NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

లోపాలు గుర్తించాం.. లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టాం..
లడ్డూ ప్రసాదం నాణ్యత పెంపుపై దృష్టి సారించామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు… లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాలంటే నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తే సాధ్యపడుతుందని పోటు కార్మికులు కోరడంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించామన్నారు ఈవో.. అయితే, నెయ్యిని నాలుగు విధానాలలో టీటీడీ కోనుగోలు చేస్తూందని వెల్లడించారు.. మొదటిది నేషనల్ డైరీల ద్వారా కోనుగోలు చేస్తూంటే.. రెండోది ఏపీ డైరీల ద్వారా.. మూడోవది 1500 కిలోమీటర్లు పరిధిలో ఉండే డైరీలు ద్వారా కొనుగోలు.. నాలుగోది టిన్ ల ద్వారా కోనుగోలు చేస్తూన్నామని పేర్కొన్నారు.. అయితే, నెయ్యి నాణ్యత పరిశీలనకు ఎన్ఏబిఎల్ ల్యాబ్ కి పంపగా.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని నివేదికలో పేర్కొన్నారని వెల్లడించారు.. దీంతో, రెండు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపి.. కాంట్రాక్టర్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.. మరోవైపు.. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్న ల్యాబ్ ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈవో శ్యామలరావు.. అందుకోసం యంత్రాలను విదేశాలు నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తూన్నామన్నారు. ప్రోక్యూర్మెంట్ విధానాలలో లోపాలు వున్నాయి.. వాటిని సరిదిద్దేందుకు నలుగురు నిపుణులతో కమిటీని వేశామని వెల్లడించారు టీటీడీ ఈవో శ్యామలరావు.

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఘటన.. విచారణ వేగవంతం..
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కుట్ర కోణంపై ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ నేత మాధవ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరగడానికి 10 రోజుల ముందు నుంచి క్రమం తప్పకుండా మాధవరెడ్డి.. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లినట్టు గుర్తించారు. ఫైల్స్‌ దహనం కేసులో అతని హస్తం ఉందని నిర్ధారించుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పదిరోజుల పాటు వరుసగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి ఎందుకు వచ్చారు? ఏయే దస్త్రాలకు సంబంధించి ఎవరెవరిని కలిశారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసులు 10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు. ఒక్కో బృందంలో టీం లీడర్‌గా డీఎస్సీ స్థాయి అధికారి ఉన్నారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి మొత్తం 11 మండలాల్లోని తాసిల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తాసిల్దార్‌ల పర్యవేక్షణలో రికార్డుల తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న గౌతం తేజను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

గ్రామాల అభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యం.. స్వాగతించిన పవన్‌
గ్రామాల అభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని స్వాగతించారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకశాఖలైన.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి బాధ్యతలు తీసుకున్న పవన్‌.. వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ.. ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తున్నారు.. ఇక ఈ రోజు పవన్‌తో సమావేశం అయ్యారు కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీ మరియు సీఈవో బి.రమేష్ బాబు.. ఈ సందర్భంగా.. కరూర్ వైశ్య బ్యాంక్ తరఫున రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులోని కరూర్ జిల్లా మనవాడి అనే గ్రామంలో తాము చేస్తున్న కార్యక్రమాలను పవన్‌ కల్యాణ్‌కు వివరించారు. జల వనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, గ్రామీణులకు పాడి పరిశ్రమలో చేయూత, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, సోలార్ విద్యుత్ ద్వారా ఆర్.ఓ. ప్లాంట్ ఏర్పాటు లాంటివి అక్కడ చేపట్టమనీ, ఇక్కడ కూడా అలాంటివి చేపట్టగలమనే విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ప్రతిపాదనలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను అందించాలని, గ్రామాల అభివృద్ధి కోసం ముందుకు వచ్చేవారికి తప్పకుండా సహకారం ఇస్తామనిచెప్పారు. గ్రామాల అభివృద్ధిలో ప్రముఖ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ప్రవాస భారతీయుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామని.. వారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికులకూ బాధ్యత కల్పించే అంశంపైన ఆలోచన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇక, ఈ సమావేశంలో కరూర్ వైశ్య బ్యాంక్ ప్రతినిధులు ఎన్.మురళీకృష్ణ, కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు
గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్‌ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్ ని రూపొందించేలా సంస్థ ప్లాన్‌ చేస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళా భవన్ లో మంగళవారం రాష్ట్రస్థాయి హెల్త్ వలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనర్ గారు మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తూ.. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి.. వారి హెల్త్‌ ప్రొఫైల్స్‌ను  సిద్దం చేసినట్లు తెలిపారు. మొదటి ఛాలెంజ్ లో అద్దె బస్సు డ్రైవర్లతో సహా 47 వేల సంస్థ సిబ్బందికి, రెండో ఛాలెంజ్ లో 45 వేల ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఛాలెంజ్‌లను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన వైద్యులు, హెల్త్‌ వలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..ఏమన్నారంటే..?
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. మే 5న జరిగిన నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ జరిగిందని, అవకతవకలు జరిగాయని నీట్ యూజీ పునఃపరీక్ష నిర్వహించాలని కోరుతూ 40కి పైగా అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నీట్ రీ-ఎగ్జామ్ అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాగా.. పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్షను నిర్వహించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో రెండు రోజుల్లో ఎన్టీఏ తుది ఫలితాలను ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. గరిష్టంగా రెండు రోజుల్లో కొత్త మెరిట్ జాబితా వస్తుందని తెలిపారు. నీట్‌పై విపక్షాలు అరాచకాలు సృష్టించాలని, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సత్యమేవ జయతే అని కేంద్ర విద్యాశాఖ మంత్రి అభివర్ణించారు. సత్యం గెలిచిందని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

తొలిసారిగా, అణుశక్తిలో పెట్టుబడులకు ప్రైవేట్ రంగానికి అనుమతి..
ప్రైవేట్ రంగాన్ని అనుమతించడం ఒక నూతన ప్రారంభమని నీతి ఆయోగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సభ్యుడు వికె సరస్వత్ చెప్పారు. పరమాణు శక్తి తక్కువ కార్బన్ ఉద్గారాలతో, శక్తిని అందిస్తుందని, కాబట్టి ప్రభుత్వం స్మాల్ రియాక్టర్ల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ నిర్ణయంపై ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పిసిఐఎల్) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ భువన్ చంద్ర పాఠక్ మాట్లాడుతూ.. అణుశక్తి అభివృద్ధిలో భాగస్వామిగా ఉండటానికి ప్రైవేట్ రంగానికి అనుమతి ఇవ్వడం చాలా స్వాగతించదగిన విషయమని అన్నారు. వాతావరణ మార్పు ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో జీరో కార్బన్ ఉద్గారాలు కలిగి విద్యుత్‌ని అందించే అణుశక్తి అనేది అందరి ముందు ఉన్న ప్రత్యామ్నాయం. ఈ రోజు తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘భారత్ స్మాల్ రియాక్టర్స్ (BSR), భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (BSMR) రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, న్యూక్లియర్ టెక్నాలజీల రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం మా ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్‌తో భాగస్వామి అవుతుంది.’’ అని ఈ రంగానికి మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్ అండ్ డీ నిధులు అందుబాటులో ఉంచబడతాయని చెప్పారు.

లైంగిక కంటెంట్‌పై నెట్‌ఫ్లిక్స్‌కి బాలల హక్కుల సంఘం సమన్లు..
మైనర్లకు అందుబాటులో “లైంగిక అసభ్యకరమైన కంటెంట్” ఉంచుతున్నారనే ఆరోపణలపై బాలల హక్కుల సంఘం నెట్‌ఫ్లిక్స్‌కి సమన్లు జారీ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ చూపుతున్నారని నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సోమవారం నెటిఫ్లిక్ అధికారులకు సమన్లు జారీ చేసింది. అయితే, ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం స్పందించలేదు. మంగళవారం నెట్‌ఫ్లిక్స్ అధికారులకు రాసిన లేఖలో మైనర్లకు అందుబాటులో అసభ్యకరమైన లైంగిక కంటెంట్ ఉంచడం ‘‘లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం-2012’’ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ఇదే విషయంపై గతంలో జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని NCPCR తెలిపింది. తాజాగా సీపీసీఆర్ 2005 సెక్షన్ 14 ప్రకారం జూలై 29 మధ్యాహ్నం 03 గంటలకు ఈ విషయంలో తీసుకున్న చర్యల వివరాలతో వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని లేఖలో ఆదేశించింది.

