ముంబయి నటి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి నటి కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై అభియోగాలున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో జత్వానీపై నిబంధనలకు విరుద్దంగా కేసు నమోదు చేశారని అభియోగం నమోదైంది. తమను ఏపీ పోలీసులు వేధించారంటూ విజయవాడ కమిషనరుకు జత్వానీ ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ముగ్గురిని సర్కారు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి ఏపీ సర్కార్ సంచలనం సృష్టించింది.
డిప్యూటీ సీఎంకు అరుదైన గౌరవం..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును నిర్వాహకులు ఆహ్వానించారు. ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ 200వ వేడుకలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఆహ్వానంలో తెలిపారు. ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఈ ఆహ్వానంపై డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క స్పందించారు. సమావేశాల్లో పాల్గొనాలని ఆహ్వానం అందటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానం అందటం.. తనకు ఎంతగానో గర్వకారణమని అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌కు చేరుకునే ముందు గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన గౌడ్ అనంతరం ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు గాంధీభవన్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, కార్పొరేషన్ చైర్మన్లు, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. , , పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు. మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకుండా పోరాటాలు చేస్తాం..
ప్రస్తుతం రాష్ట్రమంతా ఒక సమస్యపై దృష్టి పెట్టిందని.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం విధానానని స్పష్టం చేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. జాతీయంగా ఉంచుతారా, ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతారో చెప్పాలన్నారు. ఉక్కు మంత్రి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ చూశారు.. ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు ప్రజలకు సంబంధించిందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి మేము సిద్ధమని ఆయన చెప్పారు. ప్రజా ప్రతినిధుల రాజీనామాల వల్ల ఉపయోగం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో మేం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని కేంద్రానికి చెప్పడం వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదన్నారు. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మా వల్ల ఆగిందని బొత్స పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్రంలోని ఎన్డీఏకు బలం ఎక్కువ ఉందని.. ఎన్డీఏలో భాగస్వామిగా వున్న చంద్రబాబు ఈ ప్రైవేటీకరణ ఆపాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ప్రైవేటీకరణకు ఎందుకు అడుగులు పడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకుండా మేము పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
చేతబడి అనుమానం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి హత్య..
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి పేరుతో ఐదుగురిని అత్యంత కిరాకతంగా హతమార్చారు. జిల్లాలోని కుంటలోని కోయిలిబెడ ప్రాంతంలోని ఎత్కల్ గ్రామంలో మంత్రాలు చేస్తున్నారని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టిచంపారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో మూఢనమ్మకాల వల్ల హింస చెలరేగుతోంది. ఈ హత్యలు ఆదివారం జరిగాయి. గ్రామస్తులు అంతా కలిసి ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు ధృవీకరించారు. మృతులను మౌసం కన్న(60), అతడి భార్య మౌసం బీరి(43), వీరి కుమారుడు మౌసం బుచ్చా(34), మౌసం బుచ్చా భార్య మౌసం అర్జో(32), కర్క లచ్చి(43)గా గుర్తించారు. చేతబడి చేస్తున్నారని ఆరోపించింన తోటి గ్రామాస్తులు వీరిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి మరణించేలా చేశారు. ఈ ఘటనని జిల్లా ఎస్పీ చౌహాన్ కిరణ్ గంగారాం ధ్రువీకరించారు. ‘‘గ్రామస్తులు మూఢనమ్మకాలతో, కుటుంబంపై చేతబడి చేస్తు్న్నారని ఆరోపిస్తూ, ఈ దారుణ చర్య కోసం ఏకమయ్యారు’’ అని తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందర్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బాధితులు కొంత కాలంగా ఇతర గ్రామస్తుల నుంచి అనుమానాలు, శత్రుత్వాన్ని ఎదుర్కొంంటున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. గ్రామంలో పలు అకారణ మరణాలకు, అనారోగ్యాలు చోటు చేసుకోవడంతో వీరిపై అనుమానం మరింత బలపడి, చేతబడి చేస్తు్న్నారని ఆరోపిస్తూ గ్రామస్తులంతా ఏకమయ్యారు. ఇదిలా ఉంటే, ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లానే కాకుండా బస్తర్ ఏరియా జిల్లాల్లో ఈ మంత్ర విద్యలు, చేతబడులు అధికంగా ఉంటాయనే మూఢనమ్మకం ఉంది.
జర్నలిస్టుకి క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ నేత.. హిందువుల గురించి ప్రశ్నించడంతో దాడి..
రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఇండియా టుడే రిపోర్టర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన వివాదంగా మారింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఫైర్ అయ్యారు. జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై భారతదేశ ప్రతిష్టను తగ్గించిందని ప్రధాని మోదీ అన్నారు. “రాజ్యాంగం” అనే పదం కాంగ్రెస్‌కు సరిపోదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి మీడియా కీలక స్తంభం, ఓ జర్నలిస్టుని గదిలో బంధించి ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య గౌరవాన్ని చాటి చెప్పే విషయమా..? అని ప్రశ్నించారు. ఈ ఘటన మొత్తం విమర్శలకు కారణం కావడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యల్ని ప్రారంభించింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా, ఇండియా టుడే జర్నలిస్ట్ రోహిత్ శర్మకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. దురదృష్టమైన సంఘటనగా, ఘటనపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పత్రికా స్వేచ్ఛ పట్ల తన నిబద్ధతను పిట్రోడా నొక్కిచెప్పారు, జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సమయంలో శామ్ పిట్రోడాని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ‘‘రాహుల్ గాంధీ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల అంశాన్ని అమెరికా చట్టసభ సభ్యులతో లేవనెత్తారా..?’’ అని ప్రశ్నించిన సమయంలో రోహిత్ శర్మపై దాడి జరిగింది. డల్లాస్‌లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. 30 నిమిషాల పాటు సాగిన ఈ ఘటనలో తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని, ఇంటర్వ్యూ వీడియో మొత్తం డిలీట్ చేశారని రిపోర్టర్ తెలిపారు. తన అనుమతి లేకుండానే కాంగ్రెస్ కార్యకర్తలు తన ఫోన్‌ని అన్‌లాక్ చేశారని శర్మ చెప్పారు.
రాహుల్ గాంధీ నెంబర్-1 టెర్రరిస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో సిక్కులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీతో పాటు సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోనియా గాంధీ ఇంటి వెలుపల సిక్కులు ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉంటే, సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ‘‘దేశంలో నంబర్-1 టెర్రలిస్ట్’’ అని అభివర్ణించాడు. రాహుల్ గాంధీ భారతీయుడు కాదని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశానికి అతిపెద్ద శత్రువుగా పేర్కొన్నారు. గతంలో ఆయన ముస్లింలను ఉపయోగించుకోవాలని ప్రయత్నిచాడు, కానీ అది జరగలేదని, ఇప్పుడు సిక్కుల్ని విభజించాలని ప్రయత్నిస్తున్నాడని రవ్‌నీత్ సింగ్ బిట్టూ మండిపడ్డారు. ఇండియా మోస్ట్ వాంటెడ్ వ్యక్తులు కూడా రాహుల్ గాంధీ మాట్లాడినట్లే మాట్లాడారని చెప్పారు. తీవ్రవాదులు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని మెచ్చుకుంటున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతున్నారంటే, దేశంలో నంబర్ వర్ టెర్రరిస్ట్ ఆయనే అని అన్నారు. సిక్కుల గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మద్దతు తెలిపిన విషయాన్ని బిట్టూ ప్రస్తావించారు. దేశానికి అతిపెద్ద శత్రువు ఎవరినైనా పట్టుకుంటే ప్రతిఫలం ఉంటుందని అని అనుకుంటే అది రాహుల్ గాంధీ అని నా అభిప్రాయం. అంతకుముందు, అమెరికా వర్జీనియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ సిక్కుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా.. లేదా..? అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా..? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించింది’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘రాహుల్ గాంధీ భారతీయుడు కాదని, అతనను ఎక్కువ సమయం ప్రపంచం బయటే గడిపాడు. అతని స్నేహితులు కుటుంబం అక్కడే ఉన్నారు. దీంతో అతడు ఎక్కడికి వెళ్లినా దేశాన్ని గౌరవించడు, ప్రేమించడు. విదేవాల్లో ఉండీ భారత్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటాడు’’ అని అన్నారు. ‘‘అతను ఓబీసీల గురించి కులాల గురించి మాట్లాడుతాడు. ఇతను చెప్పులు కుట్టేవారి, వడ్రంగి, మెకానిక్ బాధలను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పటికీ వారి బాధల్ని అడుగుతున్నాడు. ఫోటోల కోసం ఇదంతా చేస్తున్నాడు’’ అని బిట్టూ అన్నారు.
