NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన కోసమే..!?
అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనపై రెండోసారి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు… ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తు అంశాలపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు సీఎం.. దగ్దమైన దస్త్రాలు ఏయే విభాగాలకు చెందినవి, ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులెవరు అనే అంశాలపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పి పుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆయన.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి వేయి కోట్ల అవివీతి బాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.. ఇక మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం మొన్నటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంట్రోల్లోనే ఉందని విమర్శించారు. మరోవైపు.. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ల్యాండ్ కన్వెర్షన్ జరిగిందని విమర్శించారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ల్యాండ్ కన్వెర్షన్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం ఘటన చోటు చేసుకుందన్న ఆయన.. పెద్దిరెడ్డి మీద.. స్థానిక వైసీపీ నేతల మీదే మాకు అనుమానం ఉందన్నారు.. ఆదివారం పూట ఉద్యోగులు పని చేయడం ఎందుకు..? అని ప్రశ్నించారు. ఆర్డీవో, ఎమ్మార్వో సహా ఉద్యోగులు, అధికారుల మొబైల్స్ సీజ్ చేశాం. ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించమని స్పష్టం చేశారు.

గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. రైతులందరికీ బీమా అమలు..
రైతులకు శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రైతులందరికీ బీమా అమలు చేయాలని.. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగాలని.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. స్పష్టం చేశారు.. పంట బీమాపై జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ బీమా అమలు చేయాలని, విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని అధికారులను ఆదేశించారు. పంటల బీమాపై వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రులు.. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం బీమాకు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.. ఇక, గత వైసీపీ ప్రభుత్వంలో బీమా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, ప్రీమియం చెల్లింపులు జరగలేదని విమర్శించారు మంత్రులు.. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగేలా బీమా అమలు కావాలని సూచించారు.. దిగుబడి బట్టి, వాతావరణ పరిస్థితుల బట్టి బీమా అమలులో ఉన్న అవకాశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.. బీమా అమలు, క్లైమ్ లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు. వైసీపీ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేయలేదని, తిరిగి ఈ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేసే అవకాశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన, మత్స్య శాఖల కార్యదర్శి అహ్మద్ బాబు, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, ఉద్యాన శాఖ కమిషనర్ కె.శ్రీనివాసులు.. ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తుంగభద్రకు పోటెత్తిన భారీ వరద.. గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. దీంతో.. తుంగభద్ర జలాశయానికి భారీ వరద పోటెత్తింది.. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ఇప్పటికే తుంగభద్ర నీటి మట్టం 1628.09 అడుగులకు చేరింది.. ఇక, ఇన్ ఫ్లో రూపంలో 1,01,993 క్యూసెక్కుల నీరు వచ్చి తుంగభద్ర డ్యామ్‌లో చేరుతోంది.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. ప్రాజెక్టులోని 3 గేట్ల ద్వారా దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు.. దీంతో.. తుంగభద్ర జలాశయం నుంచి 7,744 క్యూ సెక్కుల నీరు ఔట్‌ఫ్లో రూపంలో దిగివ ప్రాంతానికి వెళ్లిపోతోంది.. మరోవైపు.. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 87.056 టీఎంసీలుగా ఉందని అధికారులు చెబుతున్నారు.. ఇక, తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరించారు.. ఎగవ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోన్న నేపథ్యంలో.. ప్రాజెక్టులోని మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. హస్‌పేట బళ్లారితో పాటు కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. కృష్ణా నది ఉపనదిగా ఉన్న తుంగ‌భ‌ద్ర డ్యాం గేట్లు తెర‌వ‌డంతో.. కృష్ణా న‌దిలోకి వ‌ర‌ద పోటెత్తింది.. దీంతో.. దిగువన ఉన్న శ్రీశైలం డ్యామ్‌ వైపు కృష్ణమ్మ ప‌రుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో.. శ్రీశైలం డ్యామ్‌ మరింత వేగంగా నిండే అవకాశాలు ఉన్నాయి.

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనపై డీజీపీ కీలక వ్యాఖ్యలు.. అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం..!
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు.. మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో జరిగిన ఘటన యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందన్నారు ఏపీ డీజీపీ.. రికార్డుల రూంలో అగ్నిప్రమాదం వెనుక కుట్రకోణం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్‌ కార్యాలయంలో దాదాపు మూడు గంటలకు విచారణ చేపట్టారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గత రాత్రి సుమారు 11.30 గంటలకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. 3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం అన్నారు. 22ఏ భూముల రికార్డులున్న గదిలో ఫైర్‌ ఇన్సిడెంట్‌ జరిగింది.. కీలక దస్త్రాలున్న విభాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఘటన సమాచారం ఆర్డీవోకు తెలిసింది.. కానీ, కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోందని.. వారిపై వేటు తప్పదన్నారు. కార్యాలయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలిందని.. ఇక్కడ వోల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారు. పరిస్థతి బట్టి కేసును సీఐడీకి బదిలీ చేస్తామని.. ప్రస్తుతం పది ప్రత్యేక టీమ్‌లను దర్యాప్తు కోసం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసులో ఎవరు ఉన్నా విడిచిపెట్టం.. అంతా బయటకు తీస్తాం.. ఎవరున్నా వదలం అని హెచ్చరించారు డీజీపీ ద్వారకా తిరుమల రావు.

మరో మూడు రోజులు వర్షాలు.. అధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదుల్లో వరద పోటెత్తుతుంది. ఈ క్రమంలో కాళేశ్వరం, భద్రాచలం వద్ద గోదావరి నదికి ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోయి రవాణా స్తంభించి పోయింది. రాగల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్‌, కొమురంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ఇటు.. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షం పడుతుందని తెలిపింది. ఈ క్రమంలో.. అధికారులతో సీఎస్ శాంతికుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్న క్రమంలో.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాల్లో ఏ విధమైన ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ముందుగానే పునరావాస కేంద్రాల ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని.. పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, NDRF, SDRF తదితర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు.

ఎల్లుండి అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో మొదటిసారి అసెంబ్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్.. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. ఈనెల 24వ తేదీన (బుధవారం) తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రోజు కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. ప్రతిపక్ష నేతగా మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు గులాబీ బాస్.. మరోవైపు.. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్లోని అమరవీరుల స్థూపనికి నివాళులు అర్పించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అనంతరం 11 గంటలకు శాసససభకు హాజరుకానున్నారు. అనంతరం.. మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.

మంగళవారం నిర్మలమ్మ బడ్జెట్ విశేషాలు ఇవే!
మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సామవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే మంగళవారం మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఈ బడ్జెట్‌పై రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇక మిత్రపక్షాల రాష్ట్రాలైతే మరిన్ని ఆశలు పెట్టుకున్నాయి. కోట్లాది కళ్లన్నీ నిర్మలమ్మ బడ్జెట్‌పై ఫోకస్ అయి ఉన్నాయి. ఎలాంటి విశేషాలు ఉంటాయో మరికొన్ని గంటలు ఆగాల్సిందే. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు నిర్మలా సీతారామన్ బయల్దేరి వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌కు చేరుకోనున్నారు. ఇక ఉదయం 10.15 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రధాని మోడీతో నిర్మలమ్మ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఉదయం 11 గంటలకు లోకసభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

వామ్మో.. ఇదేం మ్యారేజ్.. పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు తీసుకున్న జంట
పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. నూతనంగా పెళ్లి చేసుకునే వారు ఎంతో సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కంటారు. కానీ నేటి యువత అందుకు భిన్నంగా ఉన్నారు. వివాహం యొక్క ప్రాముఖ్యత తెలియకో.. లేదంటే అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలియకో.. ఏమో తెలియదు గానీ.. చిన్న చిన్న కారణాలకే బీపీలు పెంచుకుని కోపావేశాలకు గురై పచ్చని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ జంట అర్ధాంతరంగా వివాహ బంధాన్ని ముగించేశారు. అసలేం జరిగింది. ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తెలియాలంటే ఈ వార్త చదవండి. కువైట్‌లో పెళ్లైన 3 నిమిషాలకే ఓ వివాహం పెటాకులైంది. విచిత్రమేంటంటే అందుకు న్యాయమూర్తి కూడా సమ్మతి తెల్పడం విశేషం. కేవలం చిన్న కారణానికే ఈ జంట విడాకులు తీసేసుకున్నారు. పెళ్లి వేదికపై వరుడు.. అవమానించాడని వధువు మనస్తాపానికి గురై మ్యారేజ్‌ను రద్దు చేసుకుంది. తనకు విడాకులు ఇప్పించాలని జడ్జిని కోరింది. ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయమూర్తి.. భార్యాభర్తలుగా ప్రకటించిన 3 నిమిషాలకే వారిద్దరికి విడాకులు మంజూరు చేశాడు. ఈ ఘటన 2019లో చోటుచేసుకుంది. కానీ ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది. గతంలో జరిగిన సంఘటనను ఎక్స్ ట్విట్టర్‌గా పోస్టు చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చరిత్రలోనే అతి చిన్న పెళ్లిగా చెప్పుకోవచ్చు.

