NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రూ.2వేల కోసం రెండు కిలోల బంగారం స్మగ్లింగ్.. సరిహద్దులో పట్టుబడిన మహిళ
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి 27 బంగారు కడ్డీలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) గురువారం అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీల బరువు 2 కిలోల కంటే ఎక్కువ. దాని విలువు దాదాపు రూ.1.29 కోట్లు ఉంటుందని అంచనా. మాణికా ధర్ (34)గా గుర్తించిన స్మగ్లర్ 27 బంగారు కడ్డీలను గుడ్డలో దాచి నడుముకు కట్టుకుంది. ఆమె బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాకు చెందిన మహిళగా అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన స్మగ్లర్‌ బంగారంతో సరిహద్దు దాటబోతున్నట్లు భారత చెక్‌పోస్టు వద్ద మోహరించిన బీఎస్‌ఎఫ్ మహిళా సిబ్బందికి సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న మహిళా జవాన్లు అనుమానం వచ్చిన వ్యక్తిని ఆపి సోదా చేయగా.. ఆమె దుస్తులలో దాచిపెట్టిన బంగారు బిస్కెట్లు కనిపించాయి. విచారణలో, పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో గుర్తు తెలియని వ్యక్తికి బంగారు కడ్డీలను డెలివరీ చేయమని ఆమెకు సూచించినట్లు స్మగ్లర్ అంగీకరించింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని, ఆ పని కోసం రూ.2,000 అందుకోబోతున్నానని కూడా ఆమె అంగీకరించింది.స్మగ్లర్, స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం కస్టమ్ ఆఫీస్ పెట్రాపోల్‌కు అప్పగించారు. సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్, బీఎస్‌ఎఫ్‌ ప్రతినిధి ఒకరు జవాన్ల అప్రమత్తతను మెచ్చుకున్నారు. స్మగ్లర్లను అడ్డుకోవడంలో వారు సాధించిన విజయంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

భర్తతోపాటే నన్ను కాల్చండి.. అమర జవాన్‌ చితిపై పడుకుని రోదించిన భార్య
ఛత్తీస్‌గఢ్‌లో జవాన్ లే లక్ష్యంగా మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో 10 మంది మరణించారు. ఈ ఘటనలో చనిపోయిన ఓ జవాన్‌ దహన సంస్కారాల్లో హృదయ విదారక దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. భర్త మృతిని తట్టుకోలేని మహిళ గుండెలవిసేలా రోదించింది. భర్త లేనిదే బతకలేనంటూ చితిపై పడుకొని తనను భర్తతో పాటే దహనం చేయాలంటూ విలపించింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో బుధవారం(ఏప్రిల్ 26) నక్సల్స్ జరిపిన ఐఈడీ పేలుడులో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)కి చెందిన పది మంది భద్రతా సిబ్బంది, వారి వాహనం డ్రైవర్ మరణించారు. వీరు ఆ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో ఉన్నారు. నక్సల్స్‌ జరిపిన ఐఈడీ పేలుడులో మరణించిన తన భర్త అంత్యక్రియల కోసం అలంకరించిన చితిపై అమరవీరుల్లో ఒకరి భార్య పడుకుంది. కసోలి గ్రామంలో జవాన్ భార్య తన భర్త అంత్యక్రియల కోసం అలంకరించిన చితిపై పడుకుని, “నన్ను అతని ముందు కాల్చండి” అంటూ రోదించింది. నా భర్త లేనప్పుడు, నేను జీవించడానికి ఎటువంటి కారణం లేదు, అని జవాన్ భార్య అంత్యక్రియల చితిపై పడుకుని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త మంటల్లో కాలిపోతుంటే చూడలేకపోతున్నానని గుండె పగిలేలా విలపించింది.

నేను రావణుడినైతే.. కేంద్ర మంత్రిపై మండిపడిన గెహ్లాట్
తనను “రావణ్” అని పిలిచినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఎదురుదాడికి దిగారు. సంజీవని క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెకావత్ ప్రమేయాన్ని గెహ్లాట్ ప్రస్తావిస్తూ, “నేను రావణుడినైతే, నువ్వు రాముడివి అయ్యి, పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి ఇవ్వు” అని అన్నారు. “మీరు నాపై రాళ్లు వేస్తే, పేదలకు ఇళ్లు నిర్మించడానికి నేను వాటిని ఉపయోగిస్తాను” అని బీజేపీ నాయకుడికి సవాల్‌ విసిరారు. హనుమాన్‌గఢ్‌లోని రావత్‌సర్ పట్టణంలోని ద్రవ్యోల్బణ సహాయ శిబిరాన్ని సందర్శించిన అనంతరం జరిగిన సభలో గెహ్లాట్ మాట్లాడుతూ.. ఈ కుంభకోణంలో షెకావత్ స్నేహితులు జైలులో ఉన్నారని, కేంద్ర మంత్రి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. షెకావత్‌ దోషి అయితే నైతిక కారణాలతో రాజీనామా చేయాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ బర్తరఫ్‌ చేయాలని ఆయన అన్నారు.

అదిరిందయ్యా ఆర్థర్.. 20అడుగుల మంచంలో 6గురు పెళ్లాలతో.. హూ
చాలామందికి ఈ మధ్య పెళ్లి కావడమే కష్టంగా ఉంది. పెళ్లికి ఒక్క పిల్లను వెతుక్కోడానికే పుణ్యకాలం సరిపోతుంది. 30లు 40లు దాటినా పెళ్లికాకుండా బ్యాచులర్స్ గా మిగిలిపోతున్నారు. కొంతమంది అదృష్టమేమో కానీ, ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకున్నారన్న వార్తలు విని ‘వాడికి ఎక్కడో సుడి ఉందిరా ’ అంటూ బ్యాచులర్లు ఆడిపోసుకుంటున్నారు. అలాంటి వార్తే ఇంకొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రెజిల్‌కు చెందిన ఓ మేల్ మోడల్ ఆరుగురి భార్యలతో ఆదర్శ భర్త అనిపించుకుంటున్నాడు. అంతే కాదు వారికోసం ఓ స్పెషల్ బెడ్ కూడా తయారు చేయించాడు. సాధారణంగా దంపతులు ఒక డబుల్ కాట్ బెడ్ ఉంటే సరిపోతుంది. మరి ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉన్న భర్తల పరిస్థితి ? వారికి డబుల్ కాట్ కాదు కదా.. కింగ్ సైజ్ బెడ్‌లు రెండున్నా సరిపోవు. అలాంటిది బ్రెజిల్‌కు చెందిన ఆర్థర్ ఓ ఉర్సో‌కు ఏకంగా ఆరుగురు భార్యలు.. వారిలో ఎవరితో కలిసి నిద్రపోయినా.. మిగతా భార్యలు అలుగుతారు. అందుకే, ఆ ఆదర్శ భర్తకు ఓ సూపర్ ఐడియా వచ్చింది. మొత్తం ఏడుగురు (భర్తతో కలిపి) కలిసి హాయిగా నిద్రపోయేందుకు 20 అడుగుల బెడ్ తయారు చేయించాడు. ఇంకేం వారితో కలిసి హాయిగా నిద్రపోతున్నాడు. తను హాయిగా నిద్రపోతున్నాడు కానీ, తను చేయించిన బెడ్ ధర వింటే మనకు నిద్రపట్టదు. ఆ బెడ్‌ను ఏకంగా రూ.81 లక్షలతో చేయించుకున్నాడు. మీకు ఒక్క సారిగా ఏమనిపిస్తోంది. ఈ డబ్బుతో మంచి అపార్టుమెంటు కొనుకోవచ్చు అనుకుంటున్నారా. అంతా తలోదిక్కు నిద్రపోడానికి బదులు.. ఒకే చోట నిద్రపోతే బాగుంటుందని..ఈ 20 అడుగులతో బెడ్ తయారు చేయించాడు.

బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వడం లేదని భార్య ఆత్మహత్య
ఈ రోజుల్లో చిన్నచిన్న విషయాలకే మనస్తాపం చెంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చేటుచేసుకుంది. బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా తన భర్త అడ్డుకున్నందుకు ఓ మహిళ(34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇండోర్‌లో 34 ఏళ్ల మహిళ బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా భర్త అడ్డుకోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు.గురువారం నగరంలోని స్కీమ్ నంబర్ 51 ప్రాంతంలోని తన ఇంట్లో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సబ్ ఇన్‌స్పెక్టర్ ఉమాశంకర్ యాదవ్ వెల్లడించారు. “ఆమెను బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నాడని, ఆవేశంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిందని ఆమె భర్త మాకు చెప్పాడు. పోస్ట్‌మార్టం నిర్వహించి కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం” అని యాదవ్ తెలిపారు.