కల్కి 2898 ఏడీ మరో రికార్డు
ఇండియన్ మూవీ డేటా బేస్ సంస్థ సినిమాలకు సంబంధించి పలు సర్వేలు చేపడుతూ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇండియన్ మూవీస్ కి సంబంధించి ఎలాంటి డేటా కావాలన్నా ఐఎండీబీలో వెళ్లి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అయితే తాజాగా ఇండియాలో మోస్ట్ పాపులర్ సినిమాలు అంటూ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది ఐఎండీబీ. 2024 సంవత్సరానికి గాను ఈ లిస్టు ని రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ఆరు నెలలు పూర్తికాగా ఏడో నెల ఆఖరికి వచ్చేసింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు లిస్టులో కల్కి మొదటి స్థానాన్ని సంపాదించగా మంజుమ్మాల్ బాయ్స్ రెండో స్థానాన్ని సంపాదించింది. హిందీ ఫైటర్ సినిమా మూడవ స్థానం, తెలుగు హనుమాన్ సినిమా 4వ స్థానం సంపాదించింది. అలాగే బాలీవుడ్ నుంచి వచ్చిన సైతాన్ 5వ స్థానం లాపాటా లేడీస్ ఆరో స్థానం ఆర్టికల్ 370 ఏడవ స్థానం, ప్రేమలు 8వ స్థానం సంపాదించింది. అలాగే ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం తొమ్మిదవ స్థానం సంపాదించగా బాలీవుడ్ లో వచ్చిన ముంజ్యా అనే సినిమా పదవ స్థానం సంపాదించింది.

అతనితో పని చేయడం కిక్కిస్తుంది.. అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
నటి అంజలి తాజాగా ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజలి మాట్లాడుతూ.. ‘ఏదైనా కొత్తగా ట్రై చేయాలని పుష్ప అనే పాత్రను ఎంచుకున్నాను. ఈ కారెక్టర్ నాతో ఏడాదిన్నరకు పైగా ట్రావెల్ చేసింది. ఈ పాత్రను నేను అంత ఈజీగా వదిలి పెట్టలేను. పుష్ప ఆడియన్స్ అందరికీ నచ్చింది. నటిగా నేను బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను. కానీ ఇలాంటి పాత్రలు రాయడం గొప్ప. బహిష్కరణను ఇంత గొప్పగా రాసిన ముఖేష్ గారికి థాంక్స్. ప్రసన్న విజువల్స్ గురించి అందరూ చెబుతున్నారు. సిద్ధార్థ్ ఆర్ఆర్ అదిరిపోయింది. రవీంద్ర విజయ్ వంటి ఆర్టిస్ట్‌తో పని చేయడం కిక్కిస్తుంది. శివయ్య పాత్ర రవీంద్ర తప్ప ఇంకెవరు ఇంత బాగా పోషించ లేరు. దర్శిగా శ్రీతేజ్ బాగా నటించారు. నిర్మాత ప్రశాంతి సహకారం లేకుంటే ఇంత బాగా వచ్చేది కాదు. ఇంత మందికి మా చిత్రం రీచ్ అయిందంటే దానికి కారణం జీ 5. మా వెబ్ సిరీస్‌ను చూడని వాళ్లంతా కూడా చూడండి, అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. డైరెక్టర్ ముఖేష్ ప్రజాపతి మాట్లాడుతూ.. ‘జీ 5, ప్రశాంతి వల్లే నా ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది. అంజలి గారికి ఇది గేమ్ చేంజర్. ఆమె ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె రూపంలో నాకు ఒక మంచి స్నేహితురాలు దొరికారు. రవీంద్ర గారు శివయ్య పాత్రకు న్యాయం చేశారు. ప్రసన్న విజువల్స్ అద్బుతంగా వచ్చాయి. సిద్దార్థ్ ఆర్ఆర్ బాగుంది. మా వెబ్ సిరీస్‌ను ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.