NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రాష్ట్ర పండుగగా తిరుపతి గంగమ్మ జాతర.. ఏమిటా ప్రత్యేకతా..?
తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక నుంచి గంగమ్మ జాతరను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. గత ఏడాది ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు గంగమ్మ ఆలయాన్ని సందర్శించి.. అమ్మవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా గంగమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. ఇక, ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకున్న సర్కార్‌.. గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా పేర్కొంది.. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో గంగమ్మ జాతర అత్యంత వైభవం జరుపనున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే భూమన.

దళితుడిననే కదా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు.. డిప్యూటీ సీఎం ఆవేదన..
డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. జ్ఞానేంద్రరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉన్నాను.. దళితుడిననే కదా నన్ను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. తాను తప్పు చేయను.. తప్పుచేస్తే కాళ్లమీద పడతాను అన్నారు.. తాను పుట్టినప్పటి నుంచి పెత్తందార్లకు వ్యతిరేకినని.. ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్తానన్నారు.. అయితే, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డిలా తాను పార్టీలు మారలేదని, అమెరికా, బెంగళూరుల్లో వ్యాపారాలు చేసుకుంటూ.. మిగిలిన సమయంలో నియోజకవర్గంలో తిరగడం లేదు అని సెటైర్లు వేశారు. నామీద ఆయనకు ఎందుకింత కక్ష? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన ఇంట్లోవాళ్లందరికీ పదవులు ఇస్తేనే పార్టీలో అందరినీ కలుపుకుని పోయినట్లా? లేకపోతే లేదా’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

సికింద్రాబాద్‌లో దారుణం.. భర్త కళ్లముందే భార్య హత్య..
సికింద్రాబాద్ మహాంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధ రాత్రి దారుణం చోటుచేసుకుంది. రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. యాచకురాలి పక్కనే భర్త కూడా ఉండటం గమనార్హం. భర్త చూస్తుండగానే భార్యపై బండరాయి వేసి హత్య చేశాడో వ్యక్తి. భర్త భయంతో అరుస్తున్నా తన చేయిపట్టుకుని ముందుకు లాగి ఆమెపై బండరాయి వేశాడు. దాంతో ఆమె బాధతో విలవిల లాడింది. తీవ్రంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మహిళా మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి భర్త కళ్లముందే భార్యను హతమార్చుతున్న భర్త ఎందుకు ఆపలేదు? హత్యతో భర్తకు ఏమైనా సంబంధం ఉందా? లేక గుర్తు తెలియని వ్యక్తి ఒక యాచకురాలిని చంపేంత కసి ఏముంది? భర్త పక్కనే ఉండగా ఏ ధైర్యంతో ఆమెను హతమార్చాడు. భర్తే ఆమెను చంపేందుకు ప్లాన్‌ వేశాడా? లేక హతమార్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉండి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? అనే కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నితీష్ తో కేజ్రీవాల్ భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ!
కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరు కలిసి కట్టుగా ఉండి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు వేశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిహార్ సీఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను కలిశారు. ఢిల్లీలో జరిగిన వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భేటీ జరిగింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీల ప్రధానమైన ఊహాగానాలకు దారితీసింది.

భారత్‌లో ధనిక సీఎంల జాబితా.. నంబర్‌ వన్‌ వైఎస్‌ జగన్‌..
భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో ఓ నివేదిక తేల్చేసింది.. అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు? ఏడీఆర్ సర్వే రిపోర్ట్ ప్రకారం అత్యల్ప మొత్తం ఆస్తులున్న సీఎం ఎవరు? కూడా తేలిపోయింది.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని ముఖ్యమంత్రులందరి ఆర్థిక స్థితిపై వారి తాజా నివేదికను విడుదల చేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం మొత్తం రూ.510 కోట్ల ఆస్తులతో రాష్ట్ర ప్రభుత్వాల సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు.. ఇక, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.163 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఉండగా.. ఆయన ఆస్తుల విలువ రూ.63 కోట్లుగా ఉంది.. 30 మంది ముఖ్యమంత్రులు, 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 29 మంది కోటి రూపాయలకు పైగా ఆస్తులున్న కోటీశ్వరులే. కోటి రూపాయల లోపు ఆస్తులున్న ఏకైక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ సీఎం అయిన ఆమె ఆస్తులు రూ. 15 లక్షలు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విశ్లేషించిన పోల్ అఫిడవిట్ల ప్రకారం, 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రులలో ఇరవై తొమ్మిది మంది కోటీశ్వరులు, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జగన్ మోహన్ రెడ్డి అత్యధికంగా రూ.510 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. విశ్లేషించిన 30 మంది సీఎంలలో 29 మంది అంటే 97 శాతం కోటీశ్వరులని, ప్రతి సీఎంకు సగటు ఆస్తులు రూ.33.96 కోట్లు అని ADR పేర్కొంది.

గుడ్‌న్యూస్‌ చెప్పిన గూగుల్‌ పే.. ఇక, ఆ సేవలు ఫ్రీ
ఏ బ్యాంకు నుంచైనా ఏ లోన్‌ తీసుకోవాలనుకున్నా.. మొదట సంబంధిత వ్యక్తి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి? అనేది ప్రతీ బ్యాంకు పరిశీలిస్తోంది.. అందులో కీలక భూమిక పోషించేది సిబిల్‌ స్కోర్‌.. ఏ బ్యాంక్‌ అయినా దరఖాస్తుదారుడి ట్రాక్‌ రికార్డ్ కోసం సంబంధిత వివరాలతో సిబిల్‌ స్కోర్‌ చెక్‌ చేస్తుంది. ఇక, కొన్ని వెబ్‌సైట్లు ఈ సేవల కోసం ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటాయి.. ఇటీవల కాలంలో చాలా వెబ్‌సైట్లు, యాప్‌లు సిబిల్‌ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అందులో ఒకటి చాలా మంది తరచుగా ఉపయోగించే యాప్ గూగుల్‌ పే. తన యూజర్లకు సిబిల్‌ సేవలను ఉచితంగా అందిస్తోంది గూగుల్‌ పే..

మొసలిపై దాడి చేసిన భార్య.. ప్రాణాలతో బయటపడ్డ భర్త..
మొసలి నోటికి చిక్కన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళ వీరోచితంగా పోరాడింది. భర్త కాళ్లను నోటీతో పట్టుకుని.. నీటిలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసిన మొసలి పైనే దాడి చేసింది. ధైర్యంగా మొసలిని ఎదుర్కొని క్రూర జంతువు నుంచి తన భర్త ప్రాణాలను కాపాడింది ఓ మహిళ. అవునండీ ఇది నిజం.. రాజస్థాన్ లోని కరౌలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మండరాయల్ సబ్ డివిజన్ పరిధిలో నివాసం ఉండే బనీసింగ్ మీనా ఓ మేకల కాపరి. అతని భార్య విమలాబాయ్. మంగళవారం.. ఇద్దరు కలిసి మేకలను మేపేందుకు చంబల్ నది తీర ప్రాంతానికి వెళ్లారు. అనంతరం వాటికి నీళ్లు తాగించేందుకు బనీసింగ్ మీనా.. నది వద్దకు వెళ్లాడు. దీంతో తనకు కూడా దాహం వేయడంతో నది దగ్గరకు వెళ్లి రెండు దోసిళ్లతో నీళ్లు పట్టుకుని తాగబోయాడు.. అంతే నీటి మాటు నుంచి ఒక్కసారిగా మొసలి అతని మీదకు దూకింది.. వెంటనే బనీసింగ్ పై దాడి చేసింది. అతడి కాలిని పట్టుకుని నోట కరుచుకుని నీటి లోపలికి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడే బిత్తరపోయిన బనీసింగ్ మీనా గట్టిగా కేకలు వేయడంతో.. కాస్త దూరంలో ఉన్న విమలాబాయి. భర్త కేకలు వినింది. పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది.. అతని పరిస్థితిని చూసి బిత్తరపోయింది. వెంటనే తేరుకుని.. నది దగ్గరికి వెళ్లి చేతిలో ఉన్న కర్రతో మొసలిపై దాడి చేసింది. దాని తలపై పదే పదే కొట్టడంతో అది కాసేపటికి బనీ సింగ్ మీనా కాలు వదిలేసి నీటిలోకి పారిపోయింది.

రుద్ర తాండవం చేసినట్లుంది..
మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా, తమిళ ప్రజల బాహుబలిగా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది పొన్నియిన్ సెల్వన్ 2. ఇతర భాషల్లో PS-2 గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా PS-2 నుంచి ‘శివోహం’ అంటూ సాగే మూడో సాంగ్ రిలీజ్ అయ్యింది. జగత్ గురువు అదిశంకరా చార్యులు రాసిన ‘నిర్వాణ శతకం’ నుంచి శివోహం చాంటింగ్ ని తీసుకోని వాటికి పాట రూపం ఇచ్చాడు రెహమాన్. నిర్వాణ శతకం నుంచి పుట్టిన ఈ పాట లిరిక్స్ కి, రెహమాన్ కంపోజ్ చేసిన గూస్ బంప్స్ ఇచ్చే ట్యూన్ కి ప్రాణం పోసారు సింగర్స్. సత్య ప్రకాష్, నారాయణన్, శ్రీకాంత్ హరిహరన్, నివాస్, అరవింద్ శ్రీనివాస్, బాగారాజ్, అయ్యప్పన్ ల వోకల్స్ ‘శివోహం’ సాంగ్ ని ఈ జనరేషన్ వాళ్లు కూడా పాడుకునేలా చేసింది. అఘోరాలు, శివ సాధువులు ఉన్న ఈ విజువల్స్ చూస్తే అరుణ్ మొలి చనిపోయాడు అనే వార్త చోళ రాజ్యంలో స్ప్రెడ్ అయిన తర్వాత ‘మధురాంతకన్’ సింహాసనం అధిరోహించే వారసుడిగా ఎన్నిక అయ్యే సీన్ లా కనిపిస్తోంది. ఈ సీన్ తర్వాతే అరుణ్ మొలి చనిపోలేదు అని తెలియడం రివీల్ అవుతుంది. ఓవరాల్ గా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా సాంగ్స్, ట్రైలర్ తో అయితే మెప్పించింది. మరి ఏప్రిల్ 28న థియేటర్స్ లో సినీ అభిమానులని ఎంత వరకూ ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. పొన్నియిన్ సెల్వన్ 1 తరహాలో పార్ట్ 2 సక్సస్ కూడా తమిళనాడుకి మాత్రమే పరిమితం అవుతుందా? లేక పాన్ ఇండియా హిట్ గా పొన్నియిన్ సెల్వన్ 2 నిలుస్తుందా అనేది చూడాలి.

సోదరుడిపై పరువు నష్టం కేసు.. 100 కోట్ల దావా వేసిన బాలీవుడు నటుడు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన సోదరుడిపై పరువు నష్టం కేసు వేశాడు. రూ.100 కోట్ల దావా వేశాడు. ఈ ఇద్దరు సోదరుల మద్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని సోదరుడు షమాసుద్దీన్‌లు తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఎలాంటి వ్యాఖ్యలను పోస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ.. పరువు నష్టం కలిగించే ప్రకటనలను పోస్ట్ చేసినందుకు తన సోదరుడి నుండి రూ. 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కోర్టును ఆశ్రయించాడు. ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావాను విచారిస్తున్నప్పుడు జస్టిస్ ఆర్‌ఐ చాగ్లాతో కూడిన సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది. మే 3న తమ న్యాయవాదులతో కలిసి తన ఛాంబర్‌లో ఉండాల్సిందిగా సోదరులను ధర్మాసనం ఆదేశించింది.