NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. లోతట్టు ప్రాంతాలకు అలర్ట్
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్న వరదలతో తెలంగాణ ఎగువన వున్న వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో ఎగువ నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ, తుపాకుల గూడెంతో పాటు ఛత్తీస్ఘడ్ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల వాసులను అధికారులు అలెర్ట్ చేశారు. అయితే 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాదం జారీ చేస్తారు. కాగా ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీగా వరద అంతా శబరి మీద పడింది. శబరి నీటి ప్రవాహం వేగంగా పెరిగింది. ప్రస్తుతం శబరి 38 అడుగులకు చేరుకోవడంతో అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక ప్రారంభమైంది. దీంతో గోదావరి స్పీడ్ తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి కొద్ది మేరకు పెరుగుతున్నది. ఇది మరింత పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తు హెచ్చరికల్ని ఇప్పటికే అధికారులు జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

 

ఏపీ గవర్నర్‌తో మాజీ సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు గవర్నర్‌తో జగన్ భేటీ అయ్యారు. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్‌కు తెలిపారు. కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు. దాడులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు గవర్నర్‌ జస్టిస్ అబ్దు్ల్‌ నజీర్‌కు జగన్ చూపించారు.

 

రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం
రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీఎల్పీలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో సబ్జెక్టులను ప్రిపేరై రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలను సభలో ప్రస్తావించేలా స్టడీ చేసి రావాలని చంద్రబాబు సూచించనున్నారు. బయట చేస్తున్న దుష్ప్రచారాన్నే వైసీపీ సభలో కూడా చేస్తే గట్టి కౌంటర్లివ్వాలని టీడీపీ భావిస్తోంది. ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెలాఖరుతో ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. 23న ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని టీడీఎల్పీ సూచించింది.

 

ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇరిగేషన్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. నిన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. రేపు మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన రైతు రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానంకు వివరించనున్నారు. మరోవైపు వరంగల్‌లో ‘రైతు కృతజ్ఞత’ సమావేశానికి రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా.. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, క్యాబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన సనత్నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో చోటు చేసుకుంది. 204 ఫ్లాట్లో విద్యుదాఘాతంతో ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఇంట్లోని బాత్రూంలో పడి ఉన్న మృతదేహాలను సాయంత్రం కాలనీవాసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

 

కేజ్రీవాల్‌ని జైలులో చంపేందుకు కుట్ర.. సంజయ్ సింగ్ ఆరోపణలు..
ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ని చంపేందుకు కుట్ర జరగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి బీజేపీ పట్టించుకోవడం లేదని అన్నారు. కేజ్రీవాల్‌కి ఎప్పుడైనా ఏదైనా జరుగొచ్చని వైద్య నివేదికలు చెబుతున్నాయని ఆయన అన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంతో బీజేపీ చెలగాటమాడుతోందని, మొదట్లో స్వీట్లు తినిపించి షుగర్ లెవల్స్ పెంచే ప్రయత్నం చేశారని, ఇప్పుడు తిండి తగ్గించేశారని చెబుతున్నారని, ఎవరైనా ఎందుకు ఇలా చేసి తమకు ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటారని సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇటీవల కేజ్రీవాల్ తనకు తాను ఉద్దేశపూర్వకంగా అనారోగ్యానికి గురవుతున్నాడని చెప్పారు. తమ నాయకుడిని చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సూచించిన వైద్య ఆహారం, మందులు వినియోగించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్, దీని వెనక కారణాలను విశ్లేషించాలని అధికారుల్ని కోరారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు సూపరింటెండెంట్ నివేదికను ఉటంకిస్తూ.. ఇంట్లో వండిన ఆహారాన్ని తగినంతగా అందించినప్పటికీ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీలను తీసుకోవడాన్ని ప్రస్తావించారు.

 

యూఏఈపై ఇండియా ఘన విజయం.. సెమీస్కు భారత్
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో భారత్ ఘన విజయం సాధించింది. యూఏఈపై 78 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ 201 పరుగులు చేయగా.. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటింగ్లో అత్యధికంగా కవిషా ఎగోడాగే (40*) పరుగులు చేసింది. ఆ తర్వాత ఇషా ఓజా (38) పరుగులు సాధించింది. ఖుషీ శర్మ (10) రన్స్ చేసింది. మిగత బ్యాటర్లందరూ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జట్టు విజయం సాధించింది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. ఆ తర్వాత రేణుకా సింగ్, తనుజా కన్వార్, పూజా వస్త్రాకర్, రాధ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ (37), స్మృతి మంధాన (13) పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత దయాళన్ హేమలత (2) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది. తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (66), రిచా ఘోష్ (64) పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ స్కోరును పెంచారు. హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. రిచా ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఆ తర్వాత.. జెమీమా రోడ్రిగ్స్ (14) పరుగులు చేయడంతో భారత్ 201 పరుగుల భారీ స్కోరు చేసింది. యూఏఈ బౌలర్లలో కవిషా 2 వికెట్లు పడగొట్టింది. సమైరా, హీనా చెరో వికెట్ తీశారు. కాగా.. భారత్ ఈ మ్యాచ్ విజయంతో సెమీఫైనల్కు చేరుకుంటుంది.

 

బీసీసీఐ కీలక ప్రకటన..భారతీయ అథ్లెట్లకు 8.5 కోట్ల సాయం
పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ టోర్నీపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. జులై 26 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. జులై 26న ప్రారంభోత్సవం, ఆగస్టు 11న ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం భారత అథ్లెట్ల బృందం రికార్డు బద్దలు కొట్టి పతకం సాధించేందుకు పూర్తిగా సిద్ధమైంది. అయితే అదే సమయంలో.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కూడా తమ అథ్లెట్ల నుంచి పతకాలు ఆశిస్తున్నట్లు తెలిపింది. ఒలింపిక్ ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కి బీసీసీఐ రూ.8.5 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిసిందే. ఇది కాకుండా.. క్రీడా మంత్రిత్వ శాఖ 140 మంది సహాయక సిబ్బందిని ఆమోదించింది. ఇందులో క్రీడా అధికారులు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఖర్చుతో 72 మంది సహాయక సిబ్బందిని మంజూరు చేశారు. పారిస్ ఒలింపిక్స్ జూలై 26న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు పాల్గొని 7 పతకాలు సాధించారు. వీటిలో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సాధించిన చరిత్రాత్మక స్వర్ణ పతకం కూడా ఉంది. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆటగాళ్లలో షాట్‌పుట్ అథ్లెట్ అభా ఖతువా పేరు జాబితాలో లేదు.