Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అందుకే మనకు ప్రధానితో సహా జాతీయ స్థాయిలో గౌరవం..!
21 ఎమ్మెల్యే, 2 ఎంపీలు ఉన్న పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీతో సహా జాతీయ స్థాయిలో మనకి గౌరవం ఇస్తున్నారంటే.. జనసేన అంత బలమైనది అని అర్థం అన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ దృక్పథంతో నేను పార్టీ పెట్టలేదు.. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనుకుని పెట్టాను అన్నారు.. జనసేన ఐడియాలజీ గడిచే కొద్ది విస్తృతంగా కలుపుకునే ఐడియాలజీ తప్పా వేరు చేసే ఐడియాలజీ కాదన్నారు.. దానికి ఉదాహరణ గానే ఇవాళ మీరంతా ఇక్కడ ఉన్నారని.. అంటే ఈ భావజాలానికి ఎంత బలం ఉండి ఉండాలి? అని ప్రశ్నించారు.. సలసల రక్తం మరిగే యువతకి ఇది ఒక వేదిక కావాలి అని పెట్టాను అని గుర్తుచేసుకున్నారు.. ఇక, రానున్న మూడేళ్లు చాలా చేయొచ్చు.. గ్రామ స్థాయిలో సమస్య రాష్ట్ర స్థాయికి రాకుండా వ్యవస్థలు పని చేయాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌.. అక్కడ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే మా వరకూ రావు కదా.. మనం తగ్గాలని.. ఇంకొకరిని పెంచాలని అస్తమాను పదేళ్లు, పదిహేను ఏళ్లు అనడం లేదు.. గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే సుస్థిర పాలన ఉండాలన్నారు.. చాలా ఏళ్లుగా పాడైపోయిన వ్యవస్థను బాగుచేసే పనిలో ఉన్నాం.. వైసీపీలో ఇమడలేక కొందరు మాజీ ఎమ్మెల్యేలు మన పార్టీలోకి వచ్చారు.. ఐదేళ్లు పనిచేసిన సీఎం పేర్లు పథకాలు పెట్టేస్తున్నారు.. కానీ, అసలైన త్యాగం చేసిన అమరజీవి లాంటి వాళ్ల పేర్లు పెడుతున్నాం.. పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ లాంటి మహనీయులకు కులాలను ఆపాదించేస్తున్నారు.. ఇది చాలా తప్పు అని సూచించారు.. పోలవరం ప్రాజెక్టుకు పొట్టిశ్రీరాములు పేరు పెడితే అలాంటి మహనీయుడికి సరైన నివాళి అవుతుందన్న ఆయన.. ఇది నా ప్రతిపాదన.. నా కోరిక.. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదు.. పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులాల గురించి మాట్లాడటానికి నాకు ఇబ్బంది ఉండదు.. అన్ని కులాలను పూర్తిగా అధ్యయనం చేసాను అన్నారు.. అయితే, వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదు.. ఆకు రౌడీల పార్టీగా గుర్తిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బలమైన ఐడియాలజీ ఉంది కనుకే ధైర్యంగా ముందుకు అడుగు వేస్తాం.. ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా మాత్రమే చేస్తాం.. మంచిగా చెప్తాం.. మంచిగా మాట్లాడతాం.. వినకపోతే చొక్కా మడతపెట్టి ముందుకు వెళ్లడం పెద్ద పని కాదు అని హెచ్చరించారు.. సింగపూర్ అభివృద్ధి కావాలంటే అలాంటి పాలన ఉండాలి అన్నారు పవన్‌ కల్యాణ్‌.. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేరన్న ఆయన.. వైసీపీ నాయకులు బెదిరింపు మాటలు మానేయండి.. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి అని సూచించారు.. వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆలోచన ఎవరైనా అధికారులకు, పోలీసులకు భయం ఉంటే వదిలేయండి వాళ్లు రారు అని జోస్యం చెప్పారు.. ఇక, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది లేకుండా చూస్తా అని పేర్కొన్నారు.. వైసీపీ నాయకులకి చెప్తున్నా రౌడీలను గంజాయి వాళ్లని కాపాడతాం అంటే లా అండ్ ఆర్డర్ ఎలా సెట్ అవుతుంది? అని నిలదీశారు.. క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరన్నారు.. క్రిమినాలిటీని కంట్రోల్ చెయ్యకపోతే గత ప్రభుత్వానికి మనకి తేడా ఏముంటుంది..? అని ప్రశ్నించారు.. పదవికి తీసుకున్న వారికి గట్టిగా చెప్తున్నా.. కొందరు అధికారులు, పదవుల్లో ఉన్న వాళ్లు మిస్ యూజ్ చేయకండి అని హెచ్చరించారు.. ప్రైవేట్‌ ఇష్యూస్‌లో కొందరు వేలు పెడుతున్నారు జాగ్రత్త.. ప్రజలకి కోపం వస్తే గట్టిగా బుద్ధి చెప్తారు అని వార్నింగ్‌ ఇచ్చారు.. మీరు తప్పులు చేస్తే ప్రజలు ఇప్పుడు ఏం మాట్లాడరు.. ఎన్నికల్లో చూపిస్తారన్న ఆయన.. నేను తప్పు చెయ్యను.. చేసే వాళ్లని చేయనివ్వను అని స్పష్టం చేశారు.. మనం తప్పు చేస్తే గత ప్రభుత్వానికి చెప్పినట్టే మనకి ప్రజలు బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..

స్పీకర్‌ అయ్యాక నా నోటికి ప్లాస్టర్‌ వేసేశారు..! అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన రాజకీయ జీవితం, స్పీకర్ బాధ్యతలు, సైబర్ నేరాలు, యువత పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ కావడానికి ముందు తాను ఎక్కువగా మాట్లాడేవాడినని, స్పీకర్ అయిన తర్వాత మాత్రం నోటికి ప్లాస్టర్ వేసినట్టయ్యిందని వ్యాఖ్యానించారు. సభలో కూర్చుని ఆదేశాలు ఇవ్వడం తప్ప గత రెండేళ్లుగా మాట్లాడే అవకాశం లేదని అన్నారు. స్పీకర్ పదవి చాలా బాధ్యతాయుతమైనదని, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక, టెక్నాలజీ పెరుగుతున్నందుకు సంతోషమే కానీ, అదే స్థాయిలో నేరాలు కూడా పెరుగుతున్నాయని అయ్యన్న పాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. మనకు తెలియకుండానే బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు మాయం అవుతోందని, సైబర్ నేరాలు తీవ్ర స్థాయికి చేరాయని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉందని వెల్లడించారు.

వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమల వెళ్లే భక్తులకు మంత్రుల కీలక సూచనలు..
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించినట్టు మంత్రులు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి వంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముగ్గురు మంత్రులతో ప్రత్యేక సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి మొత్తం 23.64 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు మంత్రి ఆనం.. డీఐఎఫ్‌ (DIF) విధానంలో ఇప్పటికే 1.89 లక్షల మంది భక్తులకు దర్శన టిక్కెట్లు జారీ చేసినట్టు పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన వసతులు, భద్రత, క్యూలైన్ నిర్వహణపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందన్నారు.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. మొత్తం దర్శన సమయంలో దాదాపు 90 శాతం సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించినట్టు తెలిపారు. భక్తులు తమకు కేటాయించిన దర్శన సమయానికే తిరుమలకు రావాలని, ముందుగా లేదా ఆలస్యంగా వస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సూచించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్టు తెలిపారు. ఏఐ (కృత్రిమ మేధస్సు) మరియు డ్రోన్‌ టెక్నాలజీ సహాయంతో పోలీసు శాఖ రద్దీని పర్యవేక్షిస్తుందని, భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా ఉంటాయని మంత్రులు తెలిపారు. భక్తులందరూ సహకరించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు..
ప్రజల కోణంలో ఆలోచించేలా అధికారులు వ్యవహరించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న సేవలు ఏ విధంగా అందుతున్నాయనే అంశంపై ఆరా తీశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “ప్రజలకు సంతృప్తికరంగా సేవలందించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఎలా చూస్తున్నారనే కోణంలో విశ్లేషించాలి… దానికి అనుగుణంగా సేవలందించడంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. గంజాయి కట్టడిపై పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలి… రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు మరింతగా అమలు చేయాలి. గంజాయి కట్టడిపై మూడు రీజియన్లల్లో చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో నేనూ పాల్గొంటాను. గంజాయి నివారణకు, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు మంచి ఫలితాలు వస్తున్నాయి. అయినా అందర్నీ భాగస్వాములను చేసేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలి సూచించారు. ఇక, గంజాయి, డ్రగ్స్ కు సంబంధించి మూడు ప్రాంతాల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేద్దాం. అమరావతి, తిరుపతి, విశాఖల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లు పెట్టండి అని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం చేపట్టే వివిధ పథకాల్లో ప్రజా భాగస్వామ్యం ఉండేట్టుగా చూడాలి. వీధి దీపాలు, తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు. సరఫరా చేసే తాగునీటికి సంబంధించిన పరీక్షలు చేపట్టాలి… వాటిని ప్రజలకూ వివరించాలి. ఎక్కడైనా తాగునీటిలో కలుషితం జరిగిందని వెల్లడైతే… అలెర్ట్ కావాలి. హాస్టళ్లల్లో తాగునీటి, పారిశుద్ధ్యం వంటి విషయాల్లో ఏ మాత్రం అలక్ష్యం చేయొద్దు. ఆర్వో ప్లాంట్లు లేని హాస్టళ్లల్లో త్వరితగతిన ప్లాంట్లను ఏర్పాటు చేయండి. క్షేత్ర స్థాయి సిబ్బంది తప్పనిసరిగా కార్యాలయాలకు రావాల్సిందే. ఫైళ్ల మానిటరింగ్, అటెండెన్స్ వంటి అంశాలను ఆర్టీజీ సెంటర్ ఎప్పటికప్పుడు నివేదించాలి.”అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

విద్యుత్ ఉద్యోగులకు భట్టి కానుక.. 17.651 శాతం డీఏ ఖరారు..
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగ ఉద్యోగులకు, ఆర్టిజన్లకు , పెన్షనర్లకు ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచిని దృష్టిలో ఉంచుకుని, వీరికి రావాల్సిన డియర్ నెస్ అలవెన్స్ (DA) , డియర్ నెస్ రిలీఫ్ (DR) ను 17.651 శాతంగా ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ప్రతి ఏటా జనవరి , జూలై నెలల్లో నిర్వహించే సమీక్షలో భాగంగా, ఈ ఏడాది జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చేలా ఈ పెంపును ఖరారు చేశారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న , విశ్రాంతి తీసుకుంటున్న సుమారు 71,387 మందికి ప్రత్యక్షంగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది. సంస్థల వారీగా లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తే, టీజీ ట్రాన్స్‌కోలో 3,036 మంది ఉద్యోగులు, 3,769 మంది ఆర్టిజన్లు, 2,446 మంది పెన్షనర్లు కలిపి మొత్తం 9,251 మందికి ప్రయోజనం కలుగుతుంది. జెన్‌కో పరిధిలో 6,913 మంది ఉద్యోగులు, 3,583 మంది ఆర్టిజన్లు , 3,579 మంది పెన్షనర్లు ఈ పెంపు పరిధిలోకి రానున్నారు. అలాగే ఎస్పీడీసీఎల్ లో 11,957 మంది ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లు, పెన్షనర్లు కలిపి పెద్ద సంఖ్యలో లబ్ధి పొందుతుండగా, ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులు, 3,465 మంది ఆర్టిజన్లు, 6,115 మంది పెన్షనర్లు తాజా ఉత్తర్వులతో ప్రయోజనం పొందనున్నారు. ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో, ప్రభుత్వం ఈ డీఏను ఖరారు చేయడం పట్ల విద్యుత్ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్ వాసులకు గోల్డెన్ ఛాన్స్.. ఆస్తి పన్ను బకాయిలపై బంపర్ డిస్కౌంట్.!1
భాగ్యనగరవాసులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తీపి కబురు అందించారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను (Property Tax) బకాయిలు ఉన్న వారికి ఊరటనిస్తూ ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. చాలా కాలంగా ఆస్తి పన్ను చెల్లించని ఆస్తులపై భారీగా వడ్డీ (Arrears Interest) పేరుకుపోయింది. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు, 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రాయితీని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ పథకం ప్రకారం.. పన్ను చెల్లింపుదారుడు తన అసలు పన్ను మొత్తాన్ని (Principal Amount) చెల్లిస్తూ, దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10 శాతాన్ని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని కార్పొరేషన్ పూర్తిగా మాఫీ చేస్తుంది. ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కేవలం ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ పరిధితో పాటు, ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయతీల పరిధిలోని ఆస్తులన్నింటికీ ఈ రాయితీ వర్తిస్తుంది. పన్ను బకాయిలు ఉన్న యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా అటు ప్రజలకు వడ్డీ భారం తగ్గుతుందని, ఇటు జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా లేదా సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లో పన్ను చెల్లించి ఈ 90% వడ్డీ మాఫీని పొందవచ్చు.

ఇకపై డిజిటల్ ఖాతాలను వదలబోనంటున్న ఐటీ శాఖ.. అతి త్వరలో సరికొత్త రూల్స్ అమల్లోకి..!
డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టం కింద, ఆదాయపు పన్ను శాఖకు (Income Tax Department) సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత ఈమెయిల్స్, ఇతర డిజిటల్ స్పేస్‌లను తనిఖీ చేసే అధికారం కల్పించనున్నారు. పన్ను ఎగవేత, దాచిన ఆదాయం లేదా ప్రకటించని ఆస్తులపై అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఈ అధికారాలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు ఐటీ అధికారులు ప్రధానంగా భౌతిక ఆధారాలైన పత్రాలు, ఆస్తులు, లాకర్లు, బ్యాంకు ఖాతాల తనిఖీలకే పరిమితమయ్యేవారు. అయితే కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, డిజిటల్ ప్రపంచం కూడా ఐటీ సెర్చ్ పరిధిలోకి వస్తుంది. సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్ ఇన్‌బాక్స్‌లు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ రికార్డులు, క్రిప్టో లావాదేవీలు, క్లౌడ్ సర్వర్లు వంటి వాటిని పరిశీలించే అధికారం ఐటీ అధికారులకు లభిస్తుంది.

అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఐపీఎల్‌ సంచలనం..
ఐపీఎల్ సంచలనం కృష్ణప్ప గౌతమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.. 14 ఏళ్ల కెరీర్ తర్వాత కృష్ణప్ప గౌతమ్ భారత దేశవాళీ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేశారు.. కర్ణాటకకు చెందిన దిగ్గజ ఆల్ రౌండర్‌ అయిన కృష్ణప్ప గౌతమ్, అన్ని రకాల క్రికెట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.. దీంతో, భారత దేశీయ క్రికెట్‌లో 14 సంవత్సరాల కెరీర్‌కు ముగింపు పలికినట్టు అయ్యింది.. తన శక్తివంతమైన లోయర్-ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు నమ్మకమైన ఆఫ్-స్పిన్‌కు పేరుగాంచారు.. రంజీ ట్రోఫీ, ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌లో చిన్నదైన కానీ చిరస్మరణీయమైన కెరీర్‌ను ఆస్వాదించారు.. అయితే, 2012 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన గౌతమ్, తన తొలి మ్యాచ్‌లోనే బలమైన ప్రభావాన్ని చూపాడు. తన తొలి మ్యాచ్‌లోనే సురేష్ రైనా, భువనేశ్వర్ కుమార్‌ల ముఖ్యమైన వికెట్లను పడగొట్టాడు. అతని దూకుడు బ్యాటింగ్ మరియు కీలకమైన సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం త్వరలోనే అతన్ని కర్ణాటక బలమైన జట్టులో కీలకమైన ఆటగాడిగా మార్చాయి. ఇక, 2016–17 రంజీ ట్రోఫీ సీజన్ అతని కెరీర్‌లో ఒక ప్రధాన మలుపుగా నిరూపించబడింది, గౌతమ్ తనను తాను నిజమైన ఆల్ రౌండర్‌గా స్థాపించుకున్నాడు.. కేవలం ఎనిమిది మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు పడగొట్టాడు. తరువాతి సీజన్‌లో, అతను మైసూర్‌లో అస్సాంపై తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు, బ్యాట్ మరియు బంతి రెండింటితోనూ మ్యాచ్‌లను ప్రభావితం చేసే తన సామర్థ్యాన్ని మరింతగా పెంచుకున్నాడు.

IPL 2026కు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మాస్టర్ ప్లాన్‌.. బీసీసీఐని ఒప్పించి మరీ..?
ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ఇంకా మూడు నెలలకుపైగా సమయం ఉన్నప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG) ఇప్పటికే తమ సన్నాహాలను వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ను అందుకోలేకపోయిన ఈ ఫ్రాంచైజీ ఆ లోటును తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జట్టు భారతీయ ఫాస్ట్ బౌలర్లను ఒక విదేశీ టీ20 లీగ్‌కు పంపేందుకు బీసీసీఐ నుంచి అనుమతి కూడా పొందింది. ఓ ప్రముఖ నివేదిక ప్రకారం.. ఐపీఎల్‌ 2026కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ తమ దేశీయ పేసర్లను సౌతాఫ్రికాకు పంపే యోచనలో ఉంది. అక్కడ వారు SA20 లీగ్‌లో పాల్గొనే డర్బన్ సూపర్ జెయింట్స్‌తో కలిసి ట్రైనింగ్ పొందనున్నారు. డర్బన్ సూపర్ జెయింట్స్‌ అనేది LSGకి అనుబంధ జట్టుగా ఉంది. డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభమయ్యే SA20 లీగ్ సమయంలో ఈ బౌలర్లు అక్కడి ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేసి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోనున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో ఆవేశ్ ఖాన్, మొహసిన్ ఖాన్ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు యువ బౌలర్ నమన్తివారీ కూడా ఈ గ్రూప్‌లో చేరే అవకాశం ఉంది. ఈ బౌలర్లు వచ్చే వారం ఎప్పుడైనా డర్బన్‌కు బయల్దేరనున్నారు.

మరో ఆరు రోజుల్లో 60వ పుట్టినరోజు.. ఆ ఫిట్‌నెస్‌ ఏంటి భాయ్..!
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. సెలబ్రేషన్లకు కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా, సల్మాన్ ఖాన్ తన ఫిట్‌నెస్‌నే తన పుట్టినరోజు విష్‌గా చూపించారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోల్లో సల్మాన్ ఖాన్ రిలాక్స్‌డ్ గా ఉన్నప్పటికీ బాడీ ఫిట్నెస్ పై ఫుల్ ఫోకస్‌తో ఉన్నట్లు కనిపించారు. దీనితో వయసు పెరిగినా తన డిసిప్లిన్‌, ఫిట్‌నెస్‌పై ఉన్న అంకితభావం మరోసారి స్పష్టమైంది. ఈ ఫోటోలతో పాటు సల్మాన్, “నేను 60 ఏళ్ల వయసులో కూడా ఇలా కనిపించాలి అనుకుంటున్నా..! ఇక ఆరు రోజులు మాత్రమే ఉన్నాయి” అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. సల్మాన్ పోస్ట్‌కు అభిమానులు భారీగా స్పందించారు. ఒక అభిమాని “మీరు కోట్లాది మందికి ఇన్‌స్పిరేషన్. ఇన్‌స్పిరేషన్ ఎప్పటికీ యువంగానే ఉంటుంది” అని ప్రశంసించాడు. ఇంకొకరు “60లో 80లా కనిపించే వాళ్లను చూశాను.. కానీ సల్మాన్ భాయ్ మాత్రం డిఫరెంట్” అంటూ కామెంట్స్ చేశారు.

ఇంటికో ల* కొడుకు.. ‘రౌడీ’ జనార్థన రచ్చ!
ప్రస్తుతం కెరీర్ పరంగా లోలో ఉన్న టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ‘ఊరమాస్’ విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో, ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ ప్రాజెక్టుకు ‘రౌడీ జనార్ధన’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా సాగిన ఈ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చూడని అత్యంత క్రూరమైన మాస్ అవతారంలో కనిపించారు. కండలు తిరిగిన దేహం, ఒళ్లంతా రక్తపు మరకలు, చేతిలో పదునైన కత్తితో శత్రువులను వేటాడుతున్న తీరు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. “కళింగపట్నంలో ఇంటికో ల* కొడుకు నేను రౌడీనని చెప్పుకు తిరుగుతడు. కానీ, ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే.. వాడే జనార్ధన.. రౌడీ జనార్ధన” అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ సినిమా కేవలం విజయ్ మాస్ ఇమేజ్ మీద మాత్రమే కాకుండా, బలమైన కథ మరియు స్టార్ కాస్ట్‌తో రాబోతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా ఒక ప్రత్యేక పాత్రలో అలరించబోతున్నారు. 1980వ దశకంలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను దర్శకుడు రవికిరణ్ కోలా మలుస్తున్నారు.

Exit mobile version