3,500 యాప్స్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగింపు.. గూగుల్‌ సంచలన నిర్ణయం
గూగ్‌ల్ ప్లే స్టోర్‌లో కుప్పలుకుప్పలుగా యాప్స్‌ ఉంటాయి.. కొన్నిసార్లు.. ఇలాంటి యాప్‌లు కూడా ఉన్నాయా? అనే అనుమానాలను కలిగిస్తుంటాయి.. అయితే, ఎప్పటికప్పుడు గూగుల్‌.. వాటిని ప్రక్షాళన చేస్తూనే ఉంటుంది.. ఈ మధ్య కాలంలో లోన్‌ యాప్స్‌ ఆగడాలు మితిమీరిపోతున్న విషయం విదితమే.. ఈ యాప్స్‌ వలలో చిక్కుకుని చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.. అయితే, లోన్ యాప్స్‌ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది గూగుల్‌.. మార్గద‌ర్శకాల‌ను ఉల్లంఘిస్తున్న 3500 లోన్ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి సెర్చింజ‌న్ దిగ్గజం తొల‌గించింది. కాగా, రుణాలు ఇస్తామంటూ మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌, హామీలు ఇచ్చే లోన్ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్స్‌లో కోకొల్లలుగా ఉన్న విషయం విదితమే.. ఈ త‌ర‌హా యాప్‌ల‌పై గూగుల్ ఉక్కుపాదం మోపింది. స‌రైన అవ‌గాహ‌న, వెరిఫికేష‌న్ లేకుండా కొంద‌రు యూజ‌ర్లు ఈ యాప్స్‌ను వాడి స‌మ‌స్యల్లో కూరుకుపోతున్న నేపథ్యంలో.. ఇలాంటి యాప్స్ బారిన‌ప‌డ‌కుండా యూజ‌ర్లను కాపాడే ఉద్దేశంతో ప్లేస్టోర్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 3500కుపైగా లోన్ యాప్స్‌ను గత ఏడాది తొలగించింది గూగుల్‌. 2021లో, వ్యక్తిగత రుణాలను అందించే వాటితో సహా భారతదేశంలోని ఆర్థిక సేవల యాప్‌ల కోసం Google తన విధానాన్ని అప్‌డేట్ చేసింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) మరియు బ్యాంకులకు ఫెసిలిటేటర్‌లుగా వ్యక్తిగత రుణాలను అందించే యాప్ డెవలపర్‌ల కోసం Google మరిన్ని అవసరాలను జోడించింది. ప్లే స్టోర్‌లోని అన్ని యాప్‌లు దాని నియమాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి Google తన విధానాలు మరియు సమీక్ష ప్రక్రియలను క్రమం తప్పకుండా నవీకరిస్తోంది. 2021లో, వ్యక్తిగత రుణాలను అందించే వాటితో సహా భారతదేశంలోని ఆర్థిక సేవల యాప్‌ల కోసం Google తన విధానాన్ని అప్‌డేట్ చేసింది. ఈ విధానం సెప్టెంబర్ 2021 నుండి అమల్లోకి వచ్చింది. యాప్ డెవలపర్‌లు వ్యక్తిగత రుణాలను అందించడానికి మరియు లైసెన్స్ కాపీని సమర్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా లైసెన్స్ పొందినట్లు ధృవీకరించాలి. వారు లైసెన్స్ పొందకపోతే, వారు లైసెన్స్ పొందిన రుణదాతలకు రుణాలు అందించడానికి మాత్రమే ప్లాట్‌ఫారమ్‌ను అందించారని ధృవీకరించాలి. డెవలపర్‌లు తమ డెవలపర్ ఖాతా పేరు వారి డిక్లరేషన్ ద్వారా అందించబడిన నమోదిత వ్యాపార పేరుతో సరిపోలినట్లు నిర్ధారించుకోవాలి.

రూ.55 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. డ్రైవింగ్ లైసెన్స్‌తో పనేలేదు..!
ఇప్పుడంతా ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తోంది.. పెట్రో ధరలు ఆల్‌టైం హై రికార్డు సృష్టించిన తర్వాత.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.. పర్యావరణాన్ని సంరక్షించేందుకు కూడా పూనుకుంటున్నారు.. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు చూస్తున్నాయి.. ఇండియన్ మార్కెట్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతూ వస్తుంది.. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురాగా.. తాజాగా, యులు (Yulu) కంపెనీ వైన్ (Wynn) అనే ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసింది.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 55,555 మాత్రమే.. అయితే, మరికొన్ని రోజుల తర్వాత దాదాపు రూ.10 వేల వరకు ఈ బైక్‌ ధర పెరుగుతుందని ఆ కంపెనీ ప్రకటించింది.. ఇక, ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 999 రిఫండబుల్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ బైక్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండగా.. తర్వారలో మరిన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. వచ్చే నెల నుంచి కస్టమర్లకు ఈ బైక్‌ను అందజేయనున్నారు.. యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ కేవలం రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి స్కార్లెట్ రెడ్ కలర్, మూన్ లైట్ కలర్. యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ బజాజ్ చేతక్ యాజమాన్యంలో ఉన్న చేతక్ టెక్నాలజీస్ లిమిటెడ్ తయారు చేస్తోంది.. 984.3 వాట్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 68 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంది.. కాబట్టి ఈ బైక్ రైడ్ చేయడానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వం అవసరం ఉండవన్న మాట..