NTV Telugu Site icon

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*రేపు టీటీడీ పాలకమండలి సమావేశం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం

రేపు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలుపనుంది. 5 వేల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. గత ఏడాదితో పోలిస్తే హుండీ ఆదాయం 100 కోట్లు తగ్గినట్లు టీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 9న శ్రీపురందరదాసుల ఆరాధనోత్సవం, 10న తిరుకచ్చినంబి ఉత్సవం, 14న వసంత పంచమి, 16న రథసప్తమి, 19న తిరుకచ్చినంబి శాత్తుమొర, 20న భీష్మ ఏకాదశి, 21న కులశేఖరాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం, 24న కుమారధార తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ వేడుకలను నిర్వహించనున్నామని, భక్తులు విశేష ఉత్సవాల్లో పాల్గొనాలని పేర్కొంది. రథసప్తమిగా పిలిచే సూర్య జయంతిని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రథ సప్తమి పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేస్తుంది. సూర్యోదయం వేళ సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం.. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం.. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించన్నారు.

 

*రేషన్‌కార్డు ఈ-కేవైసీ గడువు పొడిగింపు..
ఇప్పటి వరకు రేషన్‌ కార్డు ఈ-కేవైసీ చేసుకోని వారికి గుడ్‌న్యూస్‌ చెబుతూ.. మరో అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా.. ముందుగా విధించిన గడువు ప్రకారం జనవరి 31వ తేదీతో అంటే.. ఈ నెల 31 తేదీతో ముగియనుంది.. గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో E-KYC అప్‌డేట్ చేస్తూనే ఉన్నారు.. కొన్ని రేషన్‌ షాపుల దగ్గర భారీ లైన్లు దర్శనం ఇవ్వడంతో.. అప్‌డేట్‌ చేసుకోవడానికి కొందరు ముందుకు రాని సందర్భాలు ఉన్నాయి.. KYC అప్‌డేట్ కోసం ఆధార్ ధృవీకరణ మరియు వేలిముద్రలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాకపోతే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులు కోత పెట్టే అవకాశం లేకపోలేదు.. దీంతో.. మరో నాలుగు రోజులే మిగిలి ఉంది అనే ఆందోళన రేషన్‌ కార్డు దారుల్లో మొదలైంది.. ఇక, అలాంటి వారికి టెన్షన్‌ లేకుండా.. మరో నెలరోజుల పాటు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.. ఫిబ్రవరి చివరి వరకు అంటే.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈ-కేవైసీ చేసుకొచ్చు అని తెలంగాణ పౌరసరఫరాల శాఖ పేర్కొంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. వంద శాతం ఈ-కేవైసీ పూర్తి చేయడమే లక్ష్యంగా ఉండాలని.. కానీ, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 75.76 శాతం మాత్రం రేషన్‌కార్డు దారుల మాత్రమే ఈ-కేవైసీ అప్‌డేట్‌ చేసుకున్నారు. మిగతావారు కూడా వెంటనే అప్‌డేట్‌ చేసుకుని విధంగా ఫిబ్రవరి నెల చివరి వరకు ఈ-కేవైసీ గడువు పొడిగిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసే విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది పౌరసరఫరాల శాఖ.. కాగా, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. కానీ బోగస్‌ రేషన్‌ కార్డులను ఆధార్‌ నంబర్‌తో రేషన్‌ కార్డుతో అనుసంధానం చేయాలని ఎరివేత సంస్థ నిర్ణయించింది. దీనికి కారణాలు లేకపోలేదు. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఈ-కేవైసీ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. కుటుంబంలో చాలా మంది లబ్ధిదారులు ఉంటే, వారందరూ E-KYC చేయాలి. మరోవైపు కొత్త రేషన్ కార్డుల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న విషయం విదితమే.

 

 

