NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సాధారణ విపత్తులా ఈ విపత్తును చూడకండి.. ఉదారంగా సాయం చేయండి..

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి…అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో స‌మావేశ‌మైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని అన్నారు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయని.. కేంద్రం ఉదారంగా ఆదుకునే విధంగా చూడాలని కేంద్ర బృందాన్ని కోరారు. ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందని.. పంటలు నీళ్లలో మునిగి రైతులు కుదేలయ్యారని సీఎం అన్నారు. ప్రాణ, ఆస్థి నష్టంతో పాటు…తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారని సీఎం చెప్పారు. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడమని కేంద్ర బృందాన్ని కోరారు. రెండు రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది…కృష్ణా బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదు. గరిష్టంగా 11.90 లక్షల క్యూసెక్కుల వరదకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. మొన్న కురిసిన వ‌ర్షాల‌కు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇదే ఇప్పటి వరకు రికార్డు స్థాయి వరద. కృష్ణా నదికి ఒక వేళ 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వరదల్లో ప్రజలు పడిన బాధలు చూసి చలించిపోయాం…. మంత్రులు, అధికారులు అంతా క్షేత్ర స్థాయిలో ఉండి పనిచేశారు. ప్రజలకు ధైర్యం ఇచ్చేందుకు విజయవాడలోనే ఉండి పనిచేశాం. కలెక్టర్ కార్యాలయాన్ని సచివాలయంలా చేసుకుని పనిచేశాం. సమస్త యంత్రాంగాన్ని రంగంలోకి దించి ప్రజలకు నమ్మకం కల్పించాం. అప్పటికప్పుడు డ్రోన్లు తెప్పించి ఆహారం సరఫరా చేశాం. సహాయక‌ చర్యల కోసం కేంద్ర సాయం తీసుకున్నాం…సర్వశక్తులూ వడ్డాం. ఫైరింజన్లు పెట్టి రోడ్లు, ఇళ్లు క్లీన్ చేశాం. ముఖ్యమంత్రి నుంచి చిన్న ఉద్యోగి వరకు క్షేత్ర స్థాయిలో ఉండి వరద సహాయక చర్యలను యుద్దంలా చేపట్టాం. పెద్ద ఎత్తున పంటనష్టం జరిగింది. నష్టపోయిన కౌలురైతులకు సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉంది. రోడ్లు, ఇరిగేషన్ వ్యవ‌స్థకు తీవ్ర నష్టం జరిగింది. సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులకు, రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప తిరిగి కోలుకోలేరు. అందుకే సాధారణ విపత్తులా దీన్ని చూడవద్దు అని కోరుతున్నా” అని సీఎం కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం.. వరద ప్రాంతాల్లో త‌మ బృందం జ‌రిపిన ప‌ర్యట‌న‌కు సంబంధించి తమ అనుభవాలను ముఖ్యమంత్రికి వివ‌రించారు. “ఇంత స్థాయి వరదలు, బాధలు అనంతరం కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి సాంత్వన చేకూర్చాయి. ఇంత కష్టంలోనూ ప్రజల్లో ఎక్కడా ప్రభుత్వం పట్ల అసంతృప్తి, ఆగ్రహం కనిపించలేదు. తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది, సాయం చేస్తుంది అనే నమ్మకం వారిలో ఉంది. డ్రోన్ల వంటి వాటి ద్వారా ప్రభుత్వ సహాకయ చర్యలు ఎంతో వినూత్నంగా సాగాయి. భారీగా పంట నష్టం జరిగింది, మౌలిక సదుపాయాల పరంగా తీవ్రం నష్టం జరిగిందని మాకు క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా తెలిసింది. బుడమేరు వరదల పై ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. దాదాపు 60 ఏళ్ల తరువాత ఇలాంటి వరదలు వచ్చాయని ప్రజలు మాతో చెప్పారు. ఈ సమస్య నుంచి శాశ్వత‌ పరిష్కారం చూపాలని ప్రజలు కోరారు” అని కేంద్ర బృందం ఈ సమావేశంలో సీఎం కు తమ అనుభవాలు తెలిపింది. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తగు సాయం అందేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని కేంద్ర బృంద అధికారులు తెలిపారు.

 

కౌశిక్, అరికెపూడి వివాదంపై సీఎం రేవంత్ రియాక్షన్..
పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆదేశాలు వచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ), ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని చెప్పారు. అసెంబ్లీ చివరిరోజు బీఅర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించినప్పుడు, ఆ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పీఏసీ పదవి కాంగ్రెస్ కు కాకుండా.. ఎంఐఎంకు ఇచ్చారని చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే.. 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ చైర్మన్ గా ఎలా ఉంటారు.? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎంకు ఎలా ఇచ్చారు.. ఇస్తారు..!? అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బ్రతకడానికి వచ్చినోళ్ళ ఓట్లు కావాలి కానీ, వాళ్లకు టికెట్లు ఇవ్వద్దా..!? అని అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని తెలిపారు. “బ్రతకడానికి వచ్చినోళ్ళు” అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం పై కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల అరెస్ట్..
సైబరాబాద్‌ సీపీ ఆఫీస్‌ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్ చేశారు. హరీష్‌రావుతో పాటు బీఆర్ఎస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్‌ నేతలను శంషాబాద్‌ పీఎస్‌కు తరలించారు. దాడి చేసిన వాళ్లను అరెస్ట్ చేయమని ప్రశ్నించినందుకు తమను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని హరీష్ రావు తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. పోలీసుల రాజ్యం నడుస్తుందని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశామని.. కానీ కేవలం 41 సీఆర్పీసీ నోటీసు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు
ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపుల పరిశీలనకు కేబినెట్ సబ్ కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది. ఆరుగురు మంత్రులతో జీవోఎంను నియమించారు. ఈ కేబినెట్ సబ్‌ కమిటీలో సభ్యులుగా మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యా రాణి, కందుల దుర్గేష్, టీజీ భరత్‌లు ఉన్నారు. కేబినెట్ సబ్ కమిటీ కన్వీనరుగా పురపాలక శాఖా కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయా శాఖల కార్యదర్శులు నియామకమయ్యారు. గతంలో జరిగిన కేటాయింపులను కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. గతంలో కేటాయించిన భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను కేబినెట్ సబ్ కమిటీ సూచించనుంది. ప్రపంచ స్థాయి సంస్థలను గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించేలా కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సులు చేయనుంది.

 

కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి బాలికపై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. గతేడాది జరిగిన ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో సంగారెడ్డి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది అక్టోబర్ 16న ఐదేళ్ళ బీడీఎల్ భానూరులో ఐదేళ్ల చిన్నారిపై ఘాతుకానికి పాల్పడ్డ గపూర్‌(56)కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. బీహార్‌కు చెందిన గపూర్ భానూరులో నివాసం ఉంటున్నాడు. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ కేసులో చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ద్వారా 11 నెలల్లో విచారించి కేసుపై తీర్పు వచ్చేలా సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌ కుమార్ చేశారు. 27 ఏళ్ల తర్వాత మరణశిక్ష విధించడం జిల్లాలో ఇదే తొలిసారి.

 

సీతారాం ఏచూరి మృతికి ప్రధాని మోడీ సంతాపం
ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఏచూరికి మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి వామపక్షాల వెలుగు అంటూ కొనియాడారు. ఈ మేరకు సీతారాం ఏచూరికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. వామపక్షాలకు అగ్రగామిగా నిలిచారని కొనియాడారు. సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా పని చేశారని ప్రశంసించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి, అభిమానులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లో అందరితో కనెక్ట్ అయ్యే నాయకుడని తెలిపారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌పై ఏచూరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు కన్నుమూసినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు దానం చేశారు. బోధన, పరిశోధన ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యులు ఇన్‌స్టిట్యూట్‌కు విరాళంగా ఇచ్చారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి దానం చేయడంతో ఇక ఆయన అంత్యక్రియలు ఉండవు. ఏచూరి కోరిక మేరకే కుటుంబ సభ్యుల ఇలా చేశారు. తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వాలని ఏచూరి కోరారు. 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా కూడా గుర్తింపు పొందారు. ఏచూరి మద్రాస్‌లో తెలుగు కుటుంబంలో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ మోహన్‌ కందాకు మేనల్లుడు. ఏచూరి బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో కొడుకు ఆశిష్ చనిపోయాడు.

 

సీతారాం ఏచూరి భౌతికకాయం ఎయిమ్స్‌కు దానం
ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌పై చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు కన్నుమూసినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు దానం చేశారు. బోధన, పరిశోధన ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యులు ఇన్‌స్టిట్యూట్‌కు విరాళంగా ఇచ్చారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి దానం చేయడంతో ఇక ఆయన అంత్యక్రియలు ఉండవు. ఏచూరి కోరిక మేరకే కుటుంబ సభ్యుల ఇలా చేశారు. తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వాలని ఏచూరి కోరారు. 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా కూడా గుర్తింపు పొందారు. ఏచూరి మద్రాస్‌లో తెలుగు కుటుంబంలో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ మోహన్‌ కందాకు మేనల్లుడు. ఏచూరి బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో కొడుకు ఆశిష్ చనిపోయాడు.

 

అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్ లూతో రాహుల్ గాంధీ భేటీ.. ఎవరితను..? బంగ్లా, పాక్‌లో ఏం చేశాడు..?
అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే సిక్కు, రిజర్వేషన్ వ్యాఖ్యలపై ఆయనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు సిక్కులు నిన్న సోనియాగాంధీ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ కలుస్తున్న వ్యక్తులపై కూడా ఆందోళన నెలకొంది. భారత బద్ధవ్యతిరేకి, పాకిస్తాన్ అంటే ప్రేమ కలిగిన అమెరికా చట్టసభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ భేటీ కావడం వివాదంగా మారింది. పలు సందర్భాల్లో భారత వ్యతరేక తీర్మానాలను ప్రవేశపెట్టిన ఈమెతో రాహుల్ గాంధీ భేటీ అవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 రద్దను వ్యతిరేకించడంతో పాటు అమెరికా చట్టసభలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని కూడా వ్యతిరేకించింది. ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ కలిసిన వ్యక్తుల్లో డొనాల్డ్ లూ అనే అమెరికన్ దౌత్యవేత్త కూడా ఉన్నాడు. ఇతను అమెరికా ప్రభుత్వం తరుపున సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా వ్యవహరాల అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్నాడు. అయితే, ఇతడిని కలిస్తే సమస్య ఏంటని చాలా మంది అనుకోవచ్చు కానీ, ఇతను వెళ్లిన ప్రతీచోట ప్రభుత్వాలు దిగిపోవడం, తిరుగుబాటు రావడం జరిగింది. రెజిమ్ ఛేంజ్(పాలన మార్పిడి)లో ఇతడిని నిపుణుడిగా పరిగణిస్తారు. గతంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలో నుంచి దిగిపోయేందుకు ఇతడి కుట్ర కారణమనే ఆరోపణలు ఉన్నాయి. చివరు స్వయంగా ఇమ్రాన్ ఖాన్ కూడా డొనాల్డ్ లూ కుట్ర వల్లే తన దిగిపోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. అంతకుముందు శ్రీలంకకు వెళ్లిన తర్వాతే గోటబయ రాజపక్సపై తిరుగుబాటు ప్రారంభమైంది. తాజాగా బంగ్లాదేశ్ రిజర్వేషన్ అల్లర్లు, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడంలో కూడా ఇతడి ప్రమేయం ఉంది. గతంలో కిర్గిజ్‌స్తాన్ దేశానికి వెళ్లాడు, అక్కడ రాయబారిగా ఉన్న సమయంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. అల్బానియాలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ, డొనాల్డ్ లూ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ పర్యటనపై మెకికా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. ఈ భేటీ సాధారణ సమావేశాల్లో భాగంగానే జరిగిందని చెప్పారు. ఈ డొనాల్డ్ టూ సెప్టెంబర్ ఈ వారంలో బంగ్లాదేశ్, ఇండియాలో పర్యటించబోతున్నారు. ఇండియా-అమెరికా మధ్య జరిగే 2+2 విదేశాంగ, డిఫెన్స్ మంత్రిత్వ శాఖల మధ్య జరిగే సమావేశంలో ఈయన పాల్గొనబోతున్నారు.

 

2 గంటలు సీఎం మమత నిరీక్షణ.. చర్చలకు రాని డాక్టర్లు.. రాజీనామాకు రెడీ అంటూ ప్రకటన!
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల చర్చలపై ప్రతిష్టంభన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే షరతులతో కూడిన ఆహ్వానం పంపించింది. దీంతో వైద్యులు చర్చలకు వచ్చేందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రి మమత మాత్రం సెమినార్ హాల్‌కు వచ్చేశారు. దాదాపు వైద్యుల కోసం 2 గంటల పాటు నిరీక్షించారు. కానీ ఎవరూ రాలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోను తృణమూల్ కాంగ్రెస్ పోస్టు చేసింది. అంతేకాకుండా మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘‘నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని పెద్ద ప్రకటన చేశారు. ఒక హాలులో ఒంటరిగా కూర్చుని జూనియర్ డాక్టర్ల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కోల్‌కతాలో జూనియర్ వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశించినా నిరసనలు కొనసాగించారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్యులు కూడా ప్రభుత్వ ఆహ్వానాన్ని అంగీకరించి.. షరతులతో కూడిన లేఖను ప్రభుత్వానికి పంపించారు. చర్చలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రావాలని.. అలాగే 30 మంది డాక్లర్లు వస్తారని.. చర్చలకు సంబంధించిన విషయాలను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల షరుతపై ప్రభుత్వం స్పందించింది. గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. కేవలం 15 మంది రావాలని.. నబన్నలోని సెమినార్ హాల్‌కు రావాలని పిలిచింది. ప్రత్యక్ష ప్రచారం ఉండబోదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని లేఖలో సర్కార్ పేర్కొంది. సామాన్య ప్రజలకు చికిత్స, ఆరోగ్య సేవలను పునరుద్ధరించడానికి జూడాలు సమావేశానికి రావాలని కోరింది. చర్చలు సజావుగా సాగేలా కేవలం 15 మంది మాత్రమే రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ చర్చలపై జూనియర్ డాక్టర్లు ముందుకు రాలేదు. ప్రభుత్వ షరతులను నిరాకరించారు. సీఎం మమత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ.. సెమినార్ హాల్‌కు వచ్చినా వైద్యులు మాత్రం రాలేదు. దీంతో చర్చలపై ప్రతిష్టంభన చోటుచేసుకుంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం.. సీఎం మమత వెయింటింగ్ చేస్తున్న ఫొటోను పోస్టు చేస్తూ కీలక కామెంట్లు చేసింది. జేఎన్‌యూ నుంచి రైతుల నిరసన వరకు, రెజ్లర్ల నిరసన నుంచి మణిపూర్ వరకు ఏ రోజైనా ప్రజాస్వామ్య చర్చలకు మోడీ ప్రభుత్వం పిలిచిందా? అసమ్మతిని పట్టించుకుందా? అని నిలదీసింది. ఇదే తేడాను జూనియర్ డాక్టర్లు గుర్తించుకోవాలని టీఎంసీ కోరింది.