NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు సర్కార్‌ కీలక నిర్ణయం..
అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించింది.. వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది.. ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ చైర్మన్ గా సాంకేతిక కమిటీని నియమించింది.. కమిటీలో సభ్యులుగా రహదారులు భవనాలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలకు చెందిన చీప్ ఇంజనీర్లు ఉన్నారు.. ఇక, విజిలెన్స్‌ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రతినిధిని కూడా కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. రాజధాని ప్రాంతంలో చేపట్టి వేర్వేరు నిర్మాణాలను పరిశీలించాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నిలిచిపోయిన నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న అంశంపై సూచనలు చేయాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు ఇచ్చింది.. దీంతో.. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై పూర్తిస్థాయిలో పరిశీలించి. వివిధ నిర్మాణాల పటిష్టత.. స్థితిగతులను తెలుసుకుని.. ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది సాంకేతిక కమిటీ.. రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం, పైపులైన్లు తదితర అంశాలను కూడా సాంకేతిక కమిటీ పరిశీలించనుంది.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు.. ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ. 9151 కోట్లు
విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాలని సూచించిన ఆయన.. భూకేటాయింపులు పూర్తవగానే విశాఖ రైల్వే జోన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ అమరావతికి అనుసంధానం చేసే రూ. 2047 కోట్లు విలువైన 56 కిలో మీటర్ల రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ “డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్” ను నీతి ఆయోగ్ ఆమోదించిందన్న ఆయన.. విజయవాడ-ఏరుపాలెం-అమరావతి గుండా నంబూరుకు రైల్వే లైన్ నిర్మాణం జరగనుందన్నారు.. ఇక, ఈ ఏడాది ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం రూ. 9151 కోట్లు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు అశ్వినీ వైష్ణవ్.. ఏపీలో మొత్తం రూ. 73,743 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.. ఇప్పటి వరకు మొత్తం 743 ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్ వంతెనల నిర్మాణం జరిగాయి.. ఏపీలో 100 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగిందని స్పష్టం చేశారు.. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 73 “అమృత్” రైల్వే స్టేషన్లు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.

మంత్రులు, ఉన్నతాధికారులతో ముగిసిన సీఎం భేటీ.. స్వీట్‌ వార్నింగ్..!
మంత్రులు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.. కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని వెల్లడించారు ముఖ్యమంత్రి.. మూసధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచన చేయాలని సూచించారు.. పరిపాలనలో భాగంగా అధికారులకు తన వైపు నుంచి 100 శాతం మద్దతు ఉంటుందని తెలిపారు.. అధికారులకు వీలైనంత వరకు హ్యాండ్ హోల్డింగ్ అందిస్తానన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, ఓవైపు ఆదేశాలు ఇస్తూనే.. మరోవైపు వార్నింగ్‌లు కూడా ఇచ్చేశారు సీఎం చంద్రబాబు.. అధికారులెవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తానూ కఠినంగా ఉంటానని స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజ స్థాపనే తన లక్ష్యంగా పని చేయాలని సూచించారు.. గంటల తరబడి సమీక్షలకు తాను స్వస్తి పలికానని గుర్తుచేసుకున్నారు.. అధికారులు కూడా రిజల్ట్ ఒరియేంటెడ్ పద్ధతిలో సమీక్షలు చేపట్టాలని కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, ఇప్పటికీ అధికార యంత్రాంగం సరిగ్గా వ్యవహరించడం లేదనే భావనలో ఉన్నారట ప్రభుత్వ పెద్దలు.. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సమావేశం అంటున్నారు.. మదనపల్లె సంఘటనతో ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలు బయట పడ్డాయని చంద్రబాబు భావిస్తున్నారట.. అధికారులకు ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరించడం.. పరిపాలనపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేయడానికి ఈ కీలక భేటీ నిర్వహించారు సీఎం చంద్రబాబు..

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌ ఘటనలో విచారణ ముమ్మరం.. రేపటి నుంచి ఫిర్యాదుల స్వీకరణ
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో రికార్డుల కాల్చివేతకు సంబంధించిన కేసులో అధికారుల విచారణ ముమ్మురంగా కొనసాగుతోంది. రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడియం.. నిన్నటి నుంచి ఇక్కడే మకాం వేసి భూ వివాదాలపై ఆరా తీస్తున్నారు. ఇక, రేపు సాయంత్రం 4 గంటల నుంచి ప్రజల నుంచి భూ వివాదాలపై ఫిర్యాదులు స్వీకరించనున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐడీ అధికారులు కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేశారు. 25 అంశాలకు సంబంధించి దాదాపు 1,000 పైగా ఫైలు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సగం కాలిపోయిన మరో ఏడువందల రికార్డులను రెవెన్యూ అధికారులకు అప్పగించి వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇక, ఈ అంశంలో కుట్ర కోణం దాగు ఉందనే వివరాల మేరకు.. ఘటన జరిగిన విషయం తెలిసిన ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలపై మదనపల్లి సీఐ వలిబసు వీఆర్ కు పంపారు. ఆదివారం రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ హరి ప్రసాదు, భాస్కర్ ను సస్పెండ్ చేశారు. ఇక ఎన్నికల ముందు ఆర్డీవోగా పనిచేసిన మురళి ఘటనకు రెండు రోజుల ముందు మదనపల్లిలోనే మకాం వేసి కార్యాలయం కూడా వచ్చి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఏంటి? అనే దానిపై ఆరా తీయడానికి మూడు రోజుల నుంచి అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతనితోపాటు ఇటీవల బదిలీ అయిన ఆర్డీవో హరిప్రసాద్, వీఆర్ఏ రమణయ్య ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

టీడీఆర్ బాండ్లలో అవినీతి.. రూ.700 కోట్ల స్కామ్..!
టీడీఆర్ బాండ్ల స్కాం కింద రూ. 700 కోట్ల మేర అవినీతి జరిగిందన్నారు మంత్రి నారాయణ.. టౌన్ ప్లానింగ్ జేడీలు, ఏడీలతో సమావేశమైన ఆయన.. టౌన్ ప్లానింగ్ అధికారుల పని తీరుపై సమీక్ష నిర్వహించారు.. టౌన్ ప్లానింగ్ వింగ్ లో ఉన్న సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి.. సిబ్బంది కొరత, ప్రమోషన్లపై చర్చ సాగింది.. ఇక, లే ఔట్లకు అనుమతులపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.. అయితే, సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. టీడీఆర్ బాండ్లపై సరైన సమాచారం ఇవ్వలేదంటూ మండిపడ్డారు.. ప్రభుత్వ పనితీరు చూపించే శాఖలో పురపాలక శాఖ ప్రధానమైందన్న నారాయణ. అధికారులను సస్పెండ్ చేయటం, డిస్మిస్ చేయడం పెద్ద విషయమేం కాదన్నారు.. అయితే, అక్రమాలు జరగకుండా కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ విషయంలో 2014-19 మధ్య కాలంలో ఒక్క కంప్లైంట్ రాలేదు.. కానీ, గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు మంత్రి నారాయణ.. తణుకు, తిరుపతి, గుంటూరు, విశాఖ వంటి నగరాల్లో టీడీఆర్ బాండ్లల్లో స్కాం జరిగింది. తణుకులో 29 బాండ్లు ఇచ్చారు.. ఇవన్నీ అవకతవకలే. గజాల కింద లెక్కలు వేయాల్సి ఉండగా.. ఎకరాల లెక్కలేసి బాండ్లల్లో అవకతవకలు జరిగాయి. 1:200 ఇవ్వాల్సింది 1:400 ఇచ్చారని మండిపడ్డారు.. విలువలూ పెంచేశారు.. ఇదో పెద్ద స్కాం. ముగ్గుర్ని సస్పెండ్ కూడా చేశారు. టీడీఆర్ బాండ్ల విషయంలో నివేదిక వచ్చింది. టీడీఆర్ బాండ్ల విషయంలో అవినీతి ఇలా కూడా చేస్తారా..? అని ఆశ్చర్యం కలిగే రీతిలో స్కాం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం… నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కేంద్ర బడ్జెట్‌పై తీర్మానం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని, గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని, మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీ వెళ్లామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రస్తావించామి, పెద్దన్న పాత్ర పోషించాలని మోడీని కోరానన్నారు. మోడీని పెద్దన్న అని కీర్తిస్తే నాకు వచ్చేది ఏముంది.? రాష్ట్రాలకు పెద్దన్నలాగా వ్యవహరించాలని కోరానని, ఎవరి దగ్గర వంగిపోవడమో, లొంగిపోవడమో చేయలేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

సీఎంపై కేంద్రమంత్రి ఫైర్..
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శంబాలా నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడిని తిట్టేందుకే అసెంబ్లీని సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని., ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక, పాలన చేతకాక ప్రధాని మోడిని రెండు పార్టీలు (కాంగ్రెస్, బిఆర్ఎస్) విమర్శిస్తున్నాయి అని ఆయన అన్నారు. కేంద్రం పై నిప్పులు పోస్తున్నారు. పంచాయతీల్లో రహదారుల కోసం నిధులు ఇస్తే దారి మళ్ళించారని., రైల్వే వాగన్లు, ఇంజన్లు తయారీ సంస్థకు వరంగల్ లో ప్రధాని శంఖుస్థాపన చేస్తే, ఇంకా రైల్వే కోచ్ ఫాక్టరీ ఏదని అడగడం విడ్డూరంగా ఉందంటూ అన్నారు. తెలంగాణ లో 11 సాగునీటి ప్రాజెక్టులకు రూ. 1208 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తయ్యేలా చేసింది. గతంలో కేసిఆర్ ఎలా వ్సవహరించారో, రేవంత్ రెడ్డి కూడా అలానే వ్యవహరిస్తున్నారంటూ కాస్త గట్టిగానే స్పందించారు. తెలంగాణ లోని 60 లక్షల మంది రైతులకు నేరుగా సబ్సిడీలను కేంద్రం ఇస్తోంది. రేవంతి రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయలేకపోయున రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలని ఆయన కోరారు. నేను ఏలాంటి హామీలను ప్రజలకు ఇవ్వలేదని.. ఒక లక్ష, 50 వేల కోట్ల రూపాయల మూసీ నది ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన అని.. దానికి కేంద్రానికి సంబంధంలేని ప్రాజెక్ట్ అని., ప్రజలను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ను పదవిలో ఉండాలో, లేదో సికింద్రాబాద్ ఓటర్లు, తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని., నేను ఎవరికీ బానిసను కానని.. నేను మొదట పట్టుకున్న జెండా, కమలం జెండా.. నా చివరి శ్వాస వరకు కమలం జెండానే పట్టుకుంటానని ఆయన అన్నారు.

నిర్మలా సీతారామన్‌ని ‘‘మాతా జీ’’గా పిలిచిన ఖర్గే.. ధన్‌ఖర్ రిప్లైతో రాజ్యసభలో నవ్వులు..
బడ్జెట్ చర్చ సందర్భంలో రాజ్యసభలో ఫన్నీ సందర్భం ఎదురైంది. వాడీ వేడి చర్చ మధ్యలో రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌ఖర్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేపై వేసిన సెటైర్లతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంలో ఈ ఘటన ఎదురైంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీహార్, ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల ప్లేట్లు ఖాళీగా ఉన్నాయని అన్నారు. నిన్న సమర్పించిన బడ్జెట్‌లో ఏపీ, బీహార్‌కి తప్ప మారే రాష్ట్రానికి ఏం లభించలేదని, ఆ రాష్ట్రాల ప్లేట్లలో పకోడీ, జిలేబీ వడ్డించారని ఖర్గే అన్నారు. తాను ఇలాంటి బడ్జెట్‌ని ఎప్పుడూ చూడలేదని, ఈ బడ్జెట్ బీజేపీ తన కుర్చీని కాపాడుకునేందుకు మాత్రమే అని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు. దీనిపై స్పందించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని అనుమతించాలని ఖర్గేని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ కోరారు. ఈ సమయంలో ఖర్గే ‘‘ నన్ను పూర్తిచేయనివ్వండి, మాతాజీ మాట్లాడటంతో నిపుణులని అందరికి తెసులు’’ అంటూ నిర్మలా సీతారామన్‌ని ఉద్దేశించి అన్నారు. దీనికి ధన్‌ఖర్ రిప్లై ఇస్తూ ‘‘ మాతాజీ కాదు, ఆమె మీకు కూతురు లాంటిది’’ అనడంతో ఒక్కసారిగా అధికార, ప్రతిపక్ష ఎంపీలు నవ్వారు. ఖర్గే ఆరోపణలపై స్పందించిన ఆర్థిక మంత్రి.. తాము బడ్జెట్‌లో ఏ రాష్ట్రాన్ని కూడా విస్మరించలేదని ఆమె అన్నారు. ప్రతీ బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించలేమని చెప్పారు. ఉదాహరణకు మహరాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలో వంధవన్ అనే పట్టణంలో ఓడరేవు ఏర్పాటు చేయాలని భావించామని, అయినప్పటికీ మహారాష్ట్ర పేరును ప్రస్తావించలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. పేరు చెప్పకపోయినంత మాత్రనా మహారాష్ట్ర విస్మరించబడుతోందని అర్థం కాదని చెప్పారు.

పేపర్ లీకేజీకి పాల్పడితే పదేళ్లు జైలు.. రూ.కోటి ఫైన్.. అసెంబ్లీలో బిల్లు ఆమోదం
పేపర్ లీకేజీ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. ఏదొక రాష్ట్రంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ పేపర్  లీకేజీ కావడం పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీహార్‌లోని నితీష్ కుమార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రం లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకల్ని నియంత్రించేందుకు బీహార్‌ అసెంబ్లీలో కీలక బిల్లును బుధవారం ఆమోదించింది. బీహార్ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు-2024ను రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ప్రవేశపెట్టగా.. ప్రతిపక్షాల వాకౌట్‌ మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. నీట్‌-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌, అక్రమాల ఆరోపణలపై చెలరేగిన వివాదానికి బీహార్‌ కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. ఆయా పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి జరిమానాతో పాటు కఠినంగా శిక్షించనున్నారు.

“భారత్‌కి తిరిగి వెళ్లండి”.. కెనడా హిందూ ఎంపీకి టెర్రరిస్ట్ పన్నూ హెచ్చరిక..
ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత వ్యతిరేకతను బయటపెట్టాడు. భారత్‌చే ఉగ్రవాదిగా గుర్తించబడిన సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ పన్నూ కెనడియన్ హిందూ ఎంపీ చంద్ర ఆర్యను టార్గెట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. జూలై 28న కెనడాలోని కాల్గరీలో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణకు ఓటింగ్ జరగుతుందని వీడియోలో పేర్కొన్నారు. అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూ తరుచుగా ఈ రెండు దేశాల్లో భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల విధానాలను అవలంభిస్తున్నాడు. ఇటీవల కాలంలో కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఖలిస్తాన్ వేర్పాటువాదం, టెర్రరిజం గురించి పట్టించకోకపోవడాన్ని పలుమార్లు ఎంపీ చంద్ర ఆర్య అక్కడ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ముఖ్యంగా కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు, హింసాత్మక ఘటనపై గళం విప్పారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపుతున్నట్లుగా ఓ ర్యాలీలో ప్రదర్శించడం, ప్రధాని నరేంద్రమోడీపై ఇదే తరహాలో విద్వేషానికి పాల్పడటంపై కెనడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పన్నూ తనను టార్గెట్ చేశాడని చంద్ర ఆర్య ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ ఎడ్మంటన్‌లోని హిందూ దేవాలయం BAPS స్వామినారాయణ్ మందిర్ విధ్వంసం మరియు కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారుల ఇతర ద్వేషం మరియు హింసాత్మక చర్యలపై నా ఖండనకు ప్రతిస్పందనగా, సిక్స్ ఫర్ జస్టిస్ గురుపత్వంత్ సింగ్ పన్నూ నన్ను నా హిందూ కెనడియన్లను భారతదేశానికి వెళ్లాలని ఓ వీడియో విడుదల చేశాడు’’ అని చంద్ర ఆర్య ఆ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

