NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు టీడీపీ పొలిట్‌ బ్యూరో భేటీ.. మిషన్ -2029కు ప్రణాళికలు!

ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ కానుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మిషన్ -2029కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది టీడీపీ. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే అంశంపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీకి పడిన ఓట్లను సుస్థిరం చేసుకునేలా రూపొందించుకోవాల్సిన కార్యాచరణపై పొలిట్ బ్యూరోలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ద్రోహులు రాజకీయాల్లో ఉండకూడదనే నినాదంతో పొలిట్ బ్యూరోలో యాక్షన్ ప్లాన్ సిద్దం చేసే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులపై ప్రస్తావించనున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ పొలిట్ బ్యూరో ఫోకస్ పెట్టనుంది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. దీనికి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. నామినేటెడ్ పదవులు, శ్వేత పత్రాలు, సంస్థాగత వ్యవహారాల వంటి ఆరు అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చర్చిస్తారని సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పొలిట్ బ్యూరో సమావేశం ఇదే కావడం గమనార్హం.

 

నేడు వైసీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ
నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండో రోజు ప్రజా ప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పెందుర్తి, నర్సీపట్నం,పాయకరావుపేట నియోజకవర్గాల వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును వైఎస్‌ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. బొత్స గెలుపుపై ఎంపీటీసిలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో వైఎస్‌ జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో వేర్వేరుగా సమావేశమ­య్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచినవారు, పోటీచేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారని జగన్‌ చెప్పుకొచ్చారు. బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలని నేతలను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యా బలం లేదని.. నైతికలు విలువలు పాటిస్తే గనుక టీడీపీ పోటీ పెట్టకూడదని ఆయన అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే.. విలువలు పాటిస్తూ పోటీకి పెట్టే వాళ్ళం కాదన్నారు. సంఖ్యాబలం లేదని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతోందన్నారు. 380 పైచిలుకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీకి పోటీకి దిగుతోందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడని.. రాజకీయాల్లో విలువలను మరింత దిగజారుస్తున్నాడని ఆరోపించారు. విలువులు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఇవి వదులుకున్నప్పుడు ప్రజలకే కాదు, మన ఇంట్లోకూడా మనకు విలువ తగ్గుతుందన్నారు.

 

రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం..
తెలంగాణ రాష్ట్రంలో మెటీరియల్‌ సైన్స్‌ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన కార్నింగ్‌ ఇన్‌ కార్పొరేటేడ్‌ కంపెనీ తన కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎమర్జింగ్‌ ఇన్నొవేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోనాల్డ్‌ వెర్క్లీ రెన్‌ ఆధ్వర్యంలోనే కార్నింగ్‌ ప్రతినిధుల బృందంతో చర్చల అనంతరం అవగాహన ఒప్పందాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఓప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు చేశారు. ఫార్మాస్యూటికల్ మరియు కెమికల్ రంగాలలో తెలంగాణను అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడంలో కార్నింగ్ భాగస్వామిగా పనిచేస్తుంది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటుపై చర్చలు జరిగాయి. 2025 నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (FCT) హబ్‌లో కార్నింగ్ కంపెనీ కూడా పాల్గొంటోంది. కార్నింగ్ కంపెనీ ఔషధ, రసాయన పరిశ్రమలలో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీకి గణనీయంగా దోహదపడుతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన అధునాతన ఫ్లో రియాక్టర్ల సాంకేతికతను కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధుల బృందానికి వివరించారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ గాజు ట్యూబ్ లను ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. వీటిని తయారు చేయడానికి కంపెనీ వినూత్న వేగంతో కూడిన గాజు-పూత సాంకేతికతను ఉపయోగిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగం ఉత్పాదకతను ఈ కొత్త సదుపాయం మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. మరోవైపు వివింట్ ఫార్మా ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ బృందం సమావేశమైంది. రూ. 400 కోట్లు, కంపెనీ విస్తరణకు ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టబుల్స్ తయారీ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు వివింట్ ఫార్మా తెలిపింది.

 

నేడు లోక్‌సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై రాజకీయ వేడి నిరంతరం పెరుగుతోంది. కాగా, ఈరోజు లోక్‌సభలో మోడీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ఉదయం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఒకవైపు ఈ బిల్లును ఆమోదించేందుకు ఎన్డీయే అన్ని విధాలా ప్రయత్నిస్తుండగా మరోవైపు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 1995 నాటి వక్ఫ్ చట్టాన్ని ప్రభుత్వం సవరించనుంది. కొత్త బిల్లులో ప్రభుత్వం అనేక సవరణలు చేయవచ్చు. వక్ఫ్ బోర్డులో సంస్కరణలకు సంబంధించిన ప్రభుత్వ బిల్లు కాపీని విడుదల చేశారు. వక్ఫ్‌కు సంబంధించిన రెండు బిల్లులను ప్రభుత్వం పార్లమెంటులో తీసుకురానుంది. ముస్లిం వక్ఫ్ చట్టం 1923 బిల్లు ద్వారా రద్దు చేయబడుతుంది. రెండో బిల్లు ద్వారా వక్ఫ్ చట్టం 1995లో ముఖ్యమైన సవరణలు చేయనున్నారు. సవరణ బిల్లు 2024 ద్వారా ప్రభుత్వం 44 సవరణలు చేయబోతోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నిర్వహణ మెరుగ్గా ఉండటమే ఈ బిల్లును తీసుకురావడమేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లుతో ప్రభుత్వం మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తుంది. సెంట్రల్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఇద్దరు మహిళలు ఉండటం తప్పనిసరి. వక్ఫ్ నమోదు ప్రక్రియ సెంట్రల్ పోర్టల్, డేటాబేస్ ద్వారా క్రమబద్ధీకరించబడుతుంది. దీనితో పాటు, ఇద్దరు సభ్యులతో ట్రిబ్యునల్ నిర్మాణంలో సంస్కరణ, ట్రిబ్యునల్ ఆదేశాలపై హైకోర్టులో అప్పీల్ చేయడానికి తొంభై రోజుల వ్యవధి కూడా ఉంటుంది. ఇందులో వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 40 తొలగించబడుతోంది. దీని ప్రకారం వక్ఫ్ బోర్డుకు ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే హక్కు ఉంది. వక్ఫ్ చట్టం 1995 ఇంటిగ్రేటెడ్ వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత, అభివృద్ధి చట్టం, 1995గా పేరు మార్చబడుతుంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లింలు, ముస్లిమేతరులకు సరైన ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ చట్టం ముస్లిం వర్గాలలోని ఇతర వెనుకబడిన తరగతులను ప్రభావితం చేస్తుంది. షియా, సున్నీ, బోహ్రా, అగాఖానీలకు ప్రాతినిధ్యం కల్పించబడుతుంది. వక్ఫ్ ఆస్తులను సర్వే చేసేందుకు సర్వే కమిషనర్‌కు ఉన్న అధికారం కలెక్టర్ లేదా కలెక్టర్ నామినేట్ చేసిన డిప్యూటీ కలెక్టర్‌కు ఉంటుంది. ఔకాఫ్‌కు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంటుంది. ఏదైనా ఆస్తిని వక్ఫ్‌గా నమోదు చేసే ముందు, సంబంధిత అందరికీ సరైన నోటీసు ఇవ్వాలి. వక్ఫ్ కౌన్సిల్‌లో ఒక కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ముస్లిం సంస్థల ప్రతినిధులు, ముగ్గురు ముస్లిం న్యాయ నిపుణులు, ఇద్దరు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, ప్రఖ్యాత న్యాయవాది, నలుగురు జాతీయ ఖ్యాతి, అదనపు లేదా జాయింట్ సెక్రటరీలు ఉంటారు. వారిలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి.

 

నక్లెస్ రోడ్డులో గద్దర్ స్మృతి వనం.. సర్కార్ కీలక నిర్ణయం
ప్రముఖ రచయిత, సంగీత విద్వాంసుడు, నృత్యకారుడు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కోట్లాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గతేడాది ఆగస్టు 7న తుదిశ్వాస విడిచారు. ప్రత్యేక తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాడుతూ ఎన్నో పాటలు రాసి పాడారు. గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న యాది పేరుతో జరిగిన ఈ సభకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దర్ ఉద్యమ స్ఫూర్తి అని, ఆయన ఆలోచనా విధానాన్ని ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తామన్నారు. జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి మలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామ గ్రామాన తిరుగుతూ తన నాటకాలు, పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. అణగారిన, అణగారిన వర్గాల విముక్తి కోసం, అందరికీ సమాన న్యాయం, సమానత్వం కోసం పోరాడాలని ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నాం. భవిష్యత్తులోనూ గద్దర్ ఆశయాలను కొనసాగిస్తాం.. నక్లెస్‌ రోడ్డులో గద్దర్‌ స్మృతి వనం నిర్మిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ పరిశోధనల కోసం ఒకటిన్నర ఎకరం భూమిని కేటాయిస్తాం. అంతేకాదు ఆయనపై పరిశోధనలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తుంది. ప్రజా ఉద్యమాలకు ఆయన దిక్సూచి’. ఆయన లేని లోటు తీర్చలేనిదని నివాళులర్పించారు.

 

బంగ్లాలో నేడే తాత్కాలిక సర్కారు
బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్‌ గ్రహీత మహ్మద్‌ యూనస్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహ్మద్ యూనస్ గురువారం మధ్యాహ్నం 2:10 గంటలకు బంగ్లాదేశ్ చేరుకుంటారు.. రాత్రి 8 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవానికి 400 మంది హాజరుకావచ్చు. మహ్మద్ యూనస్ సలహా మండలిలో 15 మంది సభ్యులు ఉండవచ్చు. ఈ సలహా మండలి సలహాతోనే బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ అధికారంలో ఉంటాడు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు, నాలుగు రోజుల్లో బంగ్లాదేశ్ లో పరిస్థితి చక్కబడుతుందని వారు భావిస్తున్నారు. ప్రొఫెసర్ యూసుఫ్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తానన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు. ప్రొఫెసర్ యూసుఫ్ ప్రభుత్వాన్ని నడిపించాలని అందరూ అంగీకరిస్తారు. 84 ఏళ్ల యూనస్‌కు సైన్యం అన్ని విధాలా సాయం చేస్తుందని జనరల్ జమాన్ తెలిపారు. బంగ్లాదేశ్‌లోని హింసాకాండను దృష్టిలో ఉంచుకుని, షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, హింసాత్మక ప్రభుత్వ వ్యతిరేక నిరసనల తర్వాత దేశం విడిచిపెట్టి ఢిల్లీలో ఆశ్రయం పొందారు. ఇదిలావుండగా, ప్రొఫెసర్ యూనస్ ప్రస్తుతం పారిస్‌లో ఉన్నారు,. అతను గురువారం ఢాకాకు తిరిగి వస్తున్నాడు. ఈలోగా ప్రొఫెసర్ యూసుఫ్ అందరూ ప్రశాంతంగా ఉండాలని ఓ మెసేజ్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌ను సుభిక్షంగా మారుస్తామన్నారు. ప్రతి ఒక్కరూ హింసను విడనాడి కొత్త బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) అధ్యక్షురాలు, మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. ఖలీదా జిల్లా దేశానికి ఒక వీడియో సందేశాన్ని కూడా జారీ చేసింది. ప్రతి ఒక్కరూ హింసను విడనాడి శాంతిని కాపాడాలని ఖలీదా జిల్లా విజ్ఞప్తి చేసింది. శాంతి ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో హింసాకాండ కొనసాగుతోంది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి చెందిన కనీసం 29 మంది మద్దతుదారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో బంగ్లాదేశ్‌లో మృతుల సంఖ్య 469కి చేరింది. హింసాకాండ తర్వాత అక్కడ హిందూ మైనారిటీలపై హింస కొనసాగుతోంది. హింస బాధితులు, హిందూ మైనారిటీ, అవామీ లీగ్ మద్దతుదారులు భారత సరిహద్దు వద్ద గుమిగూడారు. భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ జల్పైగురిలో ప్రజలను బీఎస్ఎఫ్ సైనికులు సరిహద్దులో అడ్డుకున్నారు.

 

టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ ఇంట్లో తీవ్ర విషాదం!
టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) కన్నుమూశారు. గత కొంత కాలంగా కాన్సర్ మహమ్మారితో పోరాడిన ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తే వరలక్ష్మి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి లాంటి హిట్ సినిమాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ప్రస్తుతం ‘జబర్దస్త్’ కామెడీ షోకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఢీ, క్యాష్, స్టార్ మహిళ వంటి పలు ఎంటర్టైన్మెంట్ షోలకి కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు. కొత్త నటీనటులను ప్రోత్సహించడంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎప్పుడు ముందుంటారు. అందుకే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. జబర్దస్త్ షోలో చేసిన చాలామంది ప్రస్తుతం సినిమాల్లో చేస్తున్నారు.

 

నేడే అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌..పెళ్లికూతురు ఎవరంటే..?
అక్కినేని నాగచైతన్య ఎంగేజ్ మెంట్ ఈ రోజు అతికొద్ది మంది సమక్షంలో జరగనుంది. నాగచైతన్య త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్టు అక్కినేని యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ వార్త టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తన సినీ కెరిరీ లో మెుదటి హిట్ సినిమా ఏమాయ చేసావేలో చైతన్యకు జోడిగా నటించిన సమంతతో 2017 అక్టోబరు 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కాని ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అభి ప్రాయబేధాల కారణంగా ఇరువురు పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తరువాత అదే అక్టోబరులో విడిపోతున్నట్టు ప్రకటించారు. వీరి విడాకులపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. సమంతాదే తప్పని కొందరు వాదిస్తే కాదు చైతన్యదే తప్పని కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు నడిచాయి. అయితే సమంతతో వైవాహిక జీవితానికి శుభం కార్డు పడిన తర్వాత నాగ చైతన్య. శోభితా ధూళిపాళ్ళ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. నేడు వాటిని నిజం చేస్తూ ఆ జంట ఒక్కటి కాబోతుందని తెలుస్తోంది. ఇరు కుటుంబాలు అంగీకారం మేరకు, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం జరగనబోతుందని సమాచారం. ఈ కార్యక్రమానికి మీడియా అనుమతించ లేదు. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్ధం విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారకంగా ప్రకటించి నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోనున్నరని తెలుస్తోంది. అక్కినేని కుటంబానికి కోడలిగా రాబోతున్న శోబిత గతంలో ఫెమినా మిస్ ఎర్త్ 2016 గా నిలిచింది. అలాగే గూడాచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్,కురుప్ వంటి సినిమాలలో కథానాయకగా నటించింది.

 

వినేశ్‌ ఫొగాట్‌ షాకింగ్‌ నిర్ణయం.. నేను ఓడిపోయా అంటూ..!
భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు వినేశ్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. గురువారం ఉదయం ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా తెలిపారు. ఓవర్ వెయిట్ కారణంగా పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 ఫైనల్‌లో ఆడకుండా అనర్హత వేటు పడడంతో నిరుత్సాహానికి గురైన వినేష్.. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పారు. ‘కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. రెజ్లింగ్‌కు గుడ్‌బై (2001-2024). నేను మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను క్షమించండి’ అని ఎక్స్‌లో వినేశ్‌ ఫొగాట్‌ రాసుకొచ్చారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరిన వినేశ్‌.. అనూహ్య రీతిలో అదనపు బరువుతో బుధవారం అనర్హతకు గురైన విషయం తెలిసిందే. తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ కోర్ట్‌ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను వినేశ్‌ ఫొగాట్‌ ఆశ్రయించారు. తాను సిల్వర్‌ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై కోర్ట్‌ ఆఫ్ ఆర్భిట్రేషన్‌ తీర్పు వెలువడించాల్సి ఉంది. ఇక స్వర్ణ పతక రేసులో ఉన్న వినేశ్‌పై అనర్హత వేటును ప్రతి భారత అభిమాని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఒలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే.. అత్యంత ముఖ్యమైన రోజు! పతకాలు పక్కా
పారిస్ ఒలింపిక్స్ 2024లో 13వ రోజు కొనసాగుతోంది. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ 3 పతకాలు మాత్రమే సాధించింది. ఈ మూడు పతకాలు కూడా షూటింగ్‌లో సాధించినవే. అయితే ఈరోజు పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో బంగారు పతకం కోసం గురువారం పోటీ పడబోతున్నాడు. అన్నీ కలిసొస్తే స్వర్ణం, లేదా ఏదో ఒక పతకం అయినా నీరజ్‌ గెలుస్తాడని అంచనా.
హాకీలో భారత పురుషుల జట్టు కాంస్య పతక పోరులో స్పెయిన్‌తో తలపడనుంది. భారత్ ఫామ్ చూస్తే కాంస్యం ఖాయంగా కనబడుతోంది. ఈరోజు భారత్‌కు అత్యంత ముఖ్యం అని చెప్పొచ్చు. నేడు అథ్లెటిక్స్, గోల్ఫ్, రెజ్లింగ్, హాకీ మ్యాచ్‌లు జరగనున్నాయి. నేటి పూర్తి భారతీయ షెడ్యూల్ తెలుసుకోండి.
నేటి భారత షెడ్యూల్ ఇదే:
గోల్ఫ్:
మహిళల వ్యక్తిగతం: అదితి అశోక్ మరియు దీక్షా దాగర్ – మధ్యాహ్నం 12.30
అథ్లెటిక్స్:
మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపెచేజ్ రౌండ్: జ్యోతి యారాజీ – మధ్యాహ్నం 2.05
పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా – రాత్రి 11.55
రెజ్లింగ్:
పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలు (ప్రీ క్వార్టర్ ఫైనల్): అమన్ సెహ్రావత్ – 2.30 మధ్యాహ్నం
మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీలు (ప్రీ-క్వార్టర్ ఫైనల్): అన్షు మాలిక్ – మధ్యాహ్నం 2:30\
హాకీ:
పురుషుల కాంస్య పతక మ్యాచ్: భారత్ vs స్పెయిన్: సాయంత్రం 5.30