NTV Telugu Site icon

Top Headlines @ 9PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మాటలకందని విషాదం.. ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో 14 మంది మృతి
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్లు తెలిసింది. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్‌ పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని భావించి.. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు కోసం భారీ క్రేన్లను అధికారులు తెప్పించారు. 5గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అంబులెన్సుల్లో మృతదేహాలు, బాధితులను తరలిస్తున్నారు. శిథిలాల తొలగింపు పూర్తయితే కానీ మృతులు, క్షతగాత్రుల సంఖ్య తేల్చ లేని పరిస్థితిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పకూలిన పరిశ్రమ శిథిలాల కింద కార్మికులు నుజ్జునుజ్జయ్యారు. 33మంది ప్రభావానికి గురయ్యారని అధికారులు ప్రకటించారు.ఎసెన్షియా ఫార్మా కంపెనీలో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పని చేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తం 12 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపుచేశాయి. అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

 

రేపు అచ్యుతాపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్‌ పేలిన ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. శిథిలాల తొలగింపు పూర్తయితే కానీ మృతులు, క్షతగాత్రుల సంఖ్య తేల్చ లేని పరిస్థితిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ప్రమాద ఘటనపై హెల్త్ సెక్రటరీ, ఇండస్ట్రీస్ సెక్రటరీ , ఫ్యాక్టరీస్ డైరెక్టర్ , లేబర్ కమిషనర్ , బాయిలర్స్ డైరెక్టర్, ఎస్డీఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారుతో ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. తీవ్రంగా గాయపడిన 41 మందికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని ఆయన ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

 

అందుకే వాళ్లకి రుణమాఫీ కాలేదు.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి.. మంత్రి సూచన
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు. “రైతులను దగా చేసి, అయోమయానికి గురి చేసింది గత ప్రభుత్వం.. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ మొదటి పంటలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో.. హామీని అమలు చేశాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లాంటి సాంకేతిక ఇబ్బందులు వల్ల కొన్ని ఆగాయి. ఆగస్టు 14 లోపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు లిస్టు తయారు చేసి ఇచ్చారు. దానికి అనుగుణంగా చేశాం. గత ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కొద్ది మంది రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41.78 892లక్షల మంది రుణాలు తీసుకున్న లిస్టు వచ్చింది. 40 బ్యాంకుల నుంచి వచ్చిన లిస్టు ప్రకారం నగదు జమ చేశాం.” అని ఆయన వెల్లడించారు. రూ. 31 లక్షల కోట్లు అవసరమని మంత్రి అన్నారు. ఆగస్టు15 న రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. సర్వర్ ఇబ్బందులతో మరి కొన్ని బ్యాంకులు కొంత మంది లిస్ట్ ఇవ్వలేదన్నారు. నిసిగ్గుగా నిర్లజ్జగా ప్రతి పక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. “గత ప్రభుత్వం ఎన్నికలకి కొద్ది రోజుల ముందు బూటకపు మాటలతో ఓఆర్ఆర్ ను అమ్మి రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని కొద్ది మందికి మాఫీ చేశారు. దేశ చరిత్రలో మొదటి సంవత్సరం, మొదటి పంటలోనే ఋణాలు మాఫీ చేసిన ఘనట కాంగ్రెస్ ది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే… ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రతి కుటుంబానికి ఋణ విముక్తి చేయడానికి మేము ఓ మంచి నిర్ణయం తీసుకున్నాం. కాగ్ నివేదిక కూడా గత ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇలాంటి చిల్లారా రాజకీయాలు మానుకోవాలి. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం… పూర్తి చేశాం. రుణమాఫీ కాని వాళ్ళు.. బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే ఆ తర్వాత వాళ్లవి కూడా రుణమాఫీ చేస్తాం.” అని వ్యాఖ్యానించారు.

 

ట్రాఫిక్‌ పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులో ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరించట్లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నిబంధనల అమలు చేయటంలో పోలీసులు విఫలమవుతున్నారని హైకోర్టు మండిపడింది. మోటారు వాహనచట్ట నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసి పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారించింది. ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని న్యాయవాది వాదించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం 4 వారాలకు వాయిదా వేసింది.

 

నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి..
రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేరం చేస్తే శిక్ష తప్పుదు అనే భయం కనిపించేలా పోలీసు శాఖ పనిచేయాలని సీఎం అన్నారు. నేరం జరిగిన తరువాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తు అయితే…అసలు నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని సీఎం అన్నారు. ప్రజల భద్రతకు ఒక భరోసా ఇచ్చేలా పోలీసు శాఖ పనిచేయాలని.. పూర్తి స్థాయి శాంతి భద్రతలతో మళ్లీ ప్రశాంతమైన రాష్ట్రంగా ఏపీ కనిపించాలని సీఎం అన్నారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని అన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్థులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. హోం శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో గత పదేళ్లలో పోలీసు శాఖలో నెల‌కొన్న పరిస్థితులపై అధికారులు వివరించారు. 2014-19 పోల్చితే 2019-24లో క్రైం రేట్ 46 శాతం పెరిగిందని అధికారులు వివరించారు. 2014-19 తో పోల్చుకుంటే 2019-23 మధ్యకాలంలో మహిళలపై నేరాలు 35.91 శాతం, మహిళల అదృశ్యం కేసులు 84.83 శాతం, సైబర్ నేరాలు 134.43 శాతం పెరిగాయని తెలిపారు. అలాగే గంజాయి, డ్రగ్స్ కేసులు 107.89 శాతం, చిన్న పిల్లలపై నేరాలు 151.88 శాతం పెరిగాయని వెల్లడించారు. గత ప్రభుత్వ తీరుతో పోలీసు శాఖ ఎలా నిర్వీర్యమైందో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీసు శాఖలో ఆయా విభాగాలకు ఇవ్వాల్సిన చిన్న చిన్న ఆర్థిక మొత్తాలను కూడా చెల్లించకపోవడం వల్ల పోలీసులు, పోలీసు శాఖ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.పోలీసు శాఖ వద్ద 143 డ్రోన్లు ఉంటే అందులో 88 పనిచేస్తున్నాయని తెలిపారు. బాడీ వోర్న్ కెమెరాలు 1250 ఉంటే 444 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో 1180 కెమేరాలకు గాను కేవలం 317 మాత్రమే పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14,712 సీసీ కెమెరాల్లో 2371 కెమేరాలు పనిచేయడం లేదని వివరించారు. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం కూడా పనిచేయడం లేదని తెలిపారు. వీటన్నింటినీ తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన‌ రూ. 30 కోట్లు నిధులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల చాలా సేవలు అందుబాటులో లేకాండా పోయాయని.. వీటి వల్ల నేర విచారణలో తీవ్ర ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని తెలిపారు. పోలీసు విభాగంలో 2014-19 మధ్య 5215 వాహనాల కొనుగోలుకు రూ.221.8 కోట్లు ఖర్చు చేస్తే.. గత ప్రభుత్వం కేవలం రూ.67.3 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాలం చెల్లిన వాహనాలతో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోందని…ప్రస్తుతం 2812 వాహనాల కోసం రూ.281 కోట్లు బడ్జెట్ అవసరమ‌ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

 

పంచాయతీ ఎన్నికలపై కీలక సమాచారం..!
పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారీ, ప్రచురణపై అధికారులతో చర్చించారు. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అసెంబ్లీ ఓటరు లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారీ, ప్రచురణ కొరకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. 06.09.2024న వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటరు లిస్టులు ఆయా జిల్లాల్లో మండల అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీలలో ప్రచురిస్తారు. ఆ డ్రాఫ్ట్ ఓటరు లిస్టులపై జిల్లా కలెక్టర్లు, మండల అభివృద్ధి అధికారులు 09.09.2024, 10.09.2024 తేదీలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి, మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. వారి సూచనలు, సలహాలు స్వీకరించనున్నారు. ఈ డ్రాఫ్ట్ ఓటరు లిస్టులపై 07.09.2024 తేదీ నుంచి 13.09.2024 తేదీ వరకు సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు/ మండల అభివృద్ధి అధికారులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని 19.09.2024 తేదీలోగా పరిష్కరించనున్నారు. 21.08.2024 తేదీ నాడు వార్డుల వారీ, గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటరు జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీ, మండల పరిషత్ లలో ప్రచురిస్తారు. ఈ ఓటరు లిస్టుల తయారీ ప్రచురణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈనెల 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.

 

T-Safe: అమ్మాయిలూ.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా?
అమ్మాయిలు, మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్చి 12 2024లో, టీ సేఫ్ అనే యాప్ ను లాంచ్ చేశారు. ఇప్పటివరకు 15,000 మందికిపైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తోంది. అపాయంలో ఉన్న మహిళలను గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలా ఈ యాప్ పనిచేస్తోంది. స్మార్ట్ ఫోన్ లో కాకుండా, సాధారణ ఫోన్ల ద్వారా కూడా టీ సేఫ్ వాడొచ్చు. మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా ఈ యాప్ ను అభినందిస్తూ హీరో మాధవన్ టీ సేఫ్ ప్రచార వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కోల్ కత్తా మహిళా డాక్టర్ హత్య నేపథ్యంలో టీ సేఫ్ దేశ వ్యాప్తంగా మరోసారి చర్చలోకి వచ్చింది. టీ సేఫ్ యాప్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందు కొచ్చాయి. ఇతర రాష్ట్రాలకు టీ సేఫ్ యాప్ ఆదర్శంగా మారటం, ప్రముఖ హీరో మాధవన్ తన ఎక్స్ అకౌంట్లో వీడియోను అప్లోడ్ చేసి ప్రమోట్ చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అమ్మాయిలు మహిళలు ఈ యాప్ ను వినియోగించాలని సూచించారు. మరింతగా ఈ యాప్ ను వినియోగం లోకి తేవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. అవగాహనా రాహిత్యం వల్ల చాలా మంది అమ్మాయిలు, మహిళలు ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులు అందరూ తప్పకుండా ఈ యాప్ ను వినియోగించాలి. ప్రస్తుతం వనితల భద్రత కత్తిమీద సాములా మారింది. ఓ కంట కనిపెట్టుకుని ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట కీచకుల చేతికి చిక్కి బలవుతున్నారు. అందుకని ఈ యాప్ ను మీరు డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు పది మందికి అవగాహన కల్పించాలి. ఇంట్లో కూర్చొని చేసే ఈ స్వల్ప సాయం వల్ల రేపటి రోజున ఏదో ఒక చెల్లిని రక్షించిన వాళ్లమవుతాం. రామవారధి నిర్మాణంలో ఉడుత సాయంలా ఈ యాప్ గురించి ప్రతిఒక్కరికి తెలిసేలా చేద్దాం. మన సామాజిక కర్తవ్యాన్ని పూర్తి చేద్దాం.

 

ఆరోజే ఫాం హౌజ్ నాది కాదంటే అయిపోయేది కదా?
ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయకండని చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ప్రకారం ఎవరు కట్టినా 24 గంటల్లో కూల్చివేయండని డిమాండ్ చేశారు. చెరువులు, కాలువలకు అడ్డంగా కడితే ఏమవుతుందో వయనాడ్ ఘటనే ఉదాహరణ అని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష కోసం హైడ్రా వాడొద్దు.. అధికార పార్టీ నుంచే ఈ కూల్చివేతలు మొదలవ్వాలన్నారు. రైతు ఋణమఫీ ఆగస్ట్ 15లోపు చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు చెప్పారని గుర్తు చేశారు. గతంలో పదవులను గడ్డిపోచల్లగా వదిలేశామని హరీష్ రావు చెప్పారని.. ఇప్పుడు కూడా ఓ సారి పదవిని వదిలేయాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ మంత్రి, హరీష్ రావు గ్రామానికి వెళ్లి రుణమాఫీపై అడగండన్నారు. అందరికి మాఫీ అయితే హరీష్ రావుని అక్కడే రాజీనామా చేయించాలని కోరారు. కాగా..తాజాగా జన్వాడ ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం తనిఖీల కోసమే హైడ్రా అక్కడికి వెళ్ళిందని లాయర్ చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. కేసు విచారణను ముగించండి.. నిబంధనల మేరకే వ్యవహరిస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు.

 

పోలాండ్ చేరుకున్న మోడీ.. 45 ఏళ్ల తర్వాత తొలిసారి!
ప్రధాని మోడీ రెండు విదేశీ పర్యటనల్లో భాగంగా బుధవారం పోలాండ్ చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతం లభించింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మోడీకి స్వాగతం పలికారు. ఈ పర్యటన భారతదేశం-పోలాండ్ స్నేహానికి ఊపందుకుంటుందని… ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత్‌, పోలెండ్‌ల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ అక్కడ పర్యటిస్తున్నారు. అయితే గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలెండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్‌ పోలెండ్‌ను సందర్శించారు. గురువారం పోలాండ్ నుంచి ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. రైల్లో 10 గంటలు ప్రయాణం చేసి మోడీ కీవ్ చేరుకుంటారు. దాదాపు 7 గంటల పాటు అక్కడ గడుపుతారు. ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు. రష్యాతో యుద్ధం తర్వాత మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ రైలు మార్గంలోనే పోలెండ్‌ చేరుకుంటారు. అనంతరం పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగొస్తారు.

 

ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్ల ప్రయోగం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లు గోలన్ హైట్స్‌ను తాకాయి. దీంతో ప్రైవేటు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా బుధవారం ఈ దాడి జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో 19 మంది గాయపడ్డారు. గాజాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య గత 10 నెలలుగా తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల హమాస్ అగ్ర నేత హనియే, అలాగే హిజ్బుల్లా అగ్ర నేతలు మృతి చెందారు. దీనికి ఇజ్రాయెల్‌ కారణమని భావిస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌లో హనియే హతం కావడంతో ఇజ్రాయెల్‌పై పగతో రగిలిపోతున్నారు. ఏదొక క్షణంలో ఇరాన్ దాడులకు తెగబడవచ్చని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌పై అమెరికా అండగా నిలిచింది.