NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అగ్రరాజ్యానికి మంత్రి నారా లోకేష్
పారిశ్రామికరంగాన్ని గాడిలో పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 25వ తేదీనుంచి వారంరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ఈనెల 29 న లాస్ వేగాస్ లోని సీజర్స్ ప్యాలెస్ లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ “సినర్జీ” పేరుతో నిర్వహించే కీలకమైన వార్షిక సమావేశానికి మంత్రి లోకేష్ విశిష్ట అతిధిగా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి IT సేవల పరిశ్రమ నుండి 3వేల చిన్న & మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ITలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులను ఒకచోట చేర్చడానికి రూపొందించిన ఒక ప్రధాన సదస్సు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్లు జార్జ్ W బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ, షీలా బెయిర్ (FDIC చైర్), జాక్ కాస్ (ఓపెన్ AI) వంటి గౌరవనీయమైన స్పీకర్లను సినర్జీ హోస్ట్ చేస్తుంది. ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా పాలనలో సాంకేతికను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేష్ ను విశిష్ట అతిధిగా ఆహ్వానిస్తున్నట్లు సినర్జీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్ట్-అప్‌లకు మద్దతు ఇవ్వడంలో మీ చొరవ ఆర్థికాభివృద్ధిలో ఒక బెంచ్‌మార్క్‌ను ఆవిష్కరించిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై సినర్జీ సమావేశంలో మీరిచ్చే విలువైన సందేశం ఔత్సాహితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐటీ సర్వ్ అలయెన్స్ సంస్థ మంత్రి లోకేష్‌కు పంపిన ఆహ్వానపత్రంలో పేర్కొంది.

 

దూసుకొస్తున్న దానా తుఫాన్.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
ఐఎండీ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయవ్య దిశగా కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి పారాదీప్ (ఒడిశా)కి 460 కిమీ., ధమ్రా(ఒడిశా)కు 490 కిమీ.,సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 540 కిమీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ రేపు (అక్టోబర్24) తెల్లవారుజామునకు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. గురువారం (అక్టోబర్24) అర్ధరాత్రి నుంచి శుక్రవారం (అక్టోబర్25) తెల్లవారుజాములోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా (ఒడిశా) సమీపంలో తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి రేపు రాత్రి వరకు గంటకు 80-100కిమీ వేగంతో, అలాగే రేపు రాత్రి నుంచి 100-110కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బలమైన ఈదురుగాలుల పట్ల క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ సూచించారు.
• భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.
• ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.
• వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.
• మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.
• కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.

 

నాంపల్లి కోర్టులో పరువునష్టం దావాపై కేటీఆర్‌ స్టేట్‌మెంట్ రికార్డ్..
బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాంపల్లిలోని స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ డిఫర్మేషన్ దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను సాక్షులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను అమెరికాలో 6 సంవత్సరాలు చదువుకున్నానని.. చదువు పూర్తి అయ్యాక ఇండియాకు తిరిగి వచ్చినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండియాకు వచ్చాక తెలంగాణ ఉద్యమం జరుగుతుందని.. 2006 ఆగస్టు కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయని.. 2006 నుంచి 2009 లో తాను తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ గా పనిచేసినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశానని.. 2009 లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలో గెలిచినట్లు తెలిపారు. 5 సార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొచ్చారు. ప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందినట్లు తెలిపారు. 2014 నుంచి 2023 వరకు మంత్రిగా కొనసాగానన్నారు. 2018 తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఎన్నికైనట్లు తెలిపారు. ప్రజా జీవితంలోనే ఉన్నానని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డు, రివార్డులు సైతం కైవసం చేసుకున్నట్లు తెలిపారు. చాలా బ్యాట్మెంటన్ అసోసియేషన్, లాండ్ అసోసియేషన్ తో కలిసి పనిచేసినట్లు మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. “దేశంలోనే ఐటీ టెక్నాలజీ మినిస్టర్ గా అనేక కంపెనీలను తెలంగాణ రాష్టానికి తీసుకు వచ్చాను.. నా పరువు ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు.. గత 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్న తనను తన మాటలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. నిరాదార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి వాఖ్యలు చేశారు. తనపై సమాజంలో ఉన్న మంచి పేరు, ప్రతిష్టలను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారు. అన్ని ఆధారాలును కోర్టుకు సమర్పించాను.. యూట్యూబ్ లింక్స్, పేపర్ స్టేట్ మెంట్స్ అన్ని కోర్టుకు ఇచ్చాను..” అని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొండా సురేఖ ఏం వాఖ్యలు చేశారని.. కోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదు కాపీలో వివరాలు ఉన్నాయని కేటీఆర్ న్యాయవాది సమాధానమిచ్చారు. దానినే ప్రామాణికంగా తీసుకోవాలా? స్టేట్మెంట్ ఇస్తారా ? అని కోర్టు అడిగింది. ఆమె మాట్లాడిన మాటల్లో చాలా అసహ్యంగా ఉన్నాయని.. వివరంగా చెప్పమంటే చెప్తామని కేటీఆర్ కోర్టుకు స్పష్టం చేశారు. కేటీఆర్ తన స్టేట్‌మెంట్‌లో ఇలా ప్రస్తావించారు. “విడాకులు అయ్యిందండి ఒకరిది.. నాగ చైతన్య, సమంత విడాకులు కేటీఆర్ చేయబట్టే జరిగింది అని వ్యాఖ్యానించారు. చాలా అసభ్యంగా మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ హాల్ ను కులగొట్టొద్దు అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని నేను డిమాండ్ చేశానని..మంత్రి వ్యాఖ్యానించారు. ఇక నేను చెప్పలేను.” అని కేటీఆర్ తెలిపారు. కొండ సురేఖ కొన్ని వ్యాఖ్యలను చదివిన వినిపించారు. తాను ఫోన్ లు ట్యాప్ చేశానని వ్యాఖ్యానించారని.. తాను ఒక డ్రగ్ బానిస అని, ఇతరులను డ్రగ్ తీసుకునేలా ప్రేరేపించినట్లు ఆమె వ్యాఖ్యానించారన్నారు. తన వల్ల పెళ్ళీలు బ్రేక్ అవుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిపారు.

 

మైనర్ బాలికపై సీఐ లైంగిక దాడికి యత్నం.. పొక్సో కేసు నమోదు
సీఐ రవికుమార్‌పై పొక్సో కేసు నమోదైంది.హనుమకొండ పీజీఆర్ అపార్ట్మెంట్ లో ఉంటూ..అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న 16 ఏళ్ల మైనర్ బలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. పలు మార్లు లైంగిక దాడికి యత్నించినట్లు పేర్కొన్నారు. కాజీపేట్ పొలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రవి కుమార్ గతంలో మామునూర్ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధ్యత గల వృత్తిలో ఉండి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడటంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

‘మహా’మంత్రంగా సీఎం యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం..
మహారాష్ట్ర ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నినాదం ‘‘బాటేంగే తో కటేంగే’’ మారుమోగుతోంది. మహరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో యోగి ఫోటో, నినాదంతో ప్లేక్సీలు వెలిశాయి. ముఖ్యంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు సందడి చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఈ నినాదం చాలా ఫేమస్ అయింది. ‘‘ విడిపోతే.. నాశనం అవుతాం’’ అని అర్థమయ్యే ఈ నినాదాన్ని హిందువుల ఐక్యత కోసం యోగి చెప్పినట్లు తెలుస్తోంది. భారత్‌కి స్వాతంత్య్రం, దేశ విభజన వచ్చిన సమయంలో హిందువుల ఊచకోత వంటి అంశాలను ఉదహరిస్తూ యోగి ఈ కామెంట్స్ చేశారు. ఆగస్టులో బంగ్లాదేశ్ అల్లర్లను ఉదహరిస్తూ సమాజంలో విభజన పర్యవసానాలపై హెచ్చరించారు. జాతీయ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ఆగ్రాలో మాట్లాడుతూ.. “దేశానికి మించినది ఏదీ ఉండదు. మనం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం సాధికారత పొందుతుంది.బంగ్లాదేశ్‌లో ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఆ తప్పులు ఇక్కడ పునరావృతం కాకూడదు. మనం విడిపోతే, మనం నాశనం అవుతాము. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితం” అని ఆదిత్యనాథ్ అన్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ శ్రేణులు మరో విధమైన భాష్యాన్ని చెబుతున్నాయి. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ కులగణన పేరుతో దేశాన్ని విభజించే కుట్రకు పాల్పడుతున్నాడని, అందుకే హిందువులు సంఘటితంగా ఉండాలని యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం చెబుతుందని వెల్లడిస్తున్నారు. ఈ నినాదాలు ప్రస్తుతం మహారాష్ట్రలో వైరల్ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని 288 సీట్లకు నవంబర్ 20న ఎన్నికలు జరగబోతున్నాయి. 23న ఫలితాలు వెలువడుతాయి.

 

ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ..
దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తొలిసారి సమావేశమయ్యారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ మీటింగ్‌లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం ప్రారంభమైంది. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాలు పెద్దగా ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టిపెట్టలేదు. తాజాగా బ్రిక్స్ ఇరు దేశాధినేతల భేటీకి వేదికగా మారింది. గల్వాన్ ఘర్షణ తర్వాత తూర్పు లడాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదిలా ఉంటే, బ్రిక్స్ సమావేశాలకు ముందు భారత్-చైనాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇదు దేశాల సైనికులు సరిహద్దు నుంచి విత్ డ్రా చేసుకోవాలనే ఒప్పందాన్ని ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో డెప్సాంగ్, డెమ్‌చోక్‌లో రెండు దేశాల సైన్యం ఉపసంహరణ ప్రారంభమైంది. గతంలో అనేక సార్లు రెండు దేశాల సైన్యం మధ్య చర్చల అనంతరం పాంగాంగ్ త్సో, గోగ్రా, హాట్ స్ప్రింగ్ వంటి ప్రాంతాల నుంచి సైనిక ఉపసంహరణ జరిగింది. చివరిసారిగా ఇద్దరు నేతలు 2019లో కలుసుకున్నారు. చైనా-ఇండియా మధ్య ఈ ఒప్పందం కుదిరిని మూడు రోజుల్లోనే మోడీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు నవంబర్ 2022లో ఇండోనేషియాలోని బాలిలో జరిగే G20 శిఖరాగ్ర సమావేశంలో, ఆగస్టు 2023లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో ఇద్దరు నేతల పలకరింపులు మాత్రమే చోటు చేసుకున్నాయి. ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. నాలుగేళ్లుగా రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా లేవు. గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా యాప్స్‌ నిషేధించడంతో పాటు చైనా పెట్టుబడులపై భారత్ నిఘా పెంచింది. ప్రస్తుత సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు నార్మల్ అవుతాయని అంతా భావిస్తున్నారు.

 

టర్కీ రాజధానిలో భారీ ఉగ్రదాడి.. 10 మందికి పైగా మృతి..
టర్కీ రాజధాని అంకారాలో భారీ ఉగ్రదాడి జరిగింది. టర్కీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంపై బుధవారం ఘోరమైన దాడి జరిగింది. తుపాకులు, బాంబులతో దాడి చేశారు. ‘‘అంకారాలోని కహ్రామంకజాన్‌లోని TUSAS సౌకర్యాలపై తీవ్రవాద దాడి జరిగింది. దురదృష్టవశాత్తు, మాకు చనిపోయిన వారు మరియు గాయపడిన వ్యక్తులు ఉన్నారు” అని అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 10 మంది కన్నా ఎక్కువ ప్రజలు చనిపోయినట్లు తెలుస్తోంది. అసలు ఈ దాడి ఎవరు చేశారనే దానిపై స్పష్టత రాలేదు. చాలా మందిని బందీలుగా చేసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఆత్మహుతి దాడి జరిగిందని, భవనంలో బందీలు ఉన్నారని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే, అధికారులు మాత్రం వీటిని ధృవీకరించలేదు. ఉద్యోగులు సాయంత్రం ఇంటికి వెళ్లే సందర్భంలో ఎగ్జిట్ పాయింట్స్ వద్ద బాంబు పేలుళ్లు జరగొచ్చని అధికారులు చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తులు భవనంలోని రైఫిళ్లు, బ్యాక్‌ప్యాక్స్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. TUSAS టర్కీ యొక్క అత్యంత ముఖ్యమైన రక్షణ మరియు విమానయాన సంస్థలలో ఒకటి. ఇది ఇతర ప్రాజెక్టులతో పాటు టర్కీ మొట్టమొదటి జాతీయ యుద్ధ విమానం కాన్‌ని ఉత్పత్తి చేసింది. దీంట్లో 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

 

