NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

డిసెంబర్కు గ్రూప్-2 వాయిదా.. అధికారిక ప్రకటన
గ్రూప్-2 పరీక్షల వాయిదాపై టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనుంది టీజీపీఎస్సీ. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ, గ్రూప్‌ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో.. ఈరోజు సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చలు జరిపారు. అనంతరం పరీక్షల వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌లో నిర్వహించే పరీక్షల తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. గతేడాది మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే.. మొదటగా ఆగష్టు 9, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కాగా.. వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు.. గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. గ్రూప్ 2 పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ మరోసారి ప్రకటన చేసింది. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తి అయిన వెంటనే గ్రూప్- 2 పరీక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో తమకు కొంత సమయం కావాలని కొద్దిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్-2ను ప్రభుత్వం వాయిదా వేసింది.

 

ఏపీకి భారీ వర్ష సూచన.. ఏలూరు, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రేపు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడనుంది. ప్రస్తుతం వాయుగుండం పూరీకి 70 కిమీ, గోపాలపురికి 130, కళింగపట్నానికి 240కిమీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఏపీ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఉత్తరాంధ్రకు భారీ నుంచీ అతిభారీ వర్ష సూచన తేసింది. ఏలూరు, అల్లూరి జిల్లాలలో అత్యధికంగా వర్షాలు పడతాయని రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, అమలాపురం, కోనసీమ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. రాయలసీమ జిల్లాలలో 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది… భారీ వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం 3ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు మోహరించినట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్నవాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

 

ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోడీని కలుస్తాం..
ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలో వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ లేదని.. ఏపీలో పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో ఆటవిక పాలన నడుస్తోందని.. 45 రోజుల పాలనలో 36 హత్యా రాజకీయాలు, 300కు పైగా హత్యాయత్నాలు, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగిందని మాజీ సీఎం జగన్‌ అన్నారు . వైసీపీ సానుభూతిపరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. 490 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని వైఎస్‌ జగన్ అన్నారు.

 

వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు శ్రీకారం
వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. వికసిత్ భారత్ తరహాలో భాగస్వామ్యమయ్యేలా 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా విజన్ డాక్యుమెంటుపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మనుతో మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆమోగ్ సీఈఓకు చంద్రబాబు సూచనలు చేశారు. నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యంతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశంలో ఏపీ విజన్ డాక్యుమెంటుపై ప్రస్తావించారు. పేదరికం లేని సమాజం, జనాభా సమతుల్యతపై కసరత్తు చేసి ప్రణాళికలు రూపొందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..” అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సును అనుసంధానం చేస్తాం. ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నాం. రాష్ట్ర స్థాయి నుంచి కుటుంబ స్థాయి వరకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తాం. 15 శాతం గ్రోత్ రేట్ సాధించడమే ఏపీ లక్ష్యం.అనుకున్న విధంగా గ్రోత్ రేట్ సాధిస్తే తలసరి ఆదాయం పెరుగుతుంది.. పేదల జీవనం మెరుగవుతుంది. పేదరిక నిర్మూలనకు దిశగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నాం. సంపద సృష్టి పాలసీలతో 2047 విజన్ డాక్యుమెంట్ ఉండాలి.” అని ఆయన చెప్పారు.

 

