శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శన టోకెన్ల జారీ కేంద్రాలు మార్పు..
కలియుగ ప్రత్యక్షదైవం, కొలిచినవారి కొంగుబంగారం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.. తిరుమల శ్రీవారి దర్శన టోకెన్ల జారీ కేంద్రాలను మార్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలిపిరి నడకమార్గంలో జారీ చేసే దర్శన టోకెన్లు.. ఇకపై అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లోనే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.. ఇక, టోకెన్ పొందిన భక్తులు అలిపిరి నడకమార్గంలో 2083 మెట్టు దగ్గర స్కాన్ చేసుకుంటునే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.. మరోవైపు.. సర్వదర్శనం భక్తులకు విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ.. అయితే, శ్రీవారి మెట్టు నడకమార్గంలో టోకెన్ల జారీలో ఎలాంటి మార్పులు చేయలేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది.. 16 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.. ఇక, నిన్న శ్రీవారిని 67,687 మంది భక్తులు దర్శించుకున్నారు.. 25,090 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. గురువారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా ఉన్నట్టు టీటీడీ వెల్లడించింది.
టపాసులు కాల్చిన జేసీ అనుచరులు.. కేసు నమోదు
తాడిపత్రిలో టపాసులు కాల్చినందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులపై కేసు నమోదు అయ్యింది.. తాడిపత్రిలో గురువారం రాత్రి కాలేజీ గ్రౌండ్‌లో టపాసులు పేల్చారు జేసీ అభిమానులు.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాత్రి తన ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతుండగా టపాసులు అక్కడికి వచ్చి పడ్డాయట.. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు.. దీంతో.. టపాసులు కాల్చవద్దని జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు పోలీసులు.. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు మల్లికార్జున రెడ్డితో పాటు మరికొందరిపై 286, 290 r/w 34 ఐపీసీ సెక్షన్లు, 9 (B) (1) (b) ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే, టపాసులు కాల్చినా.. కేసు నమోదు చేయడం ఏంటి? అంటూ జేసీ అనుచరులు, టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. ఉద్దేశ్యపూర్వకంగానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదు చేశారని.. తప్పుడు కేసులు తమపై బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వేధింపులు, కేసులతో తమను అడ్డుకోలేరంటున్నారు.
“సాలిడ్ ప్యూయల్” బాలిస్టిక్ మిస్సైల్ ని పరీక్షించిన నార్త్ కొరియా..
ఉత్తర కొరియా మరో క్షిపణిని పరీక్షించింది. ‘‘సాలిడ్ ఫ్యూయల్’’ ఖండాంతర క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా శుక్రవారం వెల్లడించింది. అణు దాడిని ఎదుర్కొనే లక్ష్యంలో ఇది ముందడుగు అని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ‘‘హాసాంగ్-18’’ అనే పేరుతో పిలువబడే ఖండాంతర క్షిపణి తమ వ్యూహాత్మక సైనిక శక్తిని పెంచుతుందని, అణుదాడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందని కిమ్ అన్నట్లు కేసీఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది. రాజధాని ప్యాంగ్యాంగ్ ప్రాంతం నుంచి 1000 కిలోమీటర్ల మేర క్షిపణి వెళ్లినట్లు, మీడియం రేంజ్ అంతకన్నా ఎక్కువ రేంజ్ ఉన్న బాలిస్టిక్ క్షిపణిని లాప్టెడ్ ట్రాజెక్టరీలో ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం గురువారం గుర్తించింది. ఉత్తర కొరియా అణుక్షిపణులు అన్ని దాదాపుగా ద్రవ ఇంధనంతోనే పనిచేస్తాయి. అయితే భూమి, జలంతర్గాముల నుంచి ప్రయోగించే ఘన ఇంధన ఖండాంతర క్షిపణిని తయారు చేయాలనే చాలా కాలంగా పట్టుదలతో ఉన్నారు కిమ్. తాజాగా ప్రయోగంతో ఆయన కోరిక నెరవేరినట్లు అయింది.
