కొనసాగుతోన్న కౌంట్‌డౌన్.. నేడు నింగిలోకి పీఎస్‌ఎల్వీ -సీ55..
మరో ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలతో పాటు.. వాణిజ్య ప్రయోగాలను కూడా చేసి విజయం సాధించింది.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యింది.. ఈ రోజు శ్రీహరికోటలోని షార్ (SHAR) మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ 55 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలకు కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.. 741 కిలోల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతోపాటు, 16 కిలోల బరువున్న లుమొలైట్ అనే చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది ఇస్త్రో. ఇక, ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 11.49 గంటలకు ప్రారంభం అయ్యింది.. విజయవంతంగా కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా కొనసాగుతోంది.. మొత్తం 25.30 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.19 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది పీఎస్‌ఎల్వీ-సీ 55 రాకెట్. మరోవైపు ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ సమావేశం నిర్వహించారు.. శుక్రవారం రోజు తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే.
వీధి కుక్కలకు మరో చిన్నారి బలి..
వీధి కుక్కులకు చెలరేగి పోతున్నాయి.. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వెంబడించి మరి దాడి చేస్తున్నాయి.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు తీశాయి వీధి కుక్కలు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో 18 నెలల చిన్నారి సాత్విక వీధి కుక్కలకు బలిఅయ్యింది.. ఈ ఘటనతో శ్రీకాకుళం జి.సిగడాం మండలం మెట్టవలసలో తీవ్ర విషాదం నెలకొంది.. వీధిలో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారిపై.. ఒక్కసారిగా దాడి చేశాయి నాలుగు వీధి కుక్కలు.. ఈ ఘటనలు చిన్నారి తీవ్రంగా గాయపడింది.. ఇక, కుక్కల దాడిని గమనించిన కుటుంబ సభ్యులు.. చిన్నారిని వెంటనే చికిత్స కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి ప్రథమ చికిత్స చేశారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు.. అయితే, ఆ చిన్నారి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి సాత్విక కన్నుమూసింది.. పసిపాప మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.. కుక్కల నియంత్రణపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని.. స్థానికులు మండిపడుతున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు..
హన్మకొండలో మావోయిస్టు అగ్రనేత దేవేందర్ రెడ్డి అరెస్ట్
సీపీఐ(మావోయిస్ట్) పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జెడ్‌సీ) సభ్యుడు మూల దేవేందర్‌రెడ్డితోపాటు నిషేధిత మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడు గుర్రం తిరుపతిరెడ్డిని పోలీసులు శుక్రవారం హన్మకొండ సుబేదారి వద్ద అరెస్టు చేశారు. దేవేందర్ రెడ్డి (63) మంచిర్యాల జిల్లా బబ్బరు చెలుక గ్రామానికి చెందిన వ్యక్తి. పార్టీలో ఆయనకు కరప అలియాస్ నందు అనే పేరు కూడా ఉంది. అతను సెంట్రల్ టెక్నికల్ టీమ్ సభ్యునిగా DKSZC హోదాలో పని చేస్తున్నాడు. హన్మకొండ వికాస్‌నగర్‌లో నివాసముంటున్న గుర్రం తిరుపతిరెడ్డి (53) నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి. గురువారం సాయంత్రం దేవేంద్రరెడ్డి కంటి ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.21వేలు, విప్లవ సాహిత్యం, పెన్ డ్రైవ్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఇక్కడ మీడియా ముందు హాజరైన వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. పీడబ్ల్యూజీ రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్ పోరెడ్డి వెంకటరెడ్డి ప్రభావంతో దేవేందర్ రెడ్డి 1982లో అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ)లో చేరారని తెలిపారు. “అప్పట్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న సిర్పూర్ స్క్వాడ్‌కు కమాండర్‌గా పనిచేస్తున్నాడు. దేవేంద్రరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. సిర్పూర్ స్క్వాడ్‌లో మూడేళ్లు పనిచేసిన అతడిని అప్పటి డీసీఎం కాకటం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ఆదేశాల మేరకు అహేరి స్క్వాడ్‌కు బదిలీ చేశారు.
తమిళనాడులో దారుణం.. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య..?
తమిళనాడులో దారుణం. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులు, కుటుంబసభ్యులు సూచన మేరకే ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు మోహన్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ రాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్ రాజ్.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో. శవాగారంలో వద్ద పని చేస్తున్నాడు. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబసభ్యులు, బందువుల కోరిక మేరకు సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు తెలిపాడు. దీనికి మోహన్ రాజ్ ఐదు వేల రూపాయలను తీసుకుంటున్నట్లు వీడియో వెల్లడించాడు. చెన్నై, బెంగళూరులో కూడా ఈ తరహా పనులు చేసినట్లు మోహన్ రాజ్ పేర్కొన్నాడు. మద్యం మత్తులో తాను అలా మాట్లాడినట్లు మోహన్ రాజ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. మోహన్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నెల 18న మోహన్ రాజ్ మద్యం మత్తులో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడులో వైరల్ గా మారింది. దీంతో ఇలాంటి ఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు 18 మంది నకిలీ డాక్టర్లతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అన్నం వండలేదని బాలింతను కొట్టి చంపిన భర్త
ఢిల్లీ సమీపంలోని భల్స్వా డెయిరీ ప్రాంతంలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్య భోజనం వండడం లేదని, ఇంటి పనులు సమయానికి చేయలేదని అనారోగ్యంతో ఉన్న భార్యను భర్తే హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి భర్త పేరు భజరంగీ గుప్తా. భజరంగీ, ప్రీతి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత ఇద్దరి మధ్య చీటికి మాటికి గొడవలు వచ్చేవి. ఆ సమయంలో ప్రీతిని భజరంగి ఎప్పుడూ కొట్టేవాడు. ప్రీతికి మూడు నెలల క్రితం పాప పుట్టింది. ప్రసవం కారణంగా ప్రీతి బలహీనంగా ఉంది. దీంతో ఆమె ఇంట్లో పనులు చేయలేకపోతుంది. దీనిని ఆమె భర్త తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇంటిపనులు చేయడం ఇష్టం లేదని ఆమె బద్ధకం నటిస్తుందని భర్త ఆరోపిస్తూ ఉండేవాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి ప్రీతి భర్తకు భోజనం సిద్ధం కాలేదు. దీంతో కోపోద్రిక్తుడైన భజరంగీ తన భార్య ప్రీతితో గొడవకు దిగాడు. ఆ తర్వాత కోపోద్రిక్తుడైన భజరంగి తన భార్యను చెక్క కర్రతో కొట్టడం ప్రారంభించాడు. దాడిలో ప్రీతి తీవ్రంగా గాయపడి నేలపై పడిపోయింది. ఆ తర్వాత భజరంగీ ఇంటి నుంచి పారిపోయాడు. బంధువులు ప్రీతిని బురారీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రీతి తల్లి వాంగ్మూలాన్ని నమోదు చేసి కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు భజరంగీని వెతికి పట్టుకున్నారు.
పేరుకే ఆల్ రౌండర్.. అసలు టీమ్ లో ఎందుకున్నాడో అర్థం కావడం లేదు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో చెన్నై సూపర్ కింగ్స్ తమ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. హోంగ్రౌండ్ లో తమకు ఓడించడం అంత సులువు కాదని సీఎస్కే మరోసారి నిరూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ సీఎస్కే బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం సీఎస్కే 18.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. డెవాన్ కాన్వే 77 పరుగులు నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించాడు. అయితే సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ వర్మ ( 34 ) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. దేశ్ పాండే, ఆకాష్ సింగ్, పతిరానా తలా వికెట్ సాధించారు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఇదిలా ఉంటే.. ఎస్ ఆర్ హెచ్ టీమ్ లో కీలక ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన సుందర్ బౌలింగ్ లో కూడా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు.