తుగా 26 రైళ్లను ఏకంగా 45 రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. దీంతో.. రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ సహా ప్రయాణికులు డిమాండ్ ఉన్న రైళ్లు కూడా ఉండడంతో.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం – నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేపడుతున్న కారణంగా రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.. అయితే, దీనిపై ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. రద్దు చేసిన రైళ్లలో కొన్ని సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టుగా ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.. దీంతో, రేపటి నుంచి యథావిథిగా కొన్ని సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి.. ఇక, రేపటి నుంచి యథావిథిగా నడవనున్న రైళ్ల విషయానికి వస్తే.. విశాఖ – లింగంపల్లి మధ్య జన్మభూమి ఎక్స్ ప్రెస్, కాకినాడ పోర్ట్ – పాండిచ్చేరి మధ్య సర్కార్ ఎక్స్ ప్రెస్, కాకినాడ పోర్టు – విజయవాడ మధ్య మెమూ ఎక్స్ ప్రెస్ పునరుద్ధరిస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది సౌత్‌ సెంట్రల్‌ రైల్వే.. అయితే, రత్నాచల్ , సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రకటించిన విధంగానే రద్దు చేయబడతాయని స్పష్టం చేశారు అధికారులు.

2.70 ల‌క్ష‌ల ఇళ్ల‌ను మంజూరు చేయండి.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ వినతి
కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేష్ షెట్కా్‌ర్ ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని వచ్చేలా సహకరించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థ‌లాల్లో 25 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం ఆయ‌న నివాసంలో క‌లిశారు. రాష్ట్రంలో తాము నిర్మించ‌ద‌ల్చిన 25 ల‌క్ష‌ల ఇళ్ల‌లో 15 ల‌క్ష‌లు ఇళ్లు, ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని, వాటిని ల‌బ్ధిదారు ఆధ్వ‌ర్యంలోని వ్య‌క్తిగ‌త ఇళ్ల నిర్మాణం (బీఎల్‌సీ) ప‌ద్థ‌తిలో నిర్మించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

హైదరాబాద్‌లో ఫ్రెండ్లీ పోలీస్ లేదు.. రాత్రి 10:30 దాటితే లాఠీ పోలీసే..
హైదరాబాద్‌లో రాత్రి సమయంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండదని హైదరాబాద్‌ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 10.30 దాటితే నో ఫ్రెండ్లీ పోలీస్.. ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీస్ అని పోలీసులు ప్రకటిస్తున్నారు. రాత్రి 10:30 గంటలకు వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ చేస్తూ పోలీసులు ప్రకటన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాత్రి 10:30 గంటల నుంచి 11 గంటలలోపే పాతబస్తీలో పాన్ షాపులు,హోటళ్లు మూసేయాలని మైక్‌లో పోలీసులు తెలిపారు. రాత్రుళ్లు అనవసరంగా వీధుల్లో తిరగొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాత్రిళ్లు ముక్కుముఖం తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దని అన్నారు. రాత్రుళ్లు పబ్లిక్ ప్రాంతాల్లో మద్యం తాగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వరుస సంఘటనలతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి గస్తీని పెంచారు. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు జరగడంతో కఠినంగా వ్యవహరించాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో ఆఫీస్‌లు రాత్రి 11 గంటలకు ముగుస్తాయని, ఆ సమయంలో డిన్నర్ ఎక్కడ చేయాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి కొంత మంది నెటిజన్లు పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

మిస్ అయింది ఒక రాష్ట్రంలో.. డెడ్‌బాడీ దొరికింది మరో రాష్ట్రంలో.. అసలేమైంది?
మమతా యాదవ్.. మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు. అనుమానాస్పద స్థితిలో మరణించి తొమ్మిది నెలలైంది. టాటూ వేయబడిన మమతా యాదవ్ మృతదేహం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో లభ్యమైంది. కానీ మమతా యాదవ్ మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు ఇంకా పోలీసులు అప్పగించలేదు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లభించలేదు. రెండు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగాల మధ్య దర్యాప్తు చిక్కుకుంది. మమతను హిందూ సంప్రదాయాల ప్రకారం దహనం చేయాలనుకుంటున్నామని పోలీసులు తెలిపినా అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆమెను గౌరవప్రదంగా నిర్వహించాలనుకుంటున్నామని ఆమె తల్లి రైనా బాయి చెప్పింది. మమతా యాదవ్ సెప్టెంబర్ 11, 2023న కనిపించకుండా పోయింది . పరిచయస్తుడి నుంచి రూ. 7 లక్షలు రికవరీ చేయడానికి తాను ప్రయాగ్‌రాజ్‌కి వెళ్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. ఆమె చివరిసారిగా సెప్టెంబర్ 21న తన సోదరుడితో మాట్లాడింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దర్యాప్తు కూడా సరిగ్గా చేయలేదని వాపోయారు. ఇక ఫిబ్రవరిలో మమత సోదరుడు రాజ్‌భాన్‌ను పోలీసులు ప్రయాగ్‌రాజ్‌కి పిలిచారు. మృతదేహాన్ని సెప్టెంబర్ 26, 2023న మమత మృతదేహంగా సోదరుడు గుర్తించిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులు పాతిపెట్టారు.

ఆ విషయంలో మోడీ బిజీగా ఉన్నారు
సోమవారం 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఎంపీలచే ప్రమాణం చేయించారు. ఇక ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో సందడి సందడిగా కనిపించారు. అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తొలిరోజే కేంద్రంపై ఆరోపణలు సంధించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షల్లో అవకతవకలు, ఉగ్రదాడులు వంటివి చోటుచేసుకున్నాయని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. మోడీ సర్కార్.. రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు. రాజ్యాంగంపై దాడి ఆమోదయోగ్యం కాదని… రాజ్యాంగాన్ని ఏ శక్తి తాకలేదన్నారు. మేం దానిని కాపాడతామని చెప్పారు. ఈ విషయంలో మా సందేశం ప్రజల వద్దకు చేరుతోందని మీడియాతో రాహుల్‌ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్‌’ వేదికగా కూడా అదే సందేశాన్న ఇచ్చారు.‘‘అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైలు ప్రమాదాలు, కశ్మీర్‌లో ఉగ్రదాడులు, నీట్‌, యూజీసీ నెట్‌ పరీక్షల వివాదాలు, పాలు, గ్యాస్‌, టోల్‌ ధరల పెంపు, కార్చిచ్చులు, నీటి సంక్షోభం, వడదెబ్బ మరణాల వంటివి చోటుచేసుకున్నాయి’’ అని రాహుల్ ట్వీట్‌ చేశారు.

గోధుమల స్టాక్‌ పరిమితిపై కేంద్రం కీలక నిర్ణయం..
ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం గోధుమల నిల్వ పరిమితిని విధించింది. ఇప్పుడు టోకు వ్యాపారులు, బహిరంగ విక్రయదారులు లేదా వ్యాపారులు తమ వద్ద 3 వేల క్వింటాళ్ల కంటే ఎక్కువ గోధుమలను ఉంచుకోలేరు. ఈ నిబంధన అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వర్తిస్తుంది. గోధుమల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు.. 2025 వరకు ధరలను స్థిరంగా ఉంచి ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. ఈ నిర్ణయం హోర్డింగ్‌ను నిరోధిస్తుందని, దేశీయ మార్కెట్‌లో గోధుమ లభ్యతను నిర్ధారించడం మరియు ధర స్థిరంగా ఉంచడం తమ లక్ష్యమన్నారు. ఈ క్రమంలో.. లైసెన్సింగ్ అవసరాలు, స్టాక్ పరిమితులు మరియు గోధుమలపై పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2025 మార్చి 31 వరకు అమలులో ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. రిటైలర్లు చిన్న దుకాణాలకు 10 టన్నుల గోధుమలను ఉంచడానికి అనుమతి ఉందని.. వ్యాపారులు, టోకు వ్యాపారులు మరియు పెద్ద రిటైలర్లు 3,000 టన్నుల పరిమితిని అనుసరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రాసెసర్‌ల కోసం.. ఈ పరిమితిని 2024-25 ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన నెలలతో వారి నెలవారీ వ్యవస్థాపించిన సామర్థ్యం (MIC)లో 70 శాతం గుణించడం ద్వారా నిర్ణయించబడింది. ఈ రబీ సీజన్‌లో ప్రభుత్వం 266 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేసిందని.. ఇది అవసరమైన 188 లక్షల మెట్రిక్ టన్నుల కంటే చాలా ఎక్కువ అని అధికారులు తెలిపారు. దేశీయ మార్కెట్‌లో ధరలను స్థిరీకరించడానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసినప్పటికీ.. గోధుమలు, చక్కెర, బాస్మతియేతర బియ్యంపై ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదు.

వరుణ్ సందేశ్ కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్లు రాబడుతున్న ‘నింద’!!
ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన నింద సినిమా జూన్ 21న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారని ఆడియన్స్, విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి మంచి టాక్ తో పాటు రివ్యూలు కూడా వచ్చాయి. దర్శకుడు రాజేష్ జగన్నాధం తన తొలి ప్రయత్నంలో సఫలమయ్యారని వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన నింద బాగుందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు తమ నింద సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోందని టీం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వారంలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఈ సినిమా మీద కాస్త బజ్ ఎక్కువ ఉంది. దీంతో ఈ వారం రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా నింద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోందని టీం ప్రకటించింది. అంతేకాదు వరుణ్ సందేశ్ కెరీర్‌లో ఈ సినిమా హయ్యస్ట్ ఓపెనింగ్స్‌ సాధించిందని కూడా వెల్లడించింది. ఈ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల్లో నెం.1 వసూళ్లు సాధించిన చిత్రంగా నింద నిలవనుందని కూడా పేర్కొన్నారు. ఇంట్రెస్టింగ్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పెట్టుబడిని రికవరీ చేస్తూ కమర్షియల్‌గా హిట్‌ అవుతుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఇతర ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రమీజ్ నవీత్ కెమెరా, సంతు ఓంకార్ సంగీతం అందించారు. అనిల్ కుమార్ ఎడిటింగ్ చేశారు.

ఇట్స్ అఫీషియ‌ల్‌.. ‘భజే వాయు వేగం’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
సక్సెస్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. తాజాగా ఈ హీరో ” భజే వాయు వేగం ” సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించగా., హ్యాపీడేస్ స్టార్ రాహుల్ టైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్రాండ్‌ తో నిర్మించిన ఈ చిత్రం మే 31న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ ప్రసార తేదీలు తాజాగా ఖరారయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. జూన్ 28న సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. భజే వాయు వేగం సినిమాలో ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్ లతోపాటు శరత్ లోహితస్వ కీలక పాత్రల్లో నటించారు. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు రధన్ సంగీతం అందించగా, కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసారు. ఇక ఈ చిత్రం ఓటీటీలో వస్తుండడంతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.