పారిస్ ఒలింపిక్స్ నుంచి షార్లెట్ డుజార్డిన్ నిష్క్రమణ
నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మూడు సార్లు బంగారు పతకాన్ని సాధించిన బ్రిటీష్ ఒలింపియన్ షార్లెట్ డుజార్డిన్ 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆమె చర్యల పట్ల ఎఫ్‌ఈఐ  యాక్షన్ తీసుకుంది. నాలుగు సంవత్సరాల క్రితం ఆమె శిక్షణా కేంద్రంలో డుజార్డన్.. పదే పదే గుర్రాన్ని కొరడాతో కొట్టిన దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి. దీంతో ఆమె విచారణకు గురైంది. ఈ పరిణామాలతో ఆమె తాత్కాలికంగా సస్పెండ్‌కు గురైంది. నెట్టింట వీడియో వైరల్ కావడంతో ఆమె తన చర్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. క్షమాపణ కూడా చెప్పింది. తప్పు జరిగినట్లుగా ఆమె అంగీకరించింది. షార్లెట్ డుజార్డిన్.. పదే పదే గుర్రాన్ని కొరడాతో కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దెబ్బలు తాళలేక గుర్రం తప్పించుకునే ప్రయత్నం చేసింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా.. కొడుతూనే ఉంది. ఆమె చర్యలను ఎఫ్‌ఈఐ తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో ఆమెను జాతీయ, అంతర్జాతీయ ఈవెంటల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

ఆర్ఆర్ఆర్ రికార్డ్ దిశగా కల్కి పరుగులు
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పుడు ఆసక్తికరమైన కలెక్షన్లు రాబడుతూ అనేక రికార్డులు బద్దలు కొట్టే దిశగా పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమా అన్ని కేటగిరీలలో టాప్ ఫైవ్ జాబితాలో చేరిపోయింది. ముఖ్యంగా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాలు అంటే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో ఈ సినిమా మూడో స్థానం దక్కించుకుంది. మొదటి స్థానం బాహుబలి 2 దక్కించుకోగా రెండవ స్థానం ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది. 1220 కోట్ల రూపాయలతో కలిసి 2898 ఏడి మూడవ స్థానం దక్కించుకుంది. ఇక ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో మాత్రం ఈ సినిమా ఐదవ స్థానం దక్కించుకుంది. ఇక అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సౌత్ ఇండియన్ సినిమాల జాబితాలో మాత్రం నాలుగో స్థానంతో ఈ సినిమా సరిపెట్టుకుంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో బాహుబలి 2 ఉండగా రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ మూడో స్థానంలో కేజిఎఫ్ చాప్టర్ 2 ఉన్నాయి. 1220 కోట్ల రూపాయల కలెక్షన్లతో కల్కి నాలుగో స్థానానికి సరిపెట్టుకుంది. అయితే సరైన సాలిడ్ సినిమా ఏది పడక పోవడంతో ఈ కలెక్షన్లు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ దరిదాపుల్లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎంతవరకు పాజిబుల్ అవుతుందనేది కాలమే నిర్ణయించాలి.

తండ్రి వయసున్న నిర్మాత ఎంగేజ్మెంటయినా పర్లేదన్నాడు.. హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు
బెంగుళూరు నుండి హైదరాబాద్‌కి వచ్చి ‘పేకమేడలు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి తన నటనతో అందరి చేత ప్రసంసలు అందుకుంది అనూష కృష్ణ. తన మాతృ భాష కన్నడ అయినా అక్కడ ఇప్పటికే రెండు సినిమాలు చేసినా అవి విడుదల కాకపోవడంతో ఇది ఆమెకు హీరోయిన్ గా మొదటి సినిమా అని చెప్పొచ్చు. ఇక తొలి సినిమాతోనే తెలుగు నేర్చుకుని ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడిన అనూషతాజాగా ఒక ఇంటర్వూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన ఆరోపణలు చేసింది. తాను ఇంజనీరింగ్ చదివి థియేటర్స్ లోకి వచ్చానని, నటన మీద ఆసక్తి పెరిగి సినిమాల వైపు వచ్చానని అన్నారు. అయితే నాకంటే పెద్ద వయసున్న కూతుర్లు ఆ నిర్మాతకు ఉన్నారు, నా తండ్రి వయసున్న నిర్మాత తనతో మాట్లాడుతూ నేను చెప్పినట్లు చేస్తే మా సినిమాలో హీరోయిన్‌ నువ్వే అంటూ ఇబ్బంది పెట్టిన అంశాన్ని ఆమె బయట పెట్టారు.