*పార్లమెంట్లోకి ఎవరు వెళ్లాలన్నా ఇకనుంచి స్కాన్ చేయాల్సిందే..
పార్లమెంట్‌ హౌస్‌లో భద్రతా లోపం ఏర్పడిన నేపథ్యంలో బడ్జెట్‌ సెషన్‌లో ప్రేక్షకులు కాంప్లెక్స్‌లోకి ప్రవేశించేందుకు కొత్త ఏర్పాట్లు చేశారు. సందర్శకులు పార్లమెంటును సందర్శించడానికి మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దాని ఆమోదం తర్వాత, వారి ఫోన్‌లో క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ప్రేక్షకులు మొబైల్‌లో వచ్చిన క్యూఆర్ కోడ్‌ను ప్రింటవుట్ తీసుకొని పార్లమెంటుకు వెళ్లాలి. దానితో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకురావాలి. ప్రవేశం కోసం పార్లమెంటుకు చేరుకున్న తర్వాత ముందుగా QR కోడ్‌ ఎంటర్ చేయాలి. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత రిసెప్షన్‌లో ప్రేక్షకుల బయోమెట్రిక్‌లు తీసి ఫోటోగ్రాఫ్‌లు తీసుకుంటారు. దీని తర్వాత సందర్శకులకు సందర్శకుల గ్యాలరీ కోసం స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. దీని తర్వాత ప్రజలు వీక్షణ గ్యాలరీలోకి ప్రవేశించడానికి స్మార్ట్ కార్డ్‌ను నొక్కాలి, ఆ తర్వాత మాత్రమే డోర్ తెరుచుకుంటుంది. ప్రేక్షకులు పార్లమెంటు నుండి తిరిగి వచ్చే ముందు స్మార్ట్ కార్డ్‌ను తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఎవరైనా కార్డును సమర్పించకపోతే, ఆ సందర్శకుడు బ్లాక్‌లిస్ట్ చేయబడతారు. భవిష్యత్తులో అతను పార్లమెంటు కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబడడు. ఎంపీలు తమ విజిటర్స్ పాస్‌ల కోసం కనీసం మూడు రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా పోలీసు వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని కోరారు. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ కోసం కూడా, ప్రేక్షకుల గ్యాలరీలోకి ప్రవేశించడానికి జనవరి 31 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు సందర్శకుల గ్యాలరీ కోసం ఎంపీలు ఒక పాస్ కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అయితే, ఎంపీ జీవిత భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రేక్షకుల గ్యాలరీ సామర్థ్యం ప్రకారం, పాస్ చేసిన వెంటనే మూసివేయబడుతుంది. మధ్యంతర బడ్జెట్‌కు సంబంధించిన గ్యాలరీ పాస్‌ల కోసం ఎంపీలు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు

 

*నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్.. ముమ్మరంగా ఏర్పాట్లు
బీహార్ రాజకీయాలకు ఈ ఆదివారం చాలా కీలకం కానుంది. రాజకీయ గందరగోళం మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకుని ఎన్డీయేలో చేరవచ్చు. ఈరోజే నితీష్‌ కుమార్‌కు మరోసారి పట్టాభిషేకం అంటే తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నితీష్ కుమార్‌తో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయవచ్చు. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు ముమ్మరం చేశారు. రాజకీయ గందరగోళం దృష్ట్యా సెలవు రోజుల్లో కూడా సచివాలయాన్ని తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. సిఎం నితీష్ కుమార్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గవర్నర్‌కు రాజీనామా సమర్పించి బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4 గంటలకు, అతను రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయవచ్చు. దీనికి ముందు ఉదయం 10 గంటలకు జేడీయూ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఎన్డీయే శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం నితీష్ కుమార్ తన రాజీనామాను బీహార్ గవర్నర్‌కు సమర్పించనున్నారు. నితీష్ కుమార్ ఆదివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే.. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రి అవుతారు. నితీష్‌ కుమార్‌తో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయవచ్చని కూడా చెబుతున్నారు. బీజేపీ కోటా నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు కావొచ్చు. ఒక ఉపముఖ్యమంత్రి పదవికి బిజెపి నాయకురాలు రేణుదేవి పేరు ఖరారైనట్లు భావిస్తుండగా, మరో ఉపముఖ్యమంత్రి పేరుపై మేధోమథనం సాగుతోంది. రాజకీయ గందరగోళం మధ్య శనివారం సిఎం నితీష్ కుమార్ ఆర్జేడీ మంత్రుల పనిని నిషేధించారు.
9వ సారి ముఖ్యమంత్రి కానున్న నితీష్ కుమార్!
మొదటిసారి – మార్చి 3, 2000
రెండవసారి- నవంబర్ 24, 2005
మూడవసారి- నవంబర్ 26, 2010
నాల్గవసారి- ఫిబ్రవరి 22, 2015
5వ సారి- నవంబర్ 20, 2015
ఆరవసారి- జూలై 27, 2017
7వ సారి- నవంబర్ 16, 2020
8వ సారి- ఆగస్టు 9, 2022
9వ సారి- జనవరి 28, 2024

 

*పాకిస్థాన్‌లో న్యుమోనియా విధ్వంసం.. వందలమంది చిన్నారుల మృతి
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో న్యుమోనియా విధ్వంసం సృష్టించింది. ఈ వ్యాధి తీవ్రమైన చలిలో ప్రాణాంతకంగా మారుతోంది. జనవరి నెలలో న్యుమోనియా కారణంగా ఇప్పటివరకు కనీసం 244 మంది మరణించిన పరిస్థితి. పంజాబ్‌లో గత 24 గంటల్లో మరో ఏడుగురు యువకులు మరణించారు. పంజాబ్ ఆరోగ్య శాఖ ప్రకారం.. 24 గంటల్లో మొత్తం పంజాబ్ ప్రావిన్స్‌లో 942 కొత్త న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. వాటిలో 212 కొత్త కేసులు లాహోర్‌లో నిర్ధారించబడ్డాయి. ఈ నెలలో పంజాబ్‌లో 244 మంది మరణించగా, 50 మంది ఒక్క లాహోర్‌లోనే ఉన్నారు. ఆరోగ్య అధికారి ప్రకారం.. మరణాల పెరుగుదల శీతాకాలంలో పొగమంచు వల్ల కలిగే కాలుష్యం కారణంగా ఉంది. చలికాలంలో పొగమంచు కారణంగా న్యుమోనియా కేసులు పెరుగుతాయని ఆయన చెప్పారు. నిజానికి న్యుమోనియా అనేది ఊపిరితిత్తుల వ్యాధి, ఇది సాధారణంగా వైరస్‌ల వల్ల వస్తుంది. జలుబు, ఫ్లూ న్యుమోనియాకు కారణమవుతాయి. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. ఐదు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు న్యుమోనియాతో ఎక్కువగా బాధపడుతున్నారు. మరోవైపు, మరణించిన చాలా మంది పిల్లలకు న్యుమోనియా టీకాలు వేయలేదని పంజాబ్ ఆపద్ధర్మ ప్రభుత్వం చెబుతోంది. పిల్లలు పోషకాహారలోపానికి గురయ్యారు. దాని కారణంగా వారు చాలా బలహీనంగా ఉన్నారు. వైరస్తో పోరాడే సామర్థ్యాన్ని కలిగి లేరు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. మొత్తం పంజాబ్ ప్రావిన్స్‌లోని పాఠశాలల్లో ఉదయం సమావేశాలను జనవరి 31 వరకు ప్రభుత్వం నిషేధించింది. పంజాబ్‌లోని ఆరోగ్య అధికారులు న్యుమోనియా వ్యాప్తిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించడంతోపాటు ఇతర ముఖ్యమైన చర్యలపై కూడా దృష్టి సారిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

 

*తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తమిళనాడులోని సేలం-వృద్ధాచలం హైవేపై నరైయూర్ వద్ద శనివారం కారు, సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు విడుతలై చిరుతిగల్ కట్చి (VCK) కార్మికులు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం తిరుచ్చి సమీపంలోని సిరుగనూర్‌లో జరిగిన పార్టీ సమావేశానికి హాజరైన 25 మంది వీసీకే కార్యకర్తలు వ్యాన్‌లో కడలూరు జిల్లా భువనగిరి సమీపంలోని విలియనూర్‌కు తిరిగి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో వాహనం నరైయూర్ సమీపంలో ఉండగా, డ్రైవర్ వాహనంపై నియంత్రణ తప్పి ఎదురుగా వస్తున్న గూడ్స్ లారీని ఢీకొట్టింది. వేప్పూర్ నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వృద్ధాచలం, వేప్పూర్, పెరంబలూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. లారీ డ్రైవర్ సెంథిల్ గవాస్కర్‌ను పాండిచ్చేరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)కు రిఫర్ చేశారు. వ్యాన్ డ్రైవర్ ఎస్.చిరంజీవిని తిరుచ్చి జీహెచ్‌కి రిఫర్ చేశారు.

 

*వాహనం లేక.. మృతదేహాన్ని 20 కిలోమీటర్లు భుజాలపైనే..!
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో భార్య మృతదేహాన్ని బంధువుల సాయంతో 20 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన దయనీయ ఘటన ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. 3 నెలల క్రితం తన భార్య కరుణ కరుణ అమానత్య(28) ఆడపిల్లకు జన్మనిచ్చిందనే కారణంతో కోరాపుట్ జిల్లా పూర్ణగూడ పంచాయతీ కుమిలి గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం రాత్రి కరుణ ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు విడిచింది. అత్తవారింట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని నవరంగపూర్‌ జిల్లా జగన్నాథ్‌పూర్‌ పంచాయతీ పూపూగౌకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుని పలు మార్లు అంబులెన్స్‌ కోసం కాల్‌ చేశారు. ప్రభుత్వ అంబులెన్స్ లభించకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించేందుకు ఆర్ధిక పరిస్థితి బాగాలేని కారణంగా తప్పని పరిస్థితుల్లో మృతదేహాన్ని ఒక మంచాన్ని డోలిగా కట్టి తీసుకువెళ్లారు. కుటుంబీకుల సహాయంతో మృతదేహాన్ని మంచంపై వేసి భుజాలపై 20 కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.

 

*స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. శనివారం పెరిగిన పసిడి ధరలు.. నేడు (జనవరి 28) స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,950గా ఉండగా… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే.. పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆదివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,100గా ఉంది. ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ. 57,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 58,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,710గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950గా ట్రేడ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,950లకు లభిస్తోంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ఆదివారం కిలో వెండి ధర రూ. 76,000గా పలుకుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,000 కాగా.. చెన్నైలో రూ. 77,500గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,000లుగా ఉండగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ. 73,500గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలతో కిలో వెండి ధర రూ. 77,500గా ఉంది.

 

*సబలెంకదే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్.. రెండో ప్లేయర్‌గా రికార్డు!
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2024 మహిళల సింగిల్స్‌ ఛాంపియన్‌గా బెలారస్‌ భామ అరినా సబలెంక నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్‌ సబలెంకా 6-3, 6-2తో చైనాకు చెందిన 12వ సీడ్‌ కిన్వెన్‌ జెంగ్‌పై విజయం సాధించింది. గంట 16 నిమిషాల్లో టైటిల్‌ పోరును బెలారస్‌ భామ ముగించింది. గతేడాది ఫైనల్లో ఎలెనా రిబకినాపై కష్టపడ్డ సబలెంక.. ఈసారి జెంగ్‌పై సునాయాస విజయం సాధించింది. టైటిల్ విన్నర్ సబలెంకాకు 31,50,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు) దక్కగా.. రన్నరప్‌ జెంగ్‌కు 17,25,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి సెట్‌లో రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సబలెంకకు సెట్‌ గెలిచేందుకు ఎంతో సమయం పట్టలేదు. రెండో సెట్లోనూ రెండు బ్రేక్‌ పాయింట్లను సాధించిన బెలారస్‌ భామ సునాయాస విజయం సాధించింది. సబలెంకా జోరు ముందు జెంగ్‌ ఏమాత్రం నిలువలేకపోయింది. ఈ మ్యాచ్‌లో సబలెంక మూడు ఏస్‌లు, 14 విన్నర్లు కొట్టింది. మూడుసార్లు ప్రత్యర్థి సర్వీసు బ్రేక్‌ చేసింది. మరోవైపు జెంగ్‌ ఆరు డబుల్‌ ఫాల్ట్‌లతో మూల్యం చెల్లించుకుంది. గత 13 నెలలుగా అరినా సబలెంక అద్భుతంగా ఆడుతోంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2023 గెలిచిన సబలెంక.. యూఎస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌ ఓపెన్‌లలో సెమీఫైనల్‌ వరకు వెళ్ళింది. ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలుచుకుంది. ఈ ఏడాదీ కొత్త సీజన్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పిన సబలెంక.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అజరెంకా (2012, 2013) తర్వాత వరుస టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచింది. మరోవైపు యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సబలెంకా చేతిలోనే ఓడి ఇంటిదారి పట్టిన జెంగ్‌.. ఇప్పుడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

 

*ఉప్పల్ టెస్ట్.. రోహిత్ శర్మ పాదాలు తాకిన అభిమానికి 14 రోజుల రిమాండ్!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. బారికేడ్స్ దాటి పరిగెత్తుకుంటూ వెళ్లి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లు మొక్కాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ.. ఆ అభిమానిని బయటకు తీసుకెళ్లారు. తొలిరోజు (జనవరి 25) భారత్‌ ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమాని బారికేడ్స్ దాటి మైదానంలోకి దూసుకురావడాన్ని రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మైదానంలోకి దూసుకెళ్లిన అభిమాని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డిగా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.. న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ అభిమానికి 14 రోజుల రిమాండ్ విధించాడు. ఈ ఘటన నేపథ్యంలో ఉప్పల్ మైదానంలో సెక్యూరిటీ పెంచారు. ప్రేక్షకులు వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని, నిబంధలు విరుద్ధంగా మైదానంలోకి వెళితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 316/6తో నిలిచింది. ఓలి పోప్‌ (148 బ్యాటింగ్‌; 208 బంతుల్లో 17×4) సెంచరీతో సత్తాచాటాడు. పోప్‌తో పాటు రెహాన్‌ అహ్మద్‌ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా (2/29), ఆర్ అశ్విన్‌ (2/93) వికెట్స్ పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు భారత్‌ 190 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 421/7తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన రోహిత్ సేన 436 పరుగులకు ఆలౌటైంది. ఆర్ జడేజా (87; 180 బంతుల్లో 7×4, 2×6) టాప్ స్కోరర్.