NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

బెజవాడలో ప్రైవేట్ బస్సు బోల్తా
విజయవాడలో ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది.. గొల్లపూడి సమీపంలో ఈ ఘటన జరిగింది.. విజయవాడ నుంచి హైదరబాద్ వైపు వెళ్తున్న BSR ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.. టిప్పర్ లారీ వచ్చి బస్సును ఢీ కొనడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.. ప్రమాద సమయంలో సుమారుగా 30 మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తోంది.. వీరిలో దాదాపు 20 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.. వారిని వెంటనే సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. ఇక, హైవేపై బస్సు బోల్తా పడటంతో.. భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో, క్రేన్ సహాయంతో బస్సును తొలగించారు అధికారులు.. ఈ ప్రమాదంలో డ్రైవర్, సహా పలువరు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు కావడంతో.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు చెబుతున్నారు.

హోం లోన్స్‌కు డిమాండ్‌ నిల్‌..! వీటికి మాత్రం ఫుల్..
కరోనా విజృంభణ తర్వాత తగ్గిన వడ్డీ రేట్లు.. ఆ తర్వాత మళ్లీ పెరుగుతూ పోతున్నాయి.. వాటి ప్రభావం లోన్లపై స్పష్టంగా కనిపిస్తుంది.. ఆ ఓవేదిక దీనిని స్పష్టం చేస్తోంది.. డిసెంబర్‌ త్రైమాసికంలో హోం లోన్స్‌కు డిమాండ్‌ తగ్గిపోయిందట.. కానీ, ఇదే సమయంలో అన్‌సెక్యూర్డ్‌ రుణాలైన క్రెడిట్‌ కార్డులు, పర్సనల్‌ లోన్స్‌కు డిమాండ్‌ పెరిగినట్టు క్రెడిట్‌ సమాచార కంపెనీ ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ పేర్కొంది.. క్రెడిట్‌ కార్డులు మాదిరి వినియోగ ఆధారిత ఉత్పత్తులను ఎక్కువ మంది ఉపయోగిస్తుండడంతో అన్‌సెక్యూర్డ్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు పేర్కొంది సిబిల్.. గత సంవత్సరంతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో గృహ రుణాల పంపిణీ మరియు డిమాండ్ తగ్గుదల కారణంగా వినియోగదారులు పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావం చూపాయి.. FY23 క్యూ3లో గృహ రుణాల పంపిణీ 6 శాతం తగ్గాయి. మే 2022 నుండి, ఆర్బీఐ తన బెంచ్‌మార్క్ రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు 6. 5 శాతానికి పెంచింది – బ్యాంకులు క్రమంగా రుణగ్రహీతలకు బదిలీ చేశాయి. కనిష్ట గృహ రుణ రేటు ఏడాది క్రితం 6. 5 శాతంతో పోలిస్తే ప్రస్తుతం 8. 5 శాతంగా ఉంది. ఇటీవలి త్రైమాసికాల్లో బ్యాంక్ క్రెడిట్ పెరుగుదలకు దారితీసిన రిటైల్ రుణాలు, క్రెడిట్ కార్డ్ అపరాధాలు చాలా పెరగడంతో ఎదురుగాలిని ఎదుర్కోవడం ప్రారంభించింది. వినియోగ ఆధారిత వ్యక్తిగత రుణ డిమాండ్ పెరుగుతూనే ఉన్నప్పటికీ, రుణగ్రహీతలు వినియోగదారుల మన్నికైన రుణాలు మరియు క్రెడిట్ కార్డుల బకాయిలను తిరిగి చెల్లించడంలో వెనుకబడి ఉన్నారని నివేదిక పేర్కొంది.

కొత్త డిగ్రీ కోర్సులకు నాలుగేళ్ల కాలవ్యవధి..?
డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్నీ అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యావిధానం-2020ని అనుసరించి, ఉన్నత విద్యలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. డిగ్రీ కోర్సులకు నైపుణ్యం మేళవించి రూపొందించాలని భావిస్తున్నారు. సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలకు తెలిపింది. ఇందులో భాగంగా యూజీసీ చైర్మన్ ఇటీవల పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఈ విషయమై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తో మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి చర్చించారు. ఆనర్స్ కోర్సులపై ఉన్నత విద్యామండలి త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చించాలని నిర్ణయించింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలనే యోచనలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.20లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో ఎంతవరకు నాలుగేళ్ల కోర్సులను ఇష్టపడతారనే దానిపై అధ్యయం చేయాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని .. అన్ని సదుపాయాలున్న కాలేజీల్లో తొలుత ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

20 ఏళ్ల క్రితం హత్య చేశా.. ఇప్పుడు కలలో వేధిస్తున్నాడు.. ఓ వ్యక్తి వింత ఆరోపణ
ఛత్తీస్‌గఢ్ లో ఓ వింత కేసు ఎదురైంది. తాను 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని హత్య చేశానని, అతను ఇప్పుడు కలలో వచ్చి హింసిస్తు్న్నాడంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బాలోద్ జిల్లాలో ఈ వార్త కలకలం రేపింది. సదరు వ్యక్తి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం, హత్యకు గురైన వ్యక్తిని పూడ్చి పెట్టిన స్థలం కోసం అధికారులు వెతుకులాట ప్రారంభించారు. బాలోద్ జిల్లాలోని కరక్‌భాట్ ప్రాంతానికి చెందిన టికం కొలియా అనే వ్యక్తి 2003లో ఛవేశ్వర్ గోయల్ అనే వ్యక్తిని హత్య చేసి అడవిలో పూడ్చి పెట్టానట్లు గ్రామస్తులతో చెప్పాడు. కాగా, ఛవేశ్వర్ ఇప్పుడు తన కలలో వచ్చి నిత్యం హింసిస్తున్నాడంటూ పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అతడు చెప్పిన వివరాలతో గ్రామ సమీపంలో తవ్వకాలు చేపట్టారు. అయితే మృతదేహం లభించలేదు. ఇదిలా ఉంటే కొలియారా మానసిక ఆరోగ్యం బాగా లేదని పోలీసులు అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ ఛవేశ్వర్ తండ్రి మాత్రం ఈ వ్యవహారంపై అధికారులను మరోసారి ఆశ్రయించారు. బుధవారం మరోసారి తవ్వకాలు జరిపిన అధికారులు ఓ డ్యామ్ పక్కన కొన్ని ఎముకలు, వస్త్రాలను గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల కోసం ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. మృతుడు తన భార్యకు స్నేహితుడని, అతడు తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే ఛవేశ్వర్ ను చంపానని కొలియారా తెలిపారు.

చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ ఢీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ఇవాళ ( శుక్రవారం ) కీలక మ్యాచ్ కు చెన్నై వేదికగా మారింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ కీలక లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ లో ఇది 29వ మ్యాచ్.. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారీ స్కోర్ సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. కానీ చివరకు ఆర్సీబీని 218 పరుగులకే కట్టడి చేసింది. 8 పరుగుల తేడాతో ఓడించింది. చెన్నైకి చెందిన ఓపెనర్ డేవిన్ కాన్వే దంచి కొట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే శివమోత్తాడు. ఆర్సీబీ బౌలర్ల భరతం పట్టారు. ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీం చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 192 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు 178 పరుగులకే పరిమితమై పోయింది. 14 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఎలాగైన సరే చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపొందాలని ఉవ్విళ్లూరుతుంది. మరో వైపు ఆర్సీబీని ఓడించి మంచి జోష్ మీదుంది చెన్నై టీమ్. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటి వరకు 18 మ్యాచ్ లు జరిగాయి. కాగా.. చెన్నై 13 సార్లు గెలిస్తే.. హైదరాబాద్ మాత్రం కేవలం 5 సార్లు మాత్రమే విజయం సాధించింది. మంచి బ్యాటింగ్ లైనఫ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆల్ రౌండ్ షోతో సీఎస్కేను కట్టడి చేస్తామంటూ ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ మార్ర్కమ్ పేర్కొన్నాడు.

ఆ హీరోయిన్ తో కలిసి మ్యాచ్ చూసిన యాపిల్ సీఈఓ
యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ ఐపీఎల్ మ్యాచ్ లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తో కలిసి మ్యాచ్ చూశాడు. టీమ్ కుక్ తో పాటు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు. యాపిల్ స్టోర్ల ప్రారంభం కోసం ఇండియాకు వచ్చిన కుక్.. ముంబయిలో తొలి స్టోర్ ను మంగళవారం ప్రారంభించారు. ఢిల్లీలో గురువారం రెండో స్టోర్ ను ప్రారంభించారు. ఆయన చివరిసారి 2016లో భారత్ లో పర్యటించారు. అప్పుడు కూడా ఐపీఎల్ మ్యాచ్ కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.\ ఏడు సంవత్సరాల తర్వత మళ్లీ భారత్ కు వచ్చిన టీమ్ కుక్ మరోసారి ఐపీఎల్ మ్యాచ్ చూశాడు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీని సైతం టీమ్ కుక్ కలిశాడు. దేశంలో మరిన్ని కంపెనీలు పెట్టేందుకు యాపిల్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత్ లో సాంకేతిక మార్పుల గురించి ప్రస్తావించారు. ఈ వృద్దిలో సహాయపడేందుకు యాపిల్ సంసిద్ధంగా ఉందని టీమ్ కుక్ స్పష్టం చేశారు.

బోనులోంచి తప్పించుకున్న సింహాలు.. భయంతో జనం పరుగోపరుగు
జూలో సింహాలు బోనులో ఉంటాయి కాబట్టి అవి చూడటానికి వెళ్లినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అవి బోనులో ఉన్నా వాటిని చూస్తేనే మనం వణుకుతాం. అలాంటిది బోనులో నుంచి తప్పించుకుని ఒక్కసారిగా బయట ఉన్న జనాలపైకి దూసుకొస్తే గుండె ఉన్న ఫళంగా ఆగినంత పనవుతుంది. ఇలాంటి ఘటనే చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌ లుయోయాంగ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. సర్కస్‌లో విన్యాసాలను వీక్షిస్తూ ఆనందిస్తున్న జనంపైకి ఎన్‌క్లోజర్‌ నుంచి తప్పించుకుని రెండు సింహాలు ఒక్కసారిగా దూసుకువచ్చాయి. దీంతో సర్కర్ వీక్షించేందుకు వచ్చిన వారంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు లంకించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సర్కస్‌ నిర్వాహకులు సింహాలతో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఓ రింగ్‌ లోంచి దూకేందుకు సింహాలు మొరాయించడంతో వాటితో బలవంతంగా విన్యాసాలు చేయించేందుకు ట్రైనర్లు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో సరిగా లాక్‌ చేయని డోర్‌ నుంచి రెండు సింహాలూ ఒక్కసారిగా బయటకు దూకాయి. దీంతో జనం భయంతో పరుగుతీశారు. అప్రమత్తమైన నిర్వాహకులు ఆ సింహాలను పట్టుకొని తిరిగి బోనులో బంధించారు. ఈ ఘటనతో సర్కస్‌ను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

కూతురితో అల్లు అర్జున్.. క్యూట్ వీడియో
సినిమాలతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. తన పిల్లలతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. ఆ వీడియోల్లో తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అల్లు అర్జున్ తన కూతురు అర్హల వీడియోలకు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ ఉంది. ఆ వీడియోలను చూసి నెటిజన్స్ వారికి ఫిదా అయిపోతారు. ఈ ఇద్దరూ కలిసి చేసే వీడియోలకు కూడా భారీ ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. వీరి కాంబోలో మరో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అల్లు అర్జున్ అర్హతో కలిసి కారులో వెళ్తూ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అర్హ అల్లు అర్జున్ ఒడిలో కూర్చుని ఉంది. తన చేతులతో ముఖాన్ని కనిపించకుండా చేసింది. దాంతో అల్లు అర్జున్ తన చేతులను తీయడానికి ప్రయత్నించగా అర్హ వద్దంటూ ప్రతిఘటించింది. ఇలా కాసేపు ఇద్దరూ అల్లరి చేశారు. ఈ వీడియోను బన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. అభిమానులు వీరి అల్లరిని చూసి ముచ్చట పడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ ఐకాన్ స్టార్ పుష్ప2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు.

Show comments