మేము ఐక్యంగా ఉన్నాం… ప్రతిపక్షల ఐక్యతపై వ్యూహం
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. ఈ క్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ గురువారం సాయంత్రం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. ఢిల్లీలోని ఖర్గే ఇంటిలో కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. అక్కడ ప్రతిపక్షాలను ఏకం చేయడానికి వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ ముంబై నుండి మమ్మల్ని సందర్శించి మాకు మార్గనిర్దేశం చేసినందుకు తాను సంతోషిస్తున్నాను అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతిపక్షాలను ఐక్యంగా తాను, రాహుల్ గాంధీ, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌లతో చర్చించినట్లు వెల్లడించారు. దేశంలో ప్రతిపక్షాలను ఐక్యంగా ఉంచుతామని ఖర్గే అన్నారు. దేశంలో జరుగుతున్న సంఘటనలు.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడేందుకు… ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం, యువత ఉపాధికి ద్రవ్యోల్బణం వంటి అంశాలపై తాము ఒక్కటిగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఏందీ పాండ్యా ఇది.. చెత్త బ్యాటింగ్ తో అట్టర్ ప్లాప్
ఐపీఎల్2023లో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి మరో బాల్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్ మన్ గిల్ ( 67 ) కీలక ఇన్సింగ్స్ ఆడాడు. అతడితో పాటు తెవాటియా ( 2బంతుల్లో 5) కీలక సమయంలో ఫోర్ కొట్టి గుజరాత్ కు విజయాన్ని అందించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాటర్లలో షార్ట్ 36 పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లు, షమీ, జోషఫ్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఇక గుజరాత్ టైటాన్స్ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆ టీమ్ సారథి హార్థిక్ పాండ్యా మాత్రం తీవ్ర నిరాపరుస్తున్నాడు. గతేడాది అద్భుతంగా రాణించిన హార్థిక్.. ఈ సీజన్ లో మాత్రం బ్యాటింగ్-బౌలింగ్ లో దారుణంగా విఫలమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాండ్యా.. 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి డగౌట్ కి వెళ్లాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్ లో మూడు మ్యాచ్ లు ఆడిన అతడు 21 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హార్థిక్ ను నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదృష్టం బాగుంది కాబట్టి గెలుస్తున్నావు.. నీ చెత్త బ్యాటింగ్ తో కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గిల్ క్లీన్ బౌల్డ్.. ప్రీతీ జింటా కిరాక్ రియాక్షన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఈవెంట్ లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యా్చ్ లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలూండగానే టార్గెట్ ను ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్ మన్ గిల్ ( 67) అద్భుతమైన ఇన్సింగ్స్ ఆడాడు. కాగా గుజరా్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుుగులు అవసరమవ్వగా… ధావన్ సామ్ కర్రన్ చేతికి బంతిని ఇచ్చాడు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీసి గిల్ కు స్ట్రైక్ ఇచ్చాడు. అయితే సామ్ కర్రన్ వేసిన అద్భుతమైన బాల్ కి శుబ్ మన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ డగౌట్ మొత్తం సంబరాల్లో మునిగి తేలిపోయింది. ముఖ్యంగా స్టాండ్స్ నుంచి మ్యాచ్ ను వీక్షిస్తున్న పంజాబ్ కింగ్స్ సహ యాజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా అనందానికి అవధులు లేకుండా పోయాయి. శుబ్ మన్ గిల్ ఔటైన వెంటనే ప్రీతి జింటా.. బాలీవుడ్ నటులు అర్భాజ్ ఖాన్, సోనూ సూద్ లతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకుంది. అయితే ఆమె ఆనందం ఎక్కువ సేవు నిలవలేకపోయింది. ఆ తర్వాత రెండు బంతుల తర్వాత తెవాటియా ఫోర్ కొట్టి పంజాబ్ కు ఓటమిని మిగిల్చాడు. కాగా ప్రీతి జింటా రియాక్షన్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.