NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఆర్ అండ్ బీ శాఖపై సీఎం సమీక్ష.. రోడ్ల దుస్థితి చర్చ.. కీలక ఆదేశాలు
ఓవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు.. మరోవైపు.. వివిధ శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష చేశారు.. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం.. రోడ్ల దుస్థితిపై ఈ సమావేశంలో చర్చించారు.. రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని సీఎం చంద్రబాబుకు చెప్పారు అధికారులు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదన్నారు.. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకు రావడం లేదని సీఎంకు వివరించారు అధికారులు. గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరం అని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆర్ అండ్ బీ అధికారులు.. అయితే, అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదు అని మండిపడ్డ ఆయన.. వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని స్పష్టం చేశారు.. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలి.. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉంది. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

ఉచిత ఇసుక, తల్లికి వందనంపై విష ప్రచారం.. మండిపడ్డ మంత్రి
తల్లికి వందనం, ఉచిత ఇసుక పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. తల్లికి వందనం పథకంపై వైసీపీ విషప్రచారం చేస్తుందని.. వీళ్ల అబద్ధాలు, అసత్యాలు 30 రోజులుగా చూస్తూనే ఉన్నామని.. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పామని.. కానీ, ఈరోజు ఒకరికి ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారని.. ఇంకా ఆ పథకాన్ని గ్రౌండ్ లెవెల్ లో అమలు చేయలేదు.. ఎలా అమలు చేయాలి.. ఎంతమందికి ఇవ్వాలనేది కార్యాచరణ రూపొందించకుండానే అప్పుడే వీల్లేదో సెక్రటరీ ఇంట్లో, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లోకేష్ మనసులో ఏముందో తొంగి చూసినట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరల్డ్‌ బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ..
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరాపై చర్చించారు.. ఇంటింటికి మంచి నీరు అందించే ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి ఏ మేరకు నిధులివ్వగలరన్న అంశంపై ప్రధానంగా చర్చ సాగింది.. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు తెలిపారు పవన్‌.. గత ప్రభుత్వం తరహాలో నిధులను పక్క దారి మళ్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేయడం లక్ష్యంగా.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంగళగిరిలోని తన నివాసంలో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరాశాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు రమేష్ ముకల్లా, మాథ్యూస్ ముల్లికల్ పాల్గొన్నారు. కాగా, కీలక శాఖల బాధ్యతలు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌.. వరుసగా రివ్యూలు నిర్వహిస్తూ.. తాము ఇచ్చిన హామీలు.. తన లక్ష్యాలకు అనుగుణంగా.. ఆయా శాఖలను పనిలోదించే పనిలో ఉన్నారు..

ఏపీకి డిప్యూటేషన్‌పై ఐఏఎస్‌ కృష్ణ తేజ.. డీఓపీటీ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ ఐఏఎస్‌ అధికారి పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది.. ఆయనే కేరళ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఎం. కృష్ణ తేజ.. ఆయన డిప్యూటేషన్‌పై ఏపీకి వస్తారని.. కీలక బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం సాగింది.. దానికి అనుగుణంగానే ఐఏఎస్‌ కృష్ణ తేజకు డిప్యూటేషన్‌పై ఏపీకి వెళ్లేందుకు అనుమతి వచ్చేసింది.. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (DoPT) ఉత్తర్వులు జారీ చేరసింది.. ఇక, పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలను కృష్ణ తేజకు అప్పగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, గత నెలలో సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు ఐఏఎస్‌ కృష్ణతేజ.. ఆ తర్వాత కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ కోరడం.. కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ రాయడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.. మొత్తంగా ఎప్పుడు డీఓపీటీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. త్వరలోనే ఏపీలో ఛార్జ్‌ తీసుకోనున్నారు కృష్ణతేజ.. ఇక, గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా సేవలు అందించారు కృష్ణ తేజ.. ఆయన స్వస్థలం.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట.. ఇక, ఈ మధ్యే త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్‌ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్‌ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు.. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన.. వివిధ శాఖల్లో పనిచేశారు.. ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తూ వచ్చారు.. ఇప్పుడు ఏపీలో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.

కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ తన నివాసంలో ప్రకాశ్‌ గౌడ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వెంట మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి వచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్‌ను గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ప్రకాశ్‌ గౌడ్‌ చేరడంతో కాంగ్రెస్‌లోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది.

మరో కొత్త వివాదంలో పూజా.. దొంగను వదిలిపెట్టాలంటూ ఏం చేసిందంటే..!
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తవ్వేకొద్దీ ఆమె బండారం బయటడుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. వేటు వేయించుకున్న ఆమె.. కొత్త కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటోంది. ఇప్పటికే కంటి చూపు, మానసిక వైకల్యంతో పాటు ఓబీసీ సర్టిఫికెట్ విషయంలో నకిలీలు సృష్టించి ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా నవీ ముంబై పోలీసులు.. మహారాష్ట్ర హోంశాఖకు కీలక రిపోర్టును అందజేశారు. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యుడ్ని విడుదల చేయాలంటూ పోలీసులపై పూజా ఖేద్కర్ తీవ్ర ఒత్తిడి చేసిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం. పూజా.. మే 18న డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌కి ఫోన్ చేసి… దొంగిలించబడిన స్టీల్‌ను రవాణా చేస్తున్నాడని అనుమానిస్తున్న వ్యక్తిని విడిచిపెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఈశ్వర్ అనే వ్యక్తి నిర్దోషి అని.. అతనిపై వచ్చిన అభియోగాలు చాలా చిన్నవిని ఆమె చెప్పుకొచ్చింది. కానీ పోలీసులు మాత్రం దొంగను విడిచిపెట్టలేదు.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రద్దీ నేపథ్యంలో 46 రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు..
ఇటీవల కాలం రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ కావడంతో వారంతా స్లీపర్, ఏసీ కోచ్‌లలోకి ప్రయాణిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. వందేభారత్ రైళ్లపై దృష్టిపెట్టిన కేంద్రం, సామాన్యుడు ప్రయాణించే రైళ్లను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల మధ్య నడిచే ముఖ్యమైన 46 రైళ్లలో 92 కొత్త జనరల్ కో‌చ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కోచ్‌ల సంఖ్య పెంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. బెంగుళూరు సిటీ బెలగావి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ హుబ్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ముంబై బెంగళూరు ఉదయన్ ఎక్స్‌ప్రెస్, ముంబై అమరావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గౌహతి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్, గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరో 22 రైళ్లను కూడా గుర్తించామని, వాటిలో కూడా త్వరలోన అదనపు జనరల్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

హమాస్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం!
హమాస్‌తో భీకరమైన యుద్ధం వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు అమల్లో ఉన్న 34 నెలల నిర్బంధ సైనిక సేవ పరిమితిని మూడేళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ అమాంతంగా దాడులకు తెగబడి ఇజ్రాయెల్ పౌరులను అపహరించుకునిపోయారు. దీంతో అప్పటి నుంచి పగతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం.. ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. హమాస్ లక్ష్యంగా గాజాపై భీకరమైన యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే గాజా పట్టణం సర్వనాశం అయింది. ఇదిలా ఉంటే ఉగ్రవాదులతో యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రతి పురుషుడు 34 నెలల పాటు తప్పనిసరిగా మిలటరీలో పని చేయాలన్న నిబంధన ఉండగా.. దీన్ని మూడేళ్ల పెంచుతూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్‌కు చెందిన వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. తాజా నిబంధనలు మరో ఎనిమిదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. సెక్యూరిటీ కేబినెట్‌ నిర్ణయాలను ఆదివారం నిర్వహించబోయే పూర్తిస్థాయి కేబినెట్‌ సమావేశంలో ఓటింగ్‌కు పెట్టనున్నారు.

అక్షయ్‌కుమార్‌కు కోవిడ్ పాజిటివ్.. పెళ్లికి హాజరుకాలేకపోతున్న హీరో
మరికొద్ది సేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో జంట ఒక్కటవుతున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ సిద్ధమైంది. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ముంబై నగరమంతా సందడి.. సందడిగా నెలకొంది. ఇదిలా ఉంటే ఈ వివాహానికి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సినీ గ్లామర్ తళుక్కుమననుంది. ఆయా ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి అతిథులు ఆహ్వానింపబడ్డారు. అయితే బాలీవుడ్ హీరో అక్షయ్ ‌కుమార్‌ చివరి నిమిషంలో ఇరాకటంలో పడ్డారు. అనంత్ అంబానీ-రాధిక పెళ్లికి రెడీ అవుతున్న తరుణంలో కరోనా వైరస్‌కు గురయ్యారు. మెడికల్ టెస్టులు చేయగా.. అక్షయ్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

రాధిక గురించి అత్తగారు నీతా మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్
మరికొద్ది సేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ సిద్ధమైంది. ఇక ఈ వివాహానికి అతిరథ మహరథులంతా పెళ్లి మండపానికి చేరుకుంటున్నారు. ఓ వైపు పెళ్లి సందడి జరుగుతుండగా.. ఇంకోవైపు కాబోయే కోడలు రాధికా మర్చంట్ గురించి అత్తగారు నీతా అంబానీ గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక వేదికపై నీతా అంబానీ మాట్లాడుతూ.. రాధిక.. అనంత్ అంబానీకి కాబోయే భాగస్వామి మాత్రమే కాదు.. అంబానీ కూతురు కూడా అంటూ సంబోధించారు. రాధిక మా జీవితాల్లో వెలుగు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. రాధికను మా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాధిక.. అనంత్‌కు చిరకాల భాగస్వామి అంటూ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజా వీడియోతో రాధికతో నీతాకు ఉన్న లోతైన అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. డ్యాన్స్‌పై నాకున్న ప్రేమ.. తన కొడుకుపై ఉన్న ప్రేమను పంచే మరో కుమార్తె మాకు కనిపించిందని.. అందుకే రాధికను అంబానీ బేటీగా ముక్తకంఠంతో స్వాగతిస్తున్నట్లు నీతా తెలిపారు.