నిపా వైరస్‌తో కేరళలో ఒక వ్యక్తి మృతి..
నిపా వైరస్ కారణంగా కేరళలో ఒక వ్యక్తి మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తి మరణించినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. 24 ఏళ్ల వ్యక్తి మలప్పురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రీజనల్ మెడికల్ ఆఫీసర్ డెత్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిఫా ఇన్ఫెక్షన్ అనుమానం తలెత్తిందని వీణా జార్జ్ చెప్పారు. వ్యక్తి నమూనాలను వెంటనే పరీక్ష కోసం పంపామని, అందులో నిపా పాజిటివ్‌గా తేలిందని ఆమె వెల్లడించారు. బెంగళూర్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న మలప్పురానికి చెందిన వ్యక్తి సెప్టెంబర్ 09న మరణించాడు. ఈ మరణం తర్వాత నిఫా ఉన్నట్లు తేలడంతో ఆరోగ్యమంత్రి నేతృత్వంలో అత్యున్నత సమావేశం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యల్ని ప్రారంభించారు. కోజికోడ్ వైద్య కళాశాల నిఫాగా నిర్ధారించిన తర్వాత, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) ఇవే ఫలితాలను వెల్లడించింది. శనివారం రాత్రి 16 కమిటీలను ఏర్పాటు చేశామని, 151 మందితో కాంటాక్ట్ లిస్ట్‌ని గుర్తించామని మంత్రి వెల్లడించారు. మరణించిన వ్యక్తి తన స్నేహితులతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు. ఇతడితో సన్నిహితంగా మెలిగిన వారిలో ఐదుగురికి చిన్నపాటి జ్వరం, ఇతర లక్షణాలు కనుగొనబడ్డాయని, వీరిని ఐసోలేషన్‌లో ఉంచామని మంత్రి చెప్పారు. అంతకుముందు జూలై 21న నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఒక బాలుడు మరణించాడు. ఇదే రాష్ట్రంలో తొలి కేసు. 2018, 2021 మరియు 2023లో కోజికోడ్ జిల్లాలో మరియు 2019లో ఎర్నాకుళం జిల్లాలో నిపా వ్యాప్తి నమోదైంది మరియు కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి, మలప్పురం మరియు ఎర్నాకులం జిల్లాల్లోని గబ్బిలాలలో నిపా వైరస్ యాంటీబాడీస్ ఉన్నట్లు గుర్తించబడింది.
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేతని కాల్చి చంపిన దుండగులు..
పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకుడి హత్య చోటు చేసుకుంది. ఉదయం తుపాకీ కాల్పులు, బాంబులు విసిరి కాంగ్రెస్ నాయకుడిని చంపినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన కాంగ్రెస్ నేతని షేక్ సైఫుద్దీన్‌గా గుర్తించారు. ఇతను మాణిక్‌చక్‌లోని గోపాల్ పూర్ ప్రాంతానికి చెందిన కీలక నేత. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతు ఉన్న గుండాలే సైఫుద్దీన్‌ని హత్య చేశారని అతడి కుటుంబం ఆరోపించింది. అయితే, అధికార టీఎంసీ మాత్రం వారి ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ధరంపూర్ స్టాండ్ మార్కెట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖానికి ముసుగులు కప్పుకున్న నలుగురైదుగురు గుండాలు సైఫుద్దీన్‌పై కాల్పులు జరిపారని, అతడిని లక్ష్యంగా చేసుకుని రెండు క్రూడ్ బాంబుల్ని విసిరారని కుటుంబీకులు చెప్పారు. ఈ దాడిలో అతనున అక్కడిక్కడే మరణించాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనక ఎవరున్నారనే విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.