మిడిల్ ఈస్ట్ సంక్షోభం వేళ.. మోడీతో ఇరాన్ అధ్యక్షుడి భేటీ..
ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై భారతదేశం “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేసింది. చర్యలు, దౌత్యమార్గాల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. ఇరాన్ అధ్యక్షుడు భారత జోక్యాన్ని కోరారు. మధ్యప్రాచ్యంలో సంక్షోభం తీవ్రతరం కాకుండా న్యూఢిల్లీ కీలక పాత్ర పోషించగలదని నొక్కి చెప్పారు. మిడిల్ ఈస్ట్‌లోని అన్ని దేశాలతో భారత్‌కి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూకి ఫోన్ చేశారు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మోడీని కలిశారు. ఇరాన్ అధ్యక్షుడిని భారత్‌లో సందర్శించాలని ప్రధాని మోడీ ఆహ్వానించినట్లు మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే విధంగా ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టు గురించి కూడా ఇరువురు నేతలు సంభాషించారు. భారత్-ఇరాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మాట్లాడారు. ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ లేదా INSTC వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత పీఎం మోడీ ఎక్స్‌లో .. “ఇరాన్ అధ్యక్షుడు మిస్టర్ మసూద్ పెజెష్కియాన్‌తో చాలా మంచి సమావేశం జరిగింది. మేము మా దేశాల మధ్య పూర్తి స్థాయి సంబంధాలను సమీక్షించాము. భవిష్యత్ రంగాలలో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి మార్గాలపై కూడా చర్చించాము..” అని ట్వీట్ చేశారు.

 

భయపెట్టి కాసుల పంట పండించుకుంటున్న బాలీవుడ్‌
హారర్ కంటెంట్ కి బాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లో ఫుల్ డిమాండ్ ఉంది. కానీ అన్ని బాషల కంటే భిన్నంగా దెయ్యం సినిమా వస్తే చాలు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు బాలీవుడ్ ఆడియన్స్. దీంతో బాలీవుడ్‌ భవిష్యత్తును గాడిలో పెట్టేందుకు హిట్ ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయలని చూస్తున్నారు. సౌత్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతుంటే, బీటౌన్ మాత్రం సక్సెస్ ఇచ్చే జానర్ కోసం ఎదురు చూసింది. రక రకాల ప్రయోగాలు చేస్తే హారర్ కంటెంట్ ఎట్టకేలకు క్లిక్ అయి బాలీవుడ్‌కి బిగ్ రిలీఫ్‌ ఇచ్చింది. దీంతో ఇప్పుడు అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తున్నారు నార్త్ మేకర్స్. గతంలో హిట్ అయిన భూల్ భులయ్యా2 కి సీక్వెల్ గా థర్డ్ పార్ట్ ని దీవాళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ హైప్ క్రియేట్ చేసింది.కార్తీక్ ఆర్యన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.ఇది గనక హిట్ అయితే బాలీవుడ్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చినట్టే. బాలీవుడ్ లో ఈ ఏడాది కలెక్షన్స్ వర్షం కురిపించిన సినిమా స్త్రీ 2. 150 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 800 కోట్లు వచ్చాయి.ఒక్క నార్త్ లోనే 620 కోట్లు వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి థర్డ్ పార్ట్ ని అనౌన్స్ చేసింది శ్రద్దా కపూర్. ప్రీ పొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపింది. 2025 ఫస్ట్ ఆఫ్ లో స్త్రీ 3 పట్టాలెక్కించి డిసెంబర్ లో రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. బాలీవుడ్ లో ఈ ఏడాది 3 సినిమాలను రిలీజ్ చేశాడు అజయ్ దేవరగన్. ఇందులో సైతన్ బ్లాక్ బస్టర్ అయితే మైధాన్ , ఔరోన్ మే కహన్ దమ్ థా సినిమాలు సో సో టాక్ తో సరిపెట్టుకున్నాయి. ప్రజెంట్ సింగం అగైన్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్న అజయ్ తర్వాత సైతన్ 2 స్టార్ట్ చేసేలా డేట్స్ కేటాయించాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. షెడ్యూల్స్ కూడా ఫిక్సయ్యాయి. అజయ్ సెట్స్ లో అడుగుపెడితే షూటింగ్ జెట్ స్పీడ్ తో మొదలవుతుంది. 2025 సెకండాఫ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతల ప్లాన్. మొత్తానికి ఈ ఏడాది వచ్చిన హారర్ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో హిట్ ఫార్ములానే 2025లో కంటిన్యూ చేస్తున్నారు నార్త్ మేకర్స్.