NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సీఐఐ ప్రతినిధులతో సీఎం సమావేశం.. వనరులు, అవకాశాలపై సుదీర్ఘ చర్చ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సీఐఐ ప్రతినిధులతో వర్చువల్ గా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వనరులు, అవకాశాల గురించి వివరిస్తూ సీఐఐ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అందుకు ప్రభుత్వం తరపున అవసరమైన సాయం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పేదరికం లేని సమాజ స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సంస్కరణలు రాజకీయంగా నష్టం చేకూర్చినా ప్రజలకు మంచి చేస్తాయని కొన్ని ఘటనలను కూలంకషంగా సీఐఐ ప్రతినిధులకు వివరించారు ఏపీ సీఎం.. 1995లో తొలిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు సీఐఐ చిన్న సంస్థగా ఉండేది. ఇప్పుడు అదే సీఐఐ పెద్ద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే సంస్థ. అప్పట్లో ప్రతి ఏడాది సీఐఐ కాన్ఫరెన్స్ నిర్వహించేవాళ్లం. అప్పుడు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో షెడ్డుల్లో, హోటల్ లో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే దుస్థితి. ప్రస్తుత పరిస్థితి చూస్తే సేవా రంగం, పబ్లిక్ గవర్నెన్స్, ప్రైవేట్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ తో సహా ప్రతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు రాణిస్తున్నారని.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ భారతీయులను నమ్ముతారు. ఇదొక శుభ పరిణామం. మన భారతీయులు సైతం ఏ ప్రాంతం వారితోనైనా, ఏ ప్రాంతంతో అయినా ఇమడగలరు. అది మనకున్న అదనపు వనరుగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వెల్త్ క్రియేషన్, సేవా రంగంలో భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో ఇండియా నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానంలో ఉండనుందన్నారు సీఎం చంద్రబాబు..

గ్రామీణ రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు తీసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వరుసగా ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఈ రోజ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఏఐఐబీ ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. గ్రామీణ రహదారుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి అన్నారు పవన్.. రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని.. 250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రహదారి అనుసంధానం చేయాలని ఆదేశించారు. మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం అన్నారు పవన్‌ కల్యాణ్.. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయన్న ఆయన.. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదాం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుబడిందని విమర్శించారు. ఇక, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షిస్తాం.. ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేస్తాం. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్ లో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30 శాతం మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరతామని ఈ సందర్భంగా వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించారు.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. స్టీల్ ప్లాంట్ మీద ఇక్కడ ప్రజలు, ఉద్యోగుల సెంటిమెంట్‌ను నేను గుర్తించాను అన్నారు.. ఇక్కడ గమనించిన ప్రతి అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తాను అన్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితులపై ప్రధానికి నోట్ సమర్పిస్తాను అన్నారు. ఇక, స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఎవరు చెప్పారు..? అని ప్రశ్నించారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తోసిపుచ్చారు ఉక్కు మంత్రి.. ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది అని అర్థమైందన్న ఆయన.. అధ్యయనం కోసం స్టీల్ ప్లాంట్ కు వచ్చాను.. ఇక్కడ పరిస్థితిని ప్రధానికి నివేదిస్తాను అన్నారు.. కార్మిక కుటుంబాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి వాళ్ల అభిప్రాయాలు నాకు అర్ధం అయ్యిందన్నారు.. ఈ ప్లాంట్ ను పరిరక్షించడం మా బాధ్యత.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు, సహాయంతో ఈ ప్లాంట్ 100 శాతం సామర్థ్యం తో ఉత్పత్తి చేస్తుందని స్పష్టం చేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి..

ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..
ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని.. తన తాత ఎన్టీ రామారావు, తండ్రి చంద్రబాబు నాయుడు, తల్లి భువనేశ్వరి తనకు చిన్నప్పుడు నుంచి నేర్పించారని, అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తున్నానని అన్నారు మంత్రి నారా లోకేష్‌.. మంగళగిరి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను శాస్త్రోత్తంగా పూజలు చేసి ప్రారంభించిన మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్.. బంగారు చీపురుతో వీధులను శుభ్రం చేస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. అశేష భక్తజన సమూహం హాజరుకాగా.. ఇస్కాన్ టెంపుల్ పురవీధులలో స్వామివారిని ఊరేగించారు. మొదటగా పూజ నిర్వహించిన నారా లోకేష్.. జగన్నాథ స్వామికి పూజలు నిర్వహించి రథ యాత్రను ప్రారంభించారు. ఇక, ఆ తర్వాత భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్‌… ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తన తాత ఎన్టీ రామారావు, తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి తనకు చిన్నప్పుడు నుంచి నేర్పించారని గుర్తుచేసుకున్నారు.. అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తున్నానని భక్తుల సమక్షంలో ప్రకటించారు లోకేష్.. ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడి కృప కూడా ఉంటేనే తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలనని.. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడానికి భగవంతుడు తన శక్తి సామర్థ్యం ఇవ్వాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. ప్రస్తుతం భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుందని.. మంగళగిరిలో ప్రజలు తనకు ఇచ్చిన మెజారిటీకి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని.. మంగళగిరిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.

తిరుమల క్యూలైన్‌లో ప్రాంక్‌ వీడియో.. టీటీడీ సీరియస్‌
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోనే ఆకతాయిలు హల్‌చల్‌ చేశారు.. నారాయణగిరి ఉద్యాణవనంలోని క్యూలైన్ కాంప్లెక్స్‌ల్లో ప్రాంక్ వీడియోలు తీసి.. భక్తులను గందరగోళానికి గురిచేశారు.. క్యూలైన్లలో ప్రాంక్ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు కొందరు తమిళ యువకులు.. కంపార్టుమెంట్ గేట్లు తెరుస్తున్నట్లు చేసి.. భక్తులతో పరిహాసాలు ఆడారు.. అయితే, ప్రాంక్ వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది టీటీడీ.. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్చగా పేర్కొన్న టీటీడీ.. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.. తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తీసిన ప్రాంక్ వీడియో హేయమైన చర్యగా పేర్కొన్న టీటీడీ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.

డీఎస్సీ హాల్‌ టికెట్లు విడుదల
తెలంగాణలో డీఎస్సీ రాసే అభ్యర్థులకు అలర్ట్. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షల హాల్‌ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉన్నాయి. డీఎస్సీ హాల్ టికెట్లను https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ.. నేడు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సీబీటీ ఆధారిత పరీక్షను ఈ నెల 18 నుంచి నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షలు సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మరోవైపు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యాశాఖను సీజ్ చేసి మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. డీఎస్సీని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే అన్నారు. కోచింగ్ సెంటర్ల యజమానులు తమ వ్యాపారం కోసం పరీక్షలను వాయిదా వేయాలని తనను సంప్రదించారని తెలిపారు. విద్యార్థుల మృతితో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఆర్థిక వేత్తలు, నీతి అయోగ్ అధికారులతో ప్రధాని మోడీ భేటీ
మోడీ 3.0 సర్కార్ తొలిసారి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. మిత్రపక్షాల సపోర్టుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ బడ్జెట్‌పై అన్ని రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ప్రధానంగా మిత్రపక్షాల రాష్ట్రాలైతే గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా గురువారం ప్రధాని మోడీ అధ్యక్షతన బడ్జెట్ కసరత్తుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికవేత్తలు, నీతి ఆయోగ్ అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ప్రణాళిక మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సూర్జిత్ భల్లా, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, ప్రముఖ బ్యాంకర్ కెవి కామత్ పాల్గొన్నారు. మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించనుంది. కేంద్ర బడ్జెట్ 2024-25కి సంబంధించి విస్తృత సంప్రదింపులలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సీనియర్ నీతి ఆయోగ్ అధికారులు మరియు ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశం నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాబోయే బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను సేకరించేందుకు ఆర్థిక మంత్రి సీతారామన్ ఇప్పటికే భారతీయ పరిశ్రామికవేత్తలు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు, ఆర్థికవేత్తలతో విస్తృత చర్చలు జరిపారు.

ఉద్యోగమో.. రామచంద్రా! హోటల్ ఉద్యోగానికి ఎగబడ్డ నిరుద్యోగులు
భారతదేశం ఆర్థికంగానూ.. అభివృద్ధిలోనూ దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ దేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లో వెలుగులోకి వచ్చిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. తాజాగా వెలుగులోకి వచ్చిన దృశ్యాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హోటల్‌లో ఉద్యోగం కోసం వందలాది మంది నిరుద్యోగులు ఎగబడ్డారు. తోపులాటలో స్టీల్ గేటు కూడా ఊడి యువకులు కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గుజరాత్‌లోని భరూచ్‌ అంకలేశ్వర్‌లో లార్డ్స్ ప్లాజా హోటల్‌లో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 9న ఇందుకోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ చేపట్టింది. దీనికోసం వందలాది మంది నిరుద్యోగులు ఎగబడ్డారు. దరఖాస్తులు ఇచ్చేందుకు యువకులు పోటెత్తారు. తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీంతో హోటల్ రెయిలింగ్ విరిగిపోయింది. అదృష్టవశాత్తూ తొక్కిసలాట సంఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హోటల్‌లో పని చేసేందుకు అవసరమైన అర్హత, పని అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో కంపెనీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఉద్యోగం చేసేందుకు యువత ఆసక్తిగా ఉన్న ఉద్యోగాలు మాత్రం లేవంటూ వ్యాఖ్యానించారు.

