బండి సంజయ్ అర్థరాత్రి అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనకు బీజేపీ పిలుపు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త నెలకొంది. సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తు్న్నారు. బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బండి సంజయ్ కుమార్ ని అర్ధరాత్రి అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తూ అన్ని మండల జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పైన సీఎం కేసీఆర్ కుటుంబం పైన.. లీకేజీ ప్యాకేజీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెల్లుతుండడంతో దాని పక్కదారి పట్టించడానికి బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేసి ఇప్పుడు కారణాలు వెతుకుతున్నారని మండిపడుతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరీక్ష పత్రాలు లీకేజీల అవుతుండడం, మరోవైపు బీఆర్ఎస్ పేరుతో దేశవ్యాప్తంగా బీజేపీ యేతర అన్ని రాజకీయ పార్టీలకు ఫైనాన్స్ అందిస్తామని, తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలని కేసీఆర్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబం దగ్గర లక్షల కోట్ల రూపాయల ప్రజా ప్రజాధనం దోపిడీ చేశారన్న భావన ప్రజల్లో కలుగుతుండడంతో దాన్ని పక్కదారి పట్టించాలానే దుర్మార్గపు ఆలోచనతోనే బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగిందని ఆరోపించారు. బండి సంజయ్ కుమార్ ను కారణం లేకుండా అరెస్టు చేసి ఇప్పుడు కారణాలు వెతుకుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతూ బండి సంజయ్ కుమార్ ను బేషరత్ గా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం వైఎస్ జగన్ కాలికి గాయం.. ఒంటిమిట్ట పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఒంటిమిట్టలో పర్యటించాల్సి ఉంది.. కానీ, కాలికి గాయం కావడంతో ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు.. కాలినొప్పితో బాధపడుతున్నారు సీఎం జగన్.. మంగళవారం ఉదయం ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో కాలు బెణికింది.. అయితే.. సాయంత్రానికి నొప్పి తీవ్రత పెరిగింది.. గతంలోనూ ఇలానే కాలికిగాయం కావడంతో.. చాలా రోజుల పాటు ఇబ్బంది పడ్డారు ముఖ్యమంత్రి.. అయితే, తాజాగా మళ్లీ కాలినొప్పి తీవ్రం కావడంతో.. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.. దీంతో సీఎం వైఎస్ జగన్ ఇవాళ్టి ఒంటిమిట్ట పర్యటన రద్దు అయినట్టు అధికారులు ప్రకటించారు. కాగా, ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరాముని ఆలయానికి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని భావించారు. అధికారులు, పోలీసులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు.. సీఎం టూర్ షెడ్యూల్ కూడా ఖరారు చేశారు.. కానీ, కాలు బెణకడంతో పర్యటన రద్దు చేసుకున్నారు.
ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు.. ట్రాఫిక్ ఆంక్షలు
ఆంధ్ర భద్రాదిగా భావించే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మాత్రం.. పండు వెన్నెల్లో కన్నుల పండుగగా కోదండరాముని కల్యాణం నిర్వహిస్తారు.. ఈ మహోత్సావానికి ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ రాత్రి కోదండ రాముడి కల్యాణ క్రతువుకు శాస్త్రోక్తంగా నిర్వహించబోతున్నారు.. లక్ష మంది భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.. అయితే, షెడ్యూల్ ప్రకారం సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఒంటిమిట్టకు రావాల్సి ఉన్నా.. కాలికి గాయం కారణంగా ఆయన పర్యటన రద్దు కావడంతో.. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి లేదా టీటీడీ ఛైర్మన్.. స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేసేలా ఏర్పాటు జరుగుతున్నాయి.. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి.. రాత్రికి పండు వెన్నెల్లో కోదండరాముని కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.. ఇక, ఉదయం జగదభిరాముని ఊరేగింపు నిర్వహిస్తారు.. ఒంటిమిట్టలో శ్రీరాముడి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. సర్వాంగ సుందరంగా కల్యాణవేదికను ముస్తాబు చేశారు.. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఒంటిమిట్టలో కల్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. కడప-తిరుపతి ప్రధాని రహదారికి పక్కనే ఈ ఆలయం ఉండడంతో.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత కడప- తిరుపతి ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిపివేయనున్నారు.. తిరుపతి నుంచి వచ్చే వాహనాలను రాయచోటిమీదుగా కడపకు, కడప నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు.
తప్పాచబుత్ర కాల్పుల ఘటన.. అదుపులో నిందితుడు క్రాంతి సాగర్
హైదరాబాద్‌లో పాత కక్షలు భగ్గుమన్నాయి. మంగళవారం అర్థరాత్రి ఆసీఫ్‌నగర్ టప్పాచబుత్రా ప్రాంతంలో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కాల్చి చంపడంతో సంచలనం నెలకొంది. పాత కక్షల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. కార్వాన్‌లోని షబాబ్ హోటల్ సమీపంలోని తోప్‌ఖానాలో క్రాంతి అతని సహచరుల బృందం అకా ఛోటు , 26 ఏళ్ల ఆకాష్ సింగ్‌పై హఠాత్తుగా పలుసార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని క్లూస్ టీమ్‌తో పాటు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో గన్ తో పాటు కత్తులు కూడా దొరికినట్లు తెలిపారు. మరణించిన వ్యక్తి బీజేపీ నేత అమర్ సింఘ్ అల్లుడు ఆకాష్ సింఘ్ గా పోలీసులు గుర్తించారు. గతంలో తప్పచబుత్ర పోలీస్ స్టేషన్ లో ప్రధాన నిందితుడు క్రాంతి సాగర్ పై ఫిర్యాదు చేసిన మృతుడు ఆకాష్ సింగ్ కేసు నమోదు చేసి క్రాంతి సాగర్ ను పోలీసులు బైండోవర్ చేశారు. దీంతో అర్థరాత్రి సెటిల్మెంట్ అని క్రాంతి సాగర్ స్కెచ్ వేశాడు. మంగళవారం రాత్రి, క్రాంతి ఆకాష్ సింగ్‌తో రాజీ కుదుర్చుకోవడానికి కార్వాన్‌లోని తోపేఖానా ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే స్నేహితుడిని సంప్రదించాడు. అనంతరం ఆకాష్‌ను ఇమ్రాన్ తన నివాసానికి పిలిపించగా, క్రాంతి, అతని సహచరులు కూడా అక్కడికి చేరుకున్నారు. రాజీ సాకుతో, క్రాంతి అకస్మాత్తుగా ఆయుధాన్ని తీసి ఆకాష్ సింగ్‌పై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు దీంతో ఆకాష్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ప్రధాన నిందితుడు క్రాంతి సాగర్ లొంగి పోయాడు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుడు ఆకాష్ సింగ్ ఒంటిపై ఛాతీ భాగంలో రెండు బులెట్స్, కుడి చేతి, వీపు భాగంలో పలు కత్తి పొట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. క్రాంతి సాగర్ ఒక్కరే ఆకాష్ సింగ్ ను హతమార్చాడ లేదా ఇంకెవరెవరైనా ఉన్నార అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
పాన్ ఆధార్లో తప్పులుంటే కొన్ని క్షణాల్లో సరిదిద్దుకోవచ్చు
ఆదాయపు పన్ను శాఖ పాన్ – ఆధార్ లింక్‌ను తప్పనిసరి చేసింది. దీని కోసం, పాన్ హోల్డర్‌లకు జూన్ 30, 2023 వరకు గడువు ఇచ్చింది. పాన్ లేదా ఆధార్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ రెండు డాక్యుమెంట్‌లలో వేర్వేరుగా ఉంటే.. దాన్ని సరిదిద్దడానికి సులభమైన మార్గం అందుబాటులో ఉంది. రెండు పత్రాల్లోనూ పైన తెలిపినవి తప్పుగా ఉంటే రెండూ లింక్ చేయబడవు. అటువంటి పరిస్థితిలో పాన్ కార్డు వృధా అవుతుంది. ఇది పని చేయదు.. మీకు పలు సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో పాన్ వివరాలను సరి చేసుకోవచ్చు. పాన్ కార్డ్‌లోని ఏవైనా వివరాలను సరిదిద్దడానికి వినియోగదారులు NSDL పోర్టల్‌ను సందర్శించాలి. ఆదాయపు పన్ను శాఖ పాన్‌లో సమాచారాన్ని సరిదిద్దుకునే ఆన్‌లైన్ ప్రక్రియను సులభతరం చేసింది. ఇందుకు మీకు ఎక్కువ సమయం పట్టదు.
ఈ ఏడాది భారత్ ఆర్థిక వృద్ధి 6.3 శాతం.. అంచనాలను తగ్గించిన వరల్డ్ బ్యాంక్..
ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్య పరిస్థితుతలతో సతమతం అవుతోంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులు అయిన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వృద్ధి దారుణంగా ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. వీటన్నింటి ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 4-5 శాతం మధ్య ఉంటుందని చెబుతున్నాయి. మరోవైపు మరో 6 నెలల నుంచి ఏడాది కాలంలో తప్పకుండా ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులు మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని ప్రపంచబ్యాంక్, బ్లూమ్ బర్గ్ వంటివి అంచనావేశాయి. కాగా, తాజాగా 2024 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. గత అంచనాతో పోలిస్తే ఈసారి వృద్ధి రేటును తగ్గించింది. వరల్డ్ బ్యాంక్ భారత వృద్ధి రేటను 6.6 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది. అధిక రుణ ఖర్చులు వినియోగాన్ని దెబ్బతీస్తాయని అంచనా వేసింది. ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లను పెచింది. రుణ వ్యయాలు పెరగడం, ఆదాయ వృద్ధి మందగించడం వల్ల ప్రైవేటు వినియోగ వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం వృద్ధిని 6.9 శాతంగా అంచానా వేసింది.
4ఏళ్లు డబ్బు డిపాజిట్ చేయండి.. రూ.కోటి సొంతం చేసుకోండి
బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే సొమ్ముకు తగిన రాబడి రావడం లేదని చింతిస్తున్నారా.. అటువంటి పరిస్థితిలో LIC మీకోసం ఒక ప్రత్యేక పాలసీని తీసుకొచ్చి్ంది. ఇది వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంది. ఈ పథకం కింద నాలుగు ప్రీమియంలు చెల్లించడం ద్వారా కోటి రూపాయల వరకు రాబడిని పొందవచ్చు. LIC తాజా పాలసీ పేరు శిరోమణి యోజన. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. LIC లైఫ్ శిరోమణి ప్లాన్ (LIC జీవన్ శిరోమణి ప్లాన్) అనారోగ్యానికి ఉత్తమమైన కవర్‌ని అందిస్తుంది. ఈ పథకం వ్యవధి 4 స్థాయిల పరిధిలో నిర్ణయించబడింది. ఇందులో 14, 16, 18, 20 సంవత్సరాలు ఉంటాయి. పాలసీ తీసుకునే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 55 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఈ ప్లాన్ కింద కనీస హామీ మొత్తం విలువ రూ.1 కోటి. అధిక ఆదాయం ఉన్న వారి కోసం ఈ ప్లాన్ రూపొందించబడింది. మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఇది కూడా పరిమిత ప్రీమియంలో మనీ బ్యాక్ ప్లాన్.. దీనిలో మీరు ఎప్పటికప్పుడు డబ్బు పొందుతారు. పాలసీలో గరిష్ట పెట్టుబడి వయస్సు 55 సంవత్సరాలు (పాలసీ వ్యవధి 14 సంవత్సరాలు), 51 సంవత్సరాలు (పాలసీ వ్యవధి 16 సంవత్సరాలు), 48 సంవత్సరాలు (పాలసీ వ్యవధి 18 సంవత్సరాలు) మరియు 45 సంవత్సరాలు (పాలసీ వ్యవధి 20 సంవత్సరాలు).
బీజేపీలో చేరనున్న స్టార్ హీరోలు.. కాషాయ పార్టీలోకి కిచ్చా సుదీప్, దర్శన్
వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న కర్ణాటక ఎన్నికలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ఎన్నికలను లోక్ సభ ఎన్నికల ముందు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కన్నడ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే కన్నడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నడ స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగదీప బీజేపీలో చేరుతున్నట్లు తెలిసింది. ఈ రోజు బెంగళూర్ లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో వీరిద్దరు కాషాయ కండువాను కప్పుకోనున్నారు. ఓ ప్రైవేట్ హోటల్ లో వీరిద్దరి చేరిక ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1.30-2.30 మధ్య వీరు బీజేపీలో చేరనునన్నారు. కర్ణాటకలో వీరిద్దరికి మాస్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది అభిమానులు ఉన్నారు. సుదీప్, దర్శన్ చేరికతో బీజేపీ విజయావకాశాలు పెరుగుతాయని ఆ పార్టీ భావిస్తోంది. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగబోతునున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది.