Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

హలో ఇండియా.. ఆంధ్రాలో అరటి రైతుల దుస్థితి చూడండి..!
ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతుల దుస్థితిపై సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో అరటి రైతుల పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్‌లో కీలక ట్వీట్ చేశారు. “హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం ఏ స్థితిలో ఉందో చూడండి” అంటూ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకే అమ్మబడుతున్నాయి. మాచీస్‌ బాక్స్, బిస్కెట్ ప్యాకెట్ కంటే తక్కువ ధరకు అరటి రైతులు తమ పంట అమ్మాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చు పెట్టి, నెలల తరబడి శ్రమించిన రైతులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దిగ్భ్రాంతికరం అని అన్నారు. అరటితో పాటు ఉల్లి, టమాటా వంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్‌ జగన్‌.. అలాగే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహాయం అందించడంలేదని ఆరోపించారు. ఉచిత పంట బీమా లేదు.. విపత్తుల సమయంలో ఇన్‌పుట్ సబ్సిడీలు లేవు.. పంట సహాయం మాటలకే పరిమితం అంటూ విమర్శలు గుప్పించారు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్నుకు అరటి ధరను సగటున రూ.25,000 వరకు నిలబెట్టామని, అవసరమైతే రైతుల పంటను ఢిల్లీ వరకూ పంపేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని.. అలాగే కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి రైతులను రక్షించాం అని గుర్తుచేశారు. యువత, రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అని విమర్శిస్తూ.. “ఒక కిలో అరటి ధర 50 పైసలు అయితే.. ఆ రైతు చేతుల విలువ ఎంత?” అంటూ ప్రశ్నించారు వైఎస్‌ జగన్‌..

తాళ్లవలసలో విజృంభించిన డయేరియా.. సీఎం చంద్రబాబు ఆరా..
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని పరిస్థితులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం‌కు వివరించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు గ్రామంలోని ఆరుగురికి డయేరియా లక్షణాలు కనిపించగా, వారికి వెంటనే వైద్య సహాయం అందించడంతో పాటు టెక్కలి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరగా, మొత్తం బాధితుల్లో ఐదుగురు ఇంకా చికిత్స పొందుతున్నారని, ముగ్గురు రోగులు డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వివరించారు. ఈ ఘటనలో 70 ఏళ్ల చిన్నారావు అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే, చిన్నారావు మరణానికి డయేరియా కారణం కాదని, ఆయన ముందుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ వల్ల గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని అధికారులు స్పష్టం చేశారు. ఇక, గ్రామంలో ఉన్న ఒక బావి నుంచి ఐదు పబ్లిక్‌ కుళాయిలకు నీరు సరఫరా అవుతుండగా, మరో రెండు చేతి పంపుల ద్వారా కూడా త్రాగునీరు అందుతోందని అధికారులు వివరించారు. ఈ నీటి నమూనాలను గ్రామీణ జలవనరుల శాఖ (RWS) పరీక్షించగా, నీటిలో ఎక్కడా కలుషితం లేదని, తాగడానికి సురక్షితమని తేలినట్లు తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా బావి నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఎమ్మెల్సీ రాజీనామాల విషయంలో ట్విస్ట్..! రాజీనామా ఉపసంహరణ..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించి.. కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి ఆరుగురు రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.. అయితే, రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఆ తర్వాత కూటమి పార్టీల్లో చేరారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా రాజీనామా చేసి, తర్వాత బీజేపీలో చేరిన మండలి వైస్ చైర్‌పర్సన్ జకీయా ఖానుమ్, చివరి నిమిషంలో తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఈరోజు మండలి చైర్మన్‌ను కలిసి రాజీనామా ఆమోదించాలని కోరిన వైసీపీ ఎమ్మెల్సీలలో జకీయా ఖానుమ్ కూడా ఉన్నారు. అయితే, ఇతర సభ్యులతో పాటు రాజీనామా ప్రక్రియకు హాజరైన ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని మండలి చైర్మన్ వద్ద రాజీనామా ఉపసంహరణ లేఖను సమర్పించినట్లు సమాచారం. సమావేశంలో మండలి చైర్మన్ ఆమెను రాజీనామా కారణాల గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే చర్చల అనంతరం జకీయా ఖానుమ్ తన పదవిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం ఆమె వైసీపీకి రాజీనామా చేసి, అధికార జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు ఆమె రాజీనామా ఉపసంహరణ చేయడం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలకు తావిచ్చింది. జకీయా ఖానుమ్ ఎమ్మెల్సీ పదవిని కొనసాగించగలరా? లేక రాజీనామా ఉపసంహరణ చెల్లుబాటు అవుతుందా? అనే విషయంలో ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామంతో ఎమ్మెల్సీ రాజీనామాల వ్యవహారం మరింత హాట్టాపిక్‌గా మారింది.

నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు..
ఓ వైపు ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసు సంచలనంగా మారిన వేళ.. మరోవైపు నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపింది.. అయితే, విజయవాడలో నకిలీ మద్యం తయారీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నకిలీ లిక్కర్‌ కేసులో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జోగి రమేష్‌ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేశారు.. అయితే, తాజాగా, ఈ కేసులో జోగి బ్రదర్స్‌ కుమారులకు నోటీసులు అందజేశారు ఎక్సైజ్‌ పోలీసులు.. ఎక్సైజ్ శాఖ పంపిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరుకావాల్సిన వారు.. జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్, జోగి రోహిత్.. జోగి రాము కుమారుడు రాకేష్, రామ్మోహన్ ఉన్నారు.. ఈ నలుగురు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో ఎల్లుండి ఉదయం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు.. నకిలీ మద్యం తయారీ, నిల్వ, రవాణా మరియు పంపిణీ వ్యవహారంలో కీలక ఆధారాలు లభించడంతో విచారణను వేగవంతం చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కాగా.. అధికారులు కీలక అనుమానితుల ఆస్తి మరియు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరిన్ని ప్రముఖులు కూడా దర్యాప్తులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.. మొత్తంగా ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాము అరెస్ట్‌ కావడం.. ఇప్పుడు జోగి బ్రదర్స్‌ కుమారులు నలుగురికి నోటీసులు అందజేయడం చర్చగా మారింది.. కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్‌ అయిన జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రామును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. నాలుగు రోజుల పాటు ప్రశ్నించిన విషయం విదితమే.. నాలుగు రోజుల్లో మొత్తం 250 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది.. అయితే, ప్రతి ప్రశ్నకూ దాటవేత ధోరణిలోనే సమాధానాలిచ్చారట…

వైకుంఠ ద్వార దర్శనాలకు ఫుల్‌ డిమాండ్.. రికార్డుస్థాయిలో ఈ డిప్ రిజిస్ట్రేషన్లు..
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఇక స్వామివారి ఆలయంలో పరిమిత రోజులు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితి దృష్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలో.. వైకుంఠ ఏకాదశి నిర్వహణ టీటీడీకి ప్రతి సంవత్సరం కష్టతరంగా మారుతూ వస్తుంది. దీనితో ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు ఇబ్బందులు కలగని విధంగా ముందస్తూ ఏర్పాట్లు చేసింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. మొదటి మూడు రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలతో పాటు జనవరి ఒకటి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మొదటి మూడు రోజులుకు సంబంధించిన దర్శన టోకెన్లను ముందస్తుగానే కేటాయించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే మొదటి మూడు రోజులు దర్శనానికి అనుమతించబోతున్నారు. దర్శన టోకెన్లకు సంబంధించి కూడా గతంలో లాగా ఆఫ్ లైన్ విధానాన్ని రద్దుచేసి ఆన్‌లైన్‌ విధానంలో కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తుంది టీటీడీ.. నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు వరకు భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ఈ డిప్ విధానంలో దర్శన టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా టీటీడీ వెబ్‌సైట్‌, యాప్, వాట్సాప్ ల ద్వారా భక్తులను రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేయగా.. పెద్ద సంఖ్యలో భక్తులు ఆన్‌లైన్‌లో మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఐదు రోజులలో వ్యవధిలో 9 లక్షల 55 వేల రిజిస్ట్రేషన్లు జరుగగా.. వైకుంఠ ద్వార దర్శనం కోసం 24 లక్షల మంది భక్తులు రిజిస్టర్ అయ్యారు. టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా 37 శాతం.. యాప్ ద్వారా 57 శాతం.. వాట్సాప్ ద్వారా ఆరు శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరోవైపు మూడు రోజులకు సంబంధించి లక్షా 88 వేల దర్శన టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. మొదటి రోజు 62,000 మంది భక్తులకు.. రెండవ రోజు 69 వేల మంది భక్తులకు.. మూడవరోజు 57,000 మంది భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.

HILT పాలసీపై శ్రీధర్ బాబు కౌంటర్
హిల్ట్ పాలసీపై బీజేపీ, బీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నాయని పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ మరో ఢిల్లీలా కాలుష్య భరిత నగరంగా మారకుండా ఉండేందుకు పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలి ప్రాంతాలకు తరలించే నిర్ణయం తీసుకున్నామన్నారు. “బీఆర్ఎస్ పాలనలో ఫ్రీహోల్డ్ ఇచ్చినప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు హఠాత్తుగా వ్యతిరేకించడం ప్రజలకు అర్థమవుతుంది. మా ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తీసుకున్నదే. మున్సిపాలిటీల విలీనాలు కొత్త విషయం కాదు… గతంలోనూ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇలాంటి చర్యలు అనేక సార్లు జరిగాయి,” అని మంత్రి తెలిపారు. “మా జీవోలో ప్రభుత్వ భూములను లీజు నుంచి ఫ్రీహోల్డ్‌గా మార్చే అవకాశం లేదు. పట్టాలు ఉన్న వ్యక్తుల సొంత భూములకే కన్వర్షన్ ఫీజు విధించాం. కానీ బీఆర్ఎస్ హయాంలో మాత్రం ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీవోలు ఇచ్చారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులను బదిలీ చేసిన చరిత్ర కూడా వారిదే. హిల్ట్ పాలసీలో మేము ఎస్‌ఆర్‌వో రేటు కంటే ఎక్కువ కన్వర్షన్ ఫీజులు పెట్టాం. ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవం.” అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

మెట్రోలో మహిళల భద్రతకు నూతన అడుగు
హైదరాబాద్ మెట్రో రైలు దేశంలో అత్యాధునిక నగర రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో ప్రతిరోజూ సుమారు ఐదు లక్షల ప్రయాణికులకు సేవలందిస్తూ, నగర రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. రోజువారీ ప్రయాణికుల్లో మహిళల శాతం సుమారు 30 ఉండటంతో, వారి భద్రత, సౌకర్యం, విశ్వాసం మెట్రో రైలు నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత పొందుతున్న అంశాలుగా నిలుస్తున్నాయి. సమానత్వం, గౌరవం, సమాన అవకాశాలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా, ప్రజా సేవా రంగాల్లో ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని నియమించడంపై కూడా ప్రత్యేక దృష్టి ఇవ్వబడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు ఒక ప్రగతిశీల అడుగు వేసింది. మొత్తం 20 మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని భద్రతా విభాగంలో నియమించి, వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణ అందించి, ఈ రోజు నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో విధులు ప్రారంభించేలా చేసింది.

భారత్ లో పుతిన్ పర్యటన.. పాకిస్తాన్, చైనాకు వణుకు పుట్టేలా కీలక ఒప్పందాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడేళ్ల తర్వాత భారత్ లో పర్యటించనున్నారు. ఆయన చివరిసారిగా డిసెంబర్ 2021లో భారత్ ను సందర్శించారు. ఈసారి, 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 4-5 తేదీలలో జరుగనున్నది. ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, పుతిన్ మధ్య స్నేహాన్ని ప్రపంచం చూసేందుకు రెడీ అయ్యింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా, భారతదేశం రష్యాకు మద్దతు ఇవ్వడంలో స్థిరంగా ఉంది. ఈ పర్యటనలో పాకిస్తాన్, చైనాకు వణుకు పుట్టేలా కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. రక్షణ ఒప్పందాలు, ముఖ్యంగా కొత్త S-400 క్షిపణి వ్యవస్థ.

జాకెట్‌లో బాంబులు.. మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫోటో రిలీజ్ చేసిన పాక్
నొకుండిలోని ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) ప్రధాన కార్యాలయంపై జరిగిన తాజా దాడి పాకిస్థాన్ భద్రతా వ్యవస్థను కుదిపేసింది. ఈ దాడికి బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) బాధ్యత వహించింది. తాజాగా పాకిస్థాన్ FC ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకున్న మహిళా ఆత్మాహుతి బాంబర్ జరీనా రఫిక్ అలియాస్ తరంగ్ మహో ఫోటోను పాక్ అధికారులు విడుదల చేశారు. ఈ ఫోటోలో ఆమె ధరించిన జాకెట్‌లో మూడు బాంబులు కనిపిస్తున్నాయి. పేలుడు తర్వాత, కాల్పుల మోత చాలా సేపు కొనసాగింది. ఈ ఘటన మొత్తం నొకుండి ప్రాంతాన్ని కుదిపేసింది. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్యను ఇంకా భద్రతా సంస్థలు అధికారికంగా విడుదల చేయలేదు. దాడి జరిగిన తర్వాత మొదట్లో ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. కానీ తర్వాత బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) దీనికి బాధ్యత వహించింది. ఈ ఉగ్రసంస్థ ఉప యూనిట్లలో ఒకటి ఈ భారీ దాడిని నిర్వహించిందని పేర్కొంది. నొకుండిలోని రెకో డిక్, సందక్ మైనింగ్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న విదేశీ కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా పాక్ దర్యాప్తు బృందం దాడికి పాల్పడిన మహిళ ఉగ్రవాది ఫోటోను తాజాగా విడుదల చేసింది. ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడిన మహిళను జరీనా రఫీక్ అలియాస్ తరంగ్ మహోగా గుర్తించారు. ఆమె నొకుండిలోని FC ప్రధాన కార్యాలయ ప్రవేశద్వారం వద్ద తనను తాను పేల్చివేసుకుందని తెలిపారు.

మరో కేసులో.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఐదేళ్ల జైలు శిక్ష..
భూ కుంభకోణం కేసులో బంగ్లాదేశ్‌లోని ఓ కోర్టు పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆమె సోదరి షేక్ రెహానాకు ఏడేళ్ల జైలు శిక్ష, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును ది డైలీ స్టార్ నివేదించింది. ఢాకాలోని స్పెషల్ జడ్జ్ కోర్టు-4 న్యాయమూర్తి ఎండీ రబియుల్ ఆలం ఈ తీర్పును వెలువరించారు. అవినీతి నిరోధక కమిషన్ (ACC) దాఖలు చేసిన అవినీతి కేసుల్లో హసీనాకు సంబంధించిన నాల్గవ తీర్పు ఇది అని నివేదిక పేర్కొంది. పుర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్ట్ కింద ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ACC జనవరి 12, 14 మధ్య దాని ఢాకా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్-1లో ఆరు వేర్వేరు కేసులు దాఖలు చేసింది. అవినీతి నిరోధక సంస్థ ప్రకారం, హసీనా, సీనియర్ రాజుక్ అధికారులతో కలిసి, పుర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్ట్‌లోని సెక్టార్ 27లోని దౌత్య మండలంలో 10 స్టోరీస్ (7,200 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఆరు ప్లాట్లను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని, ప్రస్తుత నిబంధనల ప్రకారం వారు అనర్హులు అయినప్పటికీ, ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ పుతుల్‌తో సహా ఆమె బంధువుల కోసం ఈ భూమిని పొందారని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.

‘మిచెలిన్ కీస్ హోటల్స్ 2025’ జాబితాలో ఈ రెండు టాటా గ్రూప్ హోటల్స్.. భారత్‌కు తొలిసారి దక్కిన ఘనత
టాటా గ్రూప్ హోటల్ చైన్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ( IHCL) చరిత్ర సృష్టించింది. మిచెలిన్ గైడ్ IHCL రెండు ఐకానిక్ ప్యాలెస్ హోటళ్లను మొట్టమొదటి ‘ మిచెలిన్ కీస్ హోటల్స్ 2025’ జాబితాలో చేర్చింది. తాజ్ లేక్ ప్యాలెస్ ( ఉదయపూర్ ), తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ (హైదరాబాద్) ప్రతిష్టాత్మక ‘ త్రీ కీస్ ‘ అవార్డులను పొందాయి . భారత్ లోని ఏ హోటల్ అయినా ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి. హోటల్ ఇండస్ట్రీలో, మిచెలిన్ స్టార్లు రెస్టారెంట్ల నాణ్యతను గుర్తిస్తుండగా, మిచెలిన్ కీస్ హోటళ్ల నిర్మాణం, సర్వీస్ క్వాలిటీ, డిజైన్, వ్యక్తిత్వం, అతిథి అనుభవం గొప్పతనాన్ని గుర్తిస్తుంది. త్రీ కీస్ అంటే ” అసాధారణ బస “. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన హోటళ్ళు మాత్రమే ఈ విభాగంలో గుర్తింపు పొందాయి. ఈ విజయం పట్ల టాటా గ్రూప్ స్పందిస్తూ “మా IHCL ఆస్తులలో రెండు.. మూడు ప్రతిష్టాత్మకమైన మిచెలిన్ కీలను పొందడం భారతదేశానికి గర్వకారణం. ఇది దేశ ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రపంచ వేదికపై కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని తెలిపింది.

హైదరాబాద్‌లో బాలీవుడ్ స్టార్ అజయ్​ దేవ్‌​గన్​ ఫిల్మ్​ సిటీ
తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8 – 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ–విదేశాల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో పెట్టుబడులకు రిలయన్స్ గ్రూప్‌ ఆసక్తి చూపుతోంది. రిలయన్స్​‌కు చెందిన వెంటారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ .. నైట్ సఫారి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు మారనున్నాయి. ఫుడ్‌లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనున్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఈ కీలక ఒప్పందాలపై సంతకాలు కానున్నాయి.

‘ఉస్తాద్ భగత్ ‌సింగ్’ క్రేజీ అప్డేట్ లోడింగ్
ఓజీ సినిమాతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ సినిమా కోసం రంగంలోకి దిగారు. పవన్ అభిమానులలోనే కాకుండా, సినిమా ప్రేక్షకులలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎంతటి హిట్ సినిమానో తెలిసిందే. తాజాగా ఈ హీరో – డైరెక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ కాంబో తెరకెక్కుతున్న సినిమా నుంచి త్వరలో ఒక సూపర్ అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఫ్లోర్‌పై డ్యాన్స్ చేస్తున్న వీడియో క్లిప్‌ను పంచుకుంది. అలాగే అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. పవర్‌స్టార్ సందడి‌తో ఉస్తాద్ డిసెంబర్‌ వేడుకలు ప్రారంభం అయినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేకింగ్ వీడియోలో పవర్‌స్టార్ ‌పవన్‌ కళ్యాణ్‌ స్టైల్‌, ఎనర్జీ, మాస్‌ అటిట్యూడ్‌‌ను ప్రతిబింబించేలా సాంగ్‌ను రూపొందించినట్లు కనిపిస్తుంది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. పవన్‌–డీఎస్పీ కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన పాటలన్నీ సూపర్‌ హిట్‌ కావడంతో, ఈ కొత్త సింగిల్‌పై ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులలో మరింత హైప్‌ ఏర్పడింది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా కీ రోల్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఆనంద్‌సాయి పనిచేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. డిసెంబర్‌ నెల మొత్తం ఈ చిత్ర బృందం “ఉస్తాద్‌ భగత్‌సింగ్‌” ప్రమోషన్స్‌తో సందడి చేయనున్నట్లు సమాచారం.

Exit mobile version