కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెలలోనే జారీ..!
కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నాలుగో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా.. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మరోసారి సమావేశం కావాల్సి ఉందని తెలిపారు. గత పదేళ్లలో నామమాత్రంగా రేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. అలాగే.. ఖరీఫ్ నుండి సన్న వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. జనవరి నుండి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వబోతున్నామని మంత్రి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనుకుంటున్నాం.. గత ప్రభుత్వ హయాంలో 49,476 కార్డులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. అవి కూడా బై ఎలక్షన్ ఉన్న నియోజక వర్గాల్లో మాత్రమే ఇచ్చారన్నారు. ఒక సిష్టమేటిక్‌గా ఎక్కడ ఇవ్వలేదని.. తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికి ఇస్తామని తెలిపారు. ఈనెల 21న మరోసారి భేటీ అయి ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.
సీఎం చేతుల మీదుగా రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కూమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశ ఐక్యత కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నారు.. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని అన్నారు. పనికి రాని వాళ్ళు.. విగ్రహా ఏర్పాటు పై మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పెట్రోల్ దొరికింది కానీ.. అగ్గిపెట్టే దొరకలేదని ఒక వ్యక్తి… ఆసుపత్రిలో దొంగ దీక్ష చేసిన వ్యక్తి మరొకరు అని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు.. దోపిడీ కుటుంబానికి ఆ అర్హత లేదని మండిపడ్డారు. కేటీఆర్ నీ మానసిక స్థితి బాగోలేదని అనిపిస్తుంది.. కాంగ్రెస్ మీద చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఇన్నోవేటీవ్ ఆలోచనలు వస్తాయన్నారు. రాజీవ్ గాంధీ నిష్కల్మషుడు.. రాజీవ్ గాంధీ లేకుంటే 2005 వరకు కూడా సెల్ ఫోన్లు వచ్చేవి కాదని తెలిపారు. యువతకు దశా దిశా చూపిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో గొప్ప పేరు తెచ్చుకున్నారని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
కేసీఆర్, కేటీఆర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని సన్నాసులకు మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అమెరికా వెళ్లి జాబ్ చేశావు.. ఐటీ మంత్రి అయ్యావ్, లేకపోతే కేటీఆర్ మంత్రి దరిద్రం ఉండేది కాదు అని విమర్శించారు. లేకపోతే గుంటూరులో చాయ్, టిఫిన్స్ అమ్ముకుంటూ ఉండేవాడివి.. సిద్దిపేటలో ఛాయ్ అమ్ముకుంటూ ఉండేటోడివి అంటూ ఎద్దేవా చేశారు. ఎంత బలుపు మాటలు.. అధికారం పోయిన మదం తగ్గలేదని కేటీఆర్ పై ధ్వజమెత్తారు. త్యాగాలు అంటే నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ కుటుంబాలవేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాడిదలకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని దుయ్యబట్టారు. మీ ఫామ్ హౌజ్‌లలో జిల్లెళ్లు మొలిపిస్తానని చురకలు అంటించారు. రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ కార్యకర్తలకు చెబుతున్నా.. వెయ్యి ఎకరాల్లో తండ్రి ఫామ్ హౌజ్ కట్టించుకున్నాడు.. కొడుకు వంద ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌజ్ కట్టించుకున్నాడని అన్నారు. సొంత విగ్రహం పెట్టుకునేందుకు సెక్రటేరియట్ ముందు స్థలాన్ని పెట్టుకున్నాడు అని తెలిపారు. ‘ఎవడొస్తాడో రండిరా.. టైమ్ చెప్పండి.. ఎవడు వస్తాడో చూస్తా.. తెలంగాణ ఇచ్చింది మేము.. తెలంగాణ తెచ్చింది మేము… సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది మేము..’ అని అన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కేసీఆర్ కుటుంబం ఒక్కరు కూడా హాజరు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు రెగ్యులర్‌గా షాక్ ట్రీట్మెంట్ జరుగుతుంది.. అర్థం కావడానికి కొంత సమయం పడుతుందని విమర్శించారు. కాలకేయ ముఠా గ్రామాల మీద పడుతుంది.. కొంతమంది మిడతల దండును మన ప్రజల మీదకు ఉసి గొల్పుతున్నరు.