హైడ్రా విధివిధానాలు విడుదల చేసిన ప్రభుత్వం..
లంగాణ ప్రభుత్వం హైడ్రా విధివిధానాలు విడుదల చేసింది. హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా మున్సిపల్ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి ఉండనున్నారు. అంతేకాకుండా.. హైదరాబాద్, రంగారెడ్డి ఇంఛార్జ్ మంత్రులు, జీహెచ్ఎంసి మేయర్, సీఎస్, డీజీపీ, ఎంఎయుడి ప్రిన్సిపల్ సెక్రటరీలు హైడ్రాలో సభ్యులుగా ఉంటారు. హైడ్రా అవసరమైన సబ్ డివిజన్‌లు, అవసరమైన మెటీరియల్, పరికరాలు, వాహనాలతో కూడిన ఫీల్డ్ టీమ్‌లతో తగిన సంస్థ నిర్మాణాన్ని కలిగి ఉండాలి. ట్రాఫిక్ నిర్వహణ కోసం హైడ్రా, దాని అధికారులు రెగ్యులర్ ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటారు. ముఖ్యంగా విపత్తుల సమయంలో ట్రాఫిక్‌ను నిర్వహించడానికి ప్రత్యేకంగా నీరు నిలిచిన ప్రాంతాలు, రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాలు, విపత్తు పీడిత ప్రాంతాలు, తుఫానుపై ట్రాఫిక్ జామ్‌లకు ప్రాధాన్యత ఇస్తారు. భారీ వర్షాల సమయంలో నీరు మొదలైనవి క్లియర్ చేయాలి. హైడ్రాకు బడ్జెట్ ప్రభుత్వం నుండి కేటాయింపు చేస్తుంది. GHMC, HMDA, TGIIC, TGSPDCL, HMWSSB, MRDCL, HGCL, ఇతర యుటిలిటీల వంటి సంస్థలు, స్థానిక అధికారుల నుండి చందాలు, రుసుముల ద్వారా నిధులు వినియోగిస్తారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ ఛైర్మన్ గా MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ, మెంబర్ కన్వీనర్ గా హైడ్రా కమిషనర్, సభ్యులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, DG TG డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్, HMWSSB మేనేజింగ్ డైరెక్టర్, HMDA మెట్రోపాలిటన్ కమిషనర్, GHMC కమిషనర్, HMRL మేనేజింగ్ డైరెక్టర్, TGSPDCL మేనేజింగ్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్-ఇన్-చీఫ్, TCUR ప్రాంతంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ULBల మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్, సబ్ కమిటీ నామినేట్ చేసిన ఇతర సభ్యులు ఎవరైనా ఉంటారు.

 

ఇంజనీరింగ్ అడ్మిషన్స్.. మొదటి విడత సీట్ల కేటాయింపు
తెలంగాణ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 78, 694 సీట్లు ఉండగా 75, 200 సీట్లు కేటాయించారు. అంటే 95.6 శాతం సీట్లు కేటాయించారు. 89 కాలేజీలో వంద శాతం సీట్లు కేటాయించారు. ఇందులో 7 యూనివర్సిటీ కాలేజీలు, 82 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో53, 890 సీట్లు ఉంటే 53, 517 సీట్లు కేటాయించారు. అంటే.. 99.31 శాతం సీట్లు కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో16, 344 సీట్లు ఉంటే 15, 127 సీట్లు కేటాయించారు. అంటే.. 92.55 శాతం సీట్లు కేటాయించారు. సివిల్, మెకానికల్ కోర్సుల్లో7, 339 సీట్లు ఉంటే 5, 689 సీట్లు కేటాయించారు. అంటే.. 77.52 శాతం కేటాయించారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులకు విద్యార్థులు జై కొట్టారు. అయితే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సులను కూడా విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. గతంతో పోల్చుకుంటే మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో కూడా సంఖ్య పెరిగింది. ఇంజనీరింగ్ సీట్లు అలాట్ అయినవారిలో 41,308(55 శాతం) బాయ్స్, 33,892 (45 శాతం) గర్ల్స్ ఉన్నారు. ఇంజనీరింగ్ సీట్లు అలాట్ అయిన వారిలో 20.4 శాతం ఓసీ(oc)లు, 52.6 శాతం బీసీలు, ఎస్సీలు 16.8 శాతం, ఎస్టీ లు 10.2 శాతం ఉన్నారు. తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభమైంది. జులై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎప్పుడు హాజరవుతారో స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి 13 వరకు 36 హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో ఏదో ఒకచోట సర్టిఫికెట్స్ పరిశీలనకు హాజరయ్యారు. పరిశీలన చేయించుకున్న వారు ఈ నెల 8 నుంచి 15 వరకు వారికి తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఈ నెల 19వ తేదీ తొలి విడత సీట్లు కేటాయించనున్నారు. కాగా.. షెడ్యూల్‌ ప్రకారం.. రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 26 నుంచి ప్రారంభంకానుంది. అలాగే.. చివరి దశ కౌన్సెలింగ్‌ ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతుంది.