చెత్త కుప్పలో దొరికిన డైమండ్ నెక్లెస్.. చివరకి?
ఒక్కసారి ఊహించుకోండి మనకు గాని లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికితే ఎలాఉంటుందో. ఇక డైమండ్ నెక్లెస్ అందుకున్న తర్వాత ఎవరైనా ఆనందంతో గెంతులేస్తారు. అయితే పోగొట్టుకున్న వారికి వారి వజ్రాల హారం తిరిగి దొరికితే సంతోషం రెట్టింపు అవుతుంది. తమిళనాడులోని చెన్నైలో అచ్చం ఇలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి ఇంట్లో ఉంచిన డైమండ్ నెక్లెస్‌ను ప్రమాదవశాత్తు చెత్తకుప్పల్లో పడేశాడు. కానీ., అతనికి ఈ విషయం గుర్తుకు వచ్చేసరికి చాలా ఆలస్యం అయింది. ఆ వ్యక్తి డైమండ్ నెక్లెస్‌ను కనిపెట్టేందుకు సహాయం కోసం మున్సిపల్ కార్పొరేషన్ బృందాన్ని సహాయం అడిగాడు. దాంతో మున్సిపల్ కార్పొరేషన్ బృందం చేసిన కృషి ఫలించింది. చెత్త కుప్పలో దండలో చుట్టి ఉన్న డైమండ్ నెక్లెస్ కనిపించింది. ఇక పోయిన డైమండ్ నెక్లెస్ చూసిన వెంటనే ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ విషయం చెన్నైలోని విరుగంబాక్కం ప్రాంతంలో జరిగింది. ఇక్కడ నివాసముంటున్న దేవరాజ్ అనే వ్యక్తి ఇంట్లో ఉంచిన డైమండ్ నెక్లెస్ ప్రమాదవశాత్తూ పోగొట్టుకున్నాడు. దేవరాజ్ తల్లి ఈ డైమండ్ నెక్లెస్‌ని తన కూతురికి పెళ్లి కానుకగా ఇవ్వడానికి తెచ్చిందని., త్వరలో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉందన్నారు. డైమండ్ నెక్లెస్ కనపరాకపోవడంతో పొరపాటున నెక్లెస్‌ ను డస్ట్‌బిన్‌లో పడేసిన సంగతి దేవరాజ్‌కి గుర్తుకు వచ్చింది. అయితే అప్పటికి రెండు రోజులు గడిచిపోయాయి. దింతో అతను నెక్లెస్ దొరుకుతుందా లేదా అని దేవరాజ్ కంగారుపడ్డాడు. ముందుగా ఈ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ బృందాన్ని కలిసి వాళ్ళకి విషయం మొత్తం చెప్పాడు.

టీ20 ఆసియా కప్‭లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్‌..
ఆసియా కప్ టి-20 టోర్నమెంట్‌లో మలేషియా మహిళల క్రికెట్ జట్టుపై శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ చమరి అటపట్టు 119 పరుగులు నాట్ అవుట్ తో అద్భుత సెంచరీ సాధించింది. దింతో ఆమె ఆసియా కప్ టీ20లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్‌ గా రికార్డు సృష్టించింది. ఇకపోతే ఆమెకి ఇది టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో కెప్టెన్ చమరి 119 పరుగులు నాట్ అవుట్ తో 184/4 స్కోర్ చేసింది. మ్యాచ్ లో ఓపెనర్ విషమి గుణరత్నే (1) తొందరగానే అవుట్ అయినప్పటికీ అటపట్టు మంచి రన్ రేట్‌తో బ్యాటింగ్‌ ను కొనసాగించింది. పవర్‌ ప్లే ఓవర్లను పూర్తిగా సద్వినియోగం చేసుకొని క్రీజులో ఉండి కేవలం 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసింది. ఆ తర్వాత 63 బంతుల్లోనే తన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలిచింది. చివరకు 69 బంతుల్లో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్ లో ఆమెకు 14 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టింది. ఆడపట్టు ఇప్పుడు మహిళల ఆసియా కప్ టి20లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వ్యక్తిగా నిలిచింది. ఈ టోర్నీలో ఆమెకు ముందు అత్యధిక స్కోర్ రికార్డు భారత క్రీడాకారిణి మిథాలీ రాజ్ (97* vs మలేషియా, 2018) పేరిట ఉంది.

రాబోయే ప్రపంచకప్‭లో మరిన్ని కొత్త జట్లు.. ఐసీసీ కీలక ప్రకటన..
అమెరికా, వెస్టిండీస్‌ లో జరిగిన 2024 టి20 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ తాజాగా ఓ ప్రకటన చేసింది. అదేంటంటే.. రాబోయే ప్రపంచకప్‌లో జట్ల సంఖ్యకు సంబంధించిన ప్రకటన. జూన్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. పురుషుల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ఇన్ని జట్లు టోర్నీలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐసీసీ మహిళల టి20 ప్రపంచ కప్ పరిధిని పెంచాలని నిర్ణయించింది. దింతో రాబోయే టోర్నమెంట్లలో టీమ్స్ సంఖ్య 16 కి పెరుగుతుంది. టీ20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ, కొత్త దేశాల జట్ల ప్రదర్శన మెరుగుపడుతుండడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ వార్షిక సమావేశం శ్రీలంక రాజధాని కొలంబోలో శని, ఆదివారాల్లో జరిగింది. ఇందులో బోర్డు సమావేశం కాకుండా వార్షిక సాధారణ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో అన్ని ఐసీసీ సభ్య బోర్డుల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనది మహిళల టి20 ప్రపంచ కప్‌లో జట్ల సంఖ్యను పెంచడం. పురుషుల, మహిళల క్రికెట్‌లో సమానత్వాన్ని పెంపొందించే భాగంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. క్రమంగా టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్యను పెంచుతామని ఇంటర్నేషనల్ కౌన్సిల్ డెసిషన్ తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌లో 10 జట్లతో టోర్నమెంట్ నిర్వహించాల్సి ఉంది. ఇకపోతే 2009 లో మొదలైన టి 20 మహిళా ప్రపంచ కప్ లో 8 జట్లు పాల్గొనగా 2016 నుంచి 10 జట్లు ఆడుతున్నాయి. దీని తర్వాత 2026లో జరిగే టోర్నీలో ఈ సంఖ్య 12కి పెరుగుతుంది. ఆపై 2030 నాటికి 16కి పెరుగుతుంది. మొత్తంమీద రాబోయే సంవత్సరాల్లో మరిన్ని దేశాలు ప్రపంచ కప్‌లో పాల్గొనే అవకాశాన్ని పొందబోతున్నాయి.

త్రిష, రంభలతో విజయ్.. అసలు మ్యాటర్ ఇదా?
తమిళ చిత్రసీమలో రూ.200 కోట్ల రెమ్యునరేషన్‌తో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు తలపతి విజయ్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ వరల్డ్‌లో చాలా మంది అభిమానులను కలిగి ఉన్న విజయ్, గత కొన్నేళ్లుగా నీలంగరైలో కొత్తగా నిర్మించిన ఇంట్లో నివసిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ భార్య సంగీత అతని నుంచి విడిపోయి లండన్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. భిన్నాభిప్రాయాలు, విడాకులు.. ఇలా రకరకాల కారణాలు ఇందుకు కారణమని చెబుతున్నా.. కూతురు దివ్య షాషా చదువుల కోసం సంగీత మాత్రం లండన్‌లో ఉంటోందని కూడా మరో ప్రచారం ఉంది. ఇక సీరియస్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న తలపతి విజయ్.. తన 69వ సినిమా పూర్తి చేసిన తర్వాత సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేసి రాజకీయ రంగంలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించారు. ఓ వైపు సన్నాహక పనులు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను 234 నియోజకవర్గాల్లో తలపతి విజయ్ ఎదుర్కోబోతున్నారు. ఇదిల ఉండగా కాకుండా చెన్నైలోని పట్టినప్పక్కం ప్రాంతంలో విజయ్ కొత్త అపార్ట్‌మెంట్ కొన్నాడనే వార్త వైరల్ అవుతోంది. ఈ సమాచారాన్ని మార్కెట్ విశ్లేషకుడు పిఆర్ సుందర్ తన హోమ్ టూర్ వీడియోలో తెలిపారు. తాజాగా నటుడు విజయ్ రంభతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ కాగా.. విజయ్ కొన్న అపార్ట్ మెంట్ లోనే రంభ కూడా ఇల్లు కొన్నట్లు తేలింది. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న విజయ్‌ని తన కుటుంబంతో కలిసి సందర్శించి ఆశ్చర్యపరిచింది రంభ.

భీముడి వారసుడు నాథనాధుడిగా శరత్ కుమార్ లుక్ చూశారా?
విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద దేశ వ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ మీద ట్రోల్స్ వచ్చినా కన్నప్ప సినిమా ఎలా ఉంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా ఉండబోతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న క్రమంలో తాజాగా కన్నప్ప విడుదల గురించి విష్ణు మంచు మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కన్నప్ప చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తామని ఇది వరకే ప్రకటించారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని విష్ణు మంచు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కన్నప్ప ఈ ఏడాది డిసెంబర్‌లోనే వస్తుందని విష్ణు మంచు చెప్పేశారు. ప్రస్తుతం విష్ణు మంచు ట్వీట్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు శరత్ కుమార్ తాజాగా పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆయన నాథనాధుడిగా కనిపించనున్నారు. భీముడు-హిడింబి వారసులుగా ఉన్న కోయల పెద్దగా ఆయన కనిపిస్తున్నారు. కోయల దొరగా కనిపిస్తూ ఉన్నారు. ఇక అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో కన్నప్ప చిత్రం రానుంది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇక కంటిన్యూగా అప్డేట్లు రానున్నాయి.