NTV Telugu Site icon

Top Headlines @ 9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్..
నామినేటెడ్ పదవుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జరిపిన టెలీ కాన్ఫరెన్సులో చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేసినట్లు టెలీ కాన్ఫరెన్సులో చంద్రబాబు పేర్కొన్నారు. ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తీర్చుకుంటామన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందన్నారు. ఎవరు ఏ మేరకు పని చేశారోననే సమాచారం పార్టీ దగ్గర ఉందన్నారు. కష్టపడిన వారికి ప్రొత్సాహం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చామని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దన్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించడం ఖాయమన్నారు. గతంలో ఏర్పాటు చేసిన చోటే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని.. వంద రోజుల్లో అన్న క్యాంటీన్ల పునరుద్దరణ జరుగుతుందన్నారు. గత 20 ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు వచ్చాయంటే అది గాలివాటం కాదు, ప్రజలు నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని వెల్లడించారు. కూటమి 93 శాతం స్ట్రైట్ రేట్ తో… 57 శాతం ఓట్ షేర్ ను సాధించిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని మనం కాపాడుకోవాలని నేతలకు సూచించారు. కార్యకర్తలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.

 

నాకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబుని కలిసేందుకు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలీసులు ఇనుప గ్రిల్స్ తో బార్కేడింగ్ ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్కేడింగ్ చూసి పాత ప్రభుత్వ విధాన హ్యాoగ్ ఓవర్ వీడాలంటూ పోలీసులతో గట్టిగా చెప్పారు. ఇన్నేళ్లు కార్యకర్తల్ని కలుస్తూ వచ్చానని, ఎప్పుడూ లేని వ్యవస్థ ఇప్పుడెందుకు పెట్టారని సీఎం ప్రశ్నించారు. పార్టీ శ్రేణులకు, తనకు అడ్డుగోడలు తెచ్చే చర్యలు ఉపేక్షించనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మీ భద్రతా సాయంతోనే పార్టీ కార్యాలయం నడపలేదనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి అన్నారు. తనకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు. వినతుల స్వీకరణకు పద్ధతిలో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. సచివాలయంలోనే వినతులు స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నామన్నారు. ప్రజా వినతులు స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దుష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజావేదిక ఉండి ఉంటే వినతులు స్వీకరణకు అనువుగా ఉండేది, కానీ జగన్ ప్రజా వేదికను కూల్చి వేశాడని మండిపడ్డారు. ప్రజా వేదిక గుర్తులు విధ్వంస పాలనకు ప్రతీకగా అలానే ఉంటాయన్నారు. ఆ శిథిలాలను తొలగించమన్నారు. త్వరలోనే క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభిస్తానని.. పోలవరంతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచీ నిర్వహించేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. సచివాలయానికి రాకపోకలు కోసం రవాణా, ఇతరత్రా వెసులుబాటు లన్నీ అందుబాటులోకి తెస్తామన్నారు.

 

అడవుల వినాశనానికి పాల్పడిన వారెవరైనా కటకటాల్లోకి వెళ్లాల్సిందే..
రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగిందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా చూశానని.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. అడవులను కంటికి రెప్పలా కాపాడతామని.. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామన్నారు. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ శాఖలు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవని మంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళానని.. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను  చూశామన్నారు. పర్యావరణం పార్టీ సిద్ధాంతాల్లో భాగమని.. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటన్నారు. ఒక పక్క పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలన్నారు. అయితే ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలన్నారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి అత్యంత ఆవశ్యకమన్నారు. రేషన్ కార్డుదార్లకు నిత్యావసరాలు పంపిణీపై ప్రత్యేక దృష్టిపెడతామని మంత్రి వెల్లడించారు. రైతుల నుంచి పంటల కొనుగోలు విధానం, వారికి సొమ్ములు చెల్లించడంలో మెరుగైన విధానాలు అవలంబిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని.. పర్యాటక కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రానికి ఒక బ్రాండ్ కల్పించడంపై దృష్టి పెట్టాలన్నారు. అదే విధంగా సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం, స్నేహపూరిత వాతావరణం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. చిత్రీకరణ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

 

ఫుడ్ సేఫ్టీలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలి..
ఫుడ్ సేఫ్టీపై ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో దామోదర్ రాజనర్సింహ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంతో ఫుడ్ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా సుమారు 180 నుంచి 200 ఫుడ్ శాంపిల్స్ లను టెస్టులు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లు, బేకరీలు, డెయిరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారుదారులు లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ – 2006 ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించని ఫుడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టాస్క్ ఫోర్స్ , ఫుడ్ సేఫ్టీ అన్ వీల్స్ (ఫుడ్ లాబ్స్), ఆకస్మిక తనిఖీలు, అవగాహన సదస్సులను నిరంతరం నిర్వహించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరు పై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. మనం తీసుకునే ఆహారం నాణ్యత లోపం ఉంటే అనారోగ్య సమస్యలు మన దరికి చేరుతాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా భోజనప్రియలు బయటి హోటల్, రెస్టారెంట్లలో భుజించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. అయితే భోజనం ప్రియుల ఆదరణకు నోచుకుంటున్న పలు హోటల్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ శభాష్ అనిపించుకుంటూ ఉండగా, మరికొన్ని హోటల్, రెస్టారెంట్ల యాజమాన్యాలు మాత్రం ఫ్రిజ్ లలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతూ భోజన ప్రియులకు అందిస్తున్న తీరును అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు.

 

సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, స్టాఫ్ న‌ర్సుల భ‌ర్తీకి రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్
రాష్ట్రంలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, స్టాఫ్ న‌ర్సుల భ‌ర్తీకి రంగం సిద్ధమైంది. 531 సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్‌, 193 ల్యాబ్ టెక్నీషియ‌న్‌, 31 స్టాఫ్ న‌ర్సుల భ‌ర్తీకి త్వర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయనున్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆసుప‌త్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీపై దృష్టిసారించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ క‌న‌ప‌ర్చుతున్నారు. ప్రతి వ‌ర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇత‌ర విష జ్వరాలు ప్రబ‌లుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఖాళీల భ‌ర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్లు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, స్టాఫ్ న‌ర్సుల ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ల విడుద‌లకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల కొర‌త ఎక్కువ‌గా ఉంది. స‌మ‌స్యను అధిగ‌మించి ప్రజ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు గానూ సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల పోస్టులు 531 భ‌ర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవ‌ల నియామ‌క బోర్డు (ఎంహెచ్ఎస్ ఆర్‌బీ) త్వర‌లోనే ఈ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. నియామ‌కాల అనంత‌రం ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా స‌ర్జన్లను నియ‌మించ‌నున్నారు.వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియ‌న్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 193 ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ త్వర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. అలాగే, వివిధ ఆసుప‌త్రుల్లో రోగుల‌కు సేవ‌లు అందించే స్టాఫ్ న‌ర్సుల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు 31 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి ఎంహెచ్ఎస్ ఆర్‌బీ నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది.

 

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకుని హతమార్చిన కసాయి తల్లి..
ఓ కసాయి తల్లి వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చింది. ఈ ఘటన పటాన్ చెరులో చోటుచేసుకుంది. పటాన్‌చెరులోని ముత్తంగి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు ( ఓఆర్‌ఆర్‌ ) సర్వీస్‌ రోడ్డు పక్కన 10 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని బాలుడి మృతదేహం ఈనెల 11న లభ్యమైంది. రోడ్డు పక్కన పొదల్లో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహంపై గాయాలు కూడా గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం సంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు మూడు నగర కమిషనరేట్ల పరిధిలో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇంతలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కాగా.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న తల్లే కసాయిగా మారి కుమారుడిని పొట్టనపెట్టుకుందని తేలింది. స్వాతి అనే వివాహిత భర్త చనిపోవడంతో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల10న కొడుకు గొంతు నులిమి చంపేసింది. ప్రియుడు అనిల్ తో రాత్రి ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన కలిసి విష్ణు (10) మృతదేహాన్ని పారేసింది. పోలీసుల విచారణలో స్వాతి స్వయంగా నేరాన్ని ఒప్పుకుంది. తల్లి స్వాతి, ప్రియుడు అనిల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.

 

గన్నవరం నుంచి ముంబైకి నూతన విమాన సర్వీస్ ప్రారంభం
ఇకపై విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయికి డైరెక్ట్‌ విమాన సర్వీస్‌లు నడవనున్నాయి. గన్నవరం నుండి ముంబైకి విమాన సర్వీసును ఎంపీలు బాలశౌరి, ఎంపీలు కేశినేని చిన్ని ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లు గన్నవరం నుంచి ప్రారంభం అయ్యాయని ఎంపీ బాలశౌరి వెల్లడించారు. కొత్త ప్రభుత్వంలో వేగంగా ఏపీ అభివృద్ది చెందుతుందన్నారు. రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కావాలని.. ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్ లైన్ సర్వీసులు కావాలని ఆయన పేర్కొన్నారు. రాజధానికి కావాల్సిన అన్ని సర్వీసులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు రావటానికి కృషి చేస్తామన్నారు. ముంబై ఫ్లైట్ కనెక్టివిటీ ఫ్లైట్ ఇది ప్రయాణికులకు సులువుగా ఉంటుందన్నారు. గతంలో వీటిపై చాలా రిక్వెస్ట్‌లు పెట్టామని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాకు ఎంపీ బాలశౌరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని ప్రాంతం కావటంతో ఫ్లోటింగ్ కూడా ఉంటుందన్నారు. ఢిల్లీ ఫ్లైట్‌లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి.. దీనిపై ఇండిగో వారితో మాట్లాడుతున్నామన్నారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ త్వరగా పూర్తి చేస్తామన్నారు. వ్యాపార వర్గాలకు ముంబై సర్వీస్ ఉపయోగపడుతుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యేలా కృషి చేస్తామన్నారు.ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఫ్లైట్స్ త్వరలో అందుబాటులో ఉంటాయన్నారు. మొదటి రోజే ముంబై బుకింగ్స్ ఫుల్ అయ్యాయని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరీ చొర‌వ వల్లే ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆయ‌న ఎయిర్‌పోర్టు అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న స‌మ‌యంలో ముంబయి, విజ‌య‌వాడ మ‌ధ్య విమాన స‌ర్వీస్ ప్రారంభించాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రులు, అధికారుల‌కు విజ్ఞప్తి చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఇకపై సీఐఎస్‌ఎఫ్ భద్రత అందుబాటులోకి రానుంది. జులై 2 నుంచి అమల్లోకి రానున్నట్టు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటి వరకు ఎస్పీఎఫ్, స్పెషల్ పోలీస్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో భద్రత సేవలు అందనున్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ద్వారా భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీకి లేఖ ద్వారా ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ తెలిపారు.

 

వాహనదారులకు షాక్.. కర్ణాటకలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సార్వత్రిక ఎన్నికలు ముగియగానే వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ సేల్స్ ట్యాక్స్‌ను సవరణ చేసింది. దీంతో పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. కర్ణాటకలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సుమారు రూ. 3 నుంచి రూ. 3.05 వరకు పెరగనున్నాయి. శనివారం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం… కర్ణాటక సేల్స్ ట్యాక్స్ పెట్రోల్‌పై 25.92 శాతం నుంచి 29.84 శాతానికి, డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతానికి పెంచింది. దీంతో కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86 కాగా, డీజిల్ ధర రూ.88.94గా ఉండనుంది. పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఐదు హామీల అమలు కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.50,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంధన ధరల పెంపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2,500-రూ.2,800 కోట్లు సమీకరించవచ్చని ఆర్థిక శాఖ భావిస్తోంది.

 

కొత్త టూరిజం పాలసీ తీసుకొస్తామన్న డీకే.శివకుమార్
కర్ణాటక పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త టూరిజం పాలసీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక టూరిజం శాఖ నిర్వహించిన ‘దక్షిణ్ భారత్ ఉత్సవ్’ కార్యక్రమంలో డీకే.శివకుమార్ మాట్లాడుతూ.. మంచి టూరిజం పాలసీ వల్ల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులను ఆకర్షించగలుగుతామన్నారు. పారిశ్రామికవేత్తలు బాగా పనిచేసినప్పుడు.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడతాయని.. అలాగే పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ నుంచి చాలా మంది ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. వారి అనుభవాలను కర్ణాటకలో పంచుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో 300 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తోందన్నారు. బెంగళూరు ఐటీ రాజధానితో పాటు పర్యాటక కేంద్రంగా కూడా మారుతుందని అన్నారు. బెంగళూరులో కబ్బన్ పార్క్ మరియు లాల్ బాగ్ సంప్రదాయ పర్యాటక ప్రదేశాలు. కొత్త తరం ప్రజల కోసం కొత్త పర్యాటక ప్రదేశాలను రూపొందించడానికి బెంగళూరులో స్కై డెక్‌ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే 8-10 రోజుల్లో స్కై డెక్‌ కోసం కొత్త టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. డిస్నీల్యాండ్ తరహాలో బృందావన గార్డెన్‌ను కూడా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇందుకోసం గత బడ్జెట్‌లో కేటాయింపులు కూడా జరిగాయని గుర్తుచేశారు. జీఎస్టీ కారణంగా పెట్టుబడులు రావడం లేదని, వ్యాపారులు మొగ్గు చూపడం లేదని డీకే.శివకుమార్ తెలిపారు.

 

డిప్యూటీ సీఎం పవన్ కు లక్షల ఖరీదు చేసే పెన్.. వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
జనసేన-బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మిత్ర పక్షాలకు మంత్రి పదవులు కేటాయించడంతో పాటు.. కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించారు.. డిప్యూటీ సీఎం హెూదాను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఒక్కరికే పరిమితం చేశారు. కేబినెట్‌లోకి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి గౌరవించారు చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖల మంత్రిగా ఉన్నారు. ఇక ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి భార్య పవన్ కళ్యాణ్ వదినమ్మ సురేఖ పవన్ కళ్యాణ్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. లగ్జరీ పెన్ బ్రాండ్ మౌంట్ బ్లాక్ నుంచి పవన్ కళ్యాణ్ కి ఒక మంచి పెన్ గిఫ్ట్ ఇచ్చారు. దాని ఖరీదు దాదాపు మూడున్నర లక్షల రూపాయలుగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిజానికి మౌంట్ బ్లాక్ పెన్నులు 10వేల నుంచి మొదలవుతాయి లక్షల ధరల్లో కూడా దొరుకుతాయి. అయితే పవన్ కళ్యాణ్ కి సురేఖ ఏ పెన్ ఇచ్చారనే విషయం మీద క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం మూడున్నర లక్షల రూపాయల ఖరీదైన పెన్ ఇచ్చారు అనే ప్రచారం మొదలైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గిఫ్ట్ ఇస్తున్న సమయంలో వీడియోని షూట్ చేయగా దాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక తెలుగు ప్రజలకు సేవ చేస్తామని ఆశిస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి వీడియోలో పేర్కొన్నారు.