 

ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భద్రతాపరంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా అధికారులందరూ ప్రిపేర్ కావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ జరపాలని నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగంతో తొలి రోజు సభ ముగియనుంది. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సభలో మూడు అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. మద్యం, శాంతి భద్రతలు, ఆర్థిక అంశాలపై సభలోనే శ్వేత పత్రాల విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది.

 

విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి.. కేంద్ర మంత్రి ఆదేశం
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావితమయ్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సాంకేతిక సమస్యల తర్వాత భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌ను సంప్రదించింది. అనేక దేశాల ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశాయి. స్పైస్‌జెట్, ఇండిగో మరియు అకాసా ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి సాంకేతిక సమస్యలను ఉదహరించాయి. ఇండిగో, స్పైస్‌జెట్‌ వంటి విమానయాన సంస్థలు సర్వర్‌ సమస్యల కారణంగా సర్వీసులు నిలిచిపోయాయని చెబుతున్నాయి. తాజాగా ఈ సమస్య పరిష్కారమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమస్య వల్ల విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ అంశంపై తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంతరాయం వల్ల ప్రభావితమైన ప్రయాణికులకు నీరు, ఆహారం అందిస్తుందని మంత్రి తెలిపారు. రామ్మెహన్‌ నాయుడు తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. “ప్రయాణికుల పట్ల విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు సానుభూతితో వ్యవహరించాలి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు అదనపు సీటింగ్‌, వాటర్‌, ఆహారాన్ని తప్పక అందించాలి. ప్రయాణీకుల సురక్షిత ప్రయాణం కోసం టెక్నికల్‌ టీమ్‌ కృషి చేస్తోంది. ఇలాంటి సమాయాల్లో ప్రయాణీకుల సహకారం కూడా తప్పకుండా అవసరం. టెక్నికల్ సమస్య, విమాన సర్వీసుల రాకపోకలపై ఎలాంటి అప్‌డేట్‌ ఉన్నా ప్రయాణీకులకు వెంటనే తెలియజేయాలి. విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అవసరాల కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాం. మైక్రోసాఫ్ట్‌ సంస్థతో అధికారులు టచ్‌లోనే ఉన్నారు. వీలైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ” అని తెలిపారు.

 

మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్యపై క్రౌడ్‌స్ట్రైక్ సీఈవో కీలక వ్యాఖ్యలు..
మైక్రోసాఫ్ట్ ఔటేజ్ వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇంతలో.. క్రౌడ్‌స్ట్రైక్ కంపెనీ సీఈఓ జార్జ్ కర్ట్జ్ ఈ సమస్య ఎందుకు తలెత్తింది.. దాన్ని పరిష్కరించడానికి ఏమి చేశారో వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. లోపభూయిష్ట కంటెంట్ అప్‌డేట్ వల్లే సమస్య మొదలైందని ఆయన అన్నారు. జార్జ్ కర్ట్జ్ తన ఎక్స్ ఖాతాలో “విండోస్ (Windows) హోస్ట్‌ల కోసం ఒకే కంటెంట్ అప్‌డేట్‌లో కనుగొనబడిన లోపం వల్ల ప్రభావితమైన కస్టమర్‌లతో క్రౌడ్‌స్ట్రైక్ పని చేస్తోంది. Mac మరియు Linux హోస్ట్‌లు ప్రభావితం కావు. ఇది సైబర్ దాడి కాదు. భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదు. సమస్య గుర్తించి పరిష్కారించాం.” అని రాసుకొచ్చారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వర్లు పనిచేయకపోవడానికి క్రౌడ్‌స్ట్రైక్ బాధ్యత వహిస్తుంది. క్రౌడ్‌స్ట్రైక్ ఒక అమెరికన్ సెక్యూరిటీ సంస్థ. ఈ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో సన్నిహితంగా పనిచేస్తుంది. ఐటీ కంపెనీలను హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉంచడంలో ఈ సంస్థ సహాయపడుతుంది. హ్యాకర్లు, సైబర్ దాడులు, డేటా లీక్‌ల నుంచి కంపెనీలను రక్షించడం దీని ప్రధాన విధి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బ్యాంకులు, విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ సంస్థలు ఈ కంపెనీకి ప్రధాన కస్టమర్‌లు కావడానికి ఇదే కారణం. సైబర్ ప్రపంచంలో ఇటీవలి కాలంలో చాలా మార్పులు వచ్చాయి. హ్యాకర్ల దాడుల కారణంగా.. క్రౌడ్‌స్ట్రైక్ వంటి సంస్థలపై కంపెనీల ఆధారపడటం పెరిగింది.
క్రౌడ్ స్ట్రైక్ యొక్క ప్రధాన ఉత్పత్తులలో ఒకటైన ఫాల్కన్ ఈ ఉత్పత్తిలో లోపం తలెత్తింది. కంపెనీ ఫాల్కన్ ఉత్పత్తి నెట్‌వర్క్‌లో హానికరమైన లేదా వైరస్-కలిగిన ఫైల్‌లను గుర్తిస్తుంది. ఇది హానికరమైన ఫైల్‌లను గుర్తించడానికి మరియు వైరస్‌లను ఆపడానికి ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తుంది.

 

దుబాయ్‌లో ప్రమాదకరంగా హీట్‌వేవ్.. యూఎస్ సైంటిస్టుల ఆందోళన
అత్యధిక ఉష్ణోగ్రతలు దుబాయ్‌ను హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం తేమ, వేడి అధికంగా ఉంది. ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తు్న్నారు. జూలై 17న 43 డిగ్రీల సెలియస్‌కు చేరుకోగా.. రెండు రోజుల్లోనే అమాంతంగా పెరిగిపోయింది. తాజాగా 19-07-2024న 62 డిగ్రీల సెలియస్‌కు చేరుకుంది. ఇది అత్యంత ప్రమాదకరమని వాషింగ్టన్ పోస్టు నివేదించింది. ప్రస్తుతం మానవదేహం హీట్‌వేవ్‌ను తట్టుకునే స్థాయి దాటిపోయిందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూఎస్ ఆధారిత వాతావరణ నివేదిక ప్రకారం దుబాయ్‌లో 62 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. ఇది అత్యంత తీవ్రమైందని పేర్కొంది. అధిక తేమ, అధిక ఉష్ణోగ్రత కారణంగా మానవ మనుగడ ప్రమాదకర స్థాయికి నెట్టేస్తోందని తెలిపింది. వెట్-బల్బ్ ఉష్ణోగ్రతలుగా పిలువబడే.. ఈ వాతావరణం 35 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండకూడదు. శరీరానికి 6 గంటలకు మించి ఉండకూడదు. లేదంటే ఇది ప్రాణాంతకంగా మారుతుందని తెలిపింది. తాజా హీట్‌వేవ్ పరిస్థితుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అవుట్ డోర్ పనులు మానుకోవాలని సూచించింది. వేడి సంబంధించిన వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. జూలై 17న యూఎస్ ఆధారిత వాతావరణ పరిశీలకులు సోషల్ మీడియా ఛానల్‌లో హైలెట్ చేశారు. ఇక హీట్‌వేవ్‌ను తట్టుకునేందుకు ప్రజలు ఏసీలను అధికంగా ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఈ హీట్‌వేవ్ పరిస్థితులు అక్టోబర్ వరకు కొనసాగనున్నాయి.