NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని.. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదన్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్‌కమిటీ వేశామని.. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని తెలిపారు. డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలో రైతు పండుగ జరిగిందని.. రైతులు ప్రభుత్వానికి గొప్ప శక్తి.. వారి ఆశీర్వాదంతో ఇంధనం వచ్చిందని భావిస్తామన్నారు. ఏ జిల్లా అయితే నిండు మనస్సుతో ఆశీర్వదించిందో భవిష్యత్‌లో కూడా అలానే కొనసాగుతోందన్నారు. జూన్ 2, 2014 నాటికి 16 వేల కోట్ల మిగులు, 69 వేల కోట్ల అప్పు లతో కేసీఆర్‌కు యూపీఏ ప్రభుత్వం అప్పగించిందన్నారు. ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందన్నారు. నాడు ప్రజలకు వాస్తవాలు ఎవరూ చెప్పలేదు.. పాలకులు వివరించలేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగితే ప్రతిదాడి చేశారన్నారు. డిసెంబరు 9న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. రూ.6500 కోట్లు నెలకు అసలు, వడ్డీ ప్రభుత్వం కడుతోందన్నారు. నెల నెలా అప్పులు కడుతూనే సంక్షేమ కార్యక్రమాలు ఆపడం లేదన్నారు. నేతల తలరాతలు మార్చేది రైతులేనన్నారు. నెహ్రూ నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు రైతు సంక్షేమం కోసం పని చేశారన్నారు. అయిన రైతుల తలరాతలు బాగుపడలేదన్నారు. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధును మేమే ఇచ్చామన్నారు. రూ.7725 కోట్ల రైతు బంధు మొదటి విడత ఇచ్చామని.. 22 లక్షల22వేల 67 మందికి రుణమాఫీ చేశామన్నారు. 30.5.24 న రెండో విడత రుణమాఫీ చేశామని.. మూడోసారి 4లక్షల 46 వేల 836 మందికి మాఫీ చేశామన్నారు. నిన్న రూ.2,747 కోట్లు నాల్గో విడతగా సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఆగిపోయిన వారికి మాఫీ చేశామన్నారు. మొత్తంగా 25 లక్షల 36 వేల 964 రైతు కుటుంబాలకు రూ. 20, 616 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదని.. దేశంలోనే ఇది గొప్ప రికార్డు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయినా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ తామే గొప్పగా రుణమాఫీ చేశామని చెబుతున్నారన్నారు. రైతులు అప్పులు చేసి మిత్తిలు కట్టారని.. రుణమాఫీ కాక ఇబ్బందులు పడ్డారన్నారు. 20 లక్షల మంది కొత్తగా రుణాలు తీసుకోలేదని.. పాత వాటినే రెన్యూవల్ చేసుకున్నారన్నారు. మాది రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. రైతు బంధు బకాయిలు ఇచ్చామన్నారు. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు బంధు వేస్తామన్నారు. మారీచుడు, సుబాబులు వచ్చి అడ్డుకున్నా.. రైతు భరోసా వేస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో మారీచులు వస్తారని… ఎవరు ఆందోళన చెందవద్దని, ఎవర్ని నమ్మవద్దన్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని, నివేదికను సభలో పెట్టి చర్చిస్తామన్నారు. డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా వేస్తామన్నారు.

 

సీఎంఆర్‌ఎఫ్‌లో కొత్త రికార్డు.. ఏడాదిలోనే రూ.830 కోట్ల సాయం
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం… అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు రూ.830 కోట్లు సీఎంఆర్ఎఫ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్‌తో లబ్ధి పొందాయి. 2018 నుంచి 2023 వరకు అయిదేండ్లలో అప్పటి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2400 కోట్ల సాయం అందించింది. అప్పటి ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.480 కోట్లు ఖర్చు పెడితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క ఏడాదిలోనే రూ.830 కోట్లు సాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రజలకు ఆపదలు వచ్చినా, విపత్తులు సంభవించినా ఆదుకునేందుకు నేనున్నానంటూ.. అభయ హస్తం అందించారు. ఈ ఏడాది ఇచ్చిన రూ.810 కోట్లలో రూ.590 కోట్లు సీఎంఆర్ఎప్ ద్వారా సాయం అందించటం గమనార్హం. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం అవసరమైతే ప్రజా ప్రతినిధుల సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ సాయం అందిస్తుంది. కొన్ని వ్యాధులకు జిల్లా స్థాయిలో అవసరమైన వైద్య చికిత్స సదుపాయం అందుబాటులో లేక హైదరాబాద్​ లోని పెద్ద ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో ముందుగానే సీఎం సహాయ నిధిని ఆశ్రయిస్తారు. అటువంటి సందర్భాల్లో నిమ్స్​ తో పాటు ఎంఎన్​ జే క్యాన్సర్ ఆసుపత్రి, నిలోఫర్, ఈఎన్ టీ, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్సలకు అయ్యే అంచనా ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సీఎం సహాయ నిధి నుంచి సంబంధిత ఆసుపత్రికి ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీ చేస్తుంది. ఈ ఎల్‌వోసీల జారీలోనూ సీఎం తన ఉదారతను చాటుకున్నారు. ఈ ఏడాదిలోనే 13 వేల మందికి ఎల్ వోసీ లు జారీ చేసింది. సుమారు రూ. 240 కోట్ల ఎల్‌వోసీలు మంజూరు చేశారు. ఇందులో అత్యధికంగా చిన్న పిల్లలకు అవసరమయ్యే ఆపరేషన్లు, చికిత్సలకు కేటాయించారు. ప్రాణాపాయంలో ఎవరున్నా సరే.. వైద్య చికిత్స అత్యవసరమని గుర్తించిన ప్రజా ప్రభుత్వం ఎల్వోసీల జారీని వేగవంతం చేసింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఎల్వోసీ ఇచ్చే ఏర్పాట్లు చేసింది. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవద్దని, ఆదివారంతో పాటు సెలవు దినాల్లో కూడా ఎల్‌వోసీలు క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించటం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధులకు కూడా అవినీతి చీడ పట్టుకుంది. పేదల పేరిట మెడికల్ బిల్లులు సృష్టించి నిధులను దిగమింగే దందా వెలుగులోకి వచ్చింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్ఎఫ్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసింది. పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను కూడా ఆన్‌లైన్ లోకి తెచ్చింది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తుదారులే తమ సీఎంఆర్‌ఎఫ్ సాయం ఏ దశలో ఉందో.. ఎప్పటికప్పుడు స్టేటస్‌ను తెలుసుకునేలా ఆన్‌లైన్ వ్యవస్థను రూపొందించారు. గతంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో పని చేసిన సిబ్బంది సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు తమ ఖాతాల్లో వేసుకున్నారు. అటువంటి లొసుగులకు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులపై లబ్దిదారుల పేర్లతో పాటు వారి బ్యాంక్ ఖాతా నంబర్‌ను రేవంత్ సర్కారు ముద్రిస్తోంది. హాస్పిటల్స్‌ వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేసి, దొంగ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేయడాన్ని నిరోధించింది. నిజమైన అర్హులకు మాత్రమే సీఎం సహాయ నిధి అందే ఏర్పాట్లు చేసింది.

 

కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్
కాంగ్రెస్ ఏడాది పాలనపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఆరు అబద్ధాలు-66 మోసాలు అంటూ బీజేపీ ఛార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని .. హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధ్యం అయ్యిందన్నారు. తెలంగాణ ప్రజలు ఏ ఆశయాల కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారో.. ఆ ఆశయాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందన్నారు. కుటుంబ పాలన.. అహంకార పూరితంగా కేసీఆర్ పాలన కొనసాగిందన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పరిపాలన కూడా కొనసాగుతోందని విమర్శించారు. అబద్దాల హామీలను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించిందన్నారు. వంద రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారన్నారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలన.. ఏడాది కాంగ్రెస్ పాలన ఒకే విధంగా ఉందన్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. అందుకే ప్రజల తరపున బీజేపీ ప్రశ్నించడానికి సిద్ధమైందన్నారు. 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి.. 9వ తేదీ మా అమ్మ సోనియా గాంధీ జన్మదినం రోజు రుణమాఫీ అని రేవంత్ అన్నాడన్నారు. ఇప్పటికీ ఏడాది పూర్తి కావస్తున్న ఇంకా పూర్తిగా రైతు రుణమాఫీ కాలేదన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఎన్నికల్లో 500 వందల బోనస్ ఇస్తామన్నారని.. అధికారంలోకి వచ్చాకా కేవలం ధాన్యానికి మాత్రమే అన్నారని విమర్శలు గుప్పించారు. ఆ తరువాత సన్న బియ్యానికి అని మాట మార్చారన్నారు. మ్యానిఫెస్టోలో 10 రకాల పంటలకు 5 వందలు బోనస్ అన్నారని.. ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రైతులు 500 బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని.. మూడు లక్షల వడ్డీ పంట రుణాలు అన్నారని.. దానికి అతి గతి లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి లీటరు పాలకు 5 రూపాయలు అన్నారు.. ఆ ఊసే లేదన్నారు. ఫార్మా సిటీకి వ్యతిరేకంగా అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పోరాటం చేసిందని.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్ వెళ్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా విడుదల చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. బస్తీ పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పారని.. కానీ ఉన్న స్కూళ్లు మూసుకుపోతున్నాయి తప్పా ఒక్క స్కూల్ కూడా ఓపెన్ చేయలేదన్నారు.నాణ్యమైన ఆహారాన్ని కూడా స్కూళ్ళలో అందించలేకపోతున్నారన్నారు.

 

 

పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తాం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌరసరఫరాల శాఖ విభాగం పై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వ పనులు, కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టు, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం, రామగుండం ఎత్తిపోతల పథకం, ఎల్లంపల్లి కెనాల్ నెట్ వర్క్ ప్యాకేజ్ 2 పనులు, ధాన్యం సేకరణ, కస్టం మిల్లింగ్ రైస్ డెలివరీ తదితర అంశాల పై మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారన్నారు. గతంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందన్నారు. రైతులకు ఎక్కడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులకు రికార్డు సమయంలో వడ్ల డబ్బులు పడ్తున్నాయన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ధాన్యం సేకరణ సంతృప్తికరంగా ఉందన్నారు. డిసెంబర్ 4న సీఎం పర్యటన ఉన్న సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే గంటల వ్యవధిలో రైతులకు మద్దతు ధర, బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయానికి 100 శాతం ధాన్యం డబ్బులు చెల్లించి ఉండాలని ఆదేశించారు. సన్న రకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అధికంగా కొనుగోలు చేయాలని, ప్రైవేట్ వ్యాపారులు ఎక్కడ 2800 కంటే తక్కువ ధరతో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయకుండా చూడాలన్నారు. రాబోయే సంవత్సరంలో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఇస్తున్నామని, దీనికి అనుగుణంగా కనీసం 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర గడిచిన నేపథ్యంలో డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తమ ప్రభుత్వం 10 నెలల కాలంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ ప్రైవేట్ సంస్థలో యువత ఉపాధి పొందేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పత్తిపాక రిజర్వాయర్ 2950 కోట్లతో 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు ప్రాథమిక అంచనాలు తయారు చేశామన్నారు. రామగుండం ఎత్తిపోతల పథకం 95 శాతం పూర్తయిందని, డిసెంబర్ నెలాఖరు వరకు పెండింగ్ పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నుంచి రైతులకు సాగు నీరు అందించాలని, పాలకుర్తి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు, నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి కావాలన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు లోని ప్యాకేజ్ 9 పెండింగ్ పనులు, చిన్న కాళేశ్వరం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

 

షాకింగ్: నటి శోభిత సూసైడ్
హైదరాబాదు గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకొంది. కన్నడలో చాలా సీరియల్ స్ లో నటించిన యాంకర్ శోభిత ఆత్మహత్య చేసుకుని మరణించింది.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. కన్నడలోని పలు సీరియల్ లో నటించిన శోభిత వివాహం చేసుకుని హైదారాబాద్ షిఫ్ట్ అయి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. శోభిత ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే అంశం పై కారణాలు బయట పెట్టడం లేదు కుటుంబ సభ్యులు. శోభిత మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. రెండు ఒండ్ల మూడు, ఏటీఎం, ఒక్క కథే కెల్తా, జాక్‌పాట్, అపార్ట్‌మెంట్ టు మర్డర్, వందన వంటి కర్ణాటక సినిమాల్లో నటించింది శోభిత. అలాగే బ్రహ్మగంతు, నీనిదలేలో సీరియల్స్ లో కూడా ఆమె నటించింది. గచ్చిబౌలి లో శ్రీరామ్ నగర్ కాలనీ లో భర్త సుధీర్ తో కలిసి నివాసం ఉంటోంది బ్రహ్మగంతు సీరియల్ ఫేమ్ నటి శోభిత(32). ఈ రోజు తాను ఉంటున్న ఇంట్లోనీ సీలింగ్ ఫ్యాన్ కు చీర తో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. పెళ్ళి తర్వాత సినిమాలకి, సీరియల్స్ కి దూరంగా ఉంటూ వస్తోంది శోభిత. శోభిత మరణ వార్త తెలియడంతో శోభిత కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలి వెళ్లనున్నట్లు సమాచారం. కన్నడ హిందీ, హిందీ చిత్రసీమల్లో చురుకైన నటి శోభితా శివన్న వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. ‘హిట్లర్ కళ్యాణ’ సీరియల్‌లో విలన్‌గా కూడా ఆమె నటించింది.

 

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం నేరం కాదు..!
కుల రిజర్వేషన్లపై మాట్లాడటం ఏ వర్గానికి వ్యతిరేకంగా పరిగణించబడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి సందర్భంలో SC-ST చట్టం కింద కేసు నమోదు చేయబడదని తెలిపింది. తాజాగా ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని తెంచుకుంది. అనంతరం వాట్సాప్‌లో మెసేజ్ పంపింది. ఆ మహిళ తనకు వాట్సాప్‌లో కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. దీనిపై కోర్టుకు వెళ్లాడు. దీంతో కోర్టు ఈ మేరకు తీర్పు విలువరించింది. ఈ మెసేజ్‌లో ఏమీ లేదని.. జస్టిస్ ఊర్మిళ జోషి-ఫాల్కే అన్నారు. మహిళపై కేసును కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. ఆ మహిళ బహిరంగంగా ఎలాంటి కులం వ్యాఖ్య చేయలేదని పేర్కొన్నారు. వ్యక్తిని అవమానించలేదని.. ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఏమీ చేయలేదని తెలిపింది. వాస్తవానికి.. ఈ కేసు నాగ్‌పూర్‌కు చెందినది. 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 28 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ మధ్యప్రదేశ్ వాసులు. ఇద్దరూ ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ సంబంధాన్ని తమ కుటుంబాలకు తెలియకుండా దాచిపెట్టారు. అయితే ఆ వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందినవాడని మహిళకు తెలియడంతో విడిపోయారు. దీంతో ఆమెకు వాళ్ల ఇంట్లో వాళ్లు సంబంధాలు చూశారు. ఈ సంబంధం ఆ యువకుడి కారణంగా చెడిపోయింది. దీంతో ఆమె ఓ మెసేజ్ పంపింది. దాని ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేశారు.

 

‘‘టిప్పు సుల్తాన్ చరిత్ర చాలా క్లిష్టమైన వ్యక్తి’’.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు
భారత చరిత్రకారుడు విక్రమ్ సంపత్ రచించిన ‘టిప్పు సుల్తాన్: ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటర్‌రెగ్నమ్’ పుస్తకావిష్కరణకు విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఇడియన్ హాబిటాట్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన జైశంకర్ టిప్పు సుల్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చరిత్రలో చాలా సంక్లిష్టమైన వ్యక్తి’’గా అభివర్ణించారు. బ్రిటిష్ వలస పాలనపై అతడి పోరాటం, పాలనలోని వివాదాస్పద అంశాలను జైశంకర్ చర్చించారు. ‘‘టిప్పు సుల్తాన్ నిజానికి చరిత్రలో సంక్లిష్టమైన వ్యక్తి, ఒక వైపు భారతదేశంపై బ్రిటీష్ వలస నియంత్రణను ప్రతిఘటించిన కీలక వ్యక్తిగా అతడికి పేరుంది. ఇది వాస్తవం. ద్వీపకల్ప భారతదేశం విషయానికి వస్తే అతడి ఓటమి, మరణం ఒక మలుపు.’’ ఆయన అన్నారు. అయినప్పటికీ మైసూర్ ప్రాంతంలో టిప్పు సుల్తాన్ పాలన ‘‘ప్రతికూల ప్రభావాలు’’ గురించి జైశంకర్ మాట్లాడారు. టిప్పు సుల్తాన్ పాలించిన చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా మైసూర్‌లో ఈనాటికి బలమైన ప్రతికూల భావాలు రేకెత్తించాడు అని ఆయన చెప్పారు. భారతీయ చరిత్ర బ్రిటీష్ వారితో టిప్పు చేసిన పోరాటంపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని, అతడి పాలనలోని కీలక అంశాలను నిర్లక్ష్యం చేసిందని జైశంకర్ అన్నారు. గత చరిత్రను విస్మరించడం ప్రమాదవశాత్తుగా జరిగినది కాదని చెప్పారు. టిప్పు సుల్తాన్ విషయంలో అవసరమైనవే ఎంచుకుని ఒక రాజకీయ కథనాన్ని నిర్మించారని చెప్పారు. టిప్పు చరిత్రలో సంక్లిష్టమైన వాస్తవాలను మినహాయించి, ఒక నిర్ధిష్ట కథనాన్ని మాత్రమే చెప్పారని అన్నారు.

 

సమంతను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
హీరోయిన్లు సమంత తో పాటు కీర్తి సురేష్ అలాగే ఫ్యాషన్ డిజైనర్ కీర్తి రెడ్డి ని మోసగించిన ఒక మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదేంటి హీరోయిన్లను మోసం చేయడం ఏమిటి అనే అనుమానం కలుగుతుందా అసలు విషయం తెలుసుకుందాం పదండి. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్ ను అరెస్ట్ చేశారు. ఈ కాంతి దత్ సస్టైన్ కార్ట్ అనే ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దానిలో పలువురు సెలబ్రిటీల చేత పెట్టుబడులు పెట్టించి మోసగించాడు. నటుడు సామ్రాట్ రెడ్డి సోదరి ఫ్యాషన్ డిజైనర్, సమంతకు అత్యంత సన్నిహితంగా ఉండే శిల్పారెడ్డి తాను మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుని రిజిస్టర్ చేసిన పోలీసులు అప్పటినుంచి కాంతి దత్ కోసం గాలిస్తున్నారు. హీరోయిన్లు కీర్తి సురేష్, సమంత, పరినీతి చోప్రాతో పాటు శిల్పారెడ్డి వంటి వాళ్ళ దగ్గర సుమారు 100 కోట్లకు పైగా అతను లూటీ చేసినట్లుగా తెలుస్తోంది.