తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, చర్ల, ఖమ్మంలోని మణుగూరు సహా పలు చోట్ల భూమి కంపించింది. అదేవిధంగా ఏపీలోని విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం, కృష్ణా జిల్లాలో భూమి కంపించింది.. 2 సెకన్ల పాటు కంపించిన భూమి పరిసర గ్రామాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. ఒకవైపు వర్షాలు, చలితో ప్రజలు బయటకు వచ్చేందుకు నానా అవస్థలు పడుతుంటే.. మరోవైపు భూకంపంతో బయటకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారికంగా సమాచారం. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఏపీ సెంటర్ నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుండి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నేడు సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్‌ను ప్రయోగిస్తున్నారు. నింగిలోకి 2 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహాలు వెళ్లనున్నాయి. ఒక్కో ప్రోబా-త్రీ ఉపగ్రహం బరువు 550 కేజీలు ఉన్న వాటిని భూ కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. 2 ఉపగ్రహాలు సూర్యునిపై పరిశోధనలు చేయనున్నాయి. ఇందులో ఓకల్టర్ శాటిలైట్ (ఓఎస్సీ), కరోనా గ్రాస్ శాటిలైట్ (సీఎస్సీ ) అనే రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. రాకెట్ సహా మొత్తం 320 టన్నులను నింగిలోకి పంపబోతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం లభిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో టీం ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో అధికారులు రాకెట్ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. ప్రోబా-3 మిషన్ ఇండియాది కాదు.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబా-3 మిషన్‌లో భాగంగా 550 కేజీల శాటిలైట్లను భూ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో ఎక్స్ ద్వారా వెల్లడించింది.
నేడు జగన్ అధ్యక్షతన వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశం
నేడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.. పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు వైఎస్ జగన్.. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించనున్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేయటానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నారట వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న అనేక ఇబ్బందులపైనా చర్చించనున్నారు. ఇక, భారీగా కరెంటు ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోందని విమర్శిస్తోంది వైసీపీ.. దీనిపైనా ఎలాంటి ఆందోళనలు నిర్వహించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ధాన్యం సేకరణ, రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడం, మిల్లర్లు – దళారులు కలిసి రైతులను దోచుకుంటున్న అంశాలపై.. పోరాటాలపైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక రాష్ట్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతుందంటున్నారు.. అనారోగ్యం పాలైన ఆరోగ్యశ్రీ అంశంపై ఇదే సమావేశంలో చర్చించనున్నారు.. పేదలకు అత్యంత నష్టం చేకూరుస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆమేరకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
దారుణం.. వృద్ధుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి..
ఓ వృద్ధుడిపై గుర్తుతెలియని యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణం బాపూజీనగర్ లో జరిగింది. మంగళవారం రాత్రి బాపూజీ నగర్ లోని హెచ్ పీ పెట్రోల్ బంక్ వెనుక అలువాల మాలకొండయ్య అనే వృద్ధుడు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఆయన దాదాపు 40 ఏళ్లుగా సిమెంట్ రింగుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి లాగే దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి సంచిలో తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడిలో వృద్ధుడు మాల కొండయ్యకు తీవ్ర గాయాలపాలయ్యాడు. తండ్రి అరుపులకు ఇంటి నుంచి చిన్న కొడుకు రావడంతో రోడ్డుపై తండ్రి విలవిల లాడుతూ కనిపించాడు. తండ్రిపై దాడి చేస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు మాలకొండయ్య చిన్న కుమారుడు ప్రయత్నించడంతో ఆ యువకుడు వెంట తెచ్చుకున్న సంచుల నుంచి పెట్రోల్ ప్యాకెట్లను మీద చల్లుతూ పరుగులు తీశారు. వెంటనే కుటుంబ సభ్యులు కొండయ్యను దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన యువకుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఆర్ధిక వ్యవహారమా? లేక పాత కక్షలే కారణమా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
చరిత్ర సృష్టించిన 72 ఏళ్ల నంది-న్డైత్వా.. నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక
ఆఫ్రికా దేశలలో ఒకటైన నమీబియా దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలైంది. గతంలో దేశ ఉప రాష్ట్రపతిగా పనిచేసిన నెటుంబో నంది-న్డైత్వా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె స్వాపో పార్టీకి చెందింది. నివేదికల ప్రకారం అధికారిక ఫలితాలు మంగళవారం (డిసెంబర్ 3) నాడు వెలుబడ్డాయి. దీని ప్రకారం స్వాపో పార్టీకి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్య అధ్యక్షుడిగా మారడానికి అవసరమైన 50 శాతం ఓట్లకు మించి ఉంది. ఇక తన సమీప ప్రత్యర్థి పాట్రియాట్స్ ఫర్ ఛేంజ్ (ఐపిసి)కి చెందిన ఇటుల కేవలం 26 శాతం ఓట్లు మాత్రమే రావడంతో భారీ మెజారిటీతో నంది-న్డైత్వా గెలుపొందారు. 1990లో దక్షిణాఫ్రికా నుండి నమీబియా స్వాతంత్య్రం పొందింది. అప్పటి నుండి నంది-నాడైతవా రాజకీయాల్లో నిరంతరం క్రియాశీలకంగా ఉన్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి పార్టీని మరింత పటిష్ట స్థితికి తీసుకెళ్లారు. నివేదికల ప్రకారం 72 ఏళ్ల నంది-న్డైత్వా చాలా కాలంగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆమె 1960 లలో స్వాపో పార్టీలో చేరారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రితోపాటు పలు సీనియర్ పాత్రలు పోషించారు. దీనికి సంబంధించి, రాజకీయ విశ్లేషకుడు రాక్వెల్ ఆండ్రియాస్ ఆమెను స్వాపోలో ముఖ్యమైన నాయకురాలిగా అభివర్ణించారు. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆమె ఏదో ఒక రూపంలో ముందుంటుందని అన్నారు. ఇక ఆమె విజయం తర్వాత నంది-న్డైత్వా మాట్లాడుతూ “నమీబియా దేశం శాంతి, స్థిరత్వం కోసం ఓటు వేసింది.” అని ఆవిడా అన్నారు.
నాగ చైతన్య, శోభిత పెళ్లికి హాజరుకాబోతున్న ముఖ్య అతిథులు వీళ్లే
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ క్రమంలోనే చై, శోభితల పెళ్లి పనులు ఇప్పటికే మొదలు కాగా.. తాజాగా హల్దీ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు కాబోయే వధూవరులను ఒకేచోట ఉంచి హల్దీ వేడుకను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఇద్దరికి మంగళస్నానాలు చేయించారు. చై, శోభితలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న రాత్రి 8:13 గంటలకు జరగనుంది. పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. ఏఎన్నార్ విగ్రహం ఎదురుగా శోభిత మెడలో చై మూడుముళ్లు వేయనున్నారు. ఏఎన్నార్ ఆశీస్సులు ఉండాలనే భావనతోనే ఇరు కుటుంబాల పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. టాలీవుడ్ నుంచి దగ్గుబాటి, మెగా, నందమూరి ఫ్యామిలీలలోని అందరూ విచ్చేయనున్నారు. తాజాగా ఈ వివాహా వేడుకకు ఎవరెవరు? హాజరుకానున్నారనే విషయమై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్, దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సహా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు తెలిసింది. ఇక నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా తప్పక వివాహానికి హాజరయ్యే అవకాశం ఉంది. రాజకీయం, పారిశ్రామిక రంగాలకు చెందిన కీలకమైన వ్యక్తులు ఈవేడుకలో భాగమవుతారని సమాచారం. ఈ వివాహం పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలోనే జరుగుతుంది.
పుష్ప -2 ఓవర్సీస్.. అనుకున్నదే జరిగింది
ఎక్కడ చుసిన పుష్ప..పుష్ప.. పుష్ప.. ఇప్పుడిదే ఫీవర్ సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తుంది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. నేడు స్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల కాబోతుంది. మరోవైపు ఈ సినిమా టికెట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సింగిల్ స్క్రీన్స్ లో బ్లాక్ లో ఒక్కో టికెట్ రూ. 3000 పలుకుతుంది. అటు ఓవర్సీస్ లోను పుష్ప క్రేజ్ బుకింగ్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఇప్పటికె అత్యంత వేగంగా 1 మిలియన్ దాటి 2 మిలియన్ మార్క్ కూడా దాటి 3 మిలియన్ కు చేరుకుంది పుష్ప -2. కాగా ఇప్పుడు పుష్ప -2 మరో రేర్ ఫీట్ ను అందుకుంది. ఎంటైర్ ఓవర్సీస్ కలిపి సినిమా 4 మిలియన్ మార్క్ ను అందుకుంది. ఏరియల వారీగా చుస్తే నార్త్ అమెరికాలో $2.7 మిలియన్, UK లో $385K, ఆస్ట్రేలియాలో $225K, న్యూజిలాండ్ $25k, గల్ఫ్ లో $304K, రెస్ట్ అఫ్ ది వరల్డ్ – 375K రాబట్టి మొత్తం $4.14 మిలియన్ కొల్లగొట్టింది. ఓవర్సీస్ లో ఈ సినిమాను ప్రత్యంగిర సినిమాస్ అలాగే AA సినిమాస్ సంయుక్తంగా రిలీజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సమానంగా ఒకే టైమ్ లో ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది పుష్ప -2. హిట్ టాక్ వస్తే లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కలెక్షన్స్ ను బట్టి చుస్తే పుష్ప గాడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని నిరూపించాడు.
15 ఏళ్ల నిరీక్షణ తర్వాత వెస్టిండీస్ గడ్డపై గెలిచిన బంగ్లాదేశ్
15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టు తన తొలి టెస్టు మ్యాచ్‌ను గెలుచుకుంది. దీనితో బంగ్లాదేశ్ జట్టు విదేశీ గడ్డపై గత 6 మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించింది. ఇదివరకు గడ్డపై బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే, దీని తర్వాత వారు భారత్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయారు. ఆపై వెస్టిండీస్‌తో జరిగిన ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చి ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో స్కోర్‌లను సమం చేసింది. వెస్టిండీస్ జట్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200 పరుగులు దాటలేకపోకపోవడంతో విజయకేతనం ఎగురవేశారు. తొలిసారిగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ డ్రాగా ముగిసింది. ఇక ఈ టెస్ట్ తర్వాత ఇరు జట్లు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్లు ఆడనున్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 టెస్టు సిరీస్‌లు జరగ్గా అందులో బంగ్లాదేశ్ రెండు సిరీస్‌లను గెలుచుకోగా, మిగిలిన 8 సిరీస్‌లను వెస్టిండీస్ గెలుచుకుంది. ఈ 2024 సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. బంగ్లాదేశ్ చివరిసారిగా 2009లో వెస్టిండీస్ గడ్డపై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ సమయంలో ఆ జట్టు రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. అయితే, దీని తర్వాత బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్‌తో వరుసగా ఏడు మ్యాచ్‌లలో ఓడిపోయి ఇప్పుడు గెలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. అయితే, నహిద్ రానా ఐదు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కట్టడి చేసారు. దీని తర్వాత బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 268 పరుగులు చేసింది. దింతో వెస్టిండీస్ 286 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి వచ్చింది. దానికి ప్రతిస్పందనగా కరీబియన్ జట్టు కేవలం 185 పరుగులకే కుప్పకూలింది. ఈ దెబ్బతో బంగ్లాదేశ్ 101 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. టెస్ట్ సిరీస్‌ను వెస్టిండీస్‌తో 1-1తో సమం చేసింది.