NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అక్టోబర్ 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి రెయిన్ అలర్ట్
వాతావరణ శాఖ సూచనల ప్రకారం మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ వివరించారు.
18 అక్టోబర్, శుక్రవారం:
• కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
19 అక్టోబర్, శనివారం:
• పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
20 అక్టోబర్, ఆదివారం:
• కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
21 అక్టోబర్, సోమవారం:
• అల్లూరి సీతారామ రాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గురువారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 80.5మిమీ,విశాఖ రూరల్లో 62.2మిమీ, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 60.7మిమీ అధిక వర్షపాతం నమోదైందన్నారు.

 

హమాస్ చీఫ్, అక్టోబర్ 07 దాడుల మాస్టర్ మైండ్ హతం.. ఇజ్రాయిల్ హిట్ లిస్టులో తొలిపేరు…
ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి, దాడులకు ఆదేశాలు ఇచ్చిన హమాస్ నేత, ప్రస్తుతం ఆ సంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ హతమార్చింది. ఈ వార్త నిజమైతే హమాస్‌ని కూకటివేళ్లతో పెకిలించినట్లే. పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా ఇదే మాట చెప్పాడు. తాము హమాస్‌ని మట్టుపెట్టేదాకా యుద్ధం ఆపేది లేదని స్పష్టం చేశాడు. తాజాగా సిన్వార్ మరణంతో ఇక యుద్ధానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. గాజా దక్షిణ ప్రాంతమైన రఫాలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చేసిన ఆపరేషన్‌లో సిన్వార్ మరణించినట్లు తెలుస్తోంది. సిన్వార్ చనిపోయినట్లు పలువురు ఇజ్రాయిలీ అధికారులు ధృవీకరించారు. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సిన్వార్‌తో సహా ముగ్గురు హమాస్ మిలిటెంట్లు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో ఇజ్రాయిలీ బందీలకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. గతేడాది అక్టోబర్ 07న హమాస్ రాకెట్లతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి దొరికినవారిని దొరికినట్లు చంపేశారు. ఆడామగా, పిల్లలు అనే తేడా లేకుండా 1200 మందిని హతమార్చారు. 251 మందిని గాజాలోకి బందీలుగా తీసుకెళ్లారు. వీరిలో 90 మంది వరకు ఇంకా గాజాలో బందీలుగానే ఉన్నారు. అప్పటి నుంచి హమాస్-ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు. అక్టోబర్ 07 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి యాహ్యా సిన్వార్. దాడికి రెండేళ్ల కాలం నుంచి ఇతను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయిల్ గత కొన్నేళ్లుగా సిన్వార్ గురించి వెతుకుతోంది. ముఖ్యంగా అక్టోబర్ 07 దాడి తర్వాత సిన్వార్ ఇజ్రాయిల్ ప్రైమ్ టార్గెట్‌గా మారాడు. ఇటీవల ఇరాన్ టెహ్రాన్‌లో అనూహ్య పరిస్థితుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హనియే హతమార్చబడ్డాడు. ఆ తర్వాత ఈ స్థానంలోకి అంటే, హమాస్ చీఫ్‌గా సిన్వార్ బాధ్యతలు చేపట్టాడు. బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే హతమయ్యాడు. నిజానికి సిన్వార్ గాజాలోని భూగర్భ సొరంగాల్లోనే తన భార్య, పిల్లలతో ఉంటాడు. అతడిని రక్షించడానికి బాడీగార్డ్స్ ఉంటారు. దాదాపుగా ఇజ్రాయిల్ జైలులో 22 ఏళ్ల గడిపిన సిన్వార్, 2011లో ఇజ్రాయిల్ సైనికులు కిడ్నాప్ చేయబడిన సమయంలో, హమాస్-ఇజ్రాయిల్ మార్పిడి ఒప్పందంలో భాగంగా విడుదలై గాజాలోకి వెళ్లాడు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకపోవడం, ఎక్కువగా కనిపించకపోవడమే సిన్వార్ ఇంత కాలం బతికేందుకు కారణమైంది. ఒక వేళ సిన్వా్ర్ ఒక్క తప్పు చేసినా, ఇజ్రాయిల్ ఎప్పుడో అతడిని హతమార్చేది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పలువురు హమాస్ కీలక నేతలు, కమాండర్లు చనిపోయినా.. సిన్వార్ జాడ దొరకలేదు. సిన్వార్ నేతృత్వంలోనే హమాస్ గాజాలో ఏళ్ల తరబడి భూగర్భ సొరంగాలను నిర్మించింది. గాజా యుద్ధం తీవ్రం కావడంతో సిన్వార్ దాదాపుగా ఎలక్ట్రానిక్ డివైజెస్‌ని వాడటం మానేశాడు. కేవలం కొరియర్ వ్యవస్థపేనే ఆధారపడ్డాడు. ఒకానొక సమయంలో తన స్థానాలను మార్చేందుకు బుర్ఖాలు ధరించి, ఆడవేషధారణలో ఉంటున్నాడనే వార్తలు కూడా వచ్చాయి.

