NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాలంటే కేంద్ర నిధులు కీలకం.. ఎంపీలకు సీఎం దిశానిర్ధేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించారు. భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏపీ సీఎం చంద్రబాబు ఎంపీలకు వివరించారు. జగన్ ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారనే విషయాన్ని ఎంపీలకు సీఎం చంద్రబాబు వివరించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే కేంద్ర నిధులను తేవడం చాలా కీలకమని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ చెప్పేవన్నీ తప్పుడు విషయాలనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలని ఎంపీలకు సూచించారు. అనవసర విషయాలపై మన ఫోకస్ పెట్టేలా రాజకీయం చేసే జగన్ ఉచ్చులో పడకూడదన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..”జగన్ పోతూ పోతూ ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయాడు. ఒకట్రెండు కార్పొరేషన్లకే నిధులన్నీ మళ్లించేశాడు. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా చేశారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాష్ట్రాభివృద్ధిని సవాల్‌గా తీసుకుని నిర్మాణాత్మకంగా పని చేద్దాం. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలు. శాంతి భద్రతలపై ప్రభుత్వం పెట్టే శ్వేతపత్రంలో వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదు. గంజాయి, మాదకద్రవ్యాల సంస్కృతి వల్లే ఈ అనర్ధాలు. వినుకొండ హత్య గంజాయి ప్రభావం వల్లే జరిగిందని వైసీపీ నేతలే ఒప్పుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో నేతలంతా క్రమశిక్షణగా వ్యవహరించాలి. వైసీపీ అబద్ధపు విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడద్దాం.”అని ఆయన అన్నారు.

 

ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం.. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఉదయం నుంచి నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో వర్షం తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో.. హైదరాబాద్కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు అర్ధరాత్రి వరకు హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో.. జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులను ఐఎండీ అలర్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్తో పాటు వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. తాజాగా హైదరాబాద్తో పాటు మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మరో రెండు నుంచి మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు బలమైనా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలానే చెరువులు, కుంటలు నిండిపోయాయి.

 

రాబోయే 2 రోజులు ఏపీలో వానలే వానలు..!
ఏపీలో గత ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. రాష్ట్రంలో వర్షాలకు కారణం వాయుగుండమేనని అని ఆయన వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఎక్కువగా భారీ నుంచీ అతిభారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు కూర్మనాధ్. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలలో నుంచీ ఎవరూ వెళ్ళద్దని ఆయన సూచించారు‌.. ఇప్పటికే చంద్రబాబు వరద పరిస్ధితులపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. మొత్తం జిల్లా యంత్రాంగాలకి సెలవులు రద్దు చేసి క్షేత్రస్ధాయిలో పని చేస్తున్నారని.. ఎనిమిది జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక సమీక్షను సీఎం చంద్రబాబు నిర్వహించారని చెప్పారు. ఏపీలో అనేక ప్రాంతాల్లో 5 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ రోణింకి కూర్మనాధ్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ మాట్లాడుతూ.. “గోదావరి నదికి వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న డ్యాంలను ఎప్పటికప్పుడు స్థిరీకరిస్తున్నాం.. ప్రకాశం బ్యారేజికీ ఎగువన ఎలాంటి ఇబ్బంది లేదు.. వరద ప్రభావం తక్కువే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు వెళ్ళే జాలర్లు వేటను విరమించుకోవాలి. తుఫాను తీరం దాటే వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.” అని ఆయన సూచించారు. వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్‌కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ వాయవ్యంగా కదులుతూ, ఒడిశా-ఛత్తీస్ గఢ్ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా, హౌసింగ్ శాఖ స్పెషల్ సీఎస్ గా వికాస్‌రాజ్‌ను నియమించారు. జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్.. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ కొర్రా లక్ష్మి.. రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా హరీష్.. మేడ్చల్ మల్కాజ్‌గిరి అదనపు కలెక్టర్‌గా రాధికాగుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు.

 

కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మించారు..
ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. మీటింగ్ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.., నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్తో సమావేశం జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘ చర్చ జరిగిందని అన్నారు. సోమవారం మళ్ళీ ఇంజనీర్ల స్థాయిలో సమావేశం కొనసాగనుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అట్టహాసంగా, ఆర్భాటంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు.. ఎక్కువ పైసలు ఖర్చు పెడితే, ఎక్కువ కమిషన్ వస్తుందనే కక్కుర్తితో నిర్మాణం చేపట్టారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుడు వెదిరే శ్రీరామ్ కమిషన్ కు అఫిడవిట్ కూడా ఇచ్చారు.. లక్ష కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించారని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కాళేశ్వరంలో ఐదేళ్ల పాటు పంప్ అయిన నీళ్ళు 65 టీఎంసీలు.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయి అన్ని పంపులు పని చేస్తే ఏడాదికి కరెంట్ ఛార్జీలే 10 వేల కోట్లు ఖర్చు కానున్నాయని అన్నారు. వడ్డీకి రూ.15 వేల కోట్లు, విద్యుత్ ఛార్జీలకు రూ.10 వేల కోట్లు ఖర్చు కానుందని తెలిపారు. మేడిగడ్డ ఫౌండేషన్ ఆరడుగులు కుంగి పోయింది.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజ్ అయిందని మంత్రి తెలిపారు. భారత దేశంలో పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడ్డ డ్యాం సేఫ్టీ అథారిటిని స్టడీ చేయాలని కోరామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అబద్దాలు చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలని కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ దోపిడీ విధానాలతోనే లోపాలు జరిగాయని పేర్కొన్నారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారు.. వారి హయాంలోనే కూలిందని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ అధికారులకు కేటీఆర్ కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉందని భావిస్తున్నామన్నారు. నాశనం చేసిన వారే సలహాలు ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ల ఉచిత సలహాలు అవసరం లేదు.. సాంకేతిక కమిటీ నిపుణుల సలహాల మేరకే ముందుకు వెళతామని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

 

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో రైతులకు రుణమాఫీ అవుతున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హులైన రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేయనుంది. మొదటగా లక్ష లోపు ఉన్నవారికి రుణమాఫీ అయింది. ఈ క్రమంలో.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన మొదట్లోనే 31 వేలకోట్ల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం అని అన్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతు వేదికల వద్ద ఏఓ ఉంటారు.. సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీల ఆత్రుతతో రైతులను ప్రక్కదోవ పట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. మీడియాలో తప్పుడు వార్తలొస్తున్నాయి. కానీ నిజ నిజాలను తెలుసుకొని ప్రసారాలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతులను ఆగం చేయకుండా, అయోమయానికి గురి చేయొద్దని సూచించారు. రుణమాఫీకి అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది.. ఏ ఒక్క రైతుకు అన్యాయం కానివ్వం అని అన్నారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందొద్దు.. ఇంత మంచి కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి, కానీ బురదజల్లే కార్యక్రమం చేయొద్దని సూచించారు. రైతుబందుకు మూటకట్టి పెట్టలేదు గత ప్రభుత్వం.. చెల్లించకుండా ఉంటే తమ ప్రభుత్వం వచ్చాక చెల్లించామని తెలిపారు. అలాగే.. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతులు నమ్మకంగా ఉండండి.. గత ప్రభుత్వం చేసిన మోసం వల్ల తమపై అపనమ్మకం పెట్టుకోవద్దు రైతులకు విజ్ఞప్తి చేశారు. రెండు లక్షల రుణమాఫీ అర్హులైన ప్రతి రైతుకు చేస్తామని తెలిపారు. ఇంకా నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉంటాము.. చేయకపోతే నిలదీయండని మంత్రి చెప్పారు.

 