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ మిడతల దండును తరిమికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ జరగనుందని తెలిపారు. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలకు సాకారం లభించిందన్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్ళను నడిపి ప్రపంచానికి మేకిన్ ఇండియా కెపాసిటీ చూపిస్తామన్నారు. ప్రస్తుతం రైల్వేలు, పౌర విమానయాన సంస్థలు పోటీపడి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే జోన్ హెడ్ క్వార్టర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ముడసర్లోవ దగ్గర 52 ఎకరాలను రైల్వేశాఖ కు జిల్లా యంత్రాగం అప్పగించింది. రాష్ట్ర విభజన సమయంలో జోన్ అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 27న భారత ప్రభుత్వం ఈ జోన్ ఏర్పాటును ప్రకటించింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు ఇందులో భాగంగా ఉంటాయి. వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ ఇవ్వాలని ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
సీఎం మమతతో చర్చలకు జూడాలు అంగీకారం
మొత్తానికి బెంగాల్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు జూనియర్ వైద్యులు అంగీకరించారు. సోమవారం ఇదే చివరి ఆహ్వానం అంటూ బెంగాల్ ప్రభుత్వం వైద్యులను ఆహ్వానించింది. ప్రత్యక్ష ప్రచారంపై గత కొద్దిరోజులుగా సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. అయితే సోమవారం ఇదే ఫైనల్ ఇన్విటేషన్ అంటూ మమత సర్కార్ నుంచి హెచ్చరిక రావడంతో ఎట్టకేలకు డాక్టర్లు చర్చలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి మరియు మీ ప్రతినిధుల మధ్య సమావేశం కోసం మేము మిమ్మల్ని సంప్రదించడం ఇది ఐదవ మరియు చివరిసారి. ముందు రోజు మా చర్చకు అనుగుణంగా, గౌరవనీయ ముఖ్యమంత్రితో సమావేశానికి మిమ్మల్ని మరోసారి ఆహ్వానిస్తున్నాము. ఆమె కాళీఘాట్ నివాసంలో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరుపుతాం’’ అని బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం-వైద్యుల బృందం మధ్య చర్చలు ఒక కొలిక్కి వస్తే.. వైద్య సేవల్లో సమస్యలు పోతాయి. చాలా రోజులుగా వైద్యులు నిరసనలు చేయడంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 9న ఆర్ జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత క్రూరంగా హత్యాచారం జరిగింది. అనంతరం దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. న్యాయం చేయాలని జూడాలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పినా డాక్టర్లు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా చర్చలతో ఎలాంటి పురోగతి వస్తుందో చూడాలి.
చిదంబరం కీలక వ్యాఖ్యలు.. జమిలి ఎన్నికలు అసాధ్యమని వెల్లడి
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తు్న్నట్లు వార్తలు వెలువడుతున్న తరుణంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిదంబరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం అది సాధ్యం కాదని.. కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం అని ఆయన చెప్పుకొచ్చారు. లోక్‌సభలోగానీ.. రాజ్యసభలోగానీ రాజ్యాంగ సవరణలు ఆమోదించే బలం మోడీ ప్రభుత్వానికి లేదని ఆయన వెల్లడించారు. ‘‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’’ ప్రతిపాదనను ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తుందని చిదంబరం చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రతిపాదన బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకంగా ఉంది. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ప్రధానమంత్రి మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తరచు జరిగే ఎన్నికలు దేశ ప్రగతికి అవరోధమవుతాయని అన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై మోడీ 2.0 ప్రభుత్వంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు సంబంధించిన నివేదికను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు.
చంద్రుడికి మినీ-చంద్రుడు తోడు..‘‘మహాభారతం’’తో సంబంధం.. 2 నెలలు భూమి చుట్టూ భ్రమణం..
భూమి సహజ ఉపగ్రహం చంద్రుడికి మరో మినీ-చంద్రుడు తోడు కాబోతున్నాడు. 53 రోజలు పాటు గ్రహ శకలం భూమి చుట్టూ తిరుగుతుంది. ఇది కంటికి కనిపించదని ఇస్రో నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ (NETRA) హెడ్ డాక్టర్ ఎకె అనిల్ కుమార్ తెలిపారు. 2024 PT5 అని పిలువబడే మినీ-మూన్, వ్యాసంలో కేవలం 10 మీటర్లు మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఇది మన సాధారణ చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్లు చిన్నదని చెప్పారు. చంద్రుడి వ్యాసం 3476 కిలోమీటర్లు. కాబట్టి ఈ చిన్న చంద్రుడు కంటికి కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఇస్రో 2024 PT5 యొక్క కదలికను నిశితంగా ట్రాక్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టదని నిర్ధారించారు. మినీ మూన్ భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో దాదాపుగా రెండు నెలల పాటు పరిభ్రమించి, ఆ తర్వాత సౌర మండలంలో సుదూర తీరాలకు వెళ్తుంది. సెప్టెంబర్ 29 నుంచి దాదాపు 2 నెలలు భూమి చుట్టూ తిరుగుతుంది. భూమికి సమీపంలో వస్తువుల్ని పర్యవేక్షించడానికి నాసా వ్యవస్థ అయిన ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (ATLAS) ద్వారా ఆగష్టు 7న ఈ గ్రహశకలం కనుగొనబడింది. అయితే, ఈ గ్రహశకలానికి హిందూ ఇతిహాసం ‘మహాభారతం’తో సంబంధాలు ఉన్నాయి. అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (RNAAS) యొక్క రీసెర్చ్ నోట్స్‌లో ప్రచురించబడిన ఒక నివేదికలో, ఖగోళ శాస్త్రవేత్తలు 2024 PT5 యొక్క కక్ష్య లక్షణాలు ‘‘అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్’’ నుండి వచ్చిన గ్రహశకలాలను పోలి ఉన్నాయని చెప్పారు. NETRAకి చెందిన పరిశోధకుడు డాక్టర్ అనిల్ కుమార్ కూడా 24 PT5 అర్జున గ్రహశకలం సమూహంలో భాగమని ధృవీకరించారు. అర్జున అనేది సౌరవ్యవస్థలోని గ్రహశకలాల ప్రత్యేక సమూహం . ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ హెచ్. మెక్‌నాట్ 1991 నవంబర్ 1న ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో ‘1991 VG’ అనే గ్రహశకలాన్ని కనుగొన్నప్పుడు, ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్‌కి మహాభారతంలోని ప్రముఖ పాత్ర ‘అర్జున’ పేరుని పెట్టారు. దీనిని అంతర్జాతీయ ఖగోళ సంఘం (IAU) అధికారికంగా ఆమోదించింది. హిందూ పురాణాల్లో అర్జునుడు తన ధైర్యసాహసాలకు, అసమానమైన విలువిద్య నైపుణ్యాలకు, జ్ఞానానికి ప్రసిద్ధి. అర్జునుడి బాణాల లాగే సౌరవ్యవస్థలో దూసుకెళ్లే లక్షణం కలిగిన గ్రహశకలాలకు ఉంది. అందుకే ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. భూమి చుట్టూ చిన్న చంద్రుడు కనిపించడం ఇదే తొలిసారి కాదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకుముందు 1997, 2013 మరియు 2018లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.
ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికకు ముహూర్తం ఫిక్స్!.. ఎప్పుడంటే..!
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. లిక్కర్ కేసులో తీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదలైన తర్వాత హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కేజ్రీవాల్ కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ వారసుడు ఎవరనేదానిపై చర్చావేదికలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థి ఎంపికపై ఆప్ ముహూర్తం ఖరారు చేసింది. ఉదయం 11:30కి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేజ్రీవాల్ వారసుడిని ఎంపిక చేయనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత సాయంత్రం ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం రేసులో ఆప్ నుంచి పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సునీతా కేజ్రీవాల్, రాఘవ్ చద్దా, అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లు ప్రముఖంగా వినిస్తున్నాయి. వీరితో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నలుగురిలో ఎవరికొకరికి అవకాశం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలంటే.. చాలా కీలకంగా వ్యవహారించాలి. దీంతో కేజ్రీవాల్ ఆచూతూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇక సోమవారం కేజ్రీవాల్ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో జరిగిన సమావేశానికి సీనియర్ ఆప్ నేతలు, మంత్రులు హాజరయ్యారు. ఇక కొత్త సీఎం ఎంపిక విషయంలో మంత్రులందరితో విడివిడిగా చర్చించినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేలతో కూడా కేజ్రీవాల్ చర్చించి.. ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ వారసుడి ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
జానీ మాస్టర్ క్యారవాన్ లో బలవంతం చేశాడు.. సంచలన విషయాలు వెలుగులోకి
టాలీవుడ్ టాప్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఈరోజు ఉదయం నుంచి హాట్ టాపిక్ అవుతోంది. ఆయన తనను రేప్ చేశాడని, చెన్నై – ముంబై వెళ్ళినపుడు హోటల్స్ లో అలాగే నార్శింగిలో తన నివాసంలో కూడా లైంగికంగా వేధించాడని ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేసింది. ఇక ఆమె నార్సింగి పరిధిలో నివాసం ఉంటున్న క్రమంలో ఆ ఫిర్యాదును జీరో ఎఫ్ ఐ ఆర్ ద్వారా అదే పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. కేసు నమోదైన క్రమంలో జానీ మాస్టర్ సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఇద్దరు అసిస్టెంట్ల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ క్రమంలో ఆమె స్టేట్‌మెంట్ సంచలనం రేపుతోంది. ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు పోలీసులు.. బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారించారు పోలీసులు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తీసుకెళ్లిన పోలీసులు, వైద్య పరీక్షలు కూడా చేయించారు. షూటింగ్ టైమ్‌లో క్యారవాన్‌లో జానీ మాస్టర్ తనను బలవంతం చేశాడు అని కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడు అని ఆమె పేర్కొంది. తన కోరిక తీర్చ లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని కూడా బెదిరించాడు అని ఆమె పేర్కొన్నట్టు సమాచారం. పెళ్లి చేసుకోవాలని కూడా జానీ మాస్టర్ నాపై ఒత్తిడి చేశాడు అంటూ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది అని చెబుతున్నారు.
జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన
కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూట్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో సభ్యులైన కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఫిర్యాదును తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కి ఇవ్వడం జరిగిందని, దానిని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కు సిఫార్సు చేయడం జరిగిందనీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయ్యి POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ చేస్తారని, భాదిత పక్షం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు చేసి FIR నమోదు చేసారని మాకు తెలిసిందని అన్నారు. భాదిత పార్టీల గోప్యతను కాపాడాలని మేము అన్ని మీడియా సంస్థలను, ప్రింట్ మీడియా/ డిజిటల్ మీడియా/ ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్ధిస్తున్నాము, సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడే వరకు సంబంధిత వ్యక్తుల యొక్క బ్లర్ చేయని ఫొటోగ్రాఫ్ లను, వీడియోలను ఉపయోగించవద్దు అని కోరారు. ఏదైనా ఉపయోగించినట్లైతే వాటిని వెంటనే తీసివేయమని మీ అందరిని మరొకసారి అభ్యర్ధిస్తున్నాము అంటూ ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఫైనల్‌కు చేరిన భారత హాకీ జట్టు.. దక్షిణ కొరియాపై 4-1 తేడాతో గెలుపు
భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ-ఫైనల్స్‌లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించింది. ఫైనల్‌లో భారత్ చైనాతో తలపడనుంది. కాగా.. ఈ టోర్నీలో ఇండియా అద్భుత ప్రదర్శన చేసి అజేయంగా నిలిచింది. రేపు (మంగళవారం) భారత్-చైనాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ లో గెలిచి రికార్డు సృష్టించాలని చూస్తోంది. కాగా.. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ ఒక్కో గోల్ చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. దక్షిణ కొరియాపై భారత్ ఆరంభంలోనే ఆధిక్యం కనబరిచింది. మొదట ఉత్తమ్ సింగ్ గోల్ చేసి భారత్‌ను 1-0తో ముందంజలో ఉంచాడు. ఆ తర్వాత.. రెండో క్వార్టర్‌లోనూ భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించి ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. రెండో క్వార్టర్‌లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ దక్షిణ కొరియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది. భారత పురుషుల హాకీ జట్టు మూడో క్వార్టర్‌లోనూ ఆధిక్యాన్ని కొనసాగించింది. దక్షిణ కొరియా హాఫ్ టైమ్ తర్వాత పునరాగమనం చేసి గోల్ కొట్టే ప్రయత్నం చేసినా భారత్‌ను అధిగమించలేకపోయింది. మూడో క్వార్టర్‌లో కొరియా తరఫున జిహున్ యాంగ్ గోల్ చేయగా, భారత్ తరఫున జర్మన్‌ప్రీత్ సింగ్ మూడో గోల్ చేశాడు. ఆ తరువాత, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండవ గోల్ చేశాడు. దీంతో.. దక్షిణ కొరియాపై భారత్ 4-1 ఆధిక్యంలో నిలిచింది. దక్షిణ కొరియా చివరి వరకు ఆధిక్యం కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు. అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడడం ఇది 62వ సారి. 1958లో టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో ఇరు జట్లు తొలిసారి తలపడ్డాయి. ఆ తర్వాత భారత్ 2-1తో దక్షిణ కొరియాను ఓడించింది. ఇప్పటి వరకు భారత్ 39 మ్యాచ్‌లు, దక్షిణ కొరియా 11 మ్యాచ్‌లు గెలుపొందాయి.. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.