NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

భిన్నత్వాన్ని చూపించేలా ఏపీ సీఎం ప్లాన్‌.. 10 నుంచి 6 వరకు సచివాలయంలోనే..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఓవైపు కేబినెట్‌ మంత్రులకు శాఖలు కేటాయించారు.. మరోవైపు సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, గత పాలనకు.. ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు. ప్రభుత్వ కార్యక్రమాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మినహాయిస్తే.. ఇక నుంచి ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారట సీఎం చంద్రబాబు. సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇక, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే తొలి కెబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉందంటున్నారు.. ఇక, రెగ్యులర్‌గా సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారంట.. అంతే కాదు.. పరిపాలన పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు దిశా నిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

మనలో పోరాటపటిమ తగ్గకూడదు.. ధైర్యం కోల్పోవద్దు..
మనలో పోరాటపటిమ తగ్గకూడదు అంటూ ఎంపీలకు సూచించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైన జగన్.. నా వయసు చిన్నదే.. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు.. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదు అన్నారు.. నా వయసు చిన్నదే.. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు… మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చే శారు.. 14 నెలలు పాదయాత్ర చేశాను.. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. ఇక, ల్యాండ్ టైట్‌లింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది.. కానీ, సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి టీడీపీ కూటమి పార్టీలు విషప్రచారం చేశాయి. నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయి. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టంవల్ల వస్తాయన్నారు వైఎస్‌ జగన్.. చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఈ పత్రాల విషయంలో తప్పులు జరిగితే.. సదరు వ్యక్తికి ప్రభుత్వమే పరిహారం ఇస్తుందన్నారు. టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుందన్నారు.

నాపై నమ్మకంతో కీలక శాఖలు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు.. ఎక్కడ ఆపానో అక్కడి నుండే స్టార్ట్..
నాపై నమ్మకం ఉంచి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్‌టీజీ శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు ఏపీ మంత్రి నారా లోకేష్‌.. అయితే, తాను మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో.. అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తాను అన్నారు.. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటా.. ఈసారి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల కల్పనలో ఇతర రాష్ట్రాలకు తీవ్రమైన పోటీ ఇస్తుందన్నారు. ఐటీ ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షించడానికి, రాష్ట్రం నుంచి వలస వెళ్లాల్సి వచ్చిన మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి నేను 2019లో వదిలిపెట్టిన చోటు నుండే పనిని తిరిగి పునః ప్రారంభిస్తాను.. నాపై నమ్మకం ఉంచి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్‌టీజీ శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు లోకేష్‌. ఇక, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేసిన నా గత అనుభవం ఇప్పుడు జీవనోపాధి విద్యను రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను అని పేర్కొన్నారు మంత్రి లోకేష్‌.. మన యువతకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ఉద్యోగాలు నైపుణ్యం కల్పించడానికి నా తాజా ప్రయాణాన్ని ప్రారంభిస్తా.. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పని చేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను. రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తెచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తాను అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు మంత్రి నారా లోకేష్‌..

పోలవరంపై చంద్రబాబు సమీక్ష.. త్వరలో ప్రాజెక్టు సందర్శన..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, పాలనపై ఫోకస్‌ పెట్టారు.. ఈ రోజు తన కేబినెట్‌లోని 24 మంత్రులకు శాఖలు కేటాయించిన ఆయన.. మరోవైపు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే, సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం ఉంది.. ఇక, శ్వేత పత్రాల విడుదలకు కూడా సిద్ధం అవుతోంది చంద్రబాబు సర్కార్. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రతీసోమవారం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ.. పనులపై సమీక్ష నిర్వహిస్తూ వచ్చిన విషయం విదితమే.

గోదావరి వరదలు గుర్తు చేసిన భారీ వర్షం.. రామాలయం చుట్టూ చేరిన నీరు
ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. భద్రాచలంలో రామాలయం వద్ద ఉన్న అన్నదానం సత్రం చుట్టూ నీళ్లు చేరుకున్నాయి. రామాలయం వద్ద నీళ్లు చేరి అంతా చెరువులా మారింది .రామాలయం వద్ద నుంచి గోదావరిలోకి వెళ్లే డ్రైనేజీ నీళ్లు వెళ్లే స్లూయిస్‌లు ఓపెన్ కాకపోవడంతో నీళ్లన్నీ రామాలయం ఉత్తర భాగంలో ఉన్న రోడ్ల మీదకి నీళ్లు వచ్చాయి. అన్నదాన సత్రం చుట్టూ నీళ్లు చేరుకున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గోదావరి భారీ ఎత్తున వరదలు వచ్చిన సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి వద్ద ఉన్న అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడం ప్రతి ఏడాది జరుగుతుంది. కానీ మామూలు వర్షాలకు కూడా అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడం ఇదే మొదటిసారి. అదేవిధంగా అక్కడే ఉన్న దుకాణాల సముదాయం లోకి నీళ్లు చేరుకున్నాయి. ఒక్క సారిగా వచ్చిన వర్షానికి భక్తులు ఇక్కట్లు గురయ్యారు. మెట్ల మార్గం మీద నుంచి ఎక్కడానికి వీలు లేకుండా నీళ్లు చేరుకున్నాయి. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందనేది ఆరోపణ. ప్రధానంగా స్లూయిస్‌లను వేసవి కాలంలో మరమ్మతులు చేయడం జరుగుతుంది.

తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో తప్పులు.. చర్యలు చేపట్టిన ప్రభుత్వం
తెలుగు పాఠ్య పుస్తకంలో ముందుమాట మార్చకపోవడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరిని బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్‌ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించగా.. టీఆర్‌ఈఐఎస్ కార్యదర్శి రమణకుమార్‌కు ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో ఇచ్చిన తెలుగు పుస్తకాలను వెనక్కి తీసుకోనున్నారు. పంపిణీ చేయని వాటిని పిల్లలకు ఇవ్వకుండా ఆపారు. 24 లక్షల పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల పేర్లను ముద్రించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. బుధవారం పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను చాలాచోట్ల ఉపాధ్యాయులు గుర్తించి విద్యాశాఖ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం చర్యలు చేపట్టారు. మొదట ఆ పేజీని చించేయాలని ఆదేశించిన అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ పేపర్‌ను తొలగిస్తే దాని వెనకున్న వందేమాతరం, జాతీయ గీతం, ప్రతిజ్ఞ లేకుండా పోతాయి. ఈ క్రమంలో మరిన్ని విమర్శలు వస్తాయని భావించి.. పిల్లలకు ఇచ్చిన పుస్తకాలను వెనక్కు తీసుకోవాలని విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ పేజీ వరకు స్టిక్కర్ అంటించి మళ్లీ పంపిణీ చేసే అవకాశం ఉంది.

భారత్ లో పెరుగుతున్న నీటి వృథా.. ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయిజారిపోయే ప్రమాదం
దేశంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛమైన నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరత వెనుక వాతావరణ మార్పు ఒక ప్రధాన కారణం అయితే, మితిమీరిన వినియోగం, వృథా కూడా నీటి సంక్షోభ ప్రమాదాన్ని పెంచింది. దేశ రాజధాని ఢిల్లీ ఈరోజుల్లో నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. చాలా ప్రాంతాలను డ్రై జోన్‌లుగా ప్రకటించారు. ఢిల్లీలో రోజూ 50 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోంది. ప్రతి నీటి చుక్కకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. దేశ రాజధానికి అదనపు నీటిని అందించడానికి హర్యానా నిరాకరించడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం న్యాయ పోరాటంగా మారింది. అయితే, ఢిల్లీ మాత్రమే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కానీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో మండుతున్న వేడి, విద్యుత్ వాడకం నీటి వినియోగాన్ని పెంచింది. ఢిల్లీ, బెంగళూరు వంటి అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది.

మీటూ ఉద్యమంపై ఉక్కుపాదం.. మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు
చైనాలో మీటూ ఉద్యమం కారణంగా ఓ మహిళా జర్నలిస్టు జైలు పాలైంది. ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించే వ్యక్తులు, సంస్థలపై చైనా ఉక్కుపాదం మోపింది. మీటూ ఉద్యమంలో భాగంగా మహిళా హక్కులపై విస్తృత ప్రచారం చేసిన ఓ మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా సుమారు రూ.11.5లక్షలు జరిమానా వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మహిళా జర్నలిస్టుతో పాటు మరో సామాజిక కార్యకర్తకు మూడున్నరేళ్లు శిక్ష విధించింది. చైనాలోని ప్రముఖ యూనివర్సిటీలో పీహెచ్‌డీ సూపర్‌వైజర్‌.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ యువతి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వీటిని హువాంగ్‌ షియేకిన్‌ అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ స్థానికంగా విస్తృత ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఆమెతో పాటు మరో సామాజిక వేత్త వాంగ్‌ జియాన్‌బింగ్‌లు సెప్టెంబర్‌ 2021 నుంచి కనిపించకుండా పోయారు. అప్పుడే చైనా అధికారులు వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. కార్మిక హక్కులపై పోరాటం చేసే వాంగ్‌.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎంతోమంది మహిళలకు బాసటగా నిలిచారు. ఈ కేసు సెప్టెంబర్‌ 2023లో విచారణకు రాగా.. తాజాగా వారికి శిక్ష ఖరారైనట్లు హువాంగ్‌, వాంగ్‌ మద్దతుదారులు వెల్లడించారు. హువాంగ్‌కు ఐదేళ్ల శిక్ష పడిందని.. సెప్టెంబర్‌ 18, 2026న విడుదలవుతారని తెలిపారు. కాగా వాంగ్‌కు మాత్రం మూడున్నరేళ్ల శిక్ష ఖరారైనట్లు సమాచారం.

ఇటలీలో మోడీ బిజిబిజీ.. అగ్ర నేతలతో సమావేశం
జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని మోడీ.. శుక్రవారం బిజిబిజీగా గడిపారు. పలు దేశాల అధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటలీ వేదికగా జరుగుతోన్న జీ7 దేశాల సదస్సులో భారత్ ఆహ్వానిత దేశంగా పాల్గొంది. ఈ సందర్భంగా జీ7 దేశాల అధినేతలతో మోడీ వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌తో కూడా సంభాషించారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం విషయంలో భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తూనే.. రష్యా వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్‌కు పలుమార్లు దూరంగా ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుత సమావేశంలో పుతిన్‌ సేనలతో జరుగుతోన్న ఘర్షణకు సంబంధించి పలు అంశాలను మోడీకి జెలెన్ స్కీ వివరించినట్లు సమాచారం. ఇక ఈ జీ7 సదస్సులో ఈ యుద్ధం గురించే చర్చ జరిగింది. ఫ్రీజ్‌ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్‌కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది. దీనికి సభ్యదేశాలు తమ అంగీకారం తెలిపాయి. రక్షణ, అంతరిక్ష, విద్య, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మోడీ, మేక్రాన్ చర్చలు జరిపారు. దాంతోపాటు పలు కీలక విషయాలపై తమ మధ్య చర్చ జరిగినట్లు మోడీ వెల్లడించారు.

చందాదారులకు షాకింగ్ న్యూస్.. అడ్వాన్స్‌ సదుపాయం నిలిపివేత
పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్‌వో షాకింగ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ సమయంలో కేంద్రం తీసుకొచ్చిన కోవిడ్‌ అడ్వాన్స్‌ సదుపాయాన్ని నిలిపివేసింది. ఈ సమాచారం ఉద్యోగులకు ఇబ్బందికరమే. ఓ వైపు లాక్‌డౌన్.. ఇంకో వైపు అన్ని ధరలు అమాంతంగా పెరిగిపోవడం… మరోవైపు ఉద్యోగాలు లేని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌వో అడ్వాన్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే కరోనా పరిస్థితులు ఇప్పుడు లేవు.. కేసులు లేవు.. ఆ వార్తలు వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయా అవసరాలకు అడ్వాన్స్ తీసుకున్న చందాదారులకు ఇబ్బందులు తలెత్తినట్లే. కరోనా ఫస్ట్‌వేవ్‌ సందర్భంగా అడ్వాన్సు సదుపాయాన్ని ఈపీఎఫ్‌వో తీసుకొచ్చింది. రెండో వేవ్‌ వచ్చినప్పుడు మళ్లీ దీన్ని పునరుద్ధరించారు. అలా దాదాపు నాలుగేళ్లుగా అందుబాటులో ఉంది. తొలుత ఒకసారి మాత్రమే అడ్వాన్స్‌ పొందే అవకాశం కల్పించినా.. తర్వాత పలుమార్లు విత్‌డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇందులో భాగంగా మూడు నెలల బేసిక్‌+ డీఏ లేదా ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న 75 శాతం వరకు మొత్తం విత్‌డ్రాకు అనుమతించారు. ఆ సమయంలో చాలామందికి ఈ సౌకర్యం ఉపయోగపడింది.

భక్త కన్నప్ప కథ ఏంటి? వదిలిన టీజర్ ఏంటి? ఏమన్నా సింక్ ఉందా?
భక్త కన్నప్ప గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కన్నప్ప తమ వాడేనని భావిస్తూ ఉంటారు. శ్రీకాళహస్తిలో జరిగినట్టుగా చెప్పుకునే కన్నప్ప చరిత్ర మీద భక్తకన్నప్ప పేరుతో కృష్ణంరాజు ఒకప్పుడు సినిమా చేశారు. తర్వాత ప్రభాస్ హీరోగా ఇలాంటి ఒక సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇక ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం న్యూజిలాండ్ వెళ్లి మరీ షూటింగ్ జరుపుకుని వచ్చారు. తెలుగు నటులే కాదు, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు చెందిన స్టార్ యాక్టర్లతో పాటు ప్రభాస్ కూడా ఈ సినిమాలో భాగమయ్యాడు. సినిమా రిలీజ్ కి సిద్ధం చేసే క్రమంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మాత్రం అదిరిపోయేలా ఉందని చెప్పాలి. కానీ అసలు కన్నప్ప కథకు టీజర్ కి ఎక్కడ సింకు కుదరడం లేదు అనే కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఒకసారి కన్నప్ప వృత్తాంతం తెలుసుకుందాం, తర్వాత టీజర్ చూద్దాం. ఆ తర్వాత మీకేం అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.