సింహాచలం గిరి ప్రదక్షిణను శాస్త్రోక్తంగా ప్రారంభించిన దేవస్థానం
విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. సింహాచలం గిరి ప్రదక్షిణను దేవస్థానం శాస్త్రోక్తం ప్రారంభించింది. వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి పూల రథాన్ని జెండా ఊపి ఆలయ అనువంశిక ధర్మకర్త, చైర్మన్ అశోక్ గజపతి రాజు ప్రారంభించారు. ఏటా ఆషాఢ పౌర్ణమి రోజు సింహాద్రి అప్పన్న కొండ చుట్టూ 32కి.మీ ప్రదక్షిణ చెయ్యడం భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. ఏటా ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు లక్షలాది భక్తులు సింహాచలం పుణ్యక్షేత్రానికి తరలివస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ఆధ్యాత్మిక యాత్ర కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ యాత్ర కోసం ఐదుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు 2,600 మంది పోలీసు సిబ్బంది. భారీగా భక్తులు తరలివస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని సిటీ పోలీస్ కమిషనర్ ఎస్.బాగ్చీ తెలిపారు. 32కి.మీ గిరిప్రదక్షిణ పూర్తయ్యే సరికి రేపు మధ్యాహ్నం 11 అవ్వొచ్చని.. అప్పటి వరకు గిరిప్రదక్షిణ జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. అప్పుఘర్ దగ్గర భక్తులు పుణ్య స్నానాలు చేసి తిరిగి యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. బీచ్ దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకాకుళం ఎస్పీకి అక్కడ బాధ్యతలు అప్పగించామన్నారు. మరోవైపు.. గిరిప్రదక్షిణ కారణంగా ఈ రోజు, రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.. వివిధ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని.. భక్తులు, ప్రజలు గమనించాలని సూచించారు అధికారులు.. నగరం మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించినట్టు పేర్కొన్నారు.. అయితే, సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ నుంచి అడవివరం, ధారపాలెం, ఆరిలోవ, హనుమంతువాక పోలీసు క్వార్టర్స్, కైలాసగిరి టోల్ గేట్, అప్పుఘర్ జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్, వెంకోజీపాలెం, హెచ్‌బీ కాలనీ, కైలాసపురం, మాధవధార, మురళీ నగర్, బుచ్చిరాజు పాలెం, లక్ష్మీ నగర్, ఇందిరా నగర్, ప్రహ్లాదపురం, గోశాల జంక్షన్, లి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేసుకోవాల్సి ఉంటుంది.. మొత్తంగా గిరిప్రదక్షణ 32 కిలో మీటర్ల మేర సాగుతుంది.. కాగా, ఈ గిరి ప్రద‌క్షిణ‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు త‌మిళనాడు, క‌ర్ణాట‌క‌, ఒడిశా, తెలంగాణ త‌దిత‌ర రాష్ట్రాల నుంచి భ‌క్తులు పెద్ద సంఖ్యలో వ‌చ్చి పాల్గొంటారు. ఇక, గిరి ప్రద‌క్షిణ సంద‌ర్భంగా ఈ రోజు, రేపు ఆర్జిత సేవ‌ల‌న్నీ ర‌ద్దు చేశారు. జులై 20న ఉద‌యం గిరి ప్రద‌క్షిణ ప్రారంభించి, రాత్రికే తిరిగి సింహాచలం చేరుకునే భ‌క్తుల సౌక‌ర్యార్థం.. రాత్రి 10 గంట‌ల‌కు వ‌ర‌కు ద‌ర్శనాలకు అనుమతించనున్నారు.

 

ఒక్క ట్వీట్ తో ఐఏఎస్ పోస్ట్ ఊస్ట్.. ఆ ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరంటే.. ?
ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ చేసిన చట్టవ్యతిరేక పనులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని కదిలించింది. దీనిపై ప్రధాని కార్యాలయం దృష్టి సారించింది. ఇప్పుడు పూజా ఖేద్కర్ ఉద్యోగం ప్రమాదంలో పడింది. యూపీఎస్సీ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్‌సీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయం తొలిసారిగా ఎలా వెలుగులోకి వచ్చిందో తెలుసా? పూజా ఖేద్కర్ ఆడి కారు చిత్రాన్ని మొదటిసారి సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు జనాలు ఎదురుచూస్తున్నారు. ఐఏఎస్ పూజా ఖేద్కర్‌ను రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి పేరు వైభవ్ కోకట్. పూజా ఖేద్కర్ ఆడి కారు డిమాండ్ చేసిన విషయాన్ని తొలిసారి సోషల్ మీడియా ద్వారా అందరి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఆయనే. సోష‌ల్ మీడియా ప‌వ‌ర్‌ని అర్థం చేసుకున్న వైభ‌వ్.. ఓ ట్వీట్ చేయ‌డం వ‌ల్ల ఓ ఐఏఎస్ అధికారి పెద్ద ముప్పు తెచ్చిపెట్టింది. జులై 6న ‘X’లో పూజా ఖేద్కర్ గురించిన సమాచారాన్ని ఫోటోతో పాటు పోస్ట్ చేశాడు వైభవ్. ఆ తర్వాత క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌ను మీడియా దృష్టికి తీసుకెళ్లింది. దీని తర్వాత వైభవ్‌కు సామాజిక కార్యకర్తలు, ఆర్టీఐ (RTI) కార్యకర్తల నుంచి కాల్స్ వచ్చాయి. అప్పుడు పూజా ఖేద్కర్ గురించి మరింత సమాచారం బయటకి రావడం మొదలైంది. ఈ ఘటన తర్వాత పలువురు ఐఏఎస్ అధికారులు తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు.
వైభవ్ కోకట్ ఎవరు?
వైభవ్ బీడ్ జిల్లా కోకట్ నివాసి. సామాజిక, రాజకీయ అంశాలపై రాయడం ఆయనకు ఇష్టం. పీఆర్‌ కంపెనీలో కూడా పనిచేశాడు. ఎక్స్ లో అతనికి 31 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఒక రోజు ముందు.. జూలై 19 న పోలీసులు ఖేద్కర్‌పై కేసు నమోదు చేసినప్పుడు దీనిపై కూడా వైభవ్ మరొక పోస్ట్ చేశారు. “ఓ పోస్టుకు చాలా పవర్ ఉంది.. అన్యాయాన్ని ధైర్యంగా రాయండి. వ్యవస్థకు వ్యతిరేకంగా అన్యాయాన్ని నిలదీయండి. వ్యవస్థను సైతం వంచే శక్తి మీ రచనకు ఉంది.” అని పేర్కొన్నారు.

 

 

సింగపూర్ లో రెండో మాస్టర్స్.. పట్టా పొందిన పవన్ భార్య

ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. శ్రీమతి అనాకి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు తన సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అనా కొణిదెల ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్ లో హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికి గాను తొలుత డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో అనా మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

 

ఒక్కరోజులో భారీగా తగ్గిన ఇండిగో షేర్లు..ఇన్ని కోట్ల నష్టమా..!
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో ఏర్పడిన లోపం ప్రభావం ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిపైనా కనిపించింది. విమానయాన సంస్థలపై అత్యధిక ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలు నిలిచిపోయాయి. దీంతో విమానయాన సంస్థల షేర్లలో క్షీణత నెలకొంది. మనం భారతదేశం గురించి మాట్లాడినట్లయితే.. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో పెద్ద క్షీణత కనిపించింది. వీకెండ్స్ లో కూడా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఇండిగో స్పష్టం చేసింది. మార్గం ద్వారా.. విమానాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కానీ బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తనిఖీ చేయాలని కస్టమర్లందరినీ కంపెనీ అభ్యర్థించింది. ప్రయాణీకుల ఫ్లైట్ రద్దు చేయబడితే.. ప్రత్యామ్నాయ విమానం లేదా నగదు వాపసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ తన ఎక్స్ ఖాతా ద్వారా సమాచారం అందించింది. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే సంస్థను సంప్రదించాలని సూచించింది. దీనికి సంబంధించిన లింక్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో ఏర్పడిన లోపం వల్ల కంపెనీకి దాదాపు రూ.5300 కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈ డేటా ప్రకారం.. శుక్రవారం ఇండిగో షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. కంపెనీ షేర్లు రూ. 137.25 నష్టంతో రూ.4,278.95 వద్ద ముగిశాయి. అయితే ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు కూడా రోజు దిగువ స్థాయి రూ.4,251కి చేరాయి. అయితే కంపెనీ షేర్లు రూ.4,415 వద్ద ప్రారంభమయ్యాయి. జూన్ 10న కనిపించిన కంపెనీ 52 వారాల గరిష్టం రూ.4,610. షేర్ల పతనం కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా భారీ నష్టాన్ని చవిచూసింది. గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,70,539.48 కోట్లుగా ఉంది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఇది రూ.1,65,239.33 కోట్లకు చేరుకుంది. అంటే శుక్రవారం కంపెనీ మార్కెట్ క్యాప్‌లో రూ.5,300.15 కోట్ల నష్టం వచ్చింది.