 

 

మందుబాబులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్!
ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు. సోమవారం నాటికి 20,000 కేసుల మద్యం బాటిళ్లు చేరుకోనున్నాయని ఆయన తెలిపారు. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్ధమైందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన 5 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. గురువారం నాటికి పదివేల కేసుల రూ.99 మద్యం మార్కెట్‌కు చేరిందన్నారు. సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు. దశల వారిగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందన్నారు. మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం ఈ నెలలో అందుబాటులో ఉంటుందని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ పేర్కొన్నారు. వినియోగాన్ని బట్టి తదుపరి నెలలో ఏ మేరకు దిగుమతి చేసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

హరీష్, కేటీఆర్, ఈటెలకు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్
హరీష్.. కేటీఆర్.. ఈటెలకు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. మూడు నెలలు.. పేదలు కాళీ చేసిన ఇండ్లలో ఉండాలని.. కిరాయి తానే కడతానన్నారు. మూడు నెలలు అక్కడే ఉండి రాజకీయం చేయాలన్నారు. దాన కిషోర్ .. వాళ్లకు భోజనం కూడా పంపిస్తారని చెప్పారు. మూడు నెలలు మీరు అక్కడే ఉండాలని పునరుద్ఘాటించారు. మూసి ప్రక్షాళన ఆపెస్తే.. టెండర్ అగ్రిమెంట్‌కి నష్టం జరిగితే తన సొంత ఆస్తి అమ్మి కడతానని ముఖ్యమంత్రి అన్నారు. మూసి పాపంలో.. మమ్మల్ని కూడా నేరగాళ్లను చేయాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. మూసి పునరుజ్జీవం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ని రోజులు చర్చిస్తారో చర్చించాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఏం చేద్దామో చెప్పండని.. ఈటెల.. కిషన్ రెడ్డి.. చేవెళ్ల ఎంపీల సూచనలు అడిగారు. వారు కూడా అసెంబ్లీకి రావాలని ఆహ్వానించారు. శాసనసభలో ప్రొవిజన్ ఉందని.. న్యాయ సలహా తీసుకుని ఎంపీలను కూడా సభలోకి తీసుకువస్తామన్నారు. సలహాలు ఇవ్వాలని.. మీ మీ అనుమానాలు తనకు పంపమని సీఎం కోరారు. శనివారంలోపు తనకు ప్రశ్నలు పంపాలని సూచించారు. ప్రతి ప్రశ్నకూ సమాధానమిస్తానని స్పష్టం చేశారు. సభలో చర్చ పెడతామని.. మూసి చేయాలా వద్దా? నల్గొండ కమ్యూనిస్టులు కూడా చెప్పాలన్నారు. రాజకీయ పార్టీలతో సంప్రదింపుల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు, బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఏపీలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. సమర్థులైన యువత, స్నేహ పూర్వక ప్రభుత్వం, మౌళిక సదుపాయాలతో పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది…మా రాష్ట్రం వృద్ధి చెందుతుంది అంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి ట్విట్టర్ పోస్ట్‌లో.. “పెట్టుబడులు పెట్టేందుకు నేను పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నా. ఏపీలో వ్యాపార అనుకూల ప్రభుత్వం, ప్రతిభావంతులైన యువత, ఉత్తమ మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు అనుకూలం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో చర్చించి కొత్త పాలసీలు తెచ్చింది. కొత్త పాలసీలు వేగవంతమైన వ్యాపార నిర్వహణకు దోహదం చేస్తాయి. మేము దేశంలో అత్యుత్తమ వ్యాపార వాతారణ వ్యవస్థను నిర్మిస్తున్నాము. రాష్ట్రంలో మీ వ్యాపారానికి ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నాను. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ రాదు!. రాష్ట్రంలో పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది….రాష్ట్ర సామర్థ్యం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో మీ పెట్టుబడుల కోసం మేం ఎదురుచూస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