అనంత్-రాధిక పెళ్లికి హాజరుకానున్న ప్రధాని మోడీ!
శుక్రవారం ముంబైలో రిలయన్స అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి కావడంతో దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా రానున్నారు. ఇందుకోసం ముంబైలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇక అతిథులను పెళ్లి మండపం దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక అనంత్-రాధిక వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. కుమారుడి పెళ్లికి రావాలని ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలను, దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించారు. దీంతో ఈ వివాహానికి హాజరయ్యేందుకు రాజకీయ ప్రముఖలంతా వస్తున్నట్లు సమాచారం. ఇక ప్రధాని మోడీ శుక్రవారం ముంబై రాబోతున్నట్లు సమాచారం. మోడీతో పాటు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, శివరాజ్ సింగ్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా హాజరుకానున్నారు.

చైనా నుంచి పాక్ వెళ్తున్న ప్రమాదకర కెమికల్స్‌ని సీజ్ చేసిన భారత్..
చైనా నుంచి దాని మిత్రదేశం పాకిస్తాన్ వెళ్తున్న ప్రమాదకరమైన, నిషేధిత జాబితాలో ఉన్న రసాయన పదార్థాలు కలిగిన షిప్‌మెంట్‌ని భారత్ సీజ్ చేసింది. తమిళనాడు తిరువళ్లూర్ జిల్లాలోని కట్టుపల్లి ఓడరేవు వద్ద చైనా నుంచి పాకిస్తాన్ వెళ్తున్న నౌకను అధికారులు తనిఖీ చేశారు. చైనసీ సంస్థ చెంగ్డు షిచెన్ ట్రేడింగ్ కో. లిమిటెడ్ నుంచి పాకిస్తాన్ రావల్పిండిలోని డిఫెన్స్ సప్లయర్ అయిన రోహైల్ ఎంటర్‌ప్రైజెస్‌కి ‘‘ఆర్థో-క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్’’ సరుకు రవాణా అవుతోందని అధికారులు వెల్లడించారు. దాదాపుగా 2560 కిలోల బరువున్న ఈ సరుకు ఒక్కొక్కటి 25 కిలోలు కలిగిన 103 డమ్ముల్లో భద్రపరిచారు. 2024 ఏప్రిల్ 18న చైనాలోని షాంఘై పోర్టులోని హ్యుందాయ్ షాంఘై పేరు కలిగిన నౌకలో లోడ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరాచీకి వెళ్లే ఈ ఓడ మే 08, 2024లో కట్టుపల్లి పోర్టుకు చేరుకుంది. భారత ఎగుమతి నియంత్రణ జాబితా ‘SCOMET’లో ఈ కెమికల్ పేరు కూడా ఉంది. దీనిని నియంత్రిత పదార్థంగా గుర్తించి, కస్టమ్స్ అధికారులు దీనిని సీజ్ చేశారు.

రెడ్ మీ నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయంటే..?
రెడ్ మీ (Redmi) తన కస్టమర్ల కోసం కొత్త ఇయర్ బడ్స్ని పరిచయం చేసింది. రెడ్ మీ బడ్స్ 5C.. వైర్‌లెస్ ఆడియో పోర్ట్‌ఫోలియోను మెరుగుపరుస్తుంది. ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) అనేక ప్రత్యేక ఫీచర్లతో ముందుకు వస్తుంది. అంతేకాకుండా.. ధర కూడా తక్కువే ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది మొత్తం 36 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. అంతేకాకుండా.. 40dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ ఉంది. ఈ ఇయర్ బడ్స్ ధర విషయానికొస్తే.. రూ. 1,999 ఉంది. కంపెనీ ఈ బడ్స్ ని మూడు కలర్లలో ప్రవేశపెట్టింది.. అకౌస్టిక్ బ్లాక్, బాస్ వైట్, సింఫనీ బ్లూ. రెడ్ మీ బడ్స్ 5C జూలై 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ పరికరాన్ని షియోమీ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

మహారాజా వస్తున్నాడు.. పరాక్ బహు పరాక్
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజా’. ఈ సినిమాకు నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 14న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కల్కి మేనియాలో కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.20 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన మహారాజ సినిమా.. త‌క్కువ స‌మ‌యంలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడం గమనార్హం. మహారాజా మూవీ రిలీజై సుమారు నెల అవుతుండగా నెట్‌ఫ్లిక్స్‌లో జులై 12 నుంచి అంటే ఈరోజు అర్ధ రాత్రి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో మహారాజా మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఈ సినిమాలో మహారాజ అనే బార్బర్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. మహారాజ సినిమాను ఆసక్తికర కథనంతో క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు తెరకెక్కించగా సినిమాలోని స్క్రీన్ ప్లే చేసిన మ్యాజిక్ నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించగా.. మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ చిత్రంకు అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Show comments