NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

*డీఎస్సీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామని.. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తాం.. ఇంకా 6 వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. నిరుద్యోగులకు వెంటవెంటనే ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందరూ మంచిగా ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగ యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాల కోసం.. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితం తెలంగాణ అని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టి 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యానందించాలని డీఎస్సి ప్రకటించామని పేర్కొ్న్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసింది.. పదేళ్లు డీఎస్సీని గత ప్రభుత్వం నిర్వహించలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్ల కోసం తాపాత్రయ పడ్డారని తెలిపారు. 5 వేలకు నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహించలేదని.. తమ ప్రభుత్వం రాగానే 11 వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. 16వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించాం.. 19,718 టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే హాల్ టికెట్లు 2 లక్షల 500కు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని.. మొత్తం 2లక్షల 79వేలమంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కొంతమంది పోస్ట్ ఫోన్ చేయమని ధర్నాలు చేస్తున్నారని.. తమ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించామని చెప్పారు. గ్రూప్ 2 కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారన్నారు. తమ ప్రభుత్వం మళ్ళీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రూప్ 3 కూడా నిర్వహించలేకపోతే మళ్ళీ తాము షెడ్యూల్ చేశామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

 

*నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ..
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనలు.. ప్రభుత్వం పరిష్కరించాల్సిన డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అని అన్నారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించి ఉసూరుమనిపించారని తెలిపారు. అభ్యర్థులు, నిరుద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలిగించే మాటలు చెప్పలేదు.. సమస్యకు పరిష్కారం చూపలేదని హరీష్ రావు లేఖలో తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం వల్లనే నిరుద్యోగుల పోరాటం మొదలైందన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించాలని కోరుతున్నానని హరీష్ రావు తెలిపారు. ‘మావి కొత్త డిమాండ్లు కావు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే, రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రంథాలయాలకు, కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇచ్చిన హామీలే’ అని అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదని ప్రశ్నించారు. మీరు, మంత్రులు, అధికారం యంత్రాంగం మొత్తం ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను సంఘవిద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటం దౌర్భాగ్యం అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సహా అభ్యర్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించడం, ఇనుప కంచెలు వేయడం, ముందస్తు అరెస్టులు చేయడం, ఎక్కడిక్కడ నిర్బంధించడం వంటి చర్యలు అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. నిరుద్యోగుల బాధలను ప్రపంచానికి చూపించే జర్నలిస్టులను సైతం బెదిరించడం, అరెస్టులు చేయడం, వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని తెలిపారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.. వెంటనే అరెస్టులు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ మీరు నిందారోపణలు చేయడం ఆక్షేపణీయం అని హరీష్ రావు అన్నారు. ఇలా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం వల్ల అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభించదన్నారు. నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరు కూడా పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం వల్ల వారు శాంతించరని చెప్పారు. పైగా రెచ్చగొట్టినట్లుగా భావిస్తారన్నారు. నాడు హామీలు ఇచ్చిన వారు నేడు పదవుల్లో ఉన్నారు కానీ.. నిరుద్యోగులు మాత్రం ఇంకా రోడ్లపైనే ఉన్నారనే విషయాన్ని గుర్తించండని పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తే మంచిదని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు అశాంతితో ఉన్న రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా సాగటం అసాధ్యం.. మాది ప్రజాపాలన అని ప్రచారం చేసుకునే మీరు, నిరుద్యోగుల సమస్యల విషయంలో భేషజాలకు పోవడం సరికాదన్నారు. కంచెలు, ఆంక్షలు విధించి వారి గొంతులను నొక్కాలనుకున్న మీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. అభ్యర్థులు, నిరుద్యోగుల జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో చర్చలకు ఆహ్వానించాలని.. సహృదయంతో వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరుతున్నట్లు లేఖలో ప్రస్తావించారు.

 

*కట్టుకున్నోడే కడతేర్చాడు.. రఘునాథపాలెం రోడ్డు ప్రమాద ఘటనలో వీడిన మిస్టరీ
గత రెండు నెలల క్రితం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి హత్యలు చేసిన ఘటన ఎట్టకేలకు హత్య మిస్టరీ వీడింది. రఘునాథపాలెం మండలం హర్యా తండా వద్ద తల్లి ఇద్దరు పిల్లలతో కారు ప్రమాదం భార్య, ఇద్దరు పిల్లలు మృతిచెందిన ఘటన కనపడింది. అయితే భర్త ప్రవీణ్ హైదరాబాదులో డాక్టర్గా పనిచేస్తూ అక్కడ ఒక కేరళ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నడని ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతుంది. ఇంటికి భార్య పిల్లల్ని తీసుకుని వచ్చి కారుని ఒక చెట్టుకు ఢీకొట్టే విధంగా చేశాడు భర్త ప్రవీణ్. అప్పటిలో ఇది పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంగానే భావించారు. హత్య చేశారని భార్య బంధువులు ఆరోపించినప్పటికీ ఇది రోడ్డు ప్రమాదం కానే పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. మీడియా సమావేశాలు కూడా ఇదే వెల్లడించారు. అయితే పోలీసులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ భార్య బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద పలు దఫాలుగా ధర్నా చేశారు. ఈ విషయాన్ని ఎక్స్క్లూజివ్ గా ఆనాడు ఎన్టీవీ వెలుగులోకి చూపెట్టింది. ఇది హత్య అంటూ ఎన్ టీవీ స్పష్టం చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి హత్యగా నిర్ధారణ అయినట్టుగా పోలీసులు స్పష్టం చేశారు. భార్యని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తూ చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే చనిపోగా భర్తకు మాత్రం గాయాలు అయ్యాయి. దీంతో భర్త పైన అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటిలో భర్త ప్రవీణ్ ను ప్రైవేట్ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. చివరికి పోలీసుల విచారణలో ఇది హత్యగా తేలింది. దీనికి సంబంధించి వివరాలను ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు. 45 రోజుల తరువాత మిస్టరీ వీడిందని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి తెలిపారు. డాక్టర్ ప్రవీణ్ ను అరెస్టు చేశామన్నారు, భార్య ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్.. అనంతరం కార్ ఆక్సిడెంట్ గా క్రియేట్ చేశాడన్నారు. నర్స్తో అక్రమ సంబంధంతో ఈ ఉదంతానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. కారులో ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని.. అందులో ఖాళీ సిరంజి దొరికిందన్నారు. అనస్థీషియా సిరంజి ఇచ్చి హత్య చేసినట్లుగా స్పష్టం అయ్యిందని ఏసీపీ పేర్కొన్నారు. మే నెలలో ఇంటిలో గొడవ జరిగిందని.. అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రుల మధ్య పంచాయితీ కూడా జరిగిందని తెలిపారు. ఇంజక్షన్ ఇచ్చి చంపాలని ప్రయత్నాలు చేశారని.. కాల్షియం ఇంజెక్షన్తో హత్య చేయడం కోసం ప్లాన్ చేశారని.. కుదరలేదని ఏసీపీ తెలిపారు. భోజనం చేసి ఖమ్మం నుంచి కోయచెలక దారిలో కాల్షియం ఇంజెక్షన్, మరో ఇంజెక్షన్ కలిపి ఇచ్చాడన్నారు. భార్య నిద్ర పోగానే పిల్లలకు ఇంజెక్షనిచ్చి హత్య చేశాడని.. హర్య తండా వద్ద చెట్టుకు ఢీ కొన్నట్లు క్రియేట్ చేశాడని ఏసీపీ పేర్కొన్నారు.

 

*రికార్డు సృష్టించిన ప్రధాని.. మోడీకి ఎక్స్ లో 100 మిలియన్ల ఫాలోవర్స్..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. మోడీ “ఎక్స్” ఖాతాలో 100 మిలియన్ల ఫాలోవర్ల మార్క్‌ను దాటారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నాయకుడిగా నిలిచారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా నరేంద్ర మోడీకి మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విషయంలో ఇతర నాయకులు చాలా వెనుకబడి ఉన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 26.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 27.5 మిలియన్లు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్‌కు 19.9 మిలియన్లు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ను 6.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. మోడీ ఫాలోయింగ్ పరంగా భారతీయ నాయకుల కంటే ముందుండటమే కాదు.. విదేశీ నాయకులలో కూడా ముందున్నారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, పలువురు విదేశీ నేతలు మోడీ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. జో బిడెన్‌కి ప్రస్తుతం 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రధాని మోడీ ఎక్స్ ఖాతాలో గత మూడేళ్లుగా దాదాపు 30 మిలియన్ల ఫాలోవర్స్ ను పెరిగారు. ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో చాలా మంది ప్రజలు ఆయనను అనుసరిస్తున్నారు. మోడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 91.2 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 49 మిలియన్ల మంది, యూట్యూబ్‌లో 24.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే సమయంలో వాట్సాప్ ఛానెల్‌లో కూడా 13 మిలియన్ల మంది ఆయనను అనుసరిస్తున్నారు.

 

*చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల హతం..
జమ్మూ కాశ్మీర్‌ కుప్వారాలోని కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ సమయంలో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం. చొరబాటుదారుల బృందాన్ని ఆపడానికి సైన్యం ప్రయత్నించింది. ఆ తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయి. చొరబాటుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. గురువారం తెల్లవారుజామున కూడా జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. అనుమానిత ఉగ్రవాదుల బృందం భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. సైన్యం అడ్డుకోవడంతో తిరిగి వెనుకకు పారిపోయారు. కాగా.. సోమవారం కతువాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. దీని తర్వాత సైన్యం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కూడా జరిగాయి. దాడి తర్వాత, సైనిక వాహనం యొక్క చిత్రం కూడా స్పాట్ నుంచి బయటకు వచ్చింది. దాడి తర్వాత.. లోయలో సైన్యం మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. కొండపై దాక్కున్న ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారని, ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ కూడా విసిరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా లోయలో అలజడి పెరిగింది. ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయనే వార్తలు వరుసగా వస్తున్నాయి.

 

*ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో పట్టపగలు కాల్పులు.. రోగి అక్కడికక్కడే మృతి
ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో పట్టపగలు బుల్లెట్లు పేలాయి. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు రోగిపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన రోగిని 32 ఏళ్ల రియాజుద్దీన్‌గా గుర్తించారు. రోగి కొన్ని వారాల కిందట ఆస్పత్రిలో చేరారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నాలుగు గంటల సమయంలో 18 ఏళ్ల యువకుడు ఆసుపత్రి లోపలికి వచ్చి రియాజుద్దీన్‌పై కాల్పులు జరిపాడు. అతడు 3-4 రౌండ్ల బుల్లెట్లు కాల్చాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రియాజుద్దీన్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు అక్రమార్కులు కూడా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్ర వేళ పోలీస్ స్టేషన్ కు జీటీబీ ఆస్పత్రి నుంచి పీసీఆర్ కాల్ వచ్చింది. ఆసుపత్రిలోని 24వ వార్డులో కాల్పులు జరిగినట్లు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఢిల్లీలోని శ్రీరామ్ నగర్ ఖజూరి నివాసి రియాజుద్దీన్ పై దుండగులు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఈ కాల్పుల్లో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జూన్ 23న రియాజుద్దీన్ కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. రియాజుద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా…దేశ రాజధాని ఢిల్లీలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అంతకుముందు జూలై 13న రాజధానిలోని లజ్‌పత్ నగర్‌లో ర్యాపిడ్ ఫైరింగ్ జరిగింది. దుండగులు సుమారు 10-12 రౌండ్లు కాల్పులు జరిపారు.

 

*ట్రంప్ దాడిపై “టీ-షర్ట్‌లు”.. ఇంత ఫాస్ట్‌గా ఎలారా..?
పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని హతమార్చారు. ఇలా దాడి జరిగిందో లేదో, దానిని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. దాడి తర్వాత ట్రంప్ చేతులు బిగించి, తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ‘‘ఫైట్ ఫైట్ ఫైట్’’ అంటూ నినదించారు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. ఈ చిత్రాలతో ఏకంగా టీ-షర్టులు రెడీ అవుతున్నాయి. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం, శనివారం సాయంత్రం 6.15 గంటలకు హత్యాయత్నం జరిగింది. 6.31 గంటలకు పిడికిలి పైకెత్తిన ట్రంప్ ఫోటో రిలీజ్ అయింది. రాత్రి 8 గంటలకు అధ్యక్షుడు జో బైడెన్ ఈ దాడిని ఖండించారు. అయితే, ఈ సమయానికే చైనా తయారీదారులు ట్రంప్ పిడికిలి పైకెత్తిన ఫోటోతో టీషర్టుని తయారు చేశారు. పెద్ద సంఖ్యలో వీటిని ఉత్పత్తి చేసేందుకు చైనా తయారీదారులు సిద్ధమయ్యారు. మొదటి బ్యాచ్ టీ-షర్టులు ప్రముఖ చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన టావోబావోలో రాత్రి 8.40 గంటలకు అమ్మకానికి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దేశాధినేతలు స్పందించే లోపే టీ-షర్టుల తయారీ మొదలైంది. మూడు గంటల్లోనే చైనా, యూఎస్ నుంచి 2000 కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు టావోబావో చెప్పింది.

 

*ట్రంప్‌పై హత్యాయత్నం.. జో బైడెన్‌పై రష్యా సంచలన వ్యాఖ్యలు..
అమెరికా మాజీ అధ్యక్షుడు, నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. పెన్సిల్వేనియా బట్లర్‌లో ఎన్నికల్ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిపాడు. అయితే, అదృష్టవశాత్తు ఈ దాడి నుంచి ట్రంప్ బయపడ్డాడు. నిందితుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ప్రపంచ దేశాధినేతలు ఆకాంక్షించారు. ఈ దాడిపై రిపబ్లికన్లు, అధ్యక్షుడు బో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌పై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉంటే, రష్యా జో బైడెన్ పరిపాలనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. ఇందులో ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేస్తున్న వారే ట్రంప్‌పై దాడికి కారణమయ్యారని రష్యా విదేశాంగ ప్రతినిధి జఖరోవా ఆరోపించారు. ఇదిలా ఉంటే తాజాగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రంప్‌ని అంతమొందించడానికి, హత్య చేయడానికి ప్రస్తుత జో బైడెన్ పరిపాలన అధికారులు చేసిన ప్రయత్నమని తాము నమ్మడం లేదు’’ అని అన్నారు. అయితే, అది దాడిని రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టించిందని క్రెమ్లిన్ ఆదివారం తెలిపింది. బైడెన్ పరిపానల ట్రంప్ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ఈ రోజు అమెరికా ఎదుర్కొంటున్న దానిని రెచ్చగొట్టిందని ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ట్రంప్‌పై జరిగిన దాని ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదని చెప్పారు. రాజకీయ పోరాటంలో ఎలాంటి హింస జరిగినా రష్యా ఖండిస్తుందని పెస్కోవ్ అన్నారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్ మిలిటరీకి నిధులు ఇవ్వడం ఆపివేయాలని మరియు బదులుగా దేశీయ చట్ట అమలును మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని కోరింది. ట్రంప్‌పై జరిగిన దాడి వచ్చే ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే ప్రశ్నకు.. ‘‘ దీనిపై మేము తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. మేము యూఎస్ విషయంలో జోక్యం చేసుకోవాలనే కనీస ఆలోచన రష్యాకు లేదు’’అని పెస్కోవ్ అన్నారు. ‘‘ అభ్యర్థి ట్రంప్‌ని రాజకీయాల నుంచి తొలగించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. మొదట చట్టపరమైన సాధానాలు కోర్టులు, ప్రాసిక్యూటర్లు, రాజకీయంగా అప్రతిష్టపాలు చేయడానికి, కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారు. బయటి పరిశీలకులకు అతని ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని స్పష్టంగా తెలుసు’’అని పెస్కోవ్ అన్నారు. ఈ ఘటనపై ట్రంప్‌కి ఫోన్ చేసే ఉద్దేశం పుతిన్‌కి లేదని ఆయన చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కాల్చిచంపారని, అతని ఉద్దేశాన్ని అధికారులు గుర్తించలేదని అన్నారు.

 

*జింబాబ్వేను మడతపెట్టేసిన భారత్.. ఇండియా విక్టరీ
జింబాబ్వేతో జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియా బౌలర్లు మరోసారి అదరగొట్టడంతో గెలుపొందారు. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటింగ్లో డియాన్ మేయర్స్ (34) అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత.. ఫరాజ్ అక్రమ్.. (27) పరుగులు చేశాడు. తడివానాశే మారుమని (27), బ్రియాన్ బెన్నెట్ (10), సికిందర్ రజా (8) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 4 వికెట్లతో చెలరేగాడు. శివమ్ దూబేకు 2 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఈ స్కోరును సాధించింది. భారత్ బ్యాటింగ్లో సంజా శాంసన్ (58) పరుగులతో రాణించాడు. రియాన్ పరాగ్ (22) పరుగులతో పర్వాలేదనిపించాడు. యశస్వీ జైస్వాల్ (12), గిల్ (13), అభిషేక్ శర్మ (14) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత శాంసన్ అర్థ సెంచరీ చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అతని ఇన్నింగ్స్లో 4 సెక్సులు, 1 ఫోర్ ఉంది. ఆ తర్వాత రియాన్ పరాగ్ 24 బంతుల్లో 22 పరుగులు, శివం దూబే కూడా క్రీజులో ఉన్నంత సేపు (26) రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత రింకూ సింగ్ (11*), వాషింగ్టన్ సుందర్ (1*) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలింగ్లో ముజారబానీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సికిందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మావుట తలో వికెట్ తీశారు.