 

ఈ నెల 23న కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..
ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంలకు కేబినెట్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్సుకు చట్ట బద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసా పై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది. ఆయా శాఖల నుంచి వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. నెలాఖరున అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు సర్కార్ చేస్తుంది. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రాపై చర్చ జోరుగా కొనసాగుతోంది. హైడ్రా కార్యకలాపాలపై రాజకీయ ప్రకంపనల మధ్య తాజాగా హైడ్రాకు మరిన్ని బాధ్యతలు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్‌ వరకూ ఉన్న 27 పురపాలికల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణకు అవసరమైన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది. ఈ మేరకు బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. తాజా ఉత్తర్వులతో జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు మొదలైన పబ్లిక్ ఆస్తలు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా రక్షించనుంది. జీహెచ్‌ఎంసీ చట్టం -1955 కింద అవసరమైన అధికారాలను హైడ్రాకు అప్పగిస్తున్నట్లు’ ఉత్తర్వుల్లో వివరించారు.

 

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్భందీగా నిర్వహిస్తున్నాం
ఈనెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్భందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుండి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీస్ కమిషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారన్నారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహించాలని సీఎస్‌ ఆదేశించారు. అనంతరం TGPSC చైర్మన్ డా. ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. గ్రూప్ -1 జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు.

 

పెట్టుబడులే లక్ష్యం.. ఈ నెల 25 నుంచి అమెరికాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
ఏపీలో పెట్టుబడులపై ఈ నెల 25 నుంచి మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటించనున్నారు. నవంబర్‌ ఒకటో తేదీ వరకు శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో లోకేశ్ పర్యటించనున్నారు. ఈ నెల 25 తేదీన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే ఐటీ సినర్జీ కాన్పరెన్సుకు మంత్రి హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడులపై ప్రముఖ కంపెనీలతో మంత్రి లోకేశ్ భేటీ కానున్నారు. నారా లోకేష్ వెంట సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ వెళ్లనున్నారు. అప్పటి వరకూ ఏపీఈడీబీ సీఈఓగా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్న సంగతి తెలిసిందే. బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేశారు. ఏపీలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. సమర్థులైన యువత, స్నేహ పూర్వక ప్రభుత్వం, మౌళిక సదుపాయాలతో పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది…మా రాష్ట్రం వృద్ధి చెందుతుంది అంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే లోకేశ్ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఏపీలో పెట్టుబడులను తీసుకుని రావాలని తద్వారా ఏపీలో ఉపాధి కల్పన అవకాశాలను పెంచాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది.

 

ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్..
ఆదివాసీలకు ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కల్పించిన పోరాట యోధుడు కొమురం భీం అని మంత్రి సీతక్క అన్నారు. కొమురం భీం లేక పోతే తన ఉనికి ఉండేది కాదన్నారు. కొమురం భీం పోరాటంతోనే హక్కులు సాధించబడ్డాయన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే సాగిన ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అనంతరం తన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. లక్ష 60 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చామన్నారు. ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూముల విషయం లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు. గిరిజనులకు సరైన అవగాహన కల్పించాలని.. ప్రజలపై దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఐటీడీఏ కేంద్రంగా పాలన పటిష్టం చేస్తామని తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జోడే ఘాట్ వస్తారని…ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రూ. 6 కోట్లు టూరిజం అభివృద్ధికి ఇస్తామన్నారు. కొమురం భీం ప్రాజెక్టును టూరిజం పరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, ఇండ్లు హాస్టల్‌ల అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని మరోసారి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఇస్తామని.. కలెక్టర్ నివేదిక తయారు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కుల గణన జరుగుతుందని.. అధికారులకు మీ సమాచారం ఇవ్వాలని చెప్పారు. నాయక్ పోడు తెగలు మైదాన ప్రాంతంలో ఉన్నారని.. అధికారులు వాస్తవ నివేదిక తయారు చేయాలని సూచించారు. సబ్ క్యాస్ట్ చెప్పు కోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఆదివాసీ చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పెద్దలదన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ముందుకు వెళ్దామని కోరారు. జీ నంబర్ 3, ఆదివాసీ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ సమక్షంలో సమావేశం అయి చర్చిద్దామన్నారు.. ఆడవాళ్ళ జోలికి వస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. మీ సమస్యల పరిష్కారం చేసేందుకు మీ వెంటే ఉంటామన్నారు.

 

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో కేసులన్నీ అక్రమమే..
టీడీపీ కార్యాలయంపై దాడి కేసును అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనల్లో పారదర్శకంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆ ఘటన జరిగిన రోజు తాను జిల్లాలోనే లేనని, బద్వేల్‌ ఉన్నానని పేర్కొన్నారు. స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో ఎయిర్‌పోర్టులలో కూడా వైసీపీ నేతలను ఆపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇలా వేధిస్తే మాలో ఇంకా పట్టుదల పెరుగుతుందన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది పాలన చేయమని మాత్రమేనని, ప్రతిపక్షాలను వేధించమని కాదన్నారు. ప్రతిపక్షాన్ని వేధించడం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి కక్ష్య పూరిత పనులు మానుకోవాలని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

 

ఆక్స్‌ఫర్డ్ ఛాన్సలర్ రేసు నుంచి ఇమ్రాన్‌ఖాన్ ఔట్.. కారణమిదే!
ఆక్స్‌ఫర్డ్ ఛాన్సలర్ రేసు నుంచి ఇమ్రాన్‌ఖాన్ తప్పుకున్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పోటీ చేస్తున్న జాబితాలో ఇమ్రాన్‌ఖాన్ పేరు లేదని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇమ్రాన్‌ఖాన్‌పై నేరారోపణలు ఉండడంతో ఆయనను పోటీ నుంచి యూనివర్సిటీ తప్పించింది. ఇమ్రాన్ ఖాన్ 1975లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యాడు. ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ చదివారు. ఈ పదవి కోసం 40 మంది అప్లై చేసుకోగా.. ప్రస్తుతం 38 మంది మాత్రం రేసులో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 26, 000 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల జాబితాలో ప్రముఖ పేర్లు యూకే మాజీ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు లార్డ్ విలియం హేగ్, యూకే మాజీ లేబర్ రాజకీయ నాయకుడు లార్డ్ పీటర్ మాండెల్సన్ రేసులో ఉన్నారు. ఈ సంవత్సరం ఆన్‌లైన్‌లో పోలింగ్ జరగనుంది. పూర్వ విద్యార్థులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆన్‌లైన్ ఓటింగ్